జనాంతికం - బుద్దా మురళి

రాముడు, రావణుడు ఏకమైతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ ప్రపంచాన్ని ఎలా మార్చేద్దామనా.. అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’’
‘‘ ఇంట్లో టీవీ చానల్ మార్చేంత అధికారం కూడా నా చేతిలో ఉండదు. ఇక ప్రపపంచాన్ని మార్చేంత సీనా? నాకో ఆలోచన వచ్చింది.. అలా జరిగితే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా?’’
‘‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటారు కదా?’’
‘‘ఒక్క రాజకీయాల్లోనే కాదు. మన జీవితాల్లో, వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. పోటీపోటీగా వెళ్లిన సెల్‌ఫోన్ కంపెనీలు ఎన్ని ఏకం కాలేదు. ఎన్ని వ్యాపార సంస్థలు ఒకదానిలో ఒకటి విలీనం కాలేదు? ’’
‘‘అలానే పురాణ కాలంలో కూడా శాశ్వత శత్రువులు మిత్రులుగా మారితే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నా’’
‘‘అర్థం కాలేదు...’’
‘‘రామాయణ కథ ఏమిటి? ’’
‘‘శ్రీరాముడు హీరో, రావణుడు విలన్. ఇంకా చాలా పాత్రలున్నాయి’’
‘‘అన్నదమ్ములైన వాలి సుగ్రీవులు ఏకమైతే ఎలా ఉంటుంది?’’
‘‘ఇద్దరూ ప్రాణాలతో మిగిలి ఉండేవాళ్లు. చెరి సగం రాజ్యం పాలించే వాళ్లు.’’
‘‘అలానే శ్రీరాముడు, రావణుడు ఏకమైతే..?’’
‘‘రామాయణమే ఉండదు.’’
‘‘ఎందుకుండదు? ఇప్పుడు చూడు.. ప్రపంచానికి కాంగ్రెస్ పార్టీనే అత్యంత ప్రమాదకరమని భావించి ‘అన్న’ ఎన్టీఆర్ సినిమాల్లో హీరో వేషాలను వదిలేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారా? లేదా? ’’
‘‘ఔను’’
‘‘కాంగ్రెస్ వ్యతిరేకతే తెదేపా సిద్ధాంతం కదా?’’
‘‘ఔను.’’
‘‘మరి అలాంటి రెండు పార్టీలు ఏకమైనపుడు రాముడు, రావణుడు ఏకమైతే తప్పేంటి?’’
‘‘తలాతోకా లేకుండా రాజకీయాలను, పురాణాలను ఏకం చేస్తావేంటి? శ్రీరాముడు క్షణాల్లో రావణుడిని వధించలేక కాదు. సీతాపహరణం, రామరావణ యుద్ధం అన్నీ లోక కల్యాణం కోసమే జరిగాయి.’’
‘‘కాదని నేనన్నానా? దేశ కల్యాణం కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపానని బాబు చెబుతున్నారు కదా? ’’
‘‘నువ్వెన్నయినా చెప్పు.. రాముడు, రావణుడు ఏకం కావడం అనేది నేనసలు ఊహించలేను. హీరో, విలన్ ఎలా కలుస్తారు. ఇక సినిమా ఎక్కడుంటుంది?’’
‘‘నీ దృష్టిలో శ్రీరాముడు హీరో, రావణుడు విలన్ ఐతే చాలా మంది రావణుడే హీరో, శ్రీరాముడు విలన్ అని నమ్ముతారు. నువ్వు చాలా సార్లు ప్రస్తావించే రజనీష్ కూడా రావణుడే హీరో, రాముడే విలన్ అన్నాడు.’’
‘‘ఎవరి అభిప్రాయం వారి ది. ఈ దేశంలో కొన్ని కోట్ల మంది శ్రీరాముడని దేవుడిగా భావిస్తారు. నువ్వు రావణుడిని మొక్కుతానంటే వద్దనడానికి నెనెవరిని?’’
‘‘నీకీ సంగతి తెలుసా? 1965 ప్రాంతంలోనే ఎన్టీఆర్ తనకు రావణుడే ఆదర్శం అని ఓ పత్రికలో వ్యాసం రాశారు.’’
‘‘ఎన్టీఆర్‌ను అభిమానించే వాళ్లు రాముడినే దేవుడిగా పూజిస్తారని నీకు తెలుసా? నీ ఇష్టం.. నువ్వు ఎవరినైనా పూజించుకో. చాలా ఏళ్ల క్రితం ‘రావణుడే రాముడయితే’ అనే సినిమా కూడా వచ్చింది. కానీ శ్రీరాముడు, రావణుడు ఏకమైతే.. అనే ఆలోచన ఎవరికీ రాలేదు. నీకే వచ్చింది. ఇదొక్కటేనా? ఇంకెవరినైనా కలిపేద్దామనిపిస్తుందా?’’
