తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

పాత్రికేయ విలువలు...మూడు మరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ప్రతిరోజు సంభవించే మరణాలవలెనె మొన్నటి శుక్రవారాన ఎన్నో చావు కబుర్లు. వీటిల్లో రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. హత్యలు ఉన్నాయి. పేదరికంతో ఆకలికి తట్టుకోలేని అసహజ మరణాలు ఉన్నాయి.
చాలా దేశాలు, సమాజాలు మరణాన్ని అమానవీయంగా తీసుకుంటాయి. మనిషి ఆయుష్షుని పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. ఐనా సాధారణ ప్రజల జీవితాలను కాపాడలేక పోతున్నాయ.
మనిషికి మంచి తిండి, నీరు, గాలి ఇవ్వలేక చతికిలబడిపోయాం. ఈ దేశానికి సరిపోయే వ్యావసాయక పథకరచన చేయలేకపోయాం. అందుకే దేశవ్యాప్తంగా రోజూ వందమంది చస్తున్నారు. మరణం సర్వసాధారణం అయింది. ఎంత ఎక్కువ మంది చస్తే అది అంత పెద్ద వార్త అవుతుంది. ఈ చావులను ఆపగలమా? కారణాలు ఏమిటి అని ఎవరూ ఆలోచించరు. వార్తలు చదవడమే కాని వాటికి ప్రతిస్పందించే తత్వం మరిచిపోయాం. అసహజ మరణాలను చూసీచూడనట్టుగా భావించే ఒక అస్వాభావిక గుణం మనలో దిగబడిపోయింది.
ఎండిన బోరుబావుల గుంతల్లో పడి రోజుల కొద్దీ పోరాడి పిల్లలు మరణిస్తున్నారు. ఈ దృశ్యాలను టీవీల్లో చూసి థ్రిల్ ఫీల్ అయ్యే కాలం. బోర్‌వెల్ గుంతల్ని పూడ్చాల్సిన వాడొకడున్నాడు. వాడు నేరస్థుడు అని మనసులో ఏ మూల నైనా అనుకోవడానికి జడుస్తున్న మనుషులం. అలాంటి గుంతల్ని పూడ్చకపోతే ఆ గుంతలోనే తీసినవాడిని పూడ్చాలని చెప్పాలనే ఆలోచన రానీయని ఉదారులం. ప్రభుత్వాలు కూడా ఈ విషయాలు మాట్లాడవు. ఆలోచించవు. ప్రభుత్వ శాఖలు వేసిన బోరు గుంతల్ని ఆయా శాఖలు కూడా పూడ్చవు. పూడ్చడానికి బిల్లులు మాత్రం చెల్లింపబడతాయి. పూడ్చలేదని తెలిసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అనుకోదు. దాహం వేసిన ఓ చిన్నారి కాసిన్ని నీళ్లకోసం, ఆకలివేసి రాలిన పండ్లకోసం అటెళ్లిన పిల్లలు అందులో పడిపోతే ఎక్కడలేని మానవత తన్నుకొస్తుంది. ఎక్కడెక్కడి తవ్వు యంత్రాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. అధికార యంత్రాంగం అంతా వాలిపోతుంది. క్షణ క్షణం చానెళ్లు లైవ్ దృశ్యాలు ప్రసారం చేస్తాయి. మనకళ్ల ముందే ఓ చిన్నారి చస్తుంది. ఇలాంటి ప్రతి చావు వెనుక హంతకులు మాత్రం ఉంటారని మనం అనుకోం. ఎందుకంటే అది మనమే కావచ్చునేమో అని భయం. భయాలు మనని ఆలోచించనివ్వవు. నిజాలను చూడనివ్వవు. మాట్లాడనివ్వవు. అందుకే రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతునే ఉంటుంది.
