తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

దళారీ ముసుగుల్లో కలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు తమ జీవితాలను పాడుచేసుకుని అస్తిత్వాన్ని నిలుపుకునే ‘అహం’ రూపెత్తుతారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి తమ పంతం సాధిస్తారు. ఎదుటివాడిని నామరూపాలు లేకుండా చేసి, అంతా ‘తానే’ అనుకుంటాడు. కులంలో పెద్దననిపించుకోవడానికి కులాన్ని వాడుకుంటాడు. ‘మతం’లో ఉండి తనకోసం మతాన్ని భ్రష్టుపట్టిస్తాడు. ఊరిమీద పెత్తనానికై ప్రజల మధ్య చిచ్చుపెడతాడు. అత్యధిక శాతం ఈ జబ్బుతో బాధపడుతుంటారు. ఈ రోగ తీవ్రత కొందరిలో చాలా ఎక్కువ. ఇది ఇవ్వాళ నగరాల్లో విప్లవనేతలు కావచ్చు. రాజకీయ రంగంలోని వ్యక్తులు కావచ్చు. మరికొందరు లేనిపోని గిల్లికజ్జాలతో తమని తాము చిన్న చేసుకుంటారు. ఏం సాధించాలని అనుకుంటారో స్పష్టం కాని కొందరు అసంపూర్ణ ఆశావలయపు వలలో చిక్కుకుని కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ ఇదే జీవితం అనే నమ్మకంతో ఉంటారు.
ఇప్పుడు కనుపించేదంతా దళారీ సంస్కృతికి పుట్టిన అత్యాధునిక అవలక్షణం. ఎక్కడా దళారీ పట్టుబడడు. ఉరిశిక్షకు ఆమడదూరం. ఊచలు అతడిని చూసి పారిపోతాయి. కోర్టుల్లో నిరూపణలకు లొంగడు. చట్టాలను నిత్యం అపహాస్యం చేస్తాడు. పై వర్గం పెంచి పోషించిన వికృత రూపం దళారీ. అతడిని అందరూ, అన్ని వ్యవస్థలు కాపాడడానికే ముందుంటాయి. అందుకే ఇవ్వాళ ప్రభుత్వాలే దళారుల్లా మారిపోతున్నాయి. పాలకుల వైపున కళలు, గళాలు, కళాకారులు ప్రత్యేకంగా ఉండేవారు. అంతఃపురాల్లో, జమీ ఎస్టేట్లలో, దొరల గడీలలో- ఆస్థాన కవులుగా, పొగడ్త కవులుగా, అంతఃపురం నర్తకులుగా, ఆధునిక కాలంలో మొన్నటిదాకా కొందరు ఆస్థాన కవులుగా వెలుగులు వెలిగారు. ఇవ్వాళ సినిమా, రవీంద్రభారతి కళావేదికలు, త్యాగరాజ వేదికలు కాదు- దళారులు ముఖ్య అధిపతుల పేషీలలో తిష్టవేసుకున్నారు. దానికి కొంత భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా రాజ్యానికి దగ్గరగా ఉంటున్నారు. కొందరు ప్రగతివాదులు ఇప్పుడు మీడియేటర్స్ పాత్ర వహిస్తున్నారు. వీరు రాజ్యం దాసులు.
మధ్యవర్తి అంతిమంగా రాజ్యానికి బానిస. అతను ప్రజల వద్దకు పోడు, రాజ్యాన్ని గీమాలుతాడు. ప్రాధేయత అతని లక్షణం. ఎస్టాబ్లిష్‌మెంట్‌లో భాగం కాబట్టి తన ప్రయోజనమే ముఖ్యం. అందుకే ప్రజల స్వేచ్ఛని పరిమితులలో చూస్తాడు. మనకి తెలుసు, పాలకులతో అంటకాగుతూ, ప్రజలని తృణీకరిస్తాడు కూడా. మల్లన్నసాగర్ నిర్వాసితుల వైపు ఉంటావా? వారిని నిర్వాసితులను చేసే పాలకుల పక్షమా? అని అడిగితే ప్రజల వైపు అనడు. అభివృద్ధి కావాలి. కాబట్టి పాలకుల పక్షం వైపుఉంటా అంటాడు. బలవంతంగా ప్రజల భూములను లాక్కుంటుంటే ఆ వేపు చూడరు. రాజధానుల నిర్మాణంలో, రాజధాని విస్తరణలో నిర్వాసితుల్ని చేసే ఆలోచనలను ఎక్కడా ఏ రూపంలో నూ ఖండించడు. అం దుకే వారిది దళారీ కలం. ఇప్పుడు ఈ దళారులను అంటకాగే ప్రగతిశీల దళారులు పుట్టుకొచ్చారు. బానిసకొక బానిస వారితో అంటకాగుతూ వేదికలు పెట్టి వారితో చెట్టాపట్టాలు వేసే నగర విప్లవకారులు పెరిగిపోయారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బిడ్డ గొప్ప కవిత్వం రాస్తోందని విప్లవ అక్షర అధినేత అతనితో ఫోనులో చెబుతాడు. నిజానికి మొత్తం విప్లవ స్థైర్యం మీద దెబ్బకొట్టే చర్య ఇది. దీనినే విప్లవ ప్రతిఘాత చర్య అనాలి. కాని, ఏ టింకూగాడు కూడా సీరియస్‌గా తీసుకోడు. వాడికి వీడు దళారీ. అంతా కళ్ళు మూసుకుని పాలు తాగే బాపతు. వీళ్ళు ప్రజలపక్షం నిలుస్తారట. ప్రజల ఆకాంక్షలను అక్షరాల్లో ప్రతిబింబిస్తారట. మరొక ఆనాటి విప్లవ కవి ఇవ్వాళ్టి కాల్పనిక సినిమా హీరోని రాజకీయ హీరోగా కీర్తిస్తాడు. ఎంత ఎత్తుల లోంచి ఎన్ని దిగజారుడు లోతులివి? శిఖరాలను తాకిన పవిత్ర జలం మురికి కూపపు అథఃపాతాళాలలోకి జారడమే కదా! మనుశాస్త్రాన్ని విశే్లషించవలసిందే. ఈ నయా విప్లవ మనువాదులను ఎవరు ఖండించగలరు? వీరు దేనిని ఖండించారో, ఇంతకాలం ఏ రాజ్యాన్ని ప్రతిఘటించారో దానినే నిలుపుతున్న వైనం. దాని ఛాయాఛత్రం కింద తమ సొంత సంక్షేమం వెదుకులాట.
