జనాంతికం - బుద్దా మురళి

బయోపిక్‌లు-ఆత్మకథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎన్టీఆర్ బయోపిక్‌పై ఏమంటావు?’’
‘‘నేను చూడలేదు.. చూసే ఉద్దేశం కూడా లేదు’’
‘‘ఓహో.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూస్తావన్నమాట’’
‘‘అదీ చూడను..’’
‘‘రెండింటినీ తప్పనిసరిగా చూడాల్సి వస్తే ఏది ముందు చూస్తావ్?’’
‘‘చాలా రోజుల క్రితం తిరుపతి వెళ్లి అటు నుంచి శ్రీకాళహస్తికి బస్సులో వెళుతున్నప్పుడు పక్కనున్న ప్రయాణికుడు నా సామాజిక వర్గం గురించి తెలుసుకోడానికి తెగ తంటాలు పడ్డాడు. చివరకు ఆ సమయంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీనంబర్ 150లో ఏది ముందు చూస్తారని అడిగాడు. అలాగైనా కనీసం ఏ వర్గమో తెలుస్తుందని..’’
‘‘మరి నువ్వేమన్నావ్?’’
‘‘రెండింటిలో ఏది ముందుగా టీవీలో వస్తే దాన్ని కొద్దిసేపు చూస్తానన్నా.. ఇప్పుడు నీ ప్రశ్నకూ ఇదే సమాధానం. థియేటర్‌లో మూడు గంటల సమయం వెచ్చించేంత ఓపిక లేదు. మొదటి రోజే చూడాలనుకునే కుర్రతనం లేదు.’’
‘‘నువ్వు చూస్తే ఎంత? చూడకపోతే ఎంత? కానీ- ఎన్టీఆర్ బయోపిక్ ఎలా ఉందంటావు’’
‘‘ఓషో రజనీష్ చెప్పిన ఒక మాటలో జీవిత సారం దాగుంది. ప్రతి ఒక్కరూ మనిషే. మనిషికి ఉండే లక్షణాలన్నీ మనిషికి ఉంటాయి. ఇది అర్థం అయితే ఒక మనిషిని దేవుడు అని మొక్కం, రాక్షసుడు అని విమర్శించం. మనకు అద్భుతంగా అనిపించిన వ్యక్తి ఇతరులకు నచ్చకపోవచ్చు. వారికి నచ్చిన వాళ్లు మనకు సామాన్య వక్తి అనిపించవచ్చు. ’’
‘‘ఔను.. మనం వెంకన్ననను దర్శించుకోవడానికి అష్టకష్టాలు పడి వెళ్లి కొన్ని క్షణాలు ఆయన విగ్రహాన్ని చూసి జీవితం ధన్యం అయిందనుకుంటాం. కానీ, గర్భగుడిలోనే సేవ చేసే పూజారులకు అలాంటి భావనే ఉండాలని లేదు’’
‘‘బాగా చెప్పావ్! ట్రంప్‌ను ప్రపంచం తన్మయంగా చూసినట్టు అతడి సహాయకుడిని చూడాలని లేదు’’
‘‘ఇలాంటి మాటే తనికెళ్ల భరణి ఓసారి చెప్పారు. అమితాబ్‌ను మనం అద్భుతంగా చూస్తాం, ఆయన కారు డ్రైవర్ అంత ఆశ్చర్యంగా ఏమీ చూడడని మహానుభావులను ఎప్పుడో ఒకసారి దూరం నుంచి చూస్తేనే బాగుంటుంది కానీ దగ్గరి నుంచి రోజూ చూస్తే అంత గొప్పగా ఏమీ అనిపించదట!’’
‘‘ఎన్టీఆర్ ఎందరికో దేవుడిలా కనిపించారు. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం భరించలేని వ్యక్తిగా అనిపించారేమో అనిపిస్తుంది.. ఆయన జామాతా దశమ గ్రహం సీడీ విన్నాక, చివరి దశ గురించి తెలిశాక’’
‘‘మనం అసలు చర్చను పక్కన పెట్టాం. ఇంతకూ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ తీసిన కథానాయకుడు సినిమాలో నిజం చెప్పారా? లేక వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో నిజం చెబుతారా? ఈ రెండూ కాకుండా నాదెండ్ల భాస్కరరావు యూ ట్యూబ్ చానల్‌లో చెబుతున్నది నిజం అంటావా?’’
‘‘ఆ మూడే ప్రస్తావించా వేం? అప్పటి ఘటనలకు పాత్రధారిగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును వదిలేశావేం?’’
‘‘మూడింటిలో నిజమేదో తెలుసుకోలేక చస్తుంటే ఇక నాలుగోదా? ఆయన కూడా సినిమా తీస్తున్నారా?’’
