జనాంతికం - బుద్దా మురళి

గ్రాఫిక్స్ లోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనుషుల్లో క్రూరత్వం రోజురోజుకూ పెరిగిపోతోంది రావుగారూ’’
‘‘ఔనండీ! ఇంతకూ దేనిగురించి?’’
‘‘చూడండి పాపం.. సార్వభౌమాధికారం అని పలకలేని పసిగుడ్డును పట్టుకుని ఎనే్నసి మాటలంటున్నారు? మంగళగిరి అని చెప్పలేక, గుంటూరును గుంత్రు అని ఏదో నెట్టుకొస్తున్న యువరాజును పట్టుకుని..’’
‘‘ఆ.. పట్టుకుని...’’
‘‘దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ చెప్పిన ఏమంటివేమంటివి..? అనే డైలాగును పది తప్పులతోనైనా సరే, చూసి చదివినా చాలని చాలెంజ్ చేస్తున్నారు.’’
‘‘నిజంగానే ఇది దుర్మార్గం. అంత చిన్న వయసులో ఇంత కఠిన పరీక్షనా? ఏమైనా అయితే ఎవరిదండీ బాధ్యత? సవాల్ చేసేవారికేంటి? ఎన్నయినా అంటారు. మరీ ఇంత కఠినమైన సవాల్ అన్యాయం, దుర్మార్గం. ’’
‘‘రావుగారూ.. మిమ్మల్ని చూడగానే గుర్తుకొచ్చింది.. హైదరాబాద్‌కు దగ్గరలో ఓ వంద ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే చూడండి’’
‘‘ఏంటీ ప్లాట్ల వ్యాపారంలోకి వస్తున్నారా?’’
‘‘కాదండీ! సముద్రం తవ్వించాలని..’’
‘‘ఏం మాట్లాడుతున్నారు? సముద్రం తవ్వించడం ఏమిటి? పోనీ తవ్విస్తారు అనుకుందాం.. వంద ఎకరాలేమిటి?’’
‘అంటే వంద ఎకరాలు సరిపోవా? ఎక్కువవుతుంది అంటారా?’’
‘‘చాలా ఎక్కువవుతుంది.?’’
‘‘పోనీ.. ఎంతయితే సరిపోతుంది చెప్పండి. ఆ సముద్రంలో మచిలీపట్నం పోర్టు కూడా ఉండాలి’’
‘‘ఎకరాలు ఎందుకండి. అమీర్‌పేటలో ఇంటర్నెట్ సెంటర్ చాలు. ఏ నెట్ సెంటర్‌కెళ్లినా చాకుల్లాంటి కుర్రాళ్లు ఉంటారు. రెండు మూడు వేలు ఇవ్వండి అద్భుతమైన గ్రాఫిక్స్‌తో మీకు కావలసినవి చేయించుకోవచ్చు. హైదరాబాద్‌ను తలదనే్న రెండు మూడు డజన్ల హైదరాబాద్‌లు, సముద్రాలు, అదీ ఇదీ అని కాదండీ.. మరో ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు.’’
‘‘పిండి కొద్దీ రొట్టె అని రెండు మూడు వేల రూపాయలతో గ్రాఫిక్స్ ఐతే మరీ నాసిరకంగా ఉంటాయేమో! అది కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని గ్రాఫిక్స్‌కే మూడువందల కోట్లు ఖర్చయ్యాయట!’’
‘‘గ్రాఫిక్స్‌తో జనం సంతృప్తి చెందుతారా?’’
‘‘అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావుకోడిని వేలాడ దీసి దాన్ని చూస్తూ అన్నం తింటాడు. నిజంగా కోడికూర తిన్నట్టుగా సంబరపడతాడు. కోటను కోడి సంతృప్తి పరిచినప్పుడు, జనాల్ని గ్రాఫిక్స్ ఎందుకు సంతృప్తి పరచవు?’’
‘‘అప్పుడెప్పుడో ఓ ఫేమస్ కార్టూనిస్ట్ భవిష్యత్తు కాలం అంతా గ్రాఫిక్స్‌దే అంటూ రాస్తే ఏదో గ్రాఫిక్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ల పబ్లిసిటీ కోసం అలా రాశాడనుకున్నా.. కానీ నిజంగా గ్రాఫిక్స్‌దే లోకం’’
‘‘హఠాత్తుగా గ్రాఫిక్స్‌పై దృష్టి పడిందేంటి?’’
‘‘ఒక్కో కాలంలో ఒక్కో నినాదం పని చేస్తుంది. గరీబీ హఠావో నినాదం ఎవర్‌గ్రీన్. మన దేశంలో ఆ నినాదాన్ని మించిన నినాదం మరోటి పుట్టలేదు. మినిమం గ్యారంటీ నినాదం అది. పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్‌కు తిరుగులేదు. రాజకీయాల్లో పేదరిక నిర్మూలన నినాదానికి ఎదురులేదు.’’
