ఆటాపోటీ

కాయ్ రాజా.. కాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కాలంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు పెరిగాయి. పందేలు కాసేవారి సంఖ్య ఎక్కువ కావడంతో, వారి బలహీనతను సొమ్ము చేసుకోవడానికి బుకీలు తెరపైకి వచ్చారు. ఒక బలమైన జట్టుతో అనామక జట్టు లేదా ఒక స్టార్ ఆటగాడితో ఒక సాధారణ క్రీడాకారుడు పోటీపడుతున్నప్పుడు సహజంగానే పేరున్న వారివైపే పందెంరాయుళ్లు మొగ్గుచూపుతారు. భారీ మొత్తంలో సొమ్మును ఒడ్డుతారు. బలహీనమైన జట్టు లేదా ఊరూపేరులేని ఆటగాడిపై ఎవరూ పందెం కట్టరు. ఈ సూత్రంపైనే బుకీలు వేగంగా పని చేస్తారు. గెలిచే సత్తా ఉన్న వారిని ఓడిస్తారు. ఓడే వారిని గెలిపిస్తారు. కోట్లకు పడగలెత్తుతారు. అనూహ్యమైన ఫలితాలను రాబట్టడానికి క్రీడాకారుల సహకారం అవసరం కాబట్టి, వారికి భారీ మొత్తాలను ఎరగా వేస్తారు. ఈ ఊబిలోకి ఒకసారి దిగితే బయటపడడం చాలా కష్టం. బుకీల వెనుక అండర్ వరల్డ్ మాఫియా ఉంటుందన్నది బహిరంగ రహస్యం. బెట్టింగ్ ఎంత రహస్యంగా కొనసాగుతుందో ఫిక్సింగ్ కూడా అంతే పకడ్బందీగా సాగుతుంది. అందుకే, ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సూచించింది. ఈ ప్రతిపాదనపై ఉన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్‌లకు పాల్పడే వారిపై అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. దోషులుగా తేలిన వారిపై వేటు వేస్తున్నాయి. కానీ, ఈ చర్యలేవీ ఫిక్సింగ్ వ్యాప్తిని నిరోధించలేకపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారుల కంటే బుకీలు, అండర్ వరల్డ్ మాఫియా ఎక్కువగా ఉపయోగించుకోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం. క్రీడా సంఘాలు, సమాఖ్యల అధికారులే అవినీతి కూపంలో కూరుకుపోతున్న రోజుల్లో ఫిక్సింగ్‌ను నిరోధించడం అసాధ్యంగానే కనిపిస్తున్నది. బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించడం, క్రీడా సంఘాలు, సమాఖ్యల్లో రాజకీయాల జోక్యాన్ని నివారించడం వంటి చర్యలు సమస్యను కొంత వరకైనా పరిష్కరిస్తాయి.

ఫిక్సింగ్ భూతం భయపెడుతున్నది. పందేలు కాసి, తమకు అనుకూలంగా ఫలితాలను మార్చుకుంటున్న బుకీలు కోట్లకు పడగలెత్తుతున్నారు. వారి చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్న ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తికి నిలువునా పాతర వేస్తున్నారు. దొరకనంతకాలం తమకు తిరుగులేదని, తమను ఎవరూ గుర్తించరని విర్రవీగుతూ, పట్టుబడిన తర్వాత కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. గతంలో సాకర్, క్రికెట్ వంటి క్రీడలకు మాత్రమే పరిమితమైందని అనుకున్న ఫిక్సింగ్ రుగ్మత నేడు అన్ని క్రీడలకూ వ్యాపించిందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయ.

ఫిక్సింగ్ భూతం మరోసారి తెరపైకి వచ్చి క్రీడా రంగాన్ని భయపెడుతున్నది. పందేలు.. వాటి వెన్నంటే ఫిక్సింగ్ క్రీడారంగాన్ని అతలా కుతలం చేస్తున్నాయ. టెన్నిస్‌లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ చోటు చేసుకుందని, దశాబ్దకాలంగా ఇది నిరాటంకంగా కొనసాగుతున్నదని బిబిసి, బజ్‌ఫీడ్ సంయుక్త అధ్యయనంలో తేటతెల్లమైంది. ఈ నివేదిక క్రీడా సంఘాలు, సమాఖ్యలు, అధికారులకు ఓ గుణపాఠం. క్రీడస్ఫూర్తికి తూట్లుపోడుస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన సమయం. బుకీలు విసురుతున్న ఆశల వలల్లో చిక్కుకొని, కెరీర్‌ను నాశనం చేసుకుంటున్న వారు కొందరైతే, దొరని దొంగలు చాలామందే ఉన్నారు. డబ్బుకు ఆశపడి, మ్యాచ్‌ల ఫలితాలను ముందుగానే నిర్ధారించడాన్ని మించిన దౌర్భాగ్యం లేదు. అభిమానుల నమ్మకాన్ని నట్టేట ముంచి, ఆటగాళ్లను తప్పుదారి పట్టించే మాయదారి బుకీలు రాజ్యమేలుతున్న ఈరోజుల్లో ఏ మ్యాచ్‌ని చూసినా అనుమానాలే. క్రీడా సమాఖ్యలు సకాలంలో మేల్కోకపోవడం, అధికారుల లంచగొండితనం, ఫిక్సింగ్ నివారణకు ప్రభుత్వాల పరంగా చిత్తశుద్ధి కొరవడడం వంటి చాలా అంశాలు ఈ మహమ్మారిని పెంచిపోషిస్తున్నాయి. డబ్బుకు ఆశపడి కొందరు, ప్రలోభాలకు లొంగిపోయి మరికొందరు, హెచ్చరికలకు బెదిరిపోయి ఇంకొందరు.. కారణాలు మారినా ఫలితం ఒకటే. క్రీడాస్ఫూర్తికి ఫిక్సింగ్ గాయాలుచేసి సజీవంగా సమాధి చేయడమే.
