నెల్లూరు

చెవిలో పువ్వు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అబ్బ! ఆపరా బాబు నీ సుత్తి!’’
నాకేసి నమిలి మింగేసేలా చూస్తూ కృష్ణమూర్తి అలా అంటుంటే ఒళ్లు మండిపోయింది నాకు.
మండదామరి?!
పోనీలే స్నేహితుడు కదాని, వాడి బాగుకోరి బోల్డంత ఎనర్జీ వేస్ట్ చేసుకుని నోరు నొప్పెట్లేలా హితబోధ చేస్తే.. వెధవకది సుత్తిలా అనిపించిందంటే - ఒళ్లు మండకుండా ఎలా ఉంటుంది?
‘‘్ఛ! నీకు చెప్పినా ఒకటే - ఆ గోడకి చెప్పినా ఒకటే..’’ అన్నాను.. బూటు కాలితో నేలను తన్నుతూ.
నిజానికి నేలని కాదు, ఆ బూటుకాలితో వాడినే తన్నాలసలు.
లేకపోతే ఏంటి? నువ్వు పులినోట్లో తలదూర్చబోతున్నావురా అని చెబుతుంటే - జాగ్రత్తపడాల్సిందిపోయి ఆ పెడసరితనం ఏంటి?
ఆ కోమలి జోలికి పోయినందుకేగా రమేష్ గాడికి మూతిపళ్లు రాలాయ్! ‘కోమలీ! ఐ లవ్ యూ’ అన్నందుకేగా కామేశ్వరర్రావ్ గాడి చెంప పదిమందిలో పేలిపోయింది. ‘అందమంటే నువ్వే.. ఆనందమంటే నువ్వే..’ అంటూ ఆ కోమల్ని చూసుకుని రాగం తీసినందుకేగా చిదంబరం గాడి ముఖం చట్నీ అయిపోయింది. ఇవన్నీ తెలిసుండి కూడా.. ఇప్పుడు వాడింత దుస్సాహాసానికి పూనుకోబోతున్నాడూ అంటే.. అసలు వాడికి మతి అనేది ఉందనుకోవాలా? పోయిందనుకోవాలా?
కోమలిది మతిపోగొట్టే అందమే.. నిజమే.. కానీ, అలా మతిపోగొట్టుకుని ఆమె జోలికి పోయిన వాళ్లందరికీ ఎలాంటి దుర్గతి పట్టిందో తెలిసి కూడా.. వాడిపుడు కొరివితో తలగోక్కోబోతున్నాడూ అంటే.. నోడౌట్.. ