జనాంతికం - బుద్దా మురళి

అది ‘ఫుడ్డు’ భాష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీకో బ్రహ్మాండమైన బిజినెస్ ఐడియా..?’’
‘‘చెప్పి పుణ్యం కట్టుకోరా!’’
‘‘ఎడ్యుకేషన్ బిజినెస్.. నీకో విషయం తెలుసా? చట్టప్రకారం ఎడ్యుకేషన్ బిజినెస్ చేయకూడదు. కానీ ఎడ్యుకేషన్ బిజినెస్‌లోనే ఎక్కువ లాభం’’
‘‘నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఈ వ్యాపారాన్ని చైతన్యవంతులైన నారాయణులు ఎప్పుడో ఆక్రమించేసుకున్నారు. ’’
‘‘చూడోయ్.. రత్తయ్య రంగంలో ఉన్నాడని నారాయణ వెనకడుగు వేస్తే ఇప్పుడు విద్యా సామ్రాజ్యంలో జెండా పాతేవాడా?’’
‘‘నువ్వు ఎన్నయినా చెప్పు.. రాష్ట్రాలు విడిపోయాయి కానీ వారి వ్యాపార సామ్రాజ్యమేమీ పడిపోలేదు’’
‘‘వారు పాతుకుపోయిన వ్యాపారంలో మనం నిలువలేం’’
‘‘ఆ సంగతి నాకు తెలుసు. నేను చెప్పింది విను.. నీకు బుర్ర తిరుగుతుంది. నారాయణలు ఎంత చైతన్యంతో విద్యావ్యాపారం ప్రారంభించినా, వీరి కన్నా ముందు విద్యావ్యాపారానికి శ్రీకారం చుట్టి- వీరి దూకుడును తట్టుకోలేక చేతులెత్తేసిన కత్తుల రత్తయ్యలకు సైతం దిమ్మతిరిగిపోయే ఐడియా.. వీళ్లంతా ఇంగ్లీష్ మీడియంలో విద్యావ్యాపారం ప్రారంభించారు. మనం తెలుగు మీడియంతో మొదలు పెడదాం’’
‘‘నీకేమన్నా పిచ్చా..! ఉభయ రాష్ట్రాల్లో వేలల్లో ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల వ్యాపారం నడుస్తోంది. నా చిన్నప్పుడు ఎప్పుడో రెండు మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌కు ఇంగ్లీష్, తెలుగు మీడియం అని బోర్డు చూసి తెలుగు మీడియంలో కూడా ప్రైవేటు స్కూల్స్ ఉంటాయా? అని ఆశ్చర్యపోయాను. తెలుగు మీడియంలో విద్యా వ్యాపారమా? నీకేమైనా పిచ్చా? కావాలంటే తెలుగు మీడియా వ్యాపారం అను బోలెడు లాభాలు, తెలుగు చానల్స్ అను మినిమం గ్యారంటీ. తెలుగు వినోద చానల్స్ అను- జబర్దస్త్ లాంటి రెండు ప్రోగ్రాంలు ఉన్నాయంటే వ్యూయర్‌షిప్ అదిరిపోతుంది. అంతేకానీ తెలుగు మీడియంలో విద్యావ్యాపారం ఏంటి?’’
‘‘20-30 ఏళ్ల క్రితం నాటి బోర్డును గుర్తు చేసుకోవడమే కాదు, నువ్వు ఇంకా ఆ కాలంలోనే ఉండిపోయావు. బయటకు రా! లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్‌ను చూడు. ఇప్పుడు తెలుగు మీడియం విద్యావ్యాపారానికి మంచి రోజులు ఖాయం..’’
‘‘అని ఎవరు చెప్పారు? ఏమైనా సర్వే చేశావా?’’
‘‘ఓ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తెలుగు భాషాభిమానులు సాగిస్తున్న ఉద్యమం చూడలేదా? వారి ఉద్యమ సెగలను టీవీ చానళ్లల్లో చూసిన తరువాత వచ్చిన ఆలోచనే ఇది. మనం తెలుగు మీడియంలో విద్యావ్యాపారం ప్రారంభిస్తే నారాయణ చైతన్యలను తలదనే్న విధంగా ఎదుగుతాం. ’’
‘‘అలాగా..!’’
‘‘నేనింత సీరియస్‌గా చెబితే ... నీకంత నవ్వులాటగా ఉందా? నవ్వుతున్నావు?’’
‘‘ఏదో విషయం గుర్తుకు వచ్చి నవ్వాను.. నీ ఆలోచనకు కాదు’’
‘‘ఏమిటా విషయం చెప్పు?’’
‘‘విప్లవకవి ఎర్రమూర్తి తెలుసు కదా?’’
‘‘తెలియకపోవడం ఏమిటి? ఆయన కవిత్వం చదువుతుంటే రక్తం సలసల కాగుతుంది. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. రక్తం చిందిస్తాం- భూమిని పండిస్తాం అనే కవితా సంకలనం మొత్తం నాకు నోటిమీద ఉంది.. చెప్పమంటావా?’’
‘‘నీకేకాదు... నాకూ ప్రతి అక్షరం గుర్తుంది. కుల రహిత, మత రహిత, సర్వమానవ సమానత్వం కోసం ఆయన తపించే తీరు, ఆయన అభ్యుదయ పంథాకు నేను ఫిదా అయ్యాను’’
‘‘ఈ మధ్య వాళ్ల పిల్లల కోసం తెలిసిన వారు ఓ సంబంధం తీసుకు వచ్చారు. పెద్దమనిషి అని కూడా చూడకుండా ఆ మధ్యవర్తిని కర్రతో చితగ్గొట్టి మరోసారి మా ఇంటివైపు వస్తే కాళ్లు విరగ్గొడతాను అని వార్నింగ్ ఇచ్చి పంపాడు’’
‘‘అన్యాయం కదూ! పిల్లలకు పెళ్లి సంబంధం తెస్తే ఒక అభ్యుదయ కవి అయి ఉండి అలా అవమానిస్తాడా?’’
‘‘ఆగాగు.. తొందరపడి తీర్పు ఇవ్వకు. మధ్యవర్తి ఎలాంటి సంబంధం తెచ్చాడో తెలుసా? అభ్యుదయ వాది కుమారుడి కోసం తీసుకువచ్చిన సంబంధం ఎలాంటిదో తెలుసా? అమ్మాయి అందంగా ఉండదు. పైగా చామన ఛాయ. నిరుపేదలు. ఆమెపై కుటుంబం అంతా ఆధారపడి ఉంది. చిన్న ఉద్యోగం. చదువు అబ్బలేదు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. పైసా కట్నం ఇవ్వరు. ఇవ్వడానికి పైసా లేదు. ’’
‘‘ఇలాంటి సంబంధం ఎలా తేబుద్ధి అయింది?’’
‘‘ఆ అభ్యుదయ వాది కూడా మధ్యవర్తిని ఇదే మాట అడిగాడు. ‘మీ రచనల్లో బోలెడు అభ్యుదయ వాదం ఉంటుంది. కులం, మతం అనేవి మనం కట్టుకున్న అడ్డుగోడలే.. బాహ్య సౌందర్యం కాదు అంతః సౌందర్యం ముఖ్యం అంటూ మీరు రాసిన కవితలు చదివి, మీ అభిరుచులు ఇవే అని సంబంధం తెచ్చాను. అమ్మాయి వాళ్లు కూడా మీ కవితా సంకలం చదివిన తరువాతనే మీతో సంబంధానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చారు. లేకపోతే కోట్ల ఆస్తి ఉన్న మీరెక్కడ? పూరి గుడిసెలో జీవించే వాళ్లెక్కడ’ అన్నాడు’’
‘‘ఔను! ఇంతకూ ఇదెందుకు చెబుతున్నావు?’’
‘‘రాతలకేముందోయ్.. ఎన్ని అభ్యుదయ గీతాలైనా రాసి పారేస్తాం. తెల్ల కాగితాలు, నల్లఇంకు ఉంటే చాలు.. ఇప్పుడు అవి కూడా అవసరం లేదు. కంప్యూటర్ కీ బోర్డు చాలు. రాయడానికేముంది..’’
‘‘సరే- తెలుగు మీడియం విద్యా వ్యాపారానికి, అభ్యుదయ వాది పెళ్లి సంబంధాల కథకు సంబంధం ఏంటి?’’
‘‘తెలుగు మీడియంపై మన తాపత్రయం, అభ్యుదయ కవి గారి అభ్యుదయం రెండూ ఒకటే.. రాతల్లోనే తప్ప చేతల్లో ఉండవు. మార్కులు ఎక్కువ వస్తాయని ఇంటర్మీడియట్‌లో సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకోమని పిల్లలకు చెప్పే పెద్దలకు తెలుగు మీద ఎంత అభిమానమో! నీకు ఇంకో విషయం తెలుసా? ప్రపంచంలో అత్యధికులు మాట్లాడేది ఇంగ్లీష్ కాదు. చైనీయులు మాట్లాడే మండారియా భాష. అలాంటి చైనా వాడు కూడా అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించాలంటే సాఫ్ట్‌వేర్‌లో, ఇంగ్లీష్‌లో సైతం ప్రావీణ్యం అవసరం అని గుర్తించాడు. తెలుగు మీడియం అంటే తెలుగును రద్దు చేయడం కాదు. త్రిభాషా సూత్రం ఎలాగూ ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలాగూ ఉంటాయి. లెక్కలు, సైన్స్ వంటివి ఇంగ్లీష్‌లో బోధించినంత మాత్రాన తెలుగుకు కొత్తగా వచ్చిన ప్రమాదమేమీ లేదు.’’
‘‘నమ్మమంటావా?’’
‘‘దేశంలో తొలిసారి భాష పేరుతో ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత తెలుగుదే! అధికార భాష అమలులో అత్యంత వెనకబడింది ఈ తొలి రాష్టమ్రే. దీన్ని బట్టి తెలియడం లేదా? తెలుగుపై మన ప్రేమ ఎంతనో? ఈ రోజుల్లో ఫుడ్డు పెట్టేదే భాష. ఇంటి కోసం మాతృభాష, బయట బతకడానికి ఫుడ్డు భాష రెండూ ఉండాలి’’ *

buddhamurali2464@gmail.com