‘‘గ్రాఫిక్స్ అంటావు.. గరీబీ హఠావో అంటావు..’’
‘‘గరీబీ హఠావో తరువాత ఆత్మగౌరవ నినాదం దక్షిణాదిలో పని చేసింది. ’’
‘‘నిజమే అప్పుడప్పుడు నాకూ అనుమానం వస్తుంది. ప్రతి మనిషికీ ఆత్మగౌరవం ఉంటుంది కదా? అడుక్కునేవాడికైనా, అంబానీకైనా అత్మగౌరవం ఉంటుంది కదా?’’
‘‘అనుమానం ఎందుకు?’’
‘‘మరి దక్షిణాదిలోనే రాజకీయాల్లో ఆత్మగౌరవ నినాదం బలంగా వినిపిస్తుంది. ఉత్తరాదిలో మాత్రం అస్సలు వినిపించదేం..?’’
‘‘నిజమే కదా? తొలుత తమిళనాడులో ద్రావిడ ఉద్యమంతో మొదలైన ఆత్మగౌరవ నినాదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పాకింది’’
‘‘ఇంకో చిత్రం గమనించావా? ఆత్మగౌరవ నినాదం రాజకీయాల్లో ఒక ఊపు ఊపిన రాష్ట్రాల్లోనే నాయకులకు పాదాభివందనాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆత్మగౌరవ నినాదం తొలుత వినిపించిన తమిళనాడులోనే కాళ్లకు మొక్కే సంస్కృతి ఎక్కువ. జయలలిత కారు కనిపించినా దానికి మొక్కే అభిమానులు ఉండేవారు. మన కన్నా తమిళనాడే బెటర్. తమిళనాట కాళ్లు మొక్కే సంస్కృతే కానీ తెలుగునాట మాత్రం కాళ్లు మొక్కి కాళ్లు లాగే సంస్కృతి కూడా ఉంది.’’
‘‘గ్రాఫిక్స్‌తో మొదలు పెట్టి మధ్యలో ఆత్మగౌరవం అంటున్నావు’’
‘‘మీరింకా పాతరోజుల్లోనే ఉన్నారు. ఇప్పుడంతా స్మార్ట్ యుగం. మన నాయకులు సోషలిజాన్ని మాటలకే పరిమితం చేశారు. సోషలిజం తేవడం నాటి నేతలకే సాధ్యం కాలేదు. కానీ స్మార్ట్ఫోన్ సోషలిజం తెచ్చింది. చదువుకున్న వారు, చదువు లేని వారు, బాగా చదివిన వారు, కొద్దిగా చదివిన వారు, మేధావులు, స్ర్తిలు, పురుషులు, ఆస్తికులు, నాస్తికులు, పురుషాధిక్యతను నిలదీసే ఉద్యమ కారులు, భార్యాబాధిత సంఘం సభ్యులు, వారూ వీరు అని కాదు.. ఎవరైనా సరే ఇపుడు స్మార్ట్ఫోన్‌లో మునిగిపోయారు కదా? ’’
‘‘ఔను.. మీతో మాట్లాడుతూనే స్మార్ట్ఫోన్‌ను ఆపరేట్ చేస్తున్నా..’’
‘‘స్మార్ట్ఫోన్‌లో మునిగినప్పుడు రాజైనా, కూలీ అయినా ఒకటే... ఇది నిజమైన సోషలిజం. అప్పుడెప్పుడో తాజ్‌మహల్ కట్టినట్టు, రాజులు కోటలు నిర్మించినట్టు ఈ రోజుల్లో కూడా ఇటుక, ఇసుక, సిమెంట్ కలిపి రాజధానులను నిర్మించాలా? స్మార్ట్ఫోన్‌లో గ్రాఫిక్స్‌తో రాజధానులను నిర్మిస్తే తప్పేంటి? వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు, భవనాలను నిర్మించడం కన్నా రెండు, మూడు వందల కోట్లతో హైదరాబాద్‌నేం ఖర్మ? అమెరికాను సైతం తలదనే్న విధంగా గ్రాఫిక్స్ కట్టడాలు నిర్మిస్తే తప్పేంటి?’’
‘‘ఈ ఆలోచనేదో బాగానే ఉందండి రావుగారూ!’’
‘‘మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోలేని వారు, స్మార్ట్ఫోన్‌ను కూడా ఆపరేట్ చేయలేని వారు పాతకాలపు పోకడలతో విమర్శలు చేసుకుంటే చేసుకున్నారు.. కానీ ఈ ఐడియా బాగానే ఉంది అనిపిస్తోంది’’
‘‘నిజంగానే బాగుంది. గ్రాఫిక్స్ జిందాబాద్’’ *

buddhamurali2464@gmail.com