జనాంతికం - బుద్దా మురళి

తటస్తులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమండీ.. మూర్తిగారూ.. రాజకీయాలు చాలా హాట్‌హాట్‌గా ఉన్నట్టున్నాయి?’’
‘‘ఔనండీ.. ఎవరు గెలుస్తారో అర్థం కావడం లేదు. మీడియానేమో పార్టీలకు అనుబంధంగా మారింది. ఏ సామాజిక వర్గం మీడియా ఆ సామాజిక వర్గం వారిదే విజయం అని బాకా ఊదుతోంది. దేన్ని నమ్మాలో అర్థం కావడం లేదు. రావుగారూ.. మీరు చెప్పండి.. ఎవరు గెలుస్తారు?’’
‘‘మూర్తిగారూ.. మీతో దాపరికం ఏముంటుంది? నేను తటస్తుణ్ణి’’
‘‘గ్రేట్.. నేను కూడా తటస్తుడినే.. అందుకే మన అభిప్రాయాలు ఇలా కలిశాయి?’’
‘‘మీరూ తటస్తులేనా? ఏ పార్టీకి తటస్తులు ?’’
‘‘నేను ‘ఎక్స్’ పార్టీ తటస్తుడిని.. మరి మీరు?’’
‘‘నేను ‘జెడ్’ పార్టీ తటస్తుడిని..’’
‘‘అదేంటి? ఎక్స్ తరువాత ‘వై’ పార్టీ రావాలి కదా? ఈ రైటర్ ఏంటి? ఎక్స్ తరువాత జెడ్ అంటున్నాడు’’
‘‘ఇదిగో.. రావుగారూ, మూర్తిగారూ.. మీరూ మీరూ మాట్లాడుకోండి.. మధ్యలో ఈ రైటర్‌ను లాగకండి. ఎక్స్ తరువాత జెడ్ అని అర్థం లేకుండా వాడలేదు. మీలో ఒకరు ఎక్స్ పార్టీ తటస్తులు అనగానే ఇంకొకరు వై పార్టీ తటస్తులు అన్నామనుకోండి. ‘వై’తో మొదలయ్యే ఓ పార్టీ ఉంది కదా.. అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా? అందుకే ‘వై’ని వదిలేసి జెడ్ అన్నాను. ఎందుకుంటే మీలానే నేను కూడా తటస్తుడినే.. నన్ను వదిలేసి మీలో మీరు మాట్లాడుకోండి’’
‘‘ఐనా రావుగారూ.. మనం తటస్తులం, కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు దూరంగా ఉండాలి. కానీ ఎందుకో ఈసారి మా సామాజిక వర్గానికి చెందిన ‘ఎక్స్’ పార్టీకే విజయం ఖాయం అనిపిస్తోంది. ఏదో తటస్తుడిగా నా అభిప్రాయం చెప్పాను. అపార్థం చేసుకోకండి. నాకు పార్టీని అంటగట్టకండి’’
‘‘అయ్యో.. మూర్తిగారూ ఎంత మాటనేశారు. మనం తటస్తులం. మనకు రాష్ట్ర ప్రయోజనాలే తప్ప సామాజిక వర్గం, బంధువర్గం, మన వాళ్లు అనే అభిమానం ఎందుకుంటుంది? ఏది మంచిదనుకుంటే తటస్తంగా అది మంచిది అని చెబుతాం. అంతే.. నాకెందుకో మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం బాగు కోసం మా సామాజిక వర్గానికి చెందిన జెడ్ పార్టీ విజయం ఖాయం అనిపిస్తోంది. ప్రజలు సామాజిక వర్గాలకు అతీతంగా జెడ్ పార్టీనే ఆదరిస్తారని అనిపిస్తోంది. విశ్వమానవ సంక్షేమం కోసం ఈ నిర్ణయమే మంచిది అనిపిస్తోంది. ముందే చెబుతున్నా.. నేను తటస్తుడిని.. ఏదో మా సామాజిక వర్గం కాబట్టి అనుకూలంగా స్పందిస్తున్నానని అపార్థం చేసుకోకండి’’
‘‘రావుగారూ, మూర్తిగారూ.. మీరిద్దరు కూడా మీమీ సామాజిక వర్గాల పార్టీలు గెలవాలని కోరుకునే కరుడుకట్టిన తటస్తులు. మీ చర్చకు అంతు లేదు కానీ వదిలేయండి. మీమీ సామాజిక వర్గాల పార్టీల గెలుపు కోసం మీ వంతు కృషి చేయండి. వీలైతే ఆ తటస్త ముసుగు తీసేయండి’’
‘‘ఎంత మాట అనేశారు.. తటస్త ముసుగు తీసేస్తే ఇక మా ప్రత్యేత ఏముంది?’’
‘‘మూర్తిగారూ.. ప్రజలు చాలా తెలివి మీరి పోయారండి! తటస్తులకు ఇవి రోజులు కావు. ఆ రోజుల్లో తటస్తులంటే ఎంత గౌరవం ఉండేది. పార్టీలు టికెట్లు ఇచ్చేవి. ఏకంగా మంత్రివర్గంలో చోటు ఇచ్చే వాళ్లు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వాళ్లు మేం తటస్తులం అని చెప్పుకునేవారు. ప్రజలు అలానే గౌరవించేవాళ్లు. కానీ ఇప్పుడేంటండి తటస్తులమంటే కొంచం కూడా గౌరవించడం లేదు’’
