జనాంతికం - బుద్దా మురళి

అబద్ధం ఒక్కటే నిజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ మనుషులు అస్సలు అర్థం కారు. తమిళం వాడో, మలయాళీ వాడో సినిమా తీస్తే ఆహో ఓహో సినిమా అంటే ఇలా ఉం డాలి..అని తెగ పొగిడేస్తాం. వాస్తవ కథలు అంటూ పేజీలకు పేజీలు రివ్యూలు రాసేస్తుంటాం. అదే తెలుగువాడు వాస్తవిక కథతో సినిమా తీస్తే చూసేవాడుండడు. ‘మల్లేశం’ సినిమాకు బాహుబలి రేంజ్‌లో సమీక్షలు వచ్చినా, థియోటర్లలో పరిస్థితి వేరుగా ఉందట! డబ్బులు రాల్చని రివ్యూలు ఎంత అద్భుతంగా ఉంటేంది? అసలిలా ఎందుకు జరుగుతుందంటావ్?’’
‘‘ఇందులో అంత వింత ఏముందోయ్? మనం ధరించే ముసుగు ఒకటి, మన అసలు రూపం ఒకటి.. అందుకే మనం మాట్లాడేదానికి మన అసలు రూపానికి అస్సలు సంబంధం ఉండదు! మనం ‘జబర్దస్త్’ షోను మహా సంతోషంగా చూస్తాం. బయట మాత్రం ఛీ.ఛీ.. ఎక్కడికెళుతున్నాం? ఇవేం ప్రోగ్రామ్స్.. అని తెగ బాధపడతాం. సినిమాలూ అంతే.. హీరోలు కంటిచూపుతో విలన్లను చంపేసే సినిమాలపై జోకులేస్తాం. హాయిగా చూస్తాం. అమ్మడూ.. కుమ్ముడూ అని గెంతులేసే సినిమాల్ని కుమ్మేస్తాం. ఈ వయసులో అవేం పాటలు, అదేం నటన, మనవరాలి వయసున్న హీరోయిన్‌తో ఆ గెంతులేమిటి? అని ప్రశ్నిస్తాం. అయినా హాలులో సినిమా చూసేస్తాం. ఎవరో రాంగోపాల్‌వర్మ లాంటి ఒకరిద్దరు ఉదయం లేవగానే నీలిచిత్రాలు చూస్తానని చెప్పుకుంటాడు. కానీ మెజారిటీ మాత్రం వర్మ కన్నా ఎక్కువగా నీలిచిత్రాలు చూసినా నీలిచిత్రాలంటే ఏంటండి? అని అమాయకంగా అడుగుతుంటారు.’’
‘‘మనం మాట్లాడేదానికి, ఆచరణకు అస్సలు సంబంధం ఉండదు. ఇది తెలుసుకుంటే ఏదీ వింతగా అనిపించదు, ఆశ్చర్యం కలిగించదు. సినిమా చూసే సాధారణ ప్రేక్షకులు, మేధావులు, సమీక్షలు రాసేవారు అంతా వేరు వేరు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలని లేదు. రాష్టప్రతి మెచ్చినది అంటూ తెగ హడావుడి చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఘటనలు ఎన్ని లేవు?’’
‘‘ రాష్టప్రతి మెచ్చిన సినిమా అని ప్రచారం జరిగినా, నాలుగు దశాబ్దాల క్రితం శంకరాభరణం సినిమా బాక్సాఫీస్ గండం నుంచి బయటపడింది. కానీ ఇలాంటి అదృష్టం అందరికీ ఉంటుందా?’’
‘‘ఇంతకూ నువ్వేమంటావు?’’
‘‘నువ్వయినా నేనయినా మనం ఎవరం కనిపించే వాళ్లం కాదు. మనిద్దరమే కాదు అందరూ కనిపించని మూడో సింహాలం అంటాను’’
‘‘మనం చూసేది, వినేది, చెప్పేది అంతా అబద్ధమే అంటావా?’’
‘‘నిజం మాత్రం కాదు..’’
‘‘నిజం కాకపోతే అబద్ధమే కదా?’’
‘‘అలా ఎందుకనుకుంటావు? నిజానికి, అబద్ధానికి మధ్య అర్ధసత్యం అని ఒకటుంటుంది. నిజం, అబద్ధం కన్నా అర్ధసత్యం ఇంకా ప్రమాదకరం.’’
‘‘మరి మన కళ్లేదుట కనిపించే ఈ రాజప్రసాదాలు, భారీ భవనాలు, ఆకాశం, నేల నిజం కాదంటావా?’’
‘‘మనం నిలబడ్డ భూమి ఒకప్పుడు నీటితో ఉండేదని సైన్స్ చెబుతోంది’’
‘‘సైన్స్ అన్నీ నిజాలే చెబుతుందంటావా?’’
‘‘ఏమో? ఐన్‌స్టీన్ చెప్పిన సూత్రాలు- తప్పని తరువాత నిరూపించిన వారు కూడా ఉన్నారు.’’
