సంపాదకీయం

కుదుట పడనున్న నేపాల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్ ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియలో విజ్ఞత మళ్లీ మొలకెత్తడం హర్షణీయ పరిణామం. ఈ మొలకలు పల్లవించి, పరిమళిస్తాయా అన్నది వేచి చూడవలసిన వ్యవహారం. తెరాయ్ ప్రాంతలోని మాధేశీలు తదితర జనసముదాయాల ఆకాంక్షలను నెరవేర్చడానికి దోహదం చేయగల రెండు రాజ్యాంగ సవరణలను శనివారం నేపాల్ పార్లమెంట్ ఆమోదించడం హర్షణీయ పరిణామం. ఈ సవరణలను మన ప్రభుత్వం స్వాగతించడం సహజం. మాధేశీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పక్షాలు ఈ సవరణలను ఆమోదించినప్పటికీ మాధేశీలకు పూర్తి న్యాయం జరగలేదన్నది ఈ రాజకీయ పక్షాలు వ్యక్తం చేసిన అభిప్రాయం. పార్లమెంటులో సవరణ బిల్లులను మాధేశీ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించలేదు, అమోదించనూ లేదు. అయితే అసంతృప్తితో ఉన్న మాధేశీ పక్షాలు తమ రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగించే ప్రమాదం కూడ పొంచి ఉంది. ప్రాతినిధ్యంలో మాధేశీ ప్రజలకు నూతన రాజ్యాంగంలో జరిగిన అన్యాయాన్ని తొలగించడానికి నూతన సవరణలు దోహదం చేస్తున్నాయి. కానీ నేపాల్ సమాఖ్య వల్ల మాధేశీలకు జరిగిన అన్యాయాన్ని తొలగించడానికి ఈ సవరణల వల్ల వీలు కాదన్నది స్పష్టమైన వ్యవహారం. ఏమైనప్పటికీ గత కొన్ని నెలలుగా నేపాల్ ప్రభుత్వ నిర్వాహకులలో పొడచూపిన భారత వ్యతిరేకత పలుచబడి పోతోందనడానికి శనివారం నాటి రాజ్యాంగ సవరణలు మరో నిదర్శనం. ఈ సవరణల పట్ల ఆదివారం మన ప్రభుత్వం అనుకూలంగా ప్రతిస్పందించడం వల్ల ఉభయ దేశాల మధ్య ఇటీవలి కాలంలో మందగించిన మైత్రి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. తరతరాల సంప్రదాయానికి విరుద్ధంగా నేపాల్ నూతన ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ మనదేశంలో పర్యటించడానికి ముందే చైనాకు వెళ్లనున్నట్టు ప్రచారమైంది. ఈ సంగతిని నేపాల్ ఉప ప్రధాని కమల్ థాఫా డిసెంబర్‌లో స్వయంగా ప్రకటించాడు. కమల్ థాఫా చైనాలో వారం రోజులు పర్యటించి మంతనాలు జరిపి రావడం ఈ ప్రకటనకు నేపథ్యం. మాధేశీల రాజ్యాంగ వ్యతిరేక ఆందోళన ఉద్ధృతంగా సాగిన సమయంలో థాఫా చేసిన ఈ ప్రకటన మనదేశంతో నేపాల్ సంబంధాలను మరింత దిగజార్చింది. అయితే నేపాల్ ప్రధానమంత్రి మొదట మనదేశంలోనే పర్యటించనున్నట్టు గత వారం ప్రచారమైంది. ఫిబ్రవరిలో ఖడ్గ ప్రసాద్ శర్మ మనదేశానికి వస్తున్నాడట. ఈ సవరణ భారత నేపాల్ మైత్రి గ్రహణ విముక్తం అవుతోందనడానికి మొదటి సంకేతం. ఇప్పుడు నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన రాజ్యాంగ సవరణలు రెండవ సంకేతం.
నేపాల్ నూతన రాజ్యాంగంలో మాధేశీల పట్ల వ్యతిరేకత స్పష్టంగా ప్రస్ఫుటించింది. ఈ వ్యతిరేకత భారత దేశం పట్ల వ్యక్తమైన ప్రచ్ఛన్న వైముఖ్యం. నేపాల్‌లో 2008 నుండి మన దేశం పట్ల ఏకీకృత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ వారు, ఆ పార్టీ అధినేత ప్రచండ వెళ్లగక్కిన వ్యతిరేక భావాలు ఈ నూతన రాజ్యాంగంలో ధ్వనించాయి. నేపాల్ ప్రజలు మొత్తం భారతీయ సంతతి వారు. కానీ అనాదిగా నేపాల్‌లో నివసిస్తున్న వారికీ, గత రెండు దశాబ్దులుగా బిహార్, ఉత్తర ప్రదేశ్, బెంగాల్, సిక్కిం తదితర ప్రాంతాలనుంచి నేపాల్‌కు వెళ్లి స్థిరపడినవారికి మధ్య విద్వేషాన్ని రగిలించే కార్యక్రమాన్ని మావోయిస్టులు అత్యంత చాతుర్యంతో అమలు జరుపుతుండడం నడుస్తున్న వైపరీత్యం. ఇలా ఇటీవల వెళ్లి స్థిరపడిన వారు మనదేశానికి అనుకొని ఉన్న దక్షిణ నేపాల్‌లో నివసిస్తున్నారు. ఇలా రెండు శతాబ్దులకు ఈవల బ్రిటిష్ వారు మన దేశాన్ని దురాక్రమించిన తరుణంలో నేపాల్‌కు వెళ్లి స్థిరపడిన మాధేశీలు ఇతరులూ ప్రధానంగా తెరాయ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. తెరాయ్ ప్రాంతం మనదేశానికి ఆనుకొని ఉన్న దక్షిణ నేపాల్‌లో ఉంది. అందువల్ల నూతన రాజ్యాంగంలో మాధేశీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు దాన్ని అధికారికంగా ఆవిష్కరించవద్దని మన ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వాన్ని గత ఆగస్టులో కోరినట్టు ప్రచారమైంది. మన విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి జైశంకర్ ఈ విషయమై ఖాట్మండులో రెండు రోజులపాటు నేపాల్ ప్రభుత్వంతో చర్చలు కూడ జరిపినా వారు పట్టించుకోలేదు. ఇలా పట్టించుకోకపోవడానికి కారణం చైనా ప్రభుత్వం వారి తెరవెనుక వ్యూహం. నేపాల్ ప్రభుత్వం ఆగస్టు 20న రాజ్యాంగాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి మాధేశీల నిరసన కొనసాగుతోంది.