‘‘ఔనండీ.. రావుగారూ.. అప్పట్లో నటుడు అక్కినేని నేను తటస్తుడిని.. కానీ ఈసారికి మాత్రం నాకు నచ్చిన పార్టీకి ఓటు వేయండి అని పిలుపు ఇస్తే జనం ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు? మీ విజయానికి దోహదం చేసిన ఆ పది లక్షల ఓట్లు తటస్తుడిగా నేనిచ్చిన ప్రభావం వల్లనే అని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. మరి ఈ రోజుల్లో నేను తటస్తుడిని.. ఫలనా పార్టీకి ఓటు వేయాలంటూ- కొత్తగా ఓటు వచ్చిన 18ఏళ్ల కుర్రాడికి చెబితే, మీది ఫలనా సామాజిక వర్గమా? అందుకే ఆ పార్టీకి ఓటు వేయమని చెబుతున్నారు కదా నిర్మొహమాటంగా అంటున్నారు.’’
‘‘ఔనండీ.. చిన్నంతరం పెద్దంతరం లేకుండా పోయింది. తటస్తులను గౌరవించాలనే కనీస మర్యాద లేకుండా పోయింది.’’
‘‘సరే- మీ మాట కాదు.. నా మాట కాదు.. మనం తటస్తులం. ఏదో ఒక సామాజిక వర్గానికి ఓటు వేయడం కన్నా ‘నోటా’కు ఓటు వేయడం మంచిది. మీలాంటి మేధావులు ‘నోటా’కే ఓటు వేయాలని కోరుకుంటున్నానండీ!’’
‘‘నన్ను నోటాకు ఓటు వేయమంటున్నారు. మీరు కూడా నోటాకే వేస్తారా?’’
‘‘అనుమానమే అక్కర లేదు రావుగారూ.. నోటాకే వేస్తాను. మీరే కాదు. మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు మీతో భావసారూప్యత ఉన్న అందరికీ ఇదే మాట చెప్పండి. నోటాకే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పండి. ఉంటాను. ఒక తటస్తునిగా ఈ మాట అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ’’
‘‘ మూర్తి అంకుల్.. మీ మాటలన్నీ ఇప్పటి వరకు వింటూనే ఉన్నాను. మీరు ఎప్పుడు చూసినా రాజకీయాల గురించే మాట్లాడుకుంటారు. మీలో బోలెడు రాజకీయ చైతన్యం ఉంది. అలాంటిది నోటాకు ఓటు వేయడం అంటే ఓటు వృథా చేసుకోవడం కాదా?’’
‘‘ఆ రావుగారు మా సామాజిక వర్గం పార్టీకి ఓటు వేయమని ఎంత చెప్పినా వినడు. ఎలాగూ వ్యతిరేకంగానే ఓటు వేస్తాడు. అలా ఒక ఓటు వ్యతిరేకంగా పడడం కన్నా వాడి ఓటు వృథా కావాలని నోటాకు వేయమన్నాను. నా ఓటు మాత్రం మా పార్టీకే వేస్తాను’’
‘‘హమ్మ.. మూర్తి అంకుల్! సరే- ఆ రావుగారిని అడిగి వస్తాను. ఏం చేస్తారో చూడాలి’’
‘‘ రావు అంకుల్.. మీరు నిజంగా నోటాకు ఓటు వేస్తారా?’’
‘‘మీ మూర్తి అంకులే కాదు. నేను కూడా తటస్తుడినే. కాలం మారింది బాబూ.. ఇంతకు ముందు ఒక పార్టీకే తటస్తులు ఉండేవాళ్లు. ఇప్పుడు అన్ని పార్టీలకు తటస్తులు ఉన్నారు. తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు. మీడియా ఏ ఒక్కడి సొత్తు కాదు. ఇప్పుడు అందరికీ మీడియా ఉంది. అందరికీ తటస్తులు ఉన్నారు.
తామరాకు మీద నీటిబొట్టులా ఉండాల్సిన మీడియానే రాజకీయ పక్షాలకు అనుబంధ విభాగాలుగా మారినప్పుడు తటస్తులం అని చెప్పుకొనే వారిని ఎలా నమ్మాలి? చిన్న వాడివి.. ఒక్క మాట చెబుతాను. తటస్తులతో జాగ్రత్త..! వారిని గుడ్డిగా నమ్మకు. తటస్తులు చెప్పింది కాదు, నీ మనసు చెప్పింది విను. ఓటర్లు నచ్చిన పార్టీకి ఓటు వేస్తారు. తటస్తులు నచ్చిన పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తారు. ’’

*

buddhamurali2464@gmail.com