జనాంతికం - బుద్దా మురళి

ప్రచార సత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చూశావటోయ్ పలానా స్వామిగారు ఏళ్లతరబడి అన్నపానీయాలు తీసుకోకుండా ఉన్నాడట’’
‘‘ఇలాంటి స్వాములు ఊరికొకరు ఉంటారు. మన దేశంలో స్వామీజీలు, పేదలు అన్నం లేకుండా ఉండడం ఈ దేశానికి అలవాటే కానీ నెలకు రూపాయి జీతంతో వేల కోట్లు సంపాదించిన పాలకులున్నారు.’’
‘‘నాతో మాట్లాతూనే ఆటో డ్రైవర్‌ను అంత అనుమానంగా చూస్తున్నావేం?’’
‘‘ఆటో డ్రైవర్ కచ్చితంగా సంపన్నుడు గ్యారంటీగా చెప్పగలను’’
‘‘హైదరాబాద్ ఆటో డ్రైవర్లు మీటరు మీద ఎంతో కొంత ఎక్కువ తీసుకుంటారు నిజమే కానీ మరీ కోటీశ్వరులు అనడం అన్యాయం’’
‘‘నేనేదీ ఆధారాలు లేనిదే మాట్లాడను. అతని చేయి చూడు దానికి వాచీ లేదు, ఉంగరం కూడా లేదు. అంటే సంపన్నుడు కాకుంటే మరేంటి?’’
‘‘ఎవరో కొద్ది మంది మహానుభావులను చూసి అంతా అలానే అనుకుంటే ఎలా?’’
‘‘వాచీ ఉంగరం లేని ఎవరిని చూసినా నాకు వాళ్లు వేల కోట్ల ఆస్తులున్న సంపన్నులే అనిపిస్తుంది ఎందుకలా?’’
‘‘మహాత్మాగాంధీ కూడా ఎప్పుడూ అలా నేను షర్ట్ కూడా లేని పేదోణ్ణి అని చెప్పుకోలేదు. ప్రధానిగా ఉన్నప్పటి కేసుల నుంచి బయటపడేందుకు లాయర్ల ఫీజు చెల్లించేందుకు ఇంటిని సైతం అమ్మకానికి పెట్టిన పివి నరసింహారావు ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేదు. నేను పేదవాణ్ణి రోజుకు రెండు ఇడ్లీలు, ఒక పుల్కా మాత్రమే తింటాను అని ఒక్కసారి కూడా చెప్పగా వినలేదు. కానీ కొందరు మహా సంపన్నులు నేను పేదవాణ్ణి అని పదే పదే చెప్పుకోవడం వల్ల వాచీ ఉంగరం లేని వాళ్లంతా సంపన్నులుగా నీకు అనిపిస్తోంది. ప్రచార ప్రభావం నీపై రివర్స్‌లో పడింది. ’’
‘‘అంతేనా?’’
‘‘నాయకులు కట్టుబట్టలతో వచ్చాను. పలానా నాయకుడు పలానా నాయకుడితో కుమ్మక్కు. పలానా పార్టీలు కుమ్మక్కు అని పదే పదే ప్రచారం చేయడం వెనుక చాలా వ్యూహం ఉంటుంది.’’
‘‘అది అబద్ధం అని వారికి తెలియదా?’’
‘‘ప్రచారం ప్రారంభించేప్పుడు అది అబద్ధం అని వారికి తెలుసు, కానీ ప్రచారం ఉధృతంగా సాగిన తరువాత ఆ ప్రచారాన్ని ప్రారంభించిన వారు సైతం అది నిజమే అని నమ్ముతారు. ’’
‘‘మరీ చిత్రంగా మాట్లాడుతున్నావు. అబద్ధాల ప్రచారం ప్రారంభించిన వారే అది నిజం అని ఎలా నమ్ముతారు. నిజం ఏంటో వారికి తెలియదా?’’
‘‘ముందు నీలానే నేనూ ఇలానే అనుకునే వాడిని. అబద్ధానికి శ్రీకారం చుట్టిన వారే అది నిజం అని ఎలా నమ్ముతారో ఒక ఉపన్యాసంలో ఓషో చెప్పిన తరువాత అర్థమైంది.’’