ఆకలి మరణాలు అనేక రూపాలలో కొనసాగుతూనే ఉంటాయి. ఒక్కో బోరుబావిలో అనేకమంది చిన్నారులు ఊపిరాడక చస్తుంటారు. కొన్ని వార్తలవుతాయి. మరికొన్ని వార్తలు పట్టపగలే చంపబడతాయి. ఆ చావులు సమాజానికి అనవసరం. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తాయి. ఐనా ఎలాంటి ప్రాధాన్యత లేని చావు గురించి ఎందుకు తలబద్దలు కొట్టుకోవాలి? ఓ విలేఖరి అంతదూరం ఎందుకు వెళ్లాలి? వార్తగా ఎందుకు రాయాలి? రాసిన దానిని డెస్క్‌లో ఎందుకు ప్రాధాన్యతా క్రమంలో ఉంచాలి? పత్రిక ఏం బావుకుంటుంది? వార్తని వేసి, ఓ సర్పంచో, ఓ కార్పొరేటరో వార్త అయితే ఉపయోగం. చావువార్తలని ఎన్నని వేస్తారు? ఇలాంటి మనుషులు ఎల్లకాలం బతుకుతారా?. ఎన్నడో ఓనాడు చావాల్సిందే కదా?
ఆలోచించాల్సింది మనిషి చావడం గురించి కాదు. చావు వెనక సమాజానికి గల ఆలోచన గురించి. ఈ ఆలోచనే మానవ విలువలను నిర్ధారిస్తున్నాయి. కొన్ని అకాల మరణాల వార్త కథనాలు చదివే పాఠకులకు ఆకర్షణీయంగా ఉండాలి. అమోఘంగా రుచించాలి. ఎలా తేవాలి ఆ రుచి? వేల ఏళ్ల క్రితం ప్రాచీన కాలంలో ఆలంకారికులు కావ్యం ఇతివృత్తం, దానిలోని నాయకుడు, పౌరాణిక, ఉదాత్త మహాపురుషులై ఉండాలని అని చెప్పారు. సాహిత్యంలో ఆ విషయం ఎప్పుడో నిరాకరింపబడింది. కాని పాత్రికేయ రంగంలో ఇంకా అది పాటింపబడుతుందా అని అనుమానం రేకెత్తుతున్నది.
చావు కాదు కాని, దాని వెనకున్న కారణాలు విస్మయం కలిగిస్తున్నాయి. చావుని చూసే విలువల గురించి సమాజం ఒక చర్చాగోష్ఠి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. టీవీ చానెళ్లు చూపే కవరేజిపై, పత్రికలు రాసే విధానంపై ఓసారి ఆలోచించడం తప్పేమీ కాదు. చావు వార్తల కవరేజి మీద పౌర స్పందన గురించి పరిశోధించి నిగ్గుతేల్చితే ఎంతో బాగుంటుందని అనిపిస్తున్నది.
నిజమే! మరణించినవాడు మహానుభావుడు. కానీ ఆ తరువాతే అతను కొందరి వాడవుతున్నాడు. అంతకు ముందు లేని పరిధిలోకి నెట్టివేయబడుతున్నాడు. అల్పాయష్షు వల్ల అతని మరణం తరువాత అతని విస్తృతి తగ్గిపోతుందా అనిపిస్తుంటుంది కొన్ని సందర్భాల్లో. మరణానంతరం అతనికి లేని, బైటకు రాని, అతని సామాజిక వర్గం, అతని భావజాలం, ఇష్టానిష్టాలు అనవసరంగా ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయ. అతనిలో చూడవలసిన మానవీయ గుణాలు పక్కకు తొలగిపోవడం అమానవీయం. అతడిని కాకుండా, అతని మరణాన్ని మాత్రమే హైలైట్ చేసిన విధానం వల్ల వ్యవస్థపై అసంతృప్తి పెరిగే ప్రమాదం ఒకటుందని గ్రహించాలి.
తాజాగా శుక్రవారం నాడు చెప్పుకోదగిన ముగ్గురి మరణాలు టీవీలో చూసినప్పుడు రేకెత్తాయ. శనివారం పత్రికలలో ఆ మరణాలకి ఇచ్చిన ప్రాధాన్యతలను గమనిస్తే ఏవేవో ఆలోచనలు రేకెత్తాయ.
