రాష్ట్రీయం

కుదిరిన ముహూర్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎట్టకేలకు తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 17న ఉదయం 8 గంటల 23 నిముషాలకు భూమిపూజ ద్వారా పనులు ప్రారంభించాలని సోమవారం రాత్రి ఇక్కడి క్యాంప్ కార్యాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. వెలగపూడి గ్రామంలోని సర్వే నెంబర్లు 204, 205, 206, 207, 208, 214/1లలో నిర్మాణాలు జరపాలని, 4 నెలల కాలవ్యవధిలో పూర్తిచేసేందుకు ఎల్ అండ్ టి, పల్లోంజి షాపూర్జీ కంపెనీలకు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిర్ణీత కాలపరిమితి దాటితే భారీగా జరిమానా విధించాలని, ముందుగా పూర్తయితే ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. చదరపు అడుగుకు రూ.3,350 చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాలకు రూ.65 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.25 కోట్లు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఖాయిలాపడిన ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వటంలో భాగంగా విద్యుత్ యూనిట్‌కు 1.50 పైసలు వసూలు చేయాలని నిర్ణయించారు. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్ బిల్లులు సవరించేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే మానవ శరీరంలోని కణాలతో ‘టిష్యూ’ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో పెద్దఎత్తున భూకేటాయింపులు జరిగాయి. కర్నూలు జిల్లా నాగులూటి, మస్పెట్, కాలమూరు గ్రామాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ఎకరానికి రూ.2 లక్షల చొప్పున ఎపిఐఐసికి 2,740 ఎకరాలు కేటాయించారు. కర్నూలు జిల్లా కొండదూటూరు గ్రామంలో ఎకరాకు రూ.5లక్షల చొప్పున శాంతీరామ్ కెమికల్స్‌కు 150 ఎకరాలు కేటాయించారు. విశాఖ జిల్లా కాపులుప్పాడు గ్రామంలో 10వ బెటాలియన్ ఏర్పాటుకు 2ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎకరానికి రూ.7లక్షల చొప్పున ఎపి జెన్కోకు 28 ఎకరాలు కేటాయించారు.
రాష్ట్రంలో 1002 రైతు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి వీటిద్వారా 9,12,123 మంది రైతులకు వ్యవసాయం, ఉద్యానవనాల పెంపకం, పశుపోషణ, మత్స్య పరిశ్రమల్లో ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయిల్ దేశాల్లో అమలవుతున్న నీటిపారుదల విధానాలను అమలుచేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది రూ.6వేల కోట్లు ఖర్చు చేసి వచ్చే ఏడాది రూ.9వేల కోట్లు నిధులు వెచ్చించాలని నిర్ణయించారు. యూనిట్ ఇసుకపై రూ.500 మించి టెండరు వేస్తే వాటిని రద్దుచేసి కొత్త ఏజెన్సీలు వచ్చేవరకు డ్వాక్రా సంఘాల ద్వారానే ఇసుక విక్రయించాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా ఏటిపాక, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరులో ఆర్డీవో కార్యాలయాలు కొత్తగా ఏర్పాటుచేసి 44 కొత్త ఉద్యోగాలను కల్పించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. సియాచిన్ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ ముస్తాక్ అహ్మద్ మృతికి మంత్రివర్గం సంతాపం తెలిపింది. ఆయన కుటుంబానికి రూ.25లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయించిందని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేఖర్లకు వివరించారు.