కర్నూల్

కోట్ల వైపు నేతల చూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 5: రాహుల్‌గాంధీ పర్యటనలో జరిగిన అవమానంపై గుర్రుగా ఉన్న కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి నిర్ణయం కోసం టిడిపి, వైకాపా వేచి చూస్తున్నాయి. ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఎఐసిసి నాయకులు కర్నూలుకు వచ్చి వివరణ ఇస్తారా లేదా అన్న అంశంపై చర్చ సాగుతోంది. తమ డిమాండ్‌ను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోకపోతే కార్యకర్తల ఒత్తిడి మేరకు పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటారా లేక తన నిర్ణయానికే కోట్ల కట్టుబడి ఉంటారా అన్న అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా కోట్ల ఆగ్రహంపై శనివారం హైదరాబాద్‌లో పిసిసి ఆధ్వర్యంలో చర్చించే అవకాశమున్నట్లు ఆయన వర్గీయులు వెల్లడిస్తున్నారు. పిసిసి దూతగా వచ్చిన మాజీ మంత్రి శైలజానాథ్ ఇదే విషయం వెల్లడించారు. కోట్ల వర్గీయుల డిమాండ్‌ను 6వ తేదీ పార్టీ పెద్దలకు తెలియజేస్తానని, ఎఐసిసి పెద్దలు వచ్చి వివరణ ఇవ్వాలని కోరుతానని శైలూ పేర్కొన్నారు. సమావేశానికి కోట్ల సన్నిహితులను కూడా తీసుకెళ్తానని స్పష్టం చేశారు. దీన్నిబట్టి హైదరాబాద్‌లో నేడు జరిగే సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కోట్ల వర్గీయుల డిమాండ్‌ను ఏఐసిసి పెద్దలకు వివరించి నిర్ణయాన్ని వారికే వదిలేస్తారే తప్ప పిసిసి నాయకులు ఎందుకు ఇబ్బంది ఎదుర్కొంటారని విశే్లషకులు పేర్కొంటున్నారు. కోట్ల ఆగ్రహం పిసిసి నుంచి ఎఐసిసికి చేరాక ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని వారంటున్నారు. అయితే జాప్యం జరిగే అవకాశం ఉన్నందున కోట్ల మనసు మార్చుకుంటే తమ పార్టీలో చేర్చుకోవాలని అటు టిడిపి, ఇటు వైకాపా నేతలు యోచిస్తున్నారు. ఎన్నికలకు ముందే టిడిపిలో కీలక నేతగా వ్యవహరించి రాయలసీమ బాధ్యతలను నిర్వర్తించిన ఓ నాయకుడు కోట్ల సూర్యతో చర్చించి పార్టీలో చేరమని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే అందుకు ఆయన నిరాకరించినట్లు సమాచారం. అయితే పార్టీ పెద్దలపై ఆగ్రహంతో ఉన్న కోట్ల మనసు మార్చే ప్రయత్నం ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైకాపా నేతలు కోట్లతో చర్చించారని, ఎఐసిసి స్పందన తరువాత తన నిర్ణయం చెబుతానని పేర్కొన్నట్లు కర్నూలులో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా పార్టీ మార్పు ప్రచారంపై కోట్ల స్పందన కోరగా తనకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలని లేదన్నారు. అయితే పార్టీ నేతలు కొందరు వ్యవహరిస్తున్న తీరు కార్యకర్తల ఆగ్రహానికి గురైందన్నారు. దీంతో అవమానాలు భరిస్తూ పార్టీలో ఎందుకుండాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. వారి ఒత్తిడికి తలొగ్గి పార్టీ మారే ప్రశే్న లేదని, అయితే తనకు సరైన వివరణ ఇవ్వని పక్షంలో పార్టీ కార్యక్రమాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు.
చంపుకు తింటున్నారు..!
* వన్యప్రాణులకు రక్షణ కరువు..
* అటవీ శాఖ ఉద్యోగి ఇంట్లో అడవి పంది మాంసం లభ్యం
ఆత్మకూరు, ఫిబ్రవరి 5 : నల్లమల అరణ్యంలో నివసిస్తున్న వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది. నిత్యం ఏదో ఒక జంతువు వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు వదలుతుండడం సర్వసాధారణమైపోయింది. ఫిబ్రవరి మొదటి, రెండు తేదీల్లో నాగలూటి రేంజ్‌లో ఉచ్చులో పడి ఎలుగుబంటి ఇతీవ్రంగా గాయపడగా అటవీ శాఖ అధికారులు దానికి చికిత్స చేశారు. ఈ సంఘటన మరువకముందే గురువారం రాత్రి నల్లమల సమీపంలో ఉన్న ఎస్.ఎన్ తండాలోని ఆరుగురు ఇళ్లలో అడవి పంది మాంసాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. కంచె చేను మేసిందన్న చందంగా అటవీ శాఖలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో కూడా అడవి పంది మాంసం లభ్యం కావడంతో ఒక్కసారిగా అటవీ శాఖ యంత్రాంగం ఉలిక్కిపడింది. గురువారం ఎస్‌ఎన్ తండాలో కొందరు ఇళ్లలో అటవీ శాఖ అధికారులు సోదాలు చేపట్టడంతో ఓ అధికారి ఇంట్లో అడవి పంది మాంసం దొరికినా దాన్ని కప్పిపుచ్చినట్లు గ్రామస్థులు, అటవీ శాఖ సిబ్బందే చర్కించుకుంటున్నారు.
ఆరుగురిపై కేసు నమోదు
అడవి పంది మాంసాన్ని స్వాధీనం చేసుకుని ఆరుకురిపై కేసులు నమోదు చేశామని బైర్లూటి రేంజి శంకరయ్య తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం ఆత్మకూరు మండలంలోని ఎస్.ఎన్ తండాలోని ఇళ్లపై దాడులు నిర్వహించగా ఆరుగురు ఇళ్లల్లో అడవి పంది మాంసం లభ్యమైందన్నారు. అటవీ శాఖ ఉద్యోగి తండ్రి అయిన జె.సక్రునాయక్, బి.వెంకటయ్య, డి.హరినాయక్, జె.చిన్నస్వామి నాయక్, జె.చిన్నరాములు నాయక్‌పై కేసులు నమోదు చేశామన్నారు. అయితే నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

కలెక్టర్ బదిలీపై మళ్లీ చర్చ!
* టిడిపిలో భిన్నాభిప్రాయాలు..
* ఈసారి తప్పదంటున్న ఉద్యోగులు..
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఫిబ్రవరి 5:జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ బదిలీపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని ఐఎఎస్‌ల బదిలీపై సోమ, మంగళవారాల్లో సమీక్షించనున్నారని సచివాలయం నుంచి సమాచారం అందడంలో కలెక్టర్ బది లీ అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో అధికార పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ఈసారి బదిలీ ఖాయమన్న ధీమాతో ఉన్నారు. జిల్లా కలెక్టర్‌గా విజయమోహన్ 2014 జూలై చివరలో బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ప్రభుత్వ నిర్ణయాల అమలులో జిల్లాలోని ఉద్యోగులపై ఆయన ఒత్తిడి తీసుకువచ్చారు. పథకాల అమలు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికల విషయంలో ఆయన రాత్రివేళల్లో కూడా పని చేయిస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఉద్యోగ సం ఘాల ఆధ్వర్యంలో గతంలో ఆందోళనలు సైతం చేపట్టారు. అయితే వారితో చర్చించిన కలెక్టర్ పని ఒత్తిడి తప్పదని తాను ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు. ఉద్యోగులంతా ప్రభుత్వం పెడుతున్న పరుగులను అందుకోవడానికి అధిక సమయం వెచ్చిస్తే పనులన్నీ సాఫీగా సాగిపోతాయని సహకరించాలని కోరారు. దాంతో శాంతించిన ఉద్యోగులు తమ పనిలో నిమగ్నమయ్యారు. అయితే వారిలో కలెక్టర్‌పై ఉన్న అసంతృప్తి మాత్రం లోలోన అలాగే ఉండిపోయింది. ఆయన బదిలీ కోసం రాజకీయ పార్టీల నాయకుల కంటే ఎక్కువగా ఉగ్యోగులే ఎదురు చూస్తున్నారు. తమ ఆవేదనను ఉద్యోగ సంఘాల నేతల సహకారంతో గతంలో పని చేసిన సిఎస్ కృష్ణారావు, కొత్తగా నియమితులైన టక్కర్‌లకు వినిపించినట్లు సమాచారం. ఇక అధికార పార్టీలో కొందరు నేతలు కలెక్టర్‌గా విజయమోహన్ కొనసాగాలని కోరుకుంటుండగా మరి కొందరు మాత్రం బదిలీ కోసం ముఖ్యమంత్రికి ఫిర్యాదులతో కూడిన వినతి పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కొందరు ఐఎఎస్‌లకు స్థానం కల్పించడంతో పాటు ఏడాదిన్నర కాలం కలెక్టర్‌గా ఒకే జిల్లాలో పని చేసిన వారి జాబితాపై సమీక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ఉద్యోగులకు సమాచారం అందడంతో బదిలీ కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు
పకడ్బందీ ఏర్పాట్లు
* భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదు:ఆర్డీఓ
నంద్యాల, ఫిబ్రవరి 5: మహానంది పుణ్యక్షేత్రంలో మార్చి 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అన్ని రకాల సౌకర్యాల కల్పనకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మహానంది దేవస్థానం ఇఓ డాక్టర్ శంకర వర ప్రసాద్, మహానంది ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ భక్తులకు దేవస్థానం వారు వసతి సౌకర్యం కల్పించాలని, కొంత సేపైనా భక్తులు సేద దీరేందుకు డార్మెటరీలు, షామియానాలు వేసి ఏర్పాట్లు చేయాలన్నారు. పేద వారిని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం వారు, సంబంధిత అధికారులు పనిచేయాలన్నారు. రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ కలసి హెల్ప్‌లైన్ కౌంటర్ ఏర్పాటు చేసి ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వారి సహకారం తీసుకుని భక్తులకు సరైన సమాచారం ఇవ్వాలన్నారు. పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్య శాఖ, జెఎస్‌డబ్ల్యు సిమెంట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా విద్యుత్ శాఖ వారు అప్రమత్తంగా ఉంటూ రాత్రిపూట కరెంటు పోకుండ చూసుకోవడంతోపాటు అవసరమైన చోట జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దేవస్థానం వెనక వైపు కూడా లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్నదాన సత్రాలు, హోటళ్లలో భోజనాలు సుచి, శుభ్రతతో ఉండేలా శానిటేషన్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అగ్నిమాపక శాఖ రెండు వాహనాలతో పుణ్యక్షేత్రంలో తగినంత సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలన్నారు. రవాణాశాఖ, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ సమస్యలు రాకుండ చూడాలన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు ఎక్సైజ్‌శాఖ వారు డ్రై డేను పాటిస్తూ మద్యం అమ్మకాలను నిలిపి వేయాలని, అలాగే నాటుసారా సరఫరా కాకుండ చూడాలన్నారు. నంద్యాల ఆర్టీసీ వారు భక్తులకు తగినన్ని బస్సులను వేయాలన్నారు. ముఖ్యంగా గాజులపల్లె నుండి గాజులపల్లె రైల్వే స్టేషన్ మీదుగా మహానందికి ప్రత్యేకంగా బస్సులు నడపాలన్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో రాత్రి 9.30 గంటల వరకు భక్తులు దైవదర్శనం చేసుకుంటారని, ఆ సమయంలో తిరుగు ప్రయాణానికి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా ఏర్పాట్లు చేయడంతోపాటు రథోత్సవం రోజున రోప్ పార్టీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థానం అధికారులు భక్తుల కోసం అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనానికి ప్రత్యేకంగా పటిష్టమైన రీతిలో క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌అండ్‌బి అధికారులు దేవస్థానం పరిధిలో అవసరమైన అన్ని చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. జెఎస్‌డబ్ల్యు సిమెంట్స్ వారు పుణ్యక్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడమేకాక ఒక అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేస్తుందని, అలాగే భక్తులకు వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆర్‌ఓ ప్లాంట్‌ను బ్రహ్మోత్సవాల నాటికి సిద్ధంగా ఉంచినట్లు జెఎస్‌డబ్ల్యు ప్రతినిధి తెలిపారు. అదేవిధంగా మహానంది పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు దాతలైన డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ శాంతిరాముడు, ఆదినారాయణల సహకారం తీసుకోవాలన్నారు. మహానంది ఇఓ మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు అధికారులందరు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. అలాగే బ్రహ్మోత్సవాలకు ప్రతి శాఖ అంచనాలతో కూడిన నివేదికను కూడా ముందస్తుగా అందజేస్తే దేవస్థానం పరిధిలో ఉన్న బడ్జెట్‌ను కేటాయించే అవకాశం ఉంటుందన్నారు. రెవెన్యూ, పోలీసు, దేవస్థానం అధికారులు వైర్‌లెస్ సెట్ల ద్వారా సమన్వయం చేసుకోవాలని డిఎస్పీ హరినాథ్‌రెడ్డి కోరారు. దేవస్థానం పరిధిలో పనిచేసే వారందరికి వాహనాలతో కూడిన గుర్తింపు కార్డులను ఇవ్వాలన్నారు. మీడియా ప్రతినిధులకు మీడియా సెంటరు ఏర్పాటుతోపాటు వారికి కూడా దేవస్థానంలోకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. మరికొద్ది రోజుల్లో మహానంది దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖలకు చెందిన అధికారులందరు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
* పెద్దపాడులో పనులు తనిఖీ చేసిన కలెక్టర్
కర్నూలు, ఫిబ్రవరి 5:దత్తత స్వీకరించిన పెద్దపాడు గ్రామంలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామంలో శుక్రవారం కలెక్టర్ వీధి వీధి కలియ తిరిగి చేపట్టిన పనుల ప్రగతిని పరిశీలించేందుకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే పనులు మందకొడిగా సాగుతున్నట్లు గమనించిన కలెక్టర్ వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లల హాజరు, చేపడుతున్న చర్యలపై అడిగి తెలుసుకుంటూ హాజరు పట్టికను, సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే ప్రభుత్వ బాలుర, బాలికల వసతి గృహాలను తనిఖీ చేస్తూ మంజూరైన పనులు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఎస్‌ఎస్‌ఎ పిఓ వెంకటకృష్ణుడిని కలెక్టర్ ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీ భవనం, మరుగుదొడ్లు, సిసి రోడ్ల పనులు, తాము జాబితాలో సూచించిన పనులన్నీ మొదలవ్వాలని అవసరమైతే అదనపు కాంట్రాక్టర్లను నియమించి పనులు నిర్వహించాలని పిఆర్ ఎస్‌ఇ, ఎస్‌ఎస్‌ఎ పిఓ, కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ లోగా చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలని ప్రతి రోజూ తాను వచ్చి సమీక్షిస్తానని తెలిపారు. జిల్లా పరిషత్ పాఠశాల, బిసి బాలుర వసతి గృహం, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, దామోదరం సంజీవయ్య బాలికల వసతి గృహం తదితరాలను పరిశీలించి ఎక్కడా చెత్తచెదారం లేకుండా అవసరమైనంతా పరిశభ్రంగా వుంచాలన్నారు. పూర్తయిన భవనాలకు తక్షణమే ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేయించి నూతన గదుల్లో తరగతులు నిర్వహించాలని సూచించారు.
మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత
* ఎస్పీ రవికృష్ణ
కర్నూలు, ఫిబ్రవరి 5:జిల్లా పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ ఆకే.రవికృష్ణ తెలిపారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఉన్న పరేడ్ మైదానంలో శుక్రవారం సివిల్, ఏఆర్ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌కు ఎస్పీ హాజరై ప్రసంగించారు. పోలీస్ వ్యవస్థలో పరేడ్ అనేది క్రమశిక్షణ, శారీరక దృఢత్వానికి చిహ్నం అన్నారు. వచ్చే మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా పకడ్బందీగా బందోబస్తు చేపట్టాలన్నారు. సమాజంలోని అసాంఘిక శక్తులు ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయని అలాంటి వారి పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరచరిత్ర కలిగిన రౌడీషీటర్ల కదలికలను గమనిస్తూ శాంతి భద్రతలకు విఘా తం కలగకుండా చూడాలన్నారు. కొందరు నేరగాళ్లు సోషల్ మీడియా వాట్సప్, ఫేస్‌బుక్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల మహిళలు, యువతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించే మహిళల పట్ల తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. చైన్ స్నా చింగ్‌లను కట్టడి చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలతో పాటు ఆర్మ్‌డ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ద్విచక్ర వాహనాలు చోరీకి గురైతే దగ్గరలోని స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ ఏఎస్పీ రాధాకృష్ణ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, నగర సిఐలు ములకన్న, కృష్ణయ్య, మధుసూదన్‌రావు, మధుసూదన్‌రావు, నాగరాజ్‌యాదవ్, ఆర్‌ఐ రంగముని, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
డోన్‌కు 4 వేల పక్కాగృహాలు
* టిడిపి ఇన్‌చార్జి కెఇ
డోన్, ఫిబ్రవరి 5:జిల్లాలో ఎక్కడా లేని విధంగా డోన్ పట్టణానికి డిప్యూ టీ సిఎం కెఇ కృష్ణమూర్తి 4 వేల ఇళ్లు మంజూరు చేయించారని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ తెలిపారు. నిరుపేదలకు కలగా మారిన సొంతింటి కలను సాకారం చేసేందు కు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అందరికీ ఇళ్లు’ పథకం డోన్‌కు రావడం ఓ వరమని తెలిపారు. పట్టణంలోని కెఇ స్వగృహ ఆవరణలో శుక్రవారం కెఇ మున్సిపల్ అధికారులతో పాటు ప్యాపిలి మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ డోన్ పట్టణంలోని నిరుపేదలకు గూడు వసతి కల్పించాలనే సదుద్దేశ్యంతో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి నిరుపేదకు గృహాన్ని నిర్మించి ఇస్తామన్నారు. ప్రతి లబ్ధిదారునికి ఇంటి కోసం రూ. 