‘‘ఆయనకూ సినిమాలతో సంబంధం ఉంది. భగత్‌సింగ్ సినిమా తీయాలనుకున్నారు. 1995 నాటి వెన్నుపోటుపై సినిమా తీస్తానని ప్రకటన చేసినా ఎందుకో తీయలేదు. కానీ అప్పుడేం జరిగిందో పుస్తకంలో రాశారు, ఇంటర్వ్యూల్లో చెప్పారు. ’’
‘‘సరే.. ఈ నాలుగులో ఇంతకూ ఎవరి మాట నిజమంటావు’’
‘‘నాలుగుకే పరిమితమయ్యావేంటి? ఏది నిజమో ఎన్టీఆర్ చెప్పారు కదా? అది వద్దా? జామాతా దశమ గ్రహం అని ఏం జరిగిందో తనకు ఎలా ద్రోహం చేశారో, వెన్నుపోటుకు తానెలా బలయ్యానో స్వయంగా ఆయనే తన స్వరంతో చెప్పారు. ఆ సీడీకి రచన, దర్శకత్వం, నటన అన్నీ ఆయనే’’
‘‘నిజంగా విచిత్రమేనోయ్! ఏం జరిగిందో ఆయనే తన స్వరంతో తానే చెప్పినా ఏది నిజం? అని మనం ఆలోచిస్తున్నాం. ’’
‘‘పోనీ.. నేను చెప్పనా?’’
‘‘ముందు నినే్న అడిగాను కదా? ఏది నిజమో చెప్పుమని’’
‘‘అన్నీ నిజాలే.. అన్నీ అబద్ధాలే’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘ప్రతి సంఘటనను ఎవరి కోణంలో వారు చూస్తారు. టీడీపీ ఎన్టీఆర్ రెక్కల కష్టం కదా? 1994లో ప్రతిపక్ష స్థానానికి అవసరమైన సీట్లు కూడా మిగల్చకుండా ఏకపక్షంగా విజయం సాధించి పెడితే, తన నుంచి సీటు లాగేసుకుని అవమానకరంగా దించేయడం ఎన్టీఆర్ కోణంలో జామాతా దశమ గ్రహం సీడీని విడుదల చేయించింది. ఎన్నో ఆశలతో అధికారం కోసం కాచుకుని కూర్చుంటే మధ్యలో లక్ష్మీపార్వతి వచ్చి తన్నుకుపోయేట్టు ఉంది. ఈ అన్యాయాన్ని సహించక ఎన్టీఆర్‌ను దించేయాలనుకోవడం బాబు కోణంలో న్యాయం. సంఘటన ఒకటే- కోణాలు వేరువేరు. ఎవరి కోణంలో వారిదే న్యాయం. ఇతరుల కోణంలో అది అన్యాయం.’’
‘‘ఆ ఒక్క అంశమే కాదు. మిగిలిన విషయాల గురించి?’’
‘‘మన క్లాస్‌మేట్ పాండు వాళ్ల ఆవిడ మా వారు శ్రీరాముడు పరాయి ఆడవారిని కనె్నత్తి చూడడు అనుకుంటుంది కదా? నీ అభిప్రాయం చెప్పు’’
‘‘వాడు కాలేజీలో చదివే రోజుల్లో వాడి షోకిళ్లా రాయుడి జీవితం మనం ఎన్నిసార్లు చూడలేదు. వద్దు రా అని ఎన్నిసార్లు చెప్పాం’’
‘‘అప్పటి సంగతి వదిలేయ్.. ఇప్పుడు..’’
‘‘వాడికా అలవాట్లు ఇప్పటికీ పోలేదు. ఎప్పుడూ క్యాంపులే’’
‘‘పాతికేళ్ల నుంచి కాపురం చేస్తున్నా పాండుగాడి గురించి వాళ్ల ఆవిడకే నిజాలు తెలియదు. ప్రత్యక్షంగా చూసే అవకాశం లేనపుడు- వారి జీవితంలో ఏం జరిగిందో ఎవరికేం తెలుసు? తెరపై కనిపించే నటుడి, నాయకుడి జీవితం గురించి ఎవరికైనా ఎంతవరకు తెలుస్తుంది?’’
‘‘ఎన్టీఆర్ స్వయంగా వచ్చి తన గురించి ఇప్పుడు తాను చెప్పాలంటావా?’’
‘‘అలా చెప్పినా అన్నీ నిజాలే చెప్పారని ఒప్పుకుంటామా?’’
‘‘అంటే...’’
‘‘ఎక్కువగా ఊహించకు. నేనే అభిప్రాయం చెప్పడం లేదు, ఏ అభిప్రాయాన్ని ఖండించడం లేదు..’’
‘‘మరేం చెబుతున్నావ్?’’
‘‘వాళ్ల గురించి, వీళ్ల గురించి ఎందుకు? నీ గురించి నీకు తెలుసా? నా గురించి నాకు తెలుసా?’’
‘‘తెలియదా?’’
‘‘ శ్రీరాముడు వశిష్టుని ఇంటికి వెళ్లి తలుపు తడితే ఎవరు? అని వశిష్టుడు ప్రశ్నిస్తాడు. ‘అది తెలుసు కోవడానికే వచ్చాను’ అని శ్రీరాముడు సమాధానం చెబుతాడు. మహామహా తత్వవేత్తలంతా నిన్ను నువ్వు తెలుసుకో- అన్నారు. మనకు మనమే తెలియనప్పుడు ఇతరుల గురించి అది నిజమా? కాదా? ఏది నిజం? అని ఎలా నిర్థారిస్తాం’’
‘‘ఇప్పుడు నా గురించి నన్ను తెలుసుకోమంటావా?’’ *

buddhamurali2464@gmail.com