‘‘ ఈమధ్య పౌరాణిక పాత్రలను తీసుకుని తమ కోణం నుంచి రాస్తున్నారు కదా?’’
‘‘ఔను చాలా మంది గురించి వచ్చింది. యార్లగడ్డ ద్రౌపది గురించి రాసినట్టున్నారు. కుంతి గురించి ఆ మధ్య ఎవరో రాశారు. కుంభకర్ణుడు, రావణుడు, కైకేయి, శూర్పణఖ.. ఇలా చాలా పాత్రలను తీసుకుని తమ కోణంలో వారి గురించి నవలలు రాసినట్టున్నారు. ధ్రుతరాష్ట్రుని భార్య గాంధారికి చూపు ఉన్నా, భర్త కోసం కళ్లకు గంతలు కట్టుకుని జీవిత కాలమంతా అలా గుడ్డిగానే బతికింది.. ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించి రాశారు’’
‘‘నాకోటి తెలియక అడుగుతున్నాను.. మన పురాణాలైన రామాయణం, మహాభారతం నిజంగా జరిగాయో లేదో తెలియదు. ఊహ కావచ్చు, నిజం కావచ్చు. ఆ పాత్రలు ఏమనుకుంటున్నాయో ఏ సందర్భంలో వారి ప్రవర్తన ఎలా ఉందో పురాణాల్లోనే పూసగుచ్చినట్టు ఉంది కదా? వాళ్లు నిజంగా అలా అనుకోలేదు. మరోలా అనుకున్నారని మన ఇష్టం వచ్చినట్టు రాయడం సబబేనా?’’
‘‘నాకూ ఓ అనుమానం ఉంది. పురాణాలు అబద్ధం. కానీ పురాణాల్లోని కొన్ని పాత్రలు నిజం అని వాదించే వర్గం ఒకటి తయారైంది. అంటే శ్రీరాముడు అబద్ధం.. కానీ రావణుడు నిజం అని బల్లగుద్ది వాదించడం అన్న మాట. పురాణాలే అబద్ధం అనుకుంటే కొన్ని పాత్రలు నిజమెలా అవుతాయి?’’
‘‘్ఫలానా నాయకుడు ఏమనుకుంటున్నాడు? ఆయన మనోగతం ఏమిటి? అని ఎవరికి తోచినట్టు వాళ్లు రాయడం లేదా? ఒక నాయకుడి మనోగతం ఇలా ఉందని ఒక్కో పత్రిక ఒకే సందర్భంలో ఒక్కో రకంగా రాస్తే తప్పు లేదు కానీ- పురాణాల్లో పాత్రలు మనసులో ఏమనుకుంటున్నాయో రాస్తే తప్పెలా అవుతుంది? రాముడు, రావణుడు ఏకం కావాలి. కృష్ణుడు, దుర్యోధనుడు చెట్టాపట్టాలేసుకుని తిరగాలి. దుర్యోధనుడు, అర్జునుడు ప్రాణస్నేహితులు కావాలి. కావాలంటే ఐదేళ్లలో సగం కాలం దుర్యోధనుడు, మిగిలిన సగం కాలం ధర్మరాజు, మధ్యలో ఓ ఏడాది కర్ణుడు పాలించాలి. మన చర్చ రాజకీయాల నుంచి పురాణాల్లోకి వెళ్లింది. పురాణాల సంగతి మనకెందుకు వదిలేయ్.. రాజకీయాల గురించి మాట్లాడుకుందాం.’’
‘‘పురాణాల్లోని పాత్రల్లా రాజకీయ నాయకులు సైతం ఏకం కావాలి. ఇండియా, పాకిస్తాన్ ఏకం కావాలి. అమెరికాలో ట్రంప్, హిల్లరీ చేతులు కలపాలి. శాంతిదూతలు, ఉగ్రవాదులు ఏకం కావాలి. జగన్, చంద్రబాబు ప్రాణస్నేహితులు కావాలి. మోదీ, రాహుల్ జంటగా విదేశీ పర్యటనలు చేయాలి.’’
‘‘అంతేనా? ఆకాశం, భూమి ఏకం కావాలి అని కూడా కోరుకో. ఆశకు కూడా హద్దు ఉండాలి. హీరోలు, విలన్లు కలిస్తే సినిమాలుండవు. దేవతలు, రాక్షసులు కలిస్తే పురాణాలుండవు. బద్ధ శత్రువులైన నాయకులు కలిస్తే రాజకీయాలు ఉండవు.’’
‘‘ఉండనీ ఉండక పోనీ, ఉండాలని కోరుకుంటా.. అది నా ఇష్టం. ఏమో ఆకాశం, నేల ఏకం కావచ్చు. అసాధ్యం అనుకున్న నాయకులు కలవలేదా?’’
*

buddhamurali2464@gmail.com