భక్తి కథలు

కాశీఖండం 184

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక నాటి నడిరేయి ఆ మహానందుడు ఆనందకాననం లేక కాశీపురి వెడలిపోయి పురజనులకు వెరచి కాకుల వల్ల భీతి చెందిన గుడ్లగూబవలె చీకాకుపడి పుణ్యక్షేత్రాల్లో చొరబారడానికి అనుజ్ఞ లేక సకుటుంబంగా ‘కీకట’ దేశానికి వెడలువాడి అరణ్య మార్గంలో తాను, తన ఇల్లాలు, తనయులిద్దరు మొల ప్రదేశాల్లో బంగారు నాణేల జాలెలు కట్టుకొని సార్థవాహుల సమూహాన్ని కూడుకొని అరుగుతూ వుండగా చోరులు చుట్టుముట్టి ఆ నలుగురిని పట్టుకొని బంగారు నాణేల ధనం అంతా దోచుకున్నారు. ఆరీతిగా ధనాన్ని ఒలిచికొని ఆ తస్కరులు ఈ విధంగా వితర్కించుకొన్నారు.
‘‘ఈ విప్రుడి చెంత ధనం హేరాళంగా వుంది. ఇతడా బలగం కలవాడు. వీడు ప్రాణాలతో బయటపడి అరిగినట్లయితే వెదకించి వెదకించి మనల్ని చంపించి తీరుతాడు తప్ప బ్రతికివుండనివ్వడు. కనుక ఈ విప్రుణ్ణి సంహరిద్దాం అని నిశ్చయించుకొన్నారు.
వధింప నిశ్చయించి, ఆ బ్రాహ్మణున్ని సమీపించి కత్తి పదునుపెట్టి ‘‘ఓ విప్రుడా! నువ్వూ, నీ కుటుంబమున్ను మీ యిష్టదేవతల్ని తలచికొనండి’’ అని పలికారు. తామర కన్నుల అతని యిల్లాలు విశాలాక్షీ దేవిని స్మరించుకొంది. ఆ బ్రాహ్మణుడు తన చిత్తంలో విశే్వశ్వరుడిని తలచుకొన్నాడు. తనయులు ఇరువురూ సద్భక్తితో డుంఠి విఘ్నేశ్వరుణ్ణి కొలిచారు. అంతేగాక ఆ మహానందుడు తన ఆత్మలో, పుణ్యసాధ్వి పుణ్యగృహిణి అయిన పొరుగింటి విప్ర స్ర్తిని కన్నులు అల్లార్చి అల్లార్చి చూసి ఎందుకు అపహరించుకొని వచ్చాను?
పడకూడని- పతనం కాకూడని బ్రాహ్మణ జన్మ భస్మం అయేటట్టు మధు మాంసాల కోసం ఏల మరిగాను? పరమ నాస్తికుణ్ణి అయి వేదబాహ్యుడి వేషం వేసికొని ఏ రీతిగా యుక్తాయుక్త జ్ఞానం కోల్పోయాను? మణికర్ణికా తీర్థంలో పుల్కసుని చేత స్వర్ణ ధనం అపారంగా ఎందుకు దానంగా పరిగ్రహించాను? ఆతతాయి అయిన వాడికి, శఠుడికి, అధర్మపరుడికి, పాపబుద్ధికి, విశ్వాస ఘాతుకుడికి- నాకు ఈ విధం అయిన చావు ప్రాప్తం అయింది అని, తల వంచుకొని ఆ మహానందుడు అరణ్య మార్గమధ్యంలో వుండిపోయాడు. ఆ చోరులు ఆ నలుగురి తలలు తెగవేస్తారు. ఆ నలువురు మరణించి మరుజన్మలో కోడి జాతిలో జన్మించారు. అప్పుడు చెరువుల్లోని కోళ్లతో కలిసి ఆ నాలుగు కోళ్లూ తిరుగుతూ వుండగా, సార్థవాహులు వాటిని గూటిలో పెట్టుకొని కాశీకి ఏగారు. ఆ కుక్కుటాలు నాలుగున్ను, ప్రాతఃకాలంలో నియమం మీరకుండా మణికర్ణికా కుండంలో స్నానం ఆచరిస్తాయి. ముక్తి మంటపంలో ముని జనులు ఆది పురాణాలు పఠిస్తూ వుంటే ఆలకిస్తాయి. విశ్వనాథుడి దివ్య మందిరానికి చనువుతో ప్రదక్షిణలు మూడు చేస్తాయి. మందిర ప్రాంగణాల్లో చల్లే నీరాజన ప్రక్రియకి చెందిన దివ్యాన్నాలని కడుపార మెసవుతాయి.

-ఇంకాఉంది