‘‘సైన్స్‌ను, భూమిని, సముద్రాన్ని నమ్మవు, మరి ఏది నిజం?’’
‘‘ఇక్కడ భవనం కనిపిస్తుంది కదా? ఇది నిజమంటావా?’’
‘‘నిజంగానే కనిపిస్తున్నాక అనుమానం ఎందుకు?’’
‘‘నిన్న మొన్నటి వరకు అలానే అనుకున్నాం కదా? పాలకులు మారిన తరువాత ఈ సత్యాలు కూడా మారిపోతుంటాయి. మొన్నటి వరకు మనమేమనుకున్నాం. కరకట్టపై ఆ ప్రజావేదిక ఎంత అద్భుతంగా వెలిగిపోతోంది. ఏ శిల్పి అద్భుతంగా చెక్కాడో అని మురిసిపోయాం. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ ప్రశ్నించినట్టు ఆ భవని నిర్మాణానికి ఖర్చయిన పది కోట్లు విడుదల చేసింది ఎవరు? అని కాదు. అంత అద్భుతంగా, అంత తక్కువ సమయంలో ఆ భవనం నిర్మించింది ఎవరు అని మనం చాలా మాట్లాడుకున్నాం కదా?’’
‘‘ఔను!’’
‘‘మొన్నటికి మొన్న ఏమనుకున్నాం. ఇంత అద్భుతమైన భవన సౌందర్యాన్ని చూసి ఈర్ష్యతో కొత్తపాలకుడు దాన్ని కూల్చేయాలని అనుకుంటున్నాడని అనుకున్నాం. గుర్తుందా?’’
‘‘ఆ భారీ భవనాన్ని కూల్చేయడానికి ఒకవైపు జేసీబీలు, భారీ యంత్రాలను తరిలిస్తే మరోవైపు సౌందర్యారాధకులు- బ్రిటీష్ వాళ్లు కట్టారని పార్లమెంటు భవనాన్ని, మోఘలాయిలు కట్టారని ఎర్రకోటను, నిజాం ప్రభువు కట్టాడని చార్మినార్‌ను వద్దంటారా? అంటూ కవితాత్మకంగా ఎంత బాగా మాట్లాడారు’’
‘‘ఔను..విన్నాను. అలా అంటే మన దేశంలో ఇప్పుడున్న రైల్వే లైన్లు అత్యధికంగా బ్రిటీష్ హయాంలో వేసినవే.. వాటిని తొలగిస్తామా?’’
‘‘మోదీ తెస్తానన్న గుజరాత్ బుల్లెట్ ట్రైన్, ఏపీలో బాబు తెస్తానన్న బుల్లెట్ ట్రైన్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ ఇప్పుడున్న రైల్వే లైన్స్ బ్రిటీష్ వారి కాలంలోనివే. ఇందులో అబద్ధం ఏముంది?’’
‘‘మహామేధావులు పార్లమెంటు భవనంతో, తాజ్‌మహల్‌తో పోల్చిన ప్రజావేదిక కూల్చివేతను కనురాలా తిలకిద్దామని జగన్ అభిమానులు, ప్రజావేదికను కూల్చొద్దని అక్కడే బోరున విలపిద్దామని వెళ్లిన బాబు అభిమానులు, జేసీబీ డ్రైవర్లు, సిబ్బంది ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు’’
‘‘ఎందుకు?’’
‘‘గోటితో పోయేదానికి గొడ్డలితో అన్నట్టు. నట్లు విప్పదీస్తే భవనం మొత్తం ముక్కముక్కలై వచ్చేసిందట! దీన్ని చూసి రెండు పక్షాలూ విస్తుపోయాయి. భవనాలను ఇలా కూడా కట్టవచ్చా? అని అంతా ఆశ్చర్యపోయారట! అక్కడికి చేరిన మీడియా ప్రతినిధులు ఇంతకూ ప్రజావేదికను కూల్చారని రాయాలా? విప్పదీశారని రాయాలా? అని తేల్చుకోలేక పోయారు.’’
‘‘నాకూ అలానే అనిపించింది.. ఐతే?’’
‘‘శ్రీహరిని ఈ స్తంభంలో చూపిస్తావా? అని ప్రహ్లాదుడిని హిరణ్యాక్షుడు అడిగినట్టు.. ఈ భవనం నిజమా? అని అడిగావు కదా? ఇప్పుడేమంటావు?’’
‘‘నిజమే అబద్ధం తప్ప ఏదీ నిజం కాదని ఒప్పుకుంటా, అబద్ధం ఒక్కటే నిజం అని ఒప్పుకుంటా..’’
‘‘అది కూడా నిజం కాదేమో! అబద్ధమే నిజం అని నమీ నమీ మనం చివరకు నిజాన్ని నమ్మలేం, అబద్ధాన్నీ నమ్మలేం. ’’
‘‘ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి. నమ్మకమే జీవితం అనేది.. నిజం కాదు. అపనమ్మకమే జీవితం అనేది నేటికాలపు సత్యం’’
*

buddhamurali2464@gmail.com