జనాంతికం - బుద్దా మురళి

ఎమ్మెల్యేల మార్కెట్ ఇండెక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ప్రవహిస్తుంటే నీకేమనిపిస్తుంది?’’
‘‘పాతిక రూపాయలిస్తే మినరల్ వాటర్ బాటిల్ వస్తుంది కదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు చేసింది బురద నీటి కోసమా? ఆ నీళ్లను ఎప్పుడు శుభ్రం చేయాలి? ఎప్పుడు వాటర్ బాటిల్స్‌లో పట్టాలి? ఖర్చు పెట్టిన వేలకోట్లు తిరిగి రావాలంటే ఎన్ని వాటర్ బాటిల్స్ కావాలి? ’’
‘‘ఏంటోయ్! నువీ మాట సీరియస్‌గా అంటున్నావా? సీల్లీగానా? సీరియస్‌గా అంటే నా కళ్ల ముందు మరో మేధావి ప్రత్యక్షమైనట్టే. ఆయనెవరో రిటైర్డ్ మేధావి అన్నింటికీ ఇలానే ఆదాయం-ఖర్చు లెక్కలు చెబుతూ కాళేశ్వరం వద్దన్నాడు. కొంపదీసి ఆయన వద్ద శిష్యరికం చేస్తున్నావా?’’
‘‘నువ్వే చెప్పావు రిటైర్డ్ మేధావి అని.. తా దూర కంత లేదు మెడకో డోలు అన్నట్టు. రిటైర్డ్ మేధావి రాజకీయ అంకుర పరిశ్రమ మూత పడి ఆయనకే పని లేకుండా ఉంది. ఆయన్ని ఫాలోఅయి నేను చేసేదేముంది? టీవీ కెమెరా కనిపిస్తే మేధావి కాబట్టి కాళేశ్వరంపై ఏదో మాట్లాడాడు. ఆ సంగతి వదిలేయ్!’’
‘‘ఇంతకూ నువ్వు అంత సీరియస్‌గా దేని గురించి ఆలోచిస్తున్నావ్?’’
‘‘చాలా బాధగా ఉంది?..’’
‘‘దేనికి?’’
‘‘స్మార్ట్ఫోన్‌లో ప్రపంచం ఇమిడిపోయిన ఈ కాలంలో ఇంకా రహస్యంగా ఉంచడం బాధగా ఉంది’’
‘‘దేని గురించో చెప్పు?’’
‘‘చీపురుకట్ట ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అని ఆన్‌లైన్‌లో ప్రపంచ వ్యాప్తంగా ధరలు చూడవచ్చు.. తెలుసు కదా?’’
‘‘తెలుసా? అని అడగడం ఏమిటి? మేం ఇంటికి పాలకూర కట్టలు కూడా బిగ్ బాస్కెట్ నుంచి ఆన్‌లైన్‌లోనే తెప్పించుకుంటాం.’’
‘‘మేం కూడా కర్రీ పాయింట్ నుంచి పప్పుచారు సైతం స్విగ్గీ ద్వారా తెప్పించుకుంటాం.’’
‘‘మరి దేని గురించి నీ బాధ? అప్పుడెప్పుడో స్విగ్గీ డెలివరీ బోయ్ టిఫిన్‌ను ఎంగిలి చేసి ఇచ్చాడని- ఇప్పుడు బాధపడుతున్నావా?’’
‘‘దాని గురించి కాదు. అమెరికాలో ఉన్నా మనవాళ్లు ఆన్‌లైన్‌లో పిడకలు కొంటున్నారు. సికిందరాబాద్‌లో ఉండే మా పిన్ని వాళ్లకు బూడిద గుమ్మడికాయ కావాలంటే ఇక్కడి మార్కెట్‌లో దొరకలేదు. కానీ అమెరికా వెళ్లాక ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నారట! ’’
‘‘ఇంతకూ నువ్వేం చెప్పదలుచుకున్నావ్! మీ పిన్నివాళ్లు అమెరికాలో ఉన్నారనా? మీ పిన్నివాళ్లే కాదు ఈ దేశంలో ప్రతి గ్రామం నుంచి అమెరికాకు వెళ్లిన వాళ్లు ఉన్నారు. వారానికోసారి వెళ్లి వస్తున్న వారూ ఉన్నారు. కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనుకునే రోజులు పోయాయి. ఈ రోజుల్లో కార్లలో ప్రపంచ యాత్ర జరుపుతున్న దంపతులు ఉన్నారు తెలుసా?’’
‘‘తెలుసులే! మొన్ననే ఓ భారతీయ జంట ఇలా కారులోనే ప్రపంచ పర్యటన జరిపిన వార్త చదివా..!’’
‘‘మరి దేని గురించి నీ బాధ?’’
‘‘ఏ దేశ కరెన్సీ విలువ ఎంత? అమెరికా డాలర్‌కు ఎన్ని రూపాయలు? కెనడా డాలర్‌కు ఎన్ని రూపాయలు? అని మనం సెల్‌ఫోన్‌లో చూసి క్షణాల్లో తెలుసుకుంటున్నాం కదా?’’
