జనాంతికం - బుద్దా మురళి

వెన్నదొంగ-డేటాచోర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్నట్టు ఉంది కదూ’’
‘‘పాకిస్తాన్‌తో యుద్ధం వస్తుందా? పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? డేటా చోరీ వ్యవహారం ఎక్కడికి వెళుతుంది? ఓటుకు నోటు కేసులో రెండో సీడీ తర్వాత ఇంకెన్ని సీడీలు వస్తాయి? రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? ఇన్ని హాట్ టాపిక్స్ ఉంటే ఏ పనీ లేనట్టు బల్లి గురించి పిల్లి గురించి మాట్లాడాల్సిన సమయమా ఇది?’’
‘‘సామెత గుర్తుకొస్తే సబ్జెక్ట్ మాట్లాడే ముందు అలా ప్రారంభించాను. మహానాయకుడు సినిమా ఎందుకలా అట్టర్ ఫ్లాప్ అయిందటావు?’’
‘‘పెదబాబు అంత స్పష్టంగా చెప్పిన తరువాత కూడా నీకు అర్థం కాలేదా?’’
‘‘పెదబాబుకు సినిమాల మీద రివ్యూలు రాసేంత తీరిక కూడా ఉందా? ఒకదాని తరువాత ఒకటి కష్టాలన్నీ కలిసి వస్తున్నా, ఎన్నికల పరీక్షల ముందు సినిమా రివ్యూలు కూడా రాస్తున్నారంటే ఎంతైనా గ్రేట్’’
‘‘ఎహే.. రివ్యూలు రాస్తున్నారని నేనెక్కడన్నాను? మహానాయకుడి భవిష్యత్తు పరోక్షంగా చెప్పాడని అన్నాను’’
‘‘అదే ఏం చెప్పాడు అని?’’
‘‘నా గురించి తెలుసుకోవాలంటే మహానాయకుడు చూడండి అని ప్రధానికి వార్నింగ్ ఇచ్చారు కదా? దీనిలోనే సినిమా భవిష్యత్తు మొత్తం ఉంది. ఆ సినిమాను ప్రజలేమో ఎన్టీఆర్ జీవిత చరిత్ర అనుకున్నారు. కానీ, అది కాదు అందులో ఉన్నది నా గురించి అని అల్లుడు చెప్పాక- ఇక చూడడం ఎందుకు అనుకున్నారేమో! అందుకే సినిమా హాలు అద్దె మాట దేవుడెరుగు హాలులోని క్యాంటిన్ వాడికి కూడా అద్దె గిట్టుబాటు కాలేదట!’’
‘‘సరే.. వర్మ సినిమా ఎంత గొప్పగా ఆడుతుందో చూద్దాం లే’’
‘‘మహానాయకుడి కన్నా ఎన్నో రేట్లు బాగానే ఆడుతుంది. మహానాయకుడి దెబ్బతో ఇక సినిమాలు తీసేదిలేదని ఆ మహానాయకుడి అబ్బాయి, అల్లుడి గారి వియ్యంకుడు ప్రకటించారు. ఫలితం ఎలా ఉన్నా వర్మ మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకోరు. అంత వరకూ గ్యారంటీ. ఇంతకూ బల్లి సామెత సంగతేంటో చెప్పనే లేదు..’’
‘‘ఓ అదా..? ఐటీని కనిపెట్టింది తానేనని అంటున్న అల్లుడు గారు డేటా థెప్ట్‌లో ఇరుక్కోవడం అంటే శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టే కదా?’’
‘‘ఆ సంగతి తరువాత.. ఇంతకీ ఐటీని, సెల్‌ఫోన్‌ను నిజంగా కనిపెట్టింది ఎవరు? నెట్‌లో వెతికితే వేరే పేర్లు వస్తున్నాయి. ఆయనేమో తానేనని అంటున్నాడు. ఎవరినైనా అడిగితే నవ్వుతారని అడగలేక పోతున్నాను.’’
‘‘ఎవరు కనిపెడితే మనకేంటి? మనం డబ్బులిచ్చి సెల్‌ఫోన్ కొనుక్కున్నాం. పక్కింటి పిల్లాడిని అడిగితే ఇంటర్‌నెట్‌ను, సెల్‌ఫోన్‌ను ఎవరు కనిపెట్టారురా అంటే అంబానీ అంటున్నాడు. అదేంటిరా అంటే జియో వచ్చాకే వాడి చేతికి సెల్‌ఫోన్, దానికి ఇంటర్‌నెట్ కనెక్షన్ వచ్చిందట! ’’
‘‘డేటా థెప్ట్ మాత్రం ఆయనే కనిపెట్టారనిపిస్తోంది’’
‘‘నిజానికి ఇంటర్‌నెట్ నిన్న మొన్న కనిపెట్టారు. కానీ డేటా థెప్ట్ ఎన్నో యుగాల నుంచి ఉంది’’
‘‘ఆధారం..?’’
