అంతర్జాతీయం

కాబూల్ రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, మే 31: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం భయంకరమైన ఉగ్రదాడి జరిగింది. విదేశీ దౌత్యకార్యాలయాలు ఉండే వీధిలో ఉగ్రవాదులు అతి తీవ్రమైన ట్రక్ బాంబును పేల్చటంతో దాదాపు 80మంది మృత్యువాత పడ్డారు. మూడు వందల ఇరవై మందికి పైగా గాయపడ్డారు. ఉదయం 8.30గంటలకు జాన్‌బాఖ్ స్వేర్ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో నిండి ఉన్న ఒక ట్రక్‌తో ఆత్మాహుతి దళ సభ్యుడు వచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడు ధాటికి వందల మీటర్ల విస్తీర్ణంలో ఛిద్రమైన శరీరాలు విసిరేసినట్లు పడిపోయాయి. భారత దౌత్య కార్యాలయంతో సహా పలు విదేశీ దౌత్య కార్యాలయాల కిటికీలు, తలుపులు ఈ బాంబు ధాటికి పగిలిపోయాయి. డజన్లకొద్దీ కార్లు నామరూపాలు లేకుండా ధ్వంసమయ్యాయి. బాంబు పేలుడుతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా పొగ కమ్ముకునిపోయింది. పాఠశాలలకు వెళ్లే బాలికలు భయంతో వణికిపోయారు. ఆదుకునేవారు లేక క్షతగాత్రుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎవరిని లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పూనుకున్నారో తెలియనప్పటికీ, బాధితులు తమ వారికోసం అల్లాడుతున్న దృశ్యాలు పలువురిని కలచివేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతాలోపం ఈ దాడితో మరోసారి స్పష్టంగా బయటపడింది. చొరబాటుదారులను తిప్పి కొట్టడంలో మిలటరీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న దాడులు, మరణాలు సైన్యాన్ని ఏం చేయాలో పాలుపోని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. సైన్యం పట్టు సడలుతుండటంతో పాటు దేశంలో మూడో వంతు భాగం ప్రభుత్వ నియంత్రణలో లేకుండా పోయింది. శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు సమయం పట్టడంతో పేలుడు జరిగిన గంటల తరువాత కూడా అంబులెన్సులు ఘటనాస్థలంలోనే ఉండిపోయాయి. ‘‘దురదృష్టవశాత్తూ చనిపోయిన వారి సంఖ్య 80కి చేరింది. మహిళలు, పిల్లలతో కలిపి కనీసం 320మంది గాయపడ్డారు’’ అని ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాహీద్ మజ్రో తెలిపారు. కనీసం 50 వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు స్పష్టం చేశారు. ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్ వ్వారా తెలియజేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల జరిగిన పలు దాడులకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్( ఐసిస్) బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై మాత్రం ఐసిస్ స్పందించలేదు. ఇద్దరు జపాన్ దౌత్యకార్యాలయ సిబ్బంది ఈ పేలుడులో స్వల్పంగా గాయపడ్డారు.
మనవాళ్లు క్షేమం
కాబూల్ పేలుడు ఘటన భారత దౌత్యకార్యాలయానికి కేవలం వందమీటర్ల దూరంలో జరిగింది. అయితే అక్కడ మనవాళ్లంతా క్షేమంగా ఉన్నారని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత దౌత్యవేత్త మన్‌ప్రీత్ ఓరా ఈ పేలుడుపై స్పందించారు. ‘‘మన దౌత్యకార్యాలయానికి 100మీటర్ల దూరంలోనే పేలుడు జరిగింది. అయితే మా కార్యాలయ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. పేలుడు మాత్రం చాలా తీవ్రమైంది. మన భవనం కూడా చాలా వరకు దెబ్బతిన్నది.’’ అని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘‘కాబూల్‌లో ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం.’’ అని మోదీ ట్విట్టర్ పోస్టులో వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్న శక్తులన్నింటినీ ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.