జనాంతికం - బుద్దా మురళి

‘బీమా’వతారం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాలుగేళ్లు కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్లు పది, పదిహేను వేల జీతమైనా సరే చాలని రోడ్డున పడడం బాధగా ఉందోయ్’’
‘‘అంతోటి జీతం వచ్చే ఉద్యోగం దొరికినా అదృష్టమే. ఎంత చిన్న ఉద్యోగానికి ప్రకటన వచ్చినా ఇంజనీరింగ్ విద్యార్థులే వచ్చేస్తున్నారు.’’
‘‘కోళ్ల ఫారాల యజమానులు షెడ్లను ఇంజనీరింగ్ కాలేజీలుగా మార్చేసి, బాయిలర్ కోళ్ల స్థానంలో విద్యార్థులను తెచ్చేశారు. బాయిలర్ కోళ్ల మాదిరి ఇంజనీరింగ్ విద్యార్థులను తయారు చేశారు. ’’
‘‘ఇంతకూ మీవాడికి ఉద్యోగం దొరికిందా? ఏం చేయాలనకుంటున్నాడు’’
‘‘నాకైతే జీవిత బీమా ఏంజెంట్‌ను చేయాలనుంది’’
‘‘ఏం?’’
‘‘మన కార్టూనిస్టులు బీమా ఏజెంట్ల మీద వేసినన్ని కార్టూన్లు ఎవరి మీదా వేయలేదు. జీవితంలో ఎదగాలనుకుంటే అంతకు మించిన పని మరోటి లేదని నాకు ఎప్పటి నుంచో నమ్మకం.’’
‘‘ఆయనెవరో విజయ్‌కుమార్ ఎల్‌ఐసీ క్లర్క్‌గా జీవితం ప్రారంభించి పెద్దగా లాభసాటి కావడం లేదని కల్కీ భగవాన్ అవతారం ఎత్తి వందల కోట్లు సంపాదించడం చూసి, నీ మనసు అటు పోయినట్టు ఉంది. ఆయనెవరో ఒకడు అలా సక్సెస్ అయితే అందరూ అలా అవుతారనేముంది?’’
‘‘మనకు గల్లీకో బాబా, సన్యాసి కనిపిస్తారు. మాసిపోయిన దుస్తులు, మందుకొట్టిన మబ్బు ముఖాలు.. జాలితో ఓ రూపాయి ఇద్దాం లే అనిపించే ముఖాలకు కొదవ లేదు కానీ విజయకుమార్ స్థాయిలో సంపాదించిన ఒక్క భగవాన్ పేరు చెప్పు చూద్దాం. అదెలా సాధ్యం అయిందనుకుంటున్నావ్’’
‘‘జీవితబీమా వల్ల..’’
‘‘మోకాలికీ బొడిగుండుకు సంబంధం అంటే ఇదే.. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయావంటే ఈవీఎంల వల్ల అన్నట్టు విజయకుమార్ సక్సెస్‌కు బీమాకు సంబంధం ఏంటోయ్’’
‘‘కోటీశ్వరుడు, ఉద్యోగి, నిరుద్యోగి, తోపుడు బండి వ్యాపారి, వేల కోట్ల వ్యాపారి అనే తేడా లేకుండా ప్రతివాడూ తన శక్తిమేరకు మోసం చేస్తాడు. మోసం అనేది మానవ జీవితంలో భాగం. చిత్తూరు కల్కి భగవాన్ విజయకుమార్ ఐనా, గల్లీబాబా ఐనా డబ్బు సంపాదన కోసమే. కోటి విద్యలూ కూటి కోసమే. కానీ వారెవరూ సాధించని స్థాయిలో విజయకుమార్ విజయం సాధించాడంటే- నువ్వు ఒప్పుకున్నా.. ఒప్పుకోక పోయినా బీమానే కారణం.’’
‘‘జిందగీకే బాద్‌బీ జిందగీకే సాత్‌బీ అంటూ సాగే బీమా ప్రచారం బాగానే ఉంది. కానీ జీవించి ఉన్నప్పుడు, పోయిన తరువాత కూడా బీమా ఉపయోగపడుతుంది అంటే ఓకే.. విజయకుమార్ కల్కీగా మారడానికి బీమానే కారణమంటే నువ్వెన్నయినా చెప్పు.. నా మనసు అంగీకరించడం లేదు.’’
‘‘నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా నిజం అదే’’
‘‘ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఆయన సినీనటుడు కావడమే కారణం అంటే ఓకే. ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటుంటే ఎన్టీఆర్ గురించి పట్టించుకునే వారెవరు? ఉద్యోగం వదిలి, సినిమాల్లోకి వచ్చి పాపులారిటీ సంపాదించి జనం హృదయాల్లో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా నిలిచి ఆ అభిమానమే పెట్టుబడిగా రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యాడు. చాలా మంది తారలు సినిమా అభిమానం పెట్టుబడిగా రాజకీయాల్లో తమ భవిష్యత్తును చూసుకున్నారు. నేనేమీ కాదనడం లేదు. కానీ బీమా కంపెనీలో ఓ క్లర్క్‌కు ఉండే పాపులారిటీ ఎంత? దాన్ని పెట్టుబడిగా పెట్టి కల్కి అవతారంగా కోట్లు సంపాదించే స్థాయికి చేరుకోవడం ఎలా సాధ్యం?’’