ఒకరు ఎం.ఎల్.నరసింహారావు, రెండోవారు హనుమంతప్ప, మూడోవారు అరుణ్‌సాగర్.
మొదటి ఇద్దరు దేశం కోసం పోరాడినవారు. ఆ పోరాటంలో ఎం.ఎల్ జీవించారు. హనుమంతప్ప సరిహద్దుల్ని కాపాడే క్రమంలో సియాచిన్ ప్రాంతం మంచులో కూరుకుపోయి ప్రాణాలతో పోరాడి మరణించాడు.
1928లో జన్మించిన ఎం.ఎల్ భారత ప్రభుత్వంనుండి స్వాతంత్య్ర సమరసేనాని గుర్తింపు పొందాడు. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో పాల్గొని నైజాం దురాగతాలను ఎదిరించాడు. తరవాత ఖమ్మం జిల్లా కేంద్రంగా జాతీయ విద్యార్థి సంఘం కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వత పరిషత్ ఖమ్మం జిల్లా బాధ్యునిగా (1946-54) పనిచేశాడు. అనంతర కాలానఉస్మానియాలోని ఆర్ట్స్ కళాశాలలో ఆంధ్ర విద్యార్థి సంఘం ఉపాధ్యక్షునిగా (1951-52), తెలంగాణ జాతీయ విద్యార్థి సంఘం (1950-54) కార్యదర్శిగా పనిచేశాడు. అధ్యాపకునిగా (1960-70), తెలుగు అకాడమీలో పరిశోధక అధికారి (1971-87)గా పనిచేశాడు. తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ని కూడా ఇచ్చింది.
ఇవన్నీ ఒకెత్తు. ఎం.ఎల్. మానవీయ విలువలను ప్రేమించిన వాడు. నిగర్వి. నిబద్ధత కలిగిన ఉత్తమ పౌరుడు.
రెండో వ్యక్తి-సరిహద్దు గస్తీ తిరుగుతూ సియాచిన్ మంచు పర్వతాలలో కూరుకుపోయి ఆరు రోజుల అనంతరం ప్రాణాలతో బయటపడి ఢిల్లీ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు హనుమంతప్ప కొప్పడ. కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడైనా భారతదేశానికి ముద్దుబిడ్డ.ప్రపంచ దేశాలలో సరిహద్దులను రక్షించే వారికి ఆదర్శప్రాయుడు. ప్రాణాలను పణంగా పెట్టి చొరబాటు దారులకు ఎదురు నిలిచాడు. తన ప్రాణాలను లెక్క చేయక మంచు తుఫానుని ధిక్కరించాడు. మూడో వ్యక్తి అరుణ్ సాగర్. 1968లో పుట్టి ఆమధ్య పాత్రికేయునిగా, ఈ మధ్య కాలంలో అత్యాధునిక శైలి కవిగా రూపొందుతున్నాడు. ఒక టీవీ ఛానల్‌కి సీఈఓగా ఉన్నాడు. ఎం.ఎల్, అరుణ్ ఇద్దరూ ఖమ్మం జిల్లాకు చెందినవారే. ఇద్దరు శ్వాసకోశ వ్యాధితో పీడింపపడినవారే. హనుమంతప్ప సమస్య కూడా దాదాపు అదే.
ఈ ముగ్గురి మరణం బాధాకరమే. కానీ దేశం, సమాజం, త్యాగం, విలువలు అనే గీటురాయి ప్రధానంగా ఆ మరణాలను చూడవలసి ఉంటుంది. ముగ్గురి గురించి కొంత అటునిటుగా కవరేజి ఇస్తే బాగుండేది.
హనుమంతప్ప మరణం దేశానికి ఆదర్శం. ఎం.ఎల్ మరణం సాహిత్యానికి ముఖ్యంగా తెలగాణకి తీరని లోటు. పాత్రికేయ రంగానికి అరుణ్ మృతి బాధాకరం.
తెలుగు పత్రికలు ఈ మరణాలను విలువల ఆధారంగా చూడలేకపోవడం పాఠకులకు (కొందరికైనా) అసౌకర్యం కలిగించింది. ఓ రెండు పత్రికల సంపాదకీయం పేజీలలో పై ఇద్దరికి స్థానం లేదు. లోన వార్తలలో సైతం వారు రెండో శ్రేణి పౌరులే. మూడో వ్యక్తికి ఇచ్చిన ప్రాధాన్యతలో కొంతైనా కేటాయించగలిగితే సమతౌల్యత పాటింపబడేది. ఒక పత్రికలో సంపాదకీయం పేజీలో ఒకే మరణంపై రెండేసి రచనలు వేసినందుకు, రాసినందుకు సంతోషిద్దాం. కాని విలువల ఆధారంగా చూసి ఒక చిన్న సంపాదకీయం రాసినా బాగుండేది.
సమాజాన్ని మన దృష్టికోణం లోకి లాక్కు రావడం ఎంతమేరకు సబబు? విస్తృత ప్రజానీకం దేనిని ఆలోచించేలా చేయాలి? ఆలోచిస్తే సులభంగానే జవాబు దొరుకుతుంది. మరణించిన వారి చుట్టూ ఆవరించి ఉన్న హోదాలు, సమీకరణాలు సమాజానికి అవసరమా? ఐతే ఎంతమేరకు?
తెలుగు టీవీ ఛానెళ్లు స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన కవరేజి చూస్తే ఆశ్చర్యపోతారు. బ్రేకింగ్ న్యూసులు కాదు. కింద అట్టడుగు లైనులో నైనా వారి మరణం ఒక రౌండు ‘వార్త’ కాలేకపోవడం చూస్తుంటే సమాజంలో మరేదో, మరెక్కడో ఒక ‘చావు’ లాంటి విషాదం చోటు చేసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది.
అరుణ్ సాగర్ ఒక పెద్ద పాత్రికేయ హోదా కలిగినవాడు. ఒక పత్రికలో అతనిపై వచ్చిన వ్యాసంలో అంతటివాడు తిరిగి పుడతాడా అన్నట్లు రాశారు. ఒకటీ రెండు తెలుగు పత్రికలు తప్ప మిగతావి ఫోటోలతో చాలా ఎక్కువ కవరేజి ఇవ్వడం ముదావహమే. కాని ఎం.ఎల్.పైగాని, హనుమంతప్ప గురించి కూడా ఇలాగే వ్యాసాలు ప్రచురిస్తే బాగుండేది. మరణ వార్తతో పాటుగాఒక పత్రికలో హనుమంతప్పపై సంపాదకీయం ప్రచురించడం గమనించాలి.
మనుషులను కాదు, మానవ విలువలను సామాజిక పరంగా చూడ్డం పత్రికల బాధ్యత మరణాలను కాదు. వాటివల్ల సమాజానికి ఆ సందర్భంలో మంచి విలువలను చెప్పే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
చివరగా-
ఉదయం మరణించిన ఎం.ఎల్ ఇంటి దరిదాపులలోకి రాని జ్ఞాన పీఠాలు సాయంకాలాలలో అభినందనల సమావేశాలకు వెళ్లాయి. ప్రభుత్వ సాహిత్య సాంస్కృతిక సలహా సరఫరా దారులు మరొక పనిలో పడి ఎం.ఎల్ గతించిన విషయాన్ని మరిచారు. తెలంగాణ ఉద్యమకారులలో ఒక్కడంటే ఒక్కడు ఆ వేపు తిరిగి చూస్తే ఒట్టు. తెలంగాణ వాదానికి కాలం చెల్లిందని వాళ్ల ఆలోచన. ఇదీ సాహిత్య రంగం తీరు! మరణం స్వాభావికం. కాని, మన స్వభావానికి సంకేతాలుగా నిలుస్తాయా ఏమి కొంపదీసి!

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242