జనాంతికం - బుద్దా మురళి

బయోపిక్- యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ దగ్గరో కోటి రూపాయలున్నాయా...?’’
‘‘సర్లే.. ఆయనే ఉంటే- అని సామెత చెప్పినట్టు. ఈ నెల జీతమంతా ఇన్‌కం ట్యాక్స్‌కే పోతుంది. నెల గడిచేదెలా అని నేనేడుస్తుంటే.. కోటి రూపాయలు కావాలా?’’
‘‘పోనీ.. ఓ రెండు,మూడు రూపాయలున్నాయా?’’
‘‘రెండు,మూడు రూపాయలతో ఏం చేస్తావ్?’’
‘‘తేలిగ్గా తీసివేయకు. ఆ రెండు,మూడు రూపాయలతోనే ప్రపంచ శాంతిని సాధించవచ్చు. భారత్-పాక్‌ల మధ్య యుద్ధం ఆపేయవచ్చు’’
‘‘అబ్బో.. మరి కోటి రూపాయలెందుకు?’’
‘‘ఓ అదా.. మన గురించి మనం కాకుంటే ఎవడు పట్టించుకుంటాడు? ఇపుడు బయోపిక్‌ల కాలం నడస్తుంది కదా? ఒక వ్యక్తికి సంబంధించిన రెండు, మూడు బయోపిక్‌ల ట్రైలర్స్ చూశాక నాకీ ఐడియా వచ్చింది. మా తాత బయోపిక్ తీస్తాను.’’
‘‘కోటి రూపాయలున్నాయనుకో, మీ తాతకసలు చెప్పుకోవడానికి జీవితమే లేదు. సినిమా ఏం తీస్తావ్? మీ తాతకి ఊరంతా అప్పులేనట! ఒకటో, రెండో ‘చిన్నిళ్లు’ ఉండేవని చెప్పుకుంటారు. ’’
‘‘నిజంగా కోటి ఉంటే మా తాత బయోపిక్ స్కిృప్ట్ నేనే రాసుకుంటా. మా తాత పలుకుబడిని చూసి ఓర్వలేక పుకార్లు లేవదీశారు.’’
‘‘మీ తాత సినిమాకు ఏదీ.. ఒక సీన్ చెప్పు’’
‘‘ఒక యువకుడు ఒంటరిగా నడుచుకుంటూ పోతున్నాడు. అప్పుడే విమానంలో వెళుతున్న జవహర్‌లాల్ నెహ్రూ ఆకాశం నుంచి ఆ యువకుడిని చూసి ఏనాటికైనా వీడు నాకు పోటీ వస్తాడు. నా వారసులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా, రాహుల్ గాంధీలకు వీడి వారసులు పోటీ అవుతారని భయపడతాడు..’’
‘‘భయపడి ?’’
‘‘భయపడి విమానం నుంచే ఆ యువకుడికి నెహ్రూ నమస్కారం చేశాడు’’
‘‘కొంచెం అతిగా లేదా?’’
‘‘తెలుగు సినిమా అన్నాక ఆ మాత్రం ఉండాలి. లేకపోతే ఆర్ట్ సినిమా అనుకుంటారు. కంటి చూపుతో రైళ్లను వెనక్కి పరిగెత్తించే యాక్షన్ చిత్రాలను చూసి తట్టుకున్న తెలుగు వారు బయోపిక్ అంటే ఈ మాత్రం ఉండాలి.’’
‘‘ఇంతకూ మీ తాత ఏం చేసేవాడు?’’
‘‘ఏమో ఎవరికి తెలుసు? ఊరి నిండా అప్పులే అని నువ్వు విన్నట్టే నేనూ విన్నాను. అప్పులు పలుకుబడి ఉన్నవారికే కదా పుడతాయి? మా తాతకు చాలానే పలుకుబడి ఉండేదని నా నమ్మకం. ’’
‘‘కోటి రూపాయలు జమ అయినప్పుడు సినిమా తీద్దువుకాని.. రెండు, మూడు రూపాయలున్నా చాలన్నావుదేనికి?’’
‘‘యుద్ధాన్ని ఆపడానికి..’’
‘‘రెండు, మూడు రూపాయలతోనే?’’
‘‘చిన్న సమస్యలను మనం ఒక్కోసారి పెద్దవిగా భావించి టెన్షన్ పడతాం. రెండు, మూడు రూపాయలతో యుద్ధం ఆపవచ్చు’’
‘‘యుద్ధం తప్పదా? అనే భయం ఒకవైపు ఉంటే, నీ సిల్లీ జోకులొకవైపు..’’
‘‘యుద్ధం చేయాలన్నంత టెన్షన్ కనిపిస్తోంది నీలో.. నిజంగా యుద్ధం గురించి అంత రాస్తున్నావు కదా? నిజంగా యుద్ధం వస్తే వెళతావా?’’