‘‘బీమా కంపెనీలో క్లర్క్‌గా పాపులారిటీ సంపాదించాడని నేను చెప్పానా? బీమా అంటే నీ దృష్టిలో కార్టూనిస్టులు వేసిన బీమా ఏజెంట్ల కార్టూన్‌లు మాత్రమే’’
‘‘కార్టూన్లు అబద్ధమేమీ కాదు. బీమా ఏజెంట్లు కనిపిస్తేనే జనం పారిపోతారు. ఎక్కడ వెంటపడి పాలసీలు అంటగడతారో అని.. అలాంటిది డబ్బులిచ్చి కాళ్లు మొక్కించుకునే విజయకుమార్‌కు బీమా ఎలా సహకరించింది?’’
‘‘ఇప్పుడు దారికి వచ్చావు. బీమా చేయించేవారికి ఉన్నంత తెలివి తేటలు ఎవరికీ ఉండవని నా నమ్మకం. ఒక మనిషితో ఎలా వ్యవహరించాలి? ఏ సమయంలో కలవాలి? ఎలా కలవాలి? నమ్మకం ఎలా కలిగించాలి? జీవితం శాశ్వతం కాదనే భయం ఎలా కలిగించాలి? నీ బతుకు ఎప్పుడు తెలవారుతుందో నీ తరువాత నీ వాళ్లు ఏమవుతారో ఒక్కసారన్నా ఆలోచించావా? అని నాలుగైదు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి ఎలా చేయాలో బీమా ఏజెంట్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.’’
‘‘కల్కి భగవాన్ చేసింది బీమా ఏజెంటుగా బీమా వ్యాపారం కాదు. వేల కోట్ల రూపాయల కంపెనీలు, వందల ఎకరాల భూములు, ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యానే్న నిర్మించారు. బీమా ఏజెంటుకు కల్కీకి పోలికేంటి?’’
‘‘క్లర్క్‌గా విజయకుమార్ ఎంతోమంది బీమా ఏజెంట్లను చూసి ఉంటారు. బీమా ఏజెంట్‌గా విజయం సాధించాడంటే ఆ వ్యక్తి ఏ రంగంలోనైనా విజయం సాధిస్తాడు. పారిపోయే వాళ్లను పట్టుకుని పాలసీ అంటగట్టడం అంటే మాటలు కాదు. చాలా శక్తిసామర్థ్యాలు ఉండాలి. బీమా చేయించడం తప్పని నేను అనడం లేదు. బీమా అంటేనే పారిపోయే వాళ్లను పట్టుకోవడంలో వారి పట్టు గురించి చెబుతున్నాను. బీమా ఏజెంట్లు ఎంతో మందిని రోజూ చూసిన విజయకుమార్ ఆ అనుభవానే్న పెట్టుబడిగా పెట్టి కల్కీ భగవాన్ అవతారం ఎత్తాడని నా నమ్మకం’’
‘‘నమ్మలేక పోతున్నాను’’
‘‘ఆపిల్ చెట్టు నుంచి పండు కింద పడడం ఎంతో మంది చూసి ఉంటారు. అలా పడడం చూసి భూమికి ఆకర్షణ శక్తి ఉందని గ్రహించే వాడే చరిత్రలో నిలిచిపోతాడు. శాస్తవ్రేత్తగా ప్రపంచం చెప్పుకుంటుంది. బీమా రంగంలో అనుభవంతో కల్కీగా అవతారం ఎత్తి చక్కని మార్కెటింగ్‌తో వేల కోట్లు సంపాదించవచ్చు అని గ్రహించిన వాడే కల్కి’’
‘‘ఎంత సంపాదించి ఉంటాడు?’’
‘‘లెక్కపెట్టడానికి రోజులు పట్టేంత. అతనిలో ఒక గొప్ప స్ర్తి వాది కూడా ఉన్నాడు!’’
‘‘ఎలా?’’
‘‘నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న బాబాలు, స్వాములు ఎంతో మంది ఉన్నారు కానీ ఒక్క కల్కీ విజయకుమార్ మాత్రమే నేను దేవుణ్ణి, మా ఆవిడ దేవత అని చెప్పాడు’’
‘‘ఔను.. వీరికి కాళ్లు మొక్కాలంటే పాతిక వేల ఫీజు కట్టాలట’’
‘‘చెమటోడ్చి కాళ్లు పట్టుకుని బతికే వారు ఎంతో మంది ఉంటారు కానీ తన కాళ్లకు మొక్కించుకుని డబ్బులు వసూలు చేసిన విజయకుమార్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్’’
*

buddhamurali2464@gmail.com