కొత్తకాదు
పోటీలకు దిగే ముందే ఫలితాలను నిర్ధారించడం కొత్తేమీకాదు. ఒలింపిక్స్‌ను ప్రపంచానికి అందించిన గ్రీకు నాగరికతలో ఫిక్సింగ్ ఒక భాగమని చరిత్రకారులు అంటారు. 20వ శతాబ్దంలో బుకీలు, క్రీడాకారులు కుమ్మక్కయి మ్యాచ్‌లను ఫిక్స్ చేయడం అన్ని క్రీడలకూ విస్తరించింది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, ప్రచార, ప్రసార మాధ్యమాలు ప్రాధాన్యతను సంతరించుకోవడం వంటి కారణాలతో ఫిక్సింగ్ కేసులు ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో బయపడుతున్నాయి. అంతమాత్రం చేత ఫిక్సింగ్ నిన్నమొన్న పుట్టుకొచ్చిన జాఢ్యమని అనుకోవడానికి వీల్లేదు. ఇది శతాబ్దాలుగా వేళ్లూనుకున్న మహమ్మారి. క్రీడా రంగాన్ని పట్టిపీడిస్తున్న అంటు వ్యాధి.
క్రీడా వ్యాపారం
మానసిక, శారీరక ఉల్లాసానికి, దృఢత్వానికి క్రీడలు అవసరమన్న అవగాహనకు ఏనాడో గండిపడింది. క్రీడా వ్యాపారం జోరుగా సాగుతున్నది. స్పాన్సర్‌షిప్‌లు, అండార్స్‌మెంట్లు, ప్రకటనలు, ప్రసార హక్కుల అమ్మకాలు, కాంట్రాక్టులు వంటి ఎన్నో రూపాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అదే సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్‌ను బుకీలు వ్యాపారంగా ఎంచుకున్నారు. కెరీర్ మొత్తంలో సంపాదించుకోలేనంత మొత్తాన్ని ఆటగాళ్లకు ఎర వేస్తారు. వారిని విందులు, వినోదాల్లో ముంచెత్తుతారు. పబ్‌లు, లేట్‌నైట్ పార్టీలతో కొత్త లోకాన్ని చూపిస్తారు. డబ్బుకు ఆశపడి, విలాసాలకు అలవాటుపడిన చాలా మంది ఆటగాళ్లు బుకీల చేతిలో కీలుబొమ్మలవుతున్నారు. చిన్నాచితకా ఆటగాళ్లే బుక్‌మేకర్లకు లొంగుతున్నారనుకోవడం పొరపాటు. పేరుప్రఖ్యాతులు ఆర్జించి, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వారిపైనా ఫిక్సింగ్ ఆరోపణలున్నాయి. దోషులుగా రుజువుకావడంతో కొంత మంది శిక్షలు కూడా అనుభవించారు. అనుభవిస్తున్నారు. క్రీడలను వ్యాపారంగా మార్చడం వల్ల తలెత్తిన చెడు ప్రభావాల్లో ఫిక్సింగ్ ప్రధానమైనది. ప్రమాదకరమైనది.