‘‘డాలర్ విలువే కాదు, కొత్తిమీర కట్ట ధర కూడా తెలుసుకుంటున్నాం.. ఐతే ఏంటి?’’
‘‘అంటే శాసనసభ్యులు కొత్తిమీర కట్ట పాటి విలువ కూడా చేయరా?’’
‘‘కొత్తిమీర కట్టకు, ప్రజాప్రతినిధులకు మధ్య సంబంధం ఏమిటోయ్! తలాతోకా లేకుండా మాట్లాడతావ్..’’
‘‘కర్నాటకలో ప్రజాప్రతినిధుల రేటెంతో తెలియక ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువుధర ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నప్పుడు కర్నాటక ఎమ్మెల్యేలంటే అంత చులకనా? వారి రేటు ఎందుకు కనిపించడం లేదు’’
‘‘ఏమో నాకేం తెలుసు.. నీకే కాదు, నాకూ బాధగానే ఉంది?’’
‘‘నీకెందుకు?’’
‘‘సర్పంచ్ సంగతి పక్కన పెట్టు. ఎంపిటీసిగా గెలవాలన్నా ఎంత కష్టమో నీకు తెలుసు కదా? ?’’
‘‘కాదని ఎవరన్నారు?’’
‘‘ఇంటింటికీ తిరిగి బతిమిలాడి, ముక్కు తుడిచి, స్నానం చేయించి, టిఫినీలు తినిపించి ఓటు కోసం ఎంత కష్టపడతారో నీకు తెలుసు కదా?’’
‘‘ఔను.. ఇంట్లో టీ గ్లాస్ పక్కన పెట్టడం తెలియని వాళ్లు కూడా ఎన్నికల్లో ప్రచారం అనగానే బట్టలుతుకుతారు.’’
‘‘కుర్రదాని ప్రేమకోసం కుర్రాడు పడే కష్టం కన్నా ఓటరును ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువ కష్టపడతారు.. ఐతే ఏంటి?’’
‘‘నిద్రాహారాలు మాని, ఇల్లు గుల్ల చేసుకుని ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుక్కుని గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన సంబరాల నుంచి ఇంకా బయటపడక ముందే.. మా రాజీనామాలు అమోదించండి మహాప్రభో అని రోడ్డున పడ్డారు. ఎందుకో పాపం..?’’
‘‘ఔనోయ్.. ప్రజాస్వామ్యం రోజురోజుకూ పరిణతి చెందుతోంది. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఓట్ల కోసం రకరకాల వేషాలు వేశారు. అలా గెలిచిన వారు మా రాజీనామాలు ఆమోదించండంటూ దేవుళ్లందరికీ మొక్కుకోవడం వింతగానే ఉంది. అలా ఎందుకు మొక్కుతున్నారంటావ్?’’
‘‘నిజమే కదా? ముంబయి హోటల్స్‌లో, రాజ్‌భవన్‌లో, సుప్రీం కోర్టులో వాళ్లు రాజీనామాల కోసం మొక్కని దేవుళ్లు లేరు!’’
‘‘వాళ్ల త్యాగాన్ని మనం అభినందించాలి .. అలా చిన్నచూపు చూడొద్దు.. సర్పంచ్ పదవిని సైతం వదులుకోవడానికి ఇష్టపడని ఈ రోజుల్లో ఏకంగా శాసనసభ సభ్యత్వం వదులుకోవడమే కాకుండా.. రాజీనామాలు ఆమోదించాలంటూ కాళ్లావేళ్లా పడడం అంటే వాళ్లు- నా దృష్టిలో శరీరాన్ని కోసి ఇచ్చిన శిబి చక్రవర్తి కన్నా, దానకర్ణుడి కన్నా ఎక్కువే..’’
‘‘ఓ సినిమాలో తన గుండెనే దానం చేసేందుకు సిద్ధపడ్డతాడు కృష్ణ భగవాన్’’
‘‘నేను సీరియస్‌గా చెబితే నువ్వు సిల్లీ సినిమా గురించి చెబుతావేం’’
‘‘రెండూ ఒకటేలే...’’
‘‘కావచ్చు- కానీ పార్టీ టిక్కెట్ ఇవ్వమని, గెలిపించమని వేడుకుంటారు కానీ- రాజీనామాలు ఆమోదించమని కోరడం ఏమిటో?’’
‘‘మనం కోరుకున్న వారు అధికారంలోకి రావాలంటే మన వాళ్లు గెలవడమే కాదు.. ప్రత్యర్థి వర్గం రాజీనామాలూ ముఖ్యమే. అన్నింటికీ ఓ ధర ఉంటుంది.. ’’
‘‘నా బాధ అదే.. ఆ ధర ఏమిటో బయటపెడితే .. నచ్చినవారు కొనుక్కుంటారు కదా? ఈ కాలంలోనూ ఇంకా రహస్యాలు ఎందుకు?’’
‘‘ఏమో.. అలాంటి రోజులు కూడా రావచ్చు.. ముంబయి స్టాక్ ఎక్స్‌చేంజి ఇండెక్స్‌లా ప్రజాప్రతినిధులకూ ఇండెక్స్ ఏర్పాటు చేయవచ్చు..!
*

buddhamurali2464@gmail.com