‘‘రామాయణం, మహాభారతమే కాదు అంతకు ముందు, ఆ తరువాత ఏ యుద్ధంలోనైనా డేటా థెప్ట్ ప్రధాన భూమిక పోషించింది..’’
‘‘డేటా థెప్ట్‌లో చినబాబుకు మద్దతివ్వడానికి ప్రయత్నిస్తున్నావు..’’
‘‘చినబాబును చూస్తే నీకు డేటా థెప్ట్ గుర్తుకు వస్తుందేమో కానీ నాకైతే చిన్నికృష్ణుడు గుర్తుకు వస్తాడు’’
‘‘ఎలా?’’
‘‘ఎవరెవరి ఇళ్లలో ఉట్టిమీద వెన్న దాచి పెట్టారో చిన్నికృష్ణుడికి అతని మిత్రులు సమాచారం ఇచ్చేవాళ్లు. ఆ డేటాతో చిన్నికృష్ణుడు వాళ్ల ఇళ్లకు వెళ్లి వెన్న దొంగిలించేవాడు. ఆ డేటానే లేకపోతే చిన్నికృష్ణుడు వాళ్ల ఇళ్లకు ఎలా వెళతాడు? ఇప్పుడు ఓ ఘరానా వ్యక్తి డేటా అందించినట్టు..’’
‘‘వెన్న డేటాకు, ఐటీ డేటాకు సంబంధం లేదు’’
‘‘సరే.. మహాభారత యుద్ధంలో పాండవులు ఎలా విజయం సాధించారు? శ్రీకృష్ణుడు యుద్ధం ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సేకరించడం వల్లనే కదా? మన బలం ఏంటి? ప్రత్యర్థుల బలం ఏంటి? ప్రత్యర్థుల బలాన్ని తగ్గించడం ఎలా? మన బలం పెంచుకోవడం ఎలా? అనే డేటా మొత్తం ముందుగానే సమకూర్చడం వల్లనే కదా? మైనారిటీలో ఉన్న పాండవులు మెజారిటీపై విజయం సాధించింది.. శ్రీకృష్ణుడు చేసిన దాన్ని లోక కల్యాణం అని మెచ్చుకుంటారు. అదే పని చినబాబు చేస్తే నొచ్చుకుంటారు. ఇదెక్కడి న్యాయం? యుద్ధంలో,ప్రేమలో ఏదైనా తప్పు కాదని ఎప్పుడో అన్నారు. ఎన్నికల యుద్ధం అని సర్దుకుపోకుండా కేసులు పెట్టడం అన్యాయం’’
‘‘చిన్నికృష్ణుడితోనే ఆపేశావేం? చినబాబులో శ్రీరాముడు కూడా ఉన్నాడని చెప్పు. వాలి, రావణుడు వంటి మహామహుల డేటా మొత్తం ముందుగా సేకరించడం వల్లనే కదా శ్రీరాముడు విజయం సాధించింది. కాబట్టి శ్రీకృష్ణుడే కాదు శ్రీరాముడు కూడా అనేసేయ్. అంతా బాగానే ఉంది.. లోక కల్యాణం కోసమే డేటా చౌర్యం అయినప్పుడు- అన్ని దుఖాణాలు మూసేయడం, బాధ్యులు పరారీ కావడం ఎందుకు?’’
‘‘నీకు సినిమాలు చూసే అలవాటు ఉందా?’’
‘‘ఆ.. ’’
‘‘ఇంద్రుడు దేవతల పాలకుడే ఐనా చిన్నా చితక దేవుళ్లు సైతం పవర్‌ఫుల్‌గా ఉంటారు. భక్తులు సైతం ఒక్కోసారి పవర్‌ఫుల్‌గా ఉంటారు. ఇంద్రుడు మాత్రం ఎప్పుడూ సహాయ నటుడే. చాలాసార్లు జూనియర్ ఆర్టిస్ట్‌లా ఉండిపోతాడు. పేరుకు పాలకుడైన ఇంద్రుడు నిజానికి డమీ. జాతీయ పార్టీ కేంద్రంలో అధికారం చెలాయించిన కాలంలో రాష్ట్రాల్లో పాలకులు అచ్చం ఇలానే ఉండేవారు. ఏ రోజు ఎవరిని ఇంటికి పంపిస్తారో ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారో తెలియకుండా ఉండేది.’’
‘‘ఐతే?’’
‘‘ఇప్పుడు కాలం మారింది. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా మారడం చూశాం.. రెండు ప్రాంతీయ పార్టీలు అయ్యాయి. టెక్నాలజీ పెరిగింది. మనుషులను మేనేజ్ చేయవచ్చు కానీ టెక్నాలజీని మేనేజ్ చేయలేం కదా? ’’
‘‘అంటే రాజకీయాలు మారాయి, టెక్నాలజీ మారింది. అన్ని రోజులూ మనవి కావు.. మనం చేసే దొంగతనాలను కెమెరాల్లో రికార్డు చేసే రోజులు వచ్చాయి. డేటా చోరీని కనిపెట్టే రోజులు వచ్చాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.’’
*

buddhamurali2464@gmail.com