యాబయి శాతానికి విస్తరించి ఉన్న ఉత్తర నేపాల్‌లో జనాభాలోని ఇరవై శాతం మాత్రమే నివసిస్తున్నారు. ఉత్తర నేపాల్ ప్రధానంగా పర్వతీయ ప్రాంతం కావడం వల్ల జనసాంద్రత పలుచబడి ఉంది. మరో సగం భూభాగానికి విస్తరించి ఉన్న దక్షిణ నేపాల్‌లో మిగిలిన డెబ్బయి ఐదు శాతం జనాభా కేంద్రీకృతమై ఉంది. ఈ దక్షిణ నేపాల్‌లోని జనాభాలో దాదాపు సగం మంది మాధేశీలు, తెరాయ్ తదితర ప్రాంతాలలో నూతనంగా స్థిరపడిన వారు. అందువల్ల ఈ నూతన భారతీయ సంతతికి ప్రాధాన్యం, ప్రాతినిధ్యం తగ్గించడానికి వీలుగా విచిత్రమైన ఎన్నికల పద్ధతిని నేపాల్ రాజ్యాంగంలో చొప్పించారు. జనాభా ప్రాతిపదికగా పార్లమెంటులో ప్రాతినిధ్యం కల్పించడం, నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య వౌలిక సూత్రం. ఈ సూత్రానికి విరుద్ధంగా జనాభాను భూభాగంలో సమతుల్యం చేసి నియోజక వర్గాలను ఏర్పాటు చేయాలన్న విచిత్ర నిబంధనను నేపాల్ కొత్తగా రాజ్యాంగంలో ఏర్పాటు చేసింది. ఫలితంగా నాలుగవ వంతు జనాభా ఉన్న ఉత్తర నేపాల్‌కూ, దక్షిణ నేపాల్‌కూ పార్లమెంట్‌లో దాదాపు సమాన ప్రాతినిధ్యం ఏర్పడే వైపరీత్యం సంభవించింది. అందువల్లనే మాధేశీలు, తెరాయ్ ప్రాంతంవారు నూతన రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. నెలల పాటు జరిగిన ఆందోళన రక్తసిక్తమైంది. ఈ ఆందోళన ఫలితంగా మన దేశం నుండి నేపాల్ రాకపోకలు స్తంభించాయి. సరకు రవాణా ఎనబయి శాతం ఆగిపోయింది. నిత్యావసరాలకు లోటు ఏర్పడి నేపాల్ జనజీవనం అతలాకుతలమైంది. దీనికంతటికి మన ప్రభుత్వం కారణమని నేపాల్ ప్రభుత్వ నిర్వాహకులు బహిరంగంగా ఆరోపించడం యుగాలనాటి ఇరు దేశాల సాంస్కృతిక, ఆర్థిక, భౌగోళిక రక్షణ బంధాన్ని దెబ్బతీయడానికి దోహదం చేసింది. మన దేశం నుండి కాక చైనా నుండి నిత్యావసరాలు తెప్పించుకొనడానికి నేపాల్ చేస్తున్న యత్నాలు మన దేశంతో 1949-50లో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధం...
జనాభా ప్రాతిపదికగా మాత్రమే పార్లమెంటరీ నియోజకవర్గాలను ఏర్పాటు చేయడానికి విరుద్ధంగా ఇప్పుడు జరిగిన సవరణ మాధేశీలకు ఉపశమనం. కానీ మాధేశీలకు ప్రత్యేకంగా రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న కోర్కె మాత్రం ఇప్పటికీ సిద్ధించలేదు. ఈ కోరికను రాజ్యాంగ రచనా ప్రక్రియ కొనసాగించిన సందర్భంగా ప్రభుత్వం అంగీకరించింది. నూతన సమాఖ్యలోని ఎనిమిది రాష్ట్రాలలో రెండింటిలో మాధేశీలు మెజారిటీలో ఉంటారు. కానీ చివరికి రాష్ట్రాలను ఏడుకు కుదించారు. మాధేశీలను ఐదు రాష్ట్రాల్లో చెల్లా చెదరు చేశారు. ఏ రాష్ట్రంలో కూడ మాధేశీలు మెజారిటీగా ఉండరాదన్నదే భారత వ్యతిరేక వ్యూహంలోని ఇతివృత్తం.