‘‘యుద్ధం వస్తుందని నేను రాసే రాతలు నువ్వు చదువుతున్నట్టే, యుద్ధం వద్దు- శాంతి ముద్దు అంటూ నువ్వు రాస్తున్నవి కూడా చూస్తున్నాను లే! యుద్ధ రంగానికి వెళ్లను కానీ శాంతి కోసం నువ్వు రాస్తున్న రాతలను చూపుతూ ఈసారి నోబెల్ శాంతి బహుమతి కోసం నీ పేరు సిఫారసు చేస్తాలే’’
‘‘యుద్ధం వస్తుందని అనుకుంటున్నావా? ఐతే నువ్వు వార్తలు చూడడం లేదన్న మాట’’
‘‘బీబీసీ నుంచి ఆల్ జజీరా చానల్ వరకు అన్నీ చూస్తున్నా. మొన్న మన తెలుగు చానల్ వాళ్లు దేశ సరిహద్దుల్లో కెమెరా యాంగిల్ కోసం వెతుకుతుంటే చితగ్గొట్టారన్న వార్త కూడా చూశా..’’
‘‘అల్ జజీరా చూశావుకానీ, కేఏ పాల్ ఉపన్యాసాల వీడియోలు చూడలేదు కదూ అందుకే ఇంకా యుద్ధం వస్తుందని భయపడుతున్నావ్’’
‘‘యుద్ధం రాదని పాల్ చెప్పాడా?’’
‘‘యుద్ధాన్ని ఆపేందుకు రంగంలోకి దిగుతున్నానని చెప్పాడు’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘పాల్ ప్రపంచ శాంతి నాయకుడు కదా?’’
‘‘కాదు- ప్రజాశాంతి పార్టీ నాయకుడు’’
‘‘అదే లేవోయ్.. శాంతిని స్థాపించడమే ఆయన ప్రధాన విధి. ఆ ఉద్దేశంతో ప్రపంచ శాంతి నాయకుడన్నాను’’
‘‘ఐతే..’’
‘‘మొసలి నోట చిక్కిన ఏనుగు తనకిక పోరాడే శక్తి లేదని దేవుడ్ని వేడుకున్నట్టు- ఏ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వచ్చినా ఏ దిక్కూ లేనప్పుడు అంతా పాల్ వైపే చూస్తారు. ఆయన రంగప్రవేశం చేసి యుద్ధాన్ని ఆపేస్తాడు. గతంలో ఇండియా, పాక్‌ల మధ్య యుద్ధం తప్పదనుకొంటున్న వేళ పాల్ గారే పాక్ నేతలకు ఫోన్ చేసి యుద్ధం వద్దన్నారు. దాంతో యుద్ధం జరగలేదు. అప్పుడే పాల్ పేరును రెండు దేశాల వారూ నోబెల్ శాంతిబహుమతికి సిఫారసు చేశారట’’
‘‘నిజమా?’’
‘‘పాల్ మీద ఒట్టు.. కావాలంటే పాల్ తీసిన వీడియో చూపిస్తా.. చూడు’’
‘‘పాల్ చెప్పాడా? లేడా? అని అడగడం లేదు. పాల్ చెప్పింది నిజమా? అని అడుగుతున్నా’’
‘‘పాల్‌కు సెల్‌ఫోన్‌లో ఓ మెసీజీ ఇచ్చి చూద్దాం పోయేదేముంది? కాల్ చేసి రెండు మూడు రూపాయల ఖర్చుతో యుద్ధం ఆగితే అందరికీ మంచిదే కదా? పని చేయలేదనుకో.. పోయేది రెండు,మూడు రూపాయలే కదా? ’’
‘‘యుద్ధం అంటే నీకు నవ్వులాటగా ఉందా? ’’
‘‘అయ్యో రామ.. నా మాట నీకు నవ్వులాటగా ఉందా? సీరియస్‌గా చెబుతున్నా. పాక్‌కు రెండు కాల్స్ చేసి యుద్ధం ఆపేస్తానని పాల్ సీరియస్‌గా చెప్పిన వీడియోలు చూడు ’’
‘‘ఈ మధ్య న్యూస్ చానల్స్ కన్నా వీడియోలే ఎక్కువగా చూస్తున్నట్టున్నావ్’’
‘‘కామెడీనీ న్యూస్ చానల్స్ సీరియస్‌గా చూపిస్తుంటే వీడియోలు సీరియస్ విషయాలను కామెడీగా చూపిస్తున్నాయి. వాటి కన్నా ఇవే బెటర్ అనుకుంటున్నా’’
‘‘కోటి రూపాయలు నా వల్ల కాదు.. ఇదిగో మూడు రూపాయలు తీసుకొని యుద్ధాన్ని ఆపేయ్..వెళ్లు’’
*

buddhamurali2464@gmail.com