పాయింట్ షేవింగ్
బాస్కెట్‌బాల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు అతి సులభమైన మార్గం ‘పాయింట్ షేవింగ్’. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు పాయింట్లు చేయకుండా నిలువరించేందుకు వ్యూహాత్మకంగా వివిధ స్థానాల్లో నిల్చోవడం, సాధ్యమైనంత వరకూ అడ్డుకోవడం ప్రతి జట్టులోని క్రీడాకారులు చేసే పని. అయితే, ప్రత్యర్థులకు పాయింట్లు సంపాదించుకునే అవకాశం కల్పిస్తూ, ముందుగా నిర్ణయించుకున్న స్థానాల్లో ఆటగాళ్లు లేకుండా చేయడానే్న పాయింట్ షేవింగ్ అంటారు. సూక్ష్మంగా చెప్పాలంటే, ఒక జట్టుకు చెందిన ఆటగాళ్లు రక్షణ వలయానికి తమంతట తాముగా గండికొట్టడమే పాయింట్ షేవింగ్. ఈ విధానం ద్వారా బలమైన జట్లు కూడా ఎవరికీ అనుమానం రాని విధంగా ఓటమిని కొనితెచ్చుకుంటాయి. ఈ ప్రక్రియలో భాగంగా కోట్లాది రూపాయలు చేతులుమారుతాయి. చాలాకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ, 1950 దశకంలో మొదటిసారి వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ కాలేజీ జట్టుకు చెందిన పలువురు క్రీడాకారులపై జిల్లా న్యాయమూర్తి నిషేధం విధించాడు. 1970 దశకంలో బోస్టర్ కాలేజీ బాస్కెట్‌బాల్ జట్టు పాయింట్ షేవింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. భారీగా ముడుపులకు న్యూయార్క్‌లోని అండర్ వరల్డ్ మాఫియా ఒత్తిళ్లు కూడా జతకలవడంతో ఆటగాళ్లు సులభంగానే లొంగిపోయారని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. 1990 దశకంలో లాస్ వెగాస్‌కు చెందిన బుక్‌మేకర్లు పాయింట్ షేవింగ్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయించారు. ఈ కేసులో ఆరిజోనా స్టేట్ యూనివర్శిటీ ఆటగాళ్లపై వేటు పడింది. తాజాగా శాన్ డిగో విశ్వవిద్యాలయం ఆటగాళ్లను అమెరికా ఫెడరల్ న్యాయస్థానం సస్పెండ్ చేసింది. బుకీలతో కలిసి వీరు పాయింట్ షేవింగ్‌కు పాల్పడినట్టు రుజువైంది. మేజర్ బాస్కెట్‌బాల్ ఈవెంట్స్‌లో పాయింట్ షేవింగ్ వ్యూహం విస్తరిస్తున్నదని నిఘా విభాగాలు స్పష్టం చేస్తున్నాయి.
సాకర్‌ను కుదిపేసిన ఫిక్సింగ్
బ్రిటిష్ సాకర్ రంగంలో 1910 దశకంలో చోటు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. అంతకు ముందు కొనే్నళ్లుగా మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నప్పటికీ సాక్ష్యాధారాలు లేని కారణంగా ఎవరికీ శిక్ష పడలేదు. 1915 ఏప్రిల్ 2న మాంచెస్టర్ యునైటెడ్, లివర్‌పూల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఒక అంగీకారానికి వచ్చారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే ఆ మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ గెలిచింది. జార్జి ఆండర్సన్ చేసిన రెండు గోల్స్‌తో ఆ జట్టు లివర్‌పూల్‌ను 2-0 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌కు గురైందని, బుకీల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు పంచుకున్నారని ఆరోపణలు రావడంతో బ్రిటిష్ నిఘా విభాగం విచారణ చేపట్టింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన సాండీ టర్న్‌బుల్, ఆర్థర్ వాలే, ఎనోచ్ వెస్ట్‌తోపాటు లివర్‌పూల్ క్రీడాకారులు జేమ్స్ షెల్డన్, టామ్ మిల్లర్, బాబ్ పోర్సెల్, థామస్ ఫెయిర్‌ఫుల్‌పై కూడా జీవితకాల సస్పెన్షన్ వేటు పడింది. లివర్‌పూల్ తరఫున ఆడిన జేమ్స్ షెల్డన్ అంతకు ముందు మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు కావడంతో మ్యాచ్ ఫిక్సింగ్ అతనికి సులభమైంది.
ఫుట్‌బాల్ లీగ్ క్రీడాకారులు చాలా మంది 1960 దశకంలో తాము ఆడిన మ్యాచ్‌లను ఫిక్స్ చేశారని ఆరోపణలు రావడంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అప్రమత్తమైంది. విచారణ జరిపించిన తర్వాత సుమారు 50 మంది ఆటగాళ్లను సస్పెండ్ చేసింది. అయితే వీరంతా పేరుమోసిన క్రీడాకారులు కాకపోవడంతో ఎవరూ దృష్టిపెట్టలేదు.
జర్మనీ ఫుట్‌బాల్‌లో రిఫరీలు, ఆటగాళ్ల కుంభకోణం వెలుగు చూసిన 2005లోనే బ్రెజిల్‌లోనూ అలాంటి సంఘటనే అధికారులకు చెమటలు పట్టించింది. ఇద్దరు పేరుపొందిన రిఫరీలు, పాలో జోస్ డనెలన్, ఎడిల్సన్ పెరీరా డి కర్వాల్హో, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అనంతరం జరిగిన విచారణలో ఇద్దరు రిఫరీలు నేరాన్ని అంగీకరించారు. మరికొందరు రిఫరీలు, అధికారులు, ఆటగాళ్ల పేర్లను కూడా వీరు విచారణ సమయంలో వెల్లడించారు. వారంతా తమకు సహకరించారని స్పష్టం చేశారు. మిగతావారిని శిక్షించకుండా విచారణ పేరుతో కాలక్షేపం చేసిన బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య ఈ ఇద్దరు రిఫరీలను జీవితకాలం సస్పెండ్ చేసింది.

- శ్రీహరి