నల్గొండ

అధికారుల అండతో నగర పంచాయతీ స్థలం కబ్జా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, మార్చి 8: అధికారుల అండతో దేవరకొండ పట్టణం లో నగరపంచాయతి ఆస్ధులు కబ్జాలకు గురౌతున్నాయి. కబ్జాదారులకు కొంత మంది ప్రజాప్రతినిధులు అండగా నిలబడుతుండడంతో ప్రభుత్వ ఆస్ధులను కాపాడేవారు కరువయ్యారు. పట్టణంలోని మహాలక్ష్మి మహిళామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్దాశ్రమం ప్రక్కన నగరపంచాయతి ఆధీనం లో ఉన్న స్ధలాన్ని ఓ పండ్ల వ్యాపారి ఆక్రమించి గత వారం రోజులుగా నిర్మాణం సాగిస్తున్నా నగరపంచాయతి అధికారులు పట్టించుకోవడం లేదు. సర్వే నెంబర్ 387,388 లలో ఉన్న పంచాయతి స్ధలాన్ని అప్పటి పాలకవర్గం 1998 సంవత్సరంలో మహాలక్ష్మి మహిళామండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వృద్దాశ్రమం కోసం దాదాపు 75 అర్రల స్ధలాన్ని ఇచ్చింది. వృద్దాశ్రమ నిర్మాణ సమయంలో ఆశ్రమంకు మూడు వైపులా రోడ్లు ఉన్నట్లు అప్పటి సిబ్బంది అనుమతి ఇచ్చారు. ఆశ్రమానికి ఓ వైపు ఉన్న రోడ్డును ఆక్రమించి పండ్ల వ్యాపారి ఇప్పుడు నిర్మాణాన్ని చేపడుతున్నాడు. ఈ విషయాన్ని వృద్దాశ్రమ నిర్వాహకురాలు జనవరి 28 వ తేదీన దేవరకొండ ఆర్డీవోకు, నగరపంచాయతి కమీషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. కొంత మంది ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళతో పండ్ల వ్యాపారి యదేశ్చగా నిర్మాణం సాగిస్తున్నా నగరపంచాయతి అధికారులు కనీసం నిర్మాణాన్ని ఆపేందుకు యత్నించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. 1993 లోనే తమకు ఆ స్ధలాన్ని అప్పటి పాలకవర్గం రాసిచ్చిందని స్ధలాన్ని కబ్జా చేస్తున్న వ్యాపారి చెబుతూ అప్పటి పాలకవర్గం చేసిన తీర్మాణం కాపీని చూపిస్తుంటే అధికారులు ఆ తీర్మాణాన్ని ఎలా అంగీకరిస్తారో ఎవరికి అంతు చిక్కడం లేదు. ప్రభుత్వ స్ధలాన్ని కబ్జా చేస్తున్న వ్యాపారి చూపిస్తున్న తీర్మాణం కాపి అసలైందా లేక నకిలీదా అని నిర్ధారించేందుకు నగరపంచాయతి అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 11/01/1993 న అప్పటి పాలకవర్గం స్ధలాన్ని తనకు ఇస్తూ తీర్మాణం చేసిందని కబ్జా చేస్తున్న వ్యాపారి చూపిస్తున్న తీర్మాణం కాపీ ప్రకారం కార్యాలయం రికార్డుల్లో ఉన్న మినిట్స్‌బుక్‌లో ఆ తీర్మాణం ఉందా లేదా అన్నది సరి చూసేందుకు నగరపంచాయతి అధికారులు ఎందుకు యత్నించడం లేదన్నది ప్రశ్న. నిబంధనల ప్రకారం గ్రామపంచాయతి తీర్మాణానికి లోబడి ఏదైనా నిర్మాణం సంవత్సరం లోపే పూర్తి చేయాలి. లేకుంటే ఆ తీర్మాణాన్ని పొడిగించుకోవాలి అలాంటిదేమీ లేకుండానే 22 సంవత్సరాల క్రితం తమకు పంచాయతి పాలకవర్గం ఆభూమిని ఇచ్చినట్లు తీర్మాణం కాపీ చూపిస్తే కమీషనర్ ఎందుకు వౌనంగా ఉంటున్నాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా దాదాపు 10 లక్షల రూపాయల విలువ చేసే పంచాయతి స్ధలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తి నుండి స్ధలాన్ని స్వాధీనం చేసుకొని పంచాయతి అవసరాల కోసం వినియోగించాలని పలువురు కౌన్సిలర్లు, ప్రజలు కోరుతున్నారు.
కబ్జాకు గురైన స్ధలాన్ని స్వాధీనం చేసుకుంటాం: కమీషనర్ స్వామినాయక్
దేవరకొండ పట్టణం లోని పాతపెట్రోల్ బంక్ ఎదురుగా వృద్దాశ్రమం ఎదురుగా ఉన్న ఖాళీస్ధలం నగరపంచాయతిదేనని కమీషనర్ స్వామినాయక్ చెప్పారు. ఆ స్ధలాన్ని కొంత మంది కబ్జా చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాపారులకు నోటీస్‌లను జారీ చేశామని చెప్పారు. వరుసగా సెలవులు రావడంతో సదరు వ్యాపారి నగరపంచాయతి స్ధలంలో నిర్మాణాలను చేసి ఉంటారని ఆయన చెప్పారు. ఆ స్ధలంలో చేపట్టిన నిర్మాణాలను తొలగించి నగరపంచాయతి స్ధలం అని బోర్డును పెడుతామని ఆయన చెప్పారు. 1993 లో ఆస్ధలం తమకిచ్చారంటూ వ్యాపారులు చూపిస్తున్న తీర్మాణం ఎట్టి పరిస్ధితుల్లోనూ చెల్లదని ఆయన స్పష్టం చేశారు.