దిగజారడానికి వర్గం, కులం ప్రాతిపదిక ఏ మాత్రం కాదీనాడు. అధికార దాహం అసలు కారణం. లోన దాగిన ఆధిపత్య స్వభావం వారిని పాలకపక్షాల వైపు, రాజ్యం తాయిలాల వైపు లాగుతోంది. ఈ కొత్త పాచికలాట రాజ్యంతో కరస్పర్శల కాలం దాటి రాజ్యానికి దళారులుగా మారుతున్న వైనం. బాలగోపాల్ సిద్ధాంతాన్ని మానవ మనస్తత్వంలో దాగిన కోణం నిజం అని రుజువు చేస్తున్నారీ విప్లవవాదులు. వీళ్ళలో దాగిన దళారీతనం ఒక్కొక్కటే బైటపడుతున్నది. ప్రజలకిచ్చిన హామీ ఒక్కొక్కటే నీరుగారిపోతున్నది. ప్రజాశ్రేణులకు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఎక్కడ ఏ వేదికమీద కలవాలో తెలియని పరిస్థితి. ఎక్కడ తమ గోడు వినిపించుకోవాలో అర్థం కాని డోలాయమానం. అసలు పరీక్ష ఇప్పుడే. ఇంతవరకు చాలా సంక్షోభాలు చూశాం.
ప్రతి సంక్షోభంలో అభ్యుదయవాదుల నిశ్శబ్దాన్ని భరించాం. ఇప్పుడు అనేక ఎన్‌కౌంటర్ల మధ్య ఆగిపోయిన పెన్‌కౌంటర్లని చూస్తున్నాం. చాలామంది తమకు తామే పెన్ డౌన్ కౌంటింగ్ స్టార్ట్ చేశారు. రాజ్యంతో లోపాయకారీ ఒప్పందాలపై సంతకాలు చేసిన కలాలలోని సిరా నిండుకుంది. తమ అప్రకటిత అలిఖిత వౌన ప్రయాణ పత్రాన్ని దాటి రావడానికి మరో రెండేళ్ళు పడుతుంది. ముందస్తు ఎన్నికల వరకు ఏదో ఒక రకంగా గోడమీది పిల్లుల్లా మ్యావు మ్యావుమంటూ కాలం గడిపి తరువాత పులుల వేషం కడతారు. ఏమో.. ఏదీ తెలియదు. రాజ్యంతో జరిగిన ఒప్పంద రహస్యం ఏమిటో అర్థం కాని ప్రజలు నోరెళ్ళబెట్టారు. మరోసారి వారికే ఓట్లేస్తే ఈ మంజీర పద ధ్వనులు, కలాల సంఘ శక్తులు మరింత విజృంభించి తమ దళారీతనానికి తా మే ఒక సిద్ధాంతాన్ని జతచేసి తమ వికృత స్వభావానికి అందమైన ముఖౌటా (ముసుగు) కూడా తయారుచేసుకుంటారు. రాజ్యహింస అన్నవాడు పార్టీహింస అని ఏనాడు అన్నాడో ఆనాటినుండి రాజ్యానికి మిత్రుడయ్యాడు. బంటుతనాన్ని ఆశ్రయించాడు. దళారీ గుణాన్ని ప్రేమిస్తున్నాడు.
ప్రగతిశీల సమరశక్తిని ఇప్పుడు నిశ్శబ్దశక్తిగా కీర్తిస్తూ ఒకరి భుజాన్ని మరొకరు భేష్ అని చరుచుకుంటున్నారు. వారు తెలివైన జిత్తులమారులు. అలాంటి వారు ఆనాడూ ఉన్నారు. రేపూ ఉంటారు. ఇవ్వాళ అన్నీ అనుభవిస్తూ వీరులుగా చెలామణి అవుతుంటారు. ఇది ఒక విచిత్రం. రాజ్యమా నీకొక సలాము. ఈ రాజ్యంతో అంటకాగే నగర విప్లవ అక్షర దళమా.. నీకు అనేక అరుణారుణ జేజేలు. నీ కొత్త ఎజెండాకు, నీ పాత జెండాకు వందనాలు. నేనిలా నిన్ను పొగడకపోతే నీవే రాజ్యమై నా భరతం పడతావు. చూశారా! రాస్తూ రాస్తూ బీరాలు పోయిన నా కలం కూడా నేతిబీర అయిపోయింది. రకరకాలు ప్రయత్నాలు చేస్తుంటాడు మనిషి. అందులో ఇది దళారీల అత్యాధునిక ప్రయత్నం. ఇప్పు డు రాజ్యానికి,ప్రజలకు మధ్య అక్షర దళారుల రాజ్యంలో ఉన్నాం. *