‘‘ఆయనెప్పుడో 90లలో ఉపన్యాసాలు చేశారు. ఆ తరువాత వచ్చిన పాలకుల గురించి ఆయనకేం తెలుసు. మనుషులు కొత్త పాత కావచ్చు కానీ విధానాలు, సిద్ధాంతాలకు పాత కొత్త ఏంటి? వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చూస్తే ఎన్టీఆర్‌తో పాటు కొందరు నేతలపై ఒక రకమైన అభిప్రాయం కలుగుతుంది, అదే బాలకృష్ణ తీసిన కథానాయకుడు చూస్తే కొందరు నేతలపై మరో రకం అభిప్రాయం కలుగుతుంది. అంతా మనం చేసే ప్రచారాన్ని బట్టి ఉంటుంది. ’’
‘‘ఇది కూడా రజనీష్ చెప్పారా?. ఇంతకూ ప్రచారం గురించి రజనీష్ ఏం చెప్పారో చెప్పనే లేదు’’
‘‘పదే పదే ప్రచారం చేయడం వల్ల ఆ ప్రభావం మనపై తీవ్రంగా ఉంటుంది. వ్యాపార ప్రకటనలు ఆ కోవలోనివే. అదేదో ఫర్‌ఫ్యూమ్ రాసుకుంటే అందమైన అమ్మాయిలు మీద పడిపోతారని పదే పదే కనిపించే ప్రకటన అబద్ధం అని నీకు బాగా తెలుసు కానీ నువ్వు ఫర్‌ఫ్యూమ్ కొనడానికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రకటనలో చూపిన దానినే కొంటావు. ఆ ప్రచారం అబద్ధం అని తెలిసినా.. ఇదే సూత్రం రాజకీయ వ్యాపారానికి సైతం వర్తిస్తుంది. ’’
‘‘ప్రచారం గురించి ఓషో ఏం చెప్పాడో అది చెప్పు ముందు’’
‘‘ప్రచారం అబద్ధం అని తెలిసినా ఎంత ప్రభావం ఉంటుంది. అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకు వచ్చిన వారు సైతం కొన్ని రోజుల తరువాత దాన్ని నిజమని ఏ విధంగా నమ్ముతారో అద్భుతమైన కథ చెప్పారు’’
‘‘ఏంటా కథ?’’
‘‘మీడియాలో ప్రకటనలు తయారు చేసే వ్యక్తి మరణిస్తారు. ముందు స్వర్గానికి వెళ్లాక సెయింట్ పీటర్ అతన్ని చూసి స్వర్గంలో ప్రచార కర్తల కోటా 25 మాత్రమే. మీ కన్నా ముందే 25 మంది ఉన్నారు. ఇక్కడ మీకు చోటు లేదు. నరకానికి వెళ్లండి అంటారు. ప్రకటనలు తయారు చేసే వ్యక్తి మీడియాలో మీకు బోలెడు ప్రచారం కల్పిస్తాను నాకు స్వర్గంలో చోటు కల్పించండి అని బతిమిలాడుకుంటాడు. సెయింట్ పీటర్ ఒక మార్గం ఉంది అంటారు. 25 మందిలో ఎవరినైనా ఒకరిని నరకానికి పంపితే మీకు స్వర్గంలో అవకాశం ఉంటుంది. దీని కోసం మీకు 24 గంటల సమయం ఇస్తున్నాను అంటాడు. ప్రకటనలు తయారు చేసే అతని ఎగిరి గంతేసి అప్పటికే స్వర్గంలో ఉన్న అందరినీ విడివిడిగా కలుస్తాడు. నరకంలో కొత్త పత్రిక వస్తోంది. దాని కోసం ప్రకటనలు తయారు చేసే వ్యక్తి కావాలట. అద్భుతమైన అవకాశం అని స్వర్గంలో ఉన్న ఆ 25 మందికి విడివిడిగా రహస్యంగా చెబుతాడు. మరుసటి రోజు సెయింట్ పీటర్ వద్దకు వచ్చి, ఏమైనా ఖాళీలు ఏర్పడ్డాయా అని అడుగుతాడు. పీటర్ ఆశ్చర్యపోయి ఏం మాయ చేశావు. మొత్తం 25 మంది నరకానికి వెళ్లిపోయారు. అంతా ఖాళీనే అంటాడు. దాంతో నరకంలో అవకాశాలు అంటూ అబద్ధపు ప్రచారం మొదలు పెట్టిన ప్రకటనల కర్త ఆలోచనలో పడిపోతాడు. స్వర్గం నుంచి 25 మంది ప్రకటన కర్తలు నరకానికి వెళ్లిపోయారంటే.. అక్కడ నిజంగానే పెద్ద ఎత్తున పత్రిక వస్తుందేమో, అవకాశాలు బాగా ఉన్నాయేమో అనుకుంటాడు. అంతా నరకానికి వెళ్లినప్పుడు నేనొక్కడిని ఇక్కడ ఎందుకు అని అతను కూడా నరకానికి వెళ్లిపోతాడు. ఇది రజనీష్ చెప్పిన ప్రచార ప్రభావం కథ. ఒక అబద్ధాన్ని ప్రారంభించిన వారు, కొన్ని రోజుల తరువాత అదే నిజం అని ఎలా నమ్ముతారో చెప్పిన కథ. అచ్చం నేతలు సైతం అంతే కదా? వాళ్లు మొదలు పెట్టిన అబద్ధాన్ని చివరకు వారే నిజమని నమ్మేంత బలంగా ప్రచారం చేస్తున్నారు. ’’
‘‘ఏది నిజం ఏది అబద్ధం ఓ మహాత్మా’’
‘‘అన్నీ నిజాలే అన్నీ అబద్ధాలే మారేది కోణాలు అంతే. నీ కోణంలో నిజం అనిపించింది నా కోణంలో అబద్ధం అనిపించవచ్చు.’’

buddhamurali2464@gmail.com