4.8 లక్షలు, మరుగుదొడ్డి నిర్మాణానికి అదనంగా మరో రూ. 15 వేలు మంజూరు చేస్తామన్నారు. ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా కలిగి సొంత ఇల్లు లేని ప్రతి నిరుపేదకు తామే దగ్గరుండి ఇంటి నిర్మాణం చేయిస్తామన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో నివశిస్తున్న నిరుపేదలను గుర్తించి, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని కెఇ స్పష్టం చేశారు. అవసరమైతే మరిన్ని గృహాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో వుంచుకుని తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం కెఇ తెలుగునాడు టీచర్స్ యూనియన్, విద్యుత్ కార్మికుల యూనియన్ డైరీలను ఆవిష్కరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రికె గాయత్రిదేవి, కమిషనర్ రమేశ్‌బాబు, హౌసింగ్ డిఇ కోదండరామయ్య, టిడిపి పట్టణ అధ్యక్షుడు కొట్రికె ఫణిరాజ్, టిఇ శేషఫణిగౌడ్ పాల్గొన్నారు.
రాఘవేంద్రుని సన్నిధిలో కర్ణాటక మానవ హక్కుల కమిషన్ అధ్యక్షురాలు
మంత్రాలయం, ఫిబ్రవరి 5: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం శుక్రవారం కర్ణాటక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధ్యక్షరాలు మీరాసి సక్సేనా వచ్చారు. దీంతో ఆమెకు మఠం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆమె ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. అనంతరం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు పట్టు వస్త్రాలు ఫల మంత్రాక్షింతలు జ్ఞాపిక ఇచ్చి ఆశీర్వదించారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ద్వార పాలక అనంతస్వామి, దార్మిక సిబ్బంది ప్రకాష్ స్వామి, వ్యాసరాజాచార్ తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న సేవలో ప్రభుత్వ చీఫ్ విప్
శ్రీశైలం, ఫిబ్రవరి 5: శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ప్రభుత్వ చీఫ్‌విప్ చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చక వేదపండితులు చిఫ్‌విప్‌ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.
గోమాతను పూజిస్తే సకల శుభాలు
మహానంది, ఫిబ్రవరి 5: గోమాతను పూజించిన ప్రతి కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయని భద్రీనాథ్ మహారాజ్ బిలోరియా మహరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రోటోకాల్ ఇన్‌స్పెక్టర్ సురేంద్రనాధరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోమాతను ఏ కుటుంబం అయితే పూజిస్తుందో ఆ కుటుంబం సకల శుభాలతో వర్థిల్లుతుందని, గోమాతలో సకల దేవతలు కలిగి ఉంటారన్నారు. సైనికుడు మన దేశం కోసం పోరాడుతుంటే మనం కనీసం గోమాతను పూజించి వారు క్షేమంగా ఉండాలని కోరుకోవాలన్నారు. వీరి వెంట విహెచ్‌పి సభ్యులు బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
సంజీవయ్య జయంతి
ఘనంగా నిర్వహించండి
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 5: మాజీ సిఎం దివంగత దామోదరం సంజీవయ్య జయంతి ఉత్సవాలను ఈ నెల 14వ తేదీ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. సంజీవయ్య జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ దళిత సంఘాల నాయకులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో నే తొలి దళిత సిఎం దామోదరమని, ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో భాగం గా పెద్దఎత్తున ర్యాలీలు, ఉపకార వేతనాల పంపిణీ, లింకేజీ రుణాలు, కులాంతర వివాహాల ప్రశంసా పత్రా లు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, వసతి గృహ విదార్థులకు దామోదరం జీవిత చరిత్రపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్ పాటించి అందరినీ ఆహ్వానించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పేద రైతుల ను గుర్తించి పంటనీటి కుంటల నిర్మా ణం, ఎన్టీఆర్ జలశ్రీ పథకం కింద బోరుబావులు మంజూరు చేసి వారికి మంజూరు పత్రాలను ఈ నెల 14న జరిగే ఉత్సవాల్లో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దపాడు గ్రామ అభివృద్ధికి కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాలు ఇప్పిస్తామన్నారు. సమావేశంలో జెసి హరికిరణ్, సాంఘి క సంక్షేమ శాఖ డిడి ప్రసాదరావు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.