తెలంగాణ

జీతాల్లో కోత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగులను సన్నద్ధం చేస్తున్న తెలంగాణ సర్కార్!

ఆర్థిక శాఖను ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్
ప్రతి నెలా కావాల్సింది 3.6 వేల కోట్లు.. సగం కూడా వచ్చే చాన్స్ లేదని అంచనా
సర్కారుకు నోట్ల రద్దు దెబ్బ
పథకాల ఊసే ఇప్పట్లో తేకూడదని నిర్ణయం

హైదరాబాద్, నవంబర్ 12: పెద్దనోటు మా చెడ్డదైంది. కేంద్రం రద్దు నిర్ణయంతో వ్యవస్థనే అతలాకుతలం చేస్తుంది. మరికొన్ని రోజులపాటు ఇబ్బందులు తప్పవంటూ సాక్షాత్తూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరిస్తుంటే.. మూసుకుపోతున్న ఆదాయ మార్గాలను చూసి రాష్ట్రాలే కంగారుపడుతున్నాయి. పాలనాచక్రం తిరగాలంటే యంత్రాం గం కదలాలి. వాళ్లను కదిలించాలంటే జీతాలివ్వాలి. ఇప్పుడు వాటికే ఎసరుకొచ్చే పరిస్థితి కళ్ళముందు కనిపిస్తుంటే -పాలకుల్లో కంగారు మొదలైంది. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవటంతో, వసూళ్లు వెనకడుగు వేసిన పరిస్థితి రావడంతో, 1న ఉద్యోగులకు జీతాలెలా చెల్లించాలన్న ప్రశ్న ఉద్భవిస్తోంది. ఆదాయ మార్గాలు ఆగిపోయాయి కనుక, అవసరమైతే సగం జీతమే చెల్లించేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వసూళ్లు, చెల్లింపులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సిఎం కెసిఆర్ ఆర్థిక శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఎలా ఉంది? ఇబ్బందులను అధిగమించేందుకు ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలేంటి? అన్న అంశాలను ఆయా ప్రభుత్వాలను అడిగి తెలుసుకోవాలని సిఎస్ రాజీవ్‌శర్మను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రతి నెలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, తప్పనిసరి వ్యయం వివరాల ప్రకారం జీతాల పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది. అయితే కారు చీకటిలో కాంతి రేఖలా ఒకే అంశం మాత్రం ప్రభుత్వాన్ని ఆదుకునేలా కనిపిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా నెలకు 12వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమవుతాయి. ఈ ఒక్క శాఖలో మాత్రం గత నెల వాణిజ్య పన్నులు ఈనెల ఖజానాకు జమవుతాయి. పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి ముందు గత నెలలోని వాణిజ్య పన్నులు ఖజానాలో జమయితే జీతాల గండంనుంచి కొంతవరకు గట్టెక్కవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అవసరమైతే ఒకటి రెండు నెలలు సగం జీతం చెల్లింపులకు సిద్ధం కావాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా ప్రభుత్వోద్యోగులకు జీతాలుగా 18 వందల కోట్లు అవసరం. పెన్షన్ సొమ్ముతోబాటు రిటైరైన వారికి ఒకేసారి చెల్లించాల్సిన మొత్తం అన్నీ కలిపి 750 కోట్ల వరకు అవుతుంది. మొత్తంగా జీతాలు, పెన్షన్ కలిపి నెలకు 2.5వేల కోట్లు కావాలి. ఇవికాకుండా రుణాలకు వడ్డీలు, అసలు చెల్లింపుల నిమిత్తం నెలకు 11 వందల కోట్ల వరకు అవసరం ఉంటుంది. జీతాలు, పెన్షన్‌లు, వడ్డీలు, అసలు కలిపి దాదాపుగా ప్రతి నెలా తప్పనిసరిగా జరపాల్సిన చెల్లింపులు 3.6 వేల కోట్లు. సాధారణ పరిస్థితుల్లో నెలకు 4.5 వేల కోట్లు ఖజానాకు చేరుతుంది. దీనికితోడు అదనంగా కేంద్రం నుంచి పన్నుల్లో రాష్ట్రం వాటాగా వెయ్యి కోట్లు వస్తాయి. అయితే వ్యాపార కార్యకలాపాలన్నీ స్తంభించిపోయినందున, రాష్ట్రానికి ఆమేరకు ఆదాయం వస్తుందనే నమ్మకం లేదు. అదే సమయంలో కేంద్రం ఆదాయం సైతం తగ్గుతుంది కనుక అక్కడి నుంచి రాష్ట్రం వాటా వెయ్యి కోట్లు వస్తుందా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత నెల జీతాలు, వడ్డీల గురించే ఆలోచిస్తోంది. ఇక ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఫీజుల రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలపై దృష్టిసారించే పరిస్థితే లేదు.
రోజుకు దాదాపు 110 కోట్ల వరకు మద్యం అమ్మకాల ద్వారా బేవరేజ్ శాఖకు వస్తుంది. శనివారం కేవలం 45 కోట్లు మాత్రమే వచ్చింది. రిజిస్ట్రేషన్లు, ఇతర శాఖలతో పోలిస్తే మద్యం ఆదాయం కొంతలోకొంత మెరుగ్గా ఉందని అధికారులు అంటున్నారు. వివిధ శాఖల ఆదాయం ఎంతమేరకు పడిపోయిందనే అంశంపై సిఎం కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో శనివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో రేషన్‌షాప్‌పై దాడి జరిపి ఆహార ధాన్యాలు ఎత్తుకెళ్లడం, ఉప్పు ఐదు వందలకు కిలోచొప్పున అమ్మడం వంటి సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ డిజిపిని ఆదేశించారు.
సాధారణ పరిస్థితుల్లో ప్రతి నెల రాష్ట్రానికి 5.5వేల కోట్ల సొమ్ము జమవుతుంది. పెద్ద నోట్ల రద్దు తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించినపోయిన తరుణంలో, కనీసం సగం ఆదాయం వస్తుందా? రాదా? అనే సందేహం ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తోంది. దీంతో ఆసరా పెన్షన్‌ల వంటి కీలక పథకాలకు తప్ప మిగిలిన శాఖల కేటాయింపులకు కోత విధించనున్నారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే సాధించుకున్న తెలంగాణకు సార్థకత చేకూరుతుందని అనుకుంటే నోట్ల రద్దు చర్య ఊహించని విధంగా దెబ్బతీసిందని ముఖ్యమంత్రి అధికారుల వద్ద వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వంటి మహానగరం ఉన్నందువల్ల ఎంతోకొంత వరకు మనం నెట్టుకురాగలిగినా, పూర్తిగా గ్రామీణ ప్రాంతాలుండే రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఘోరంగా దెబ్బతింటాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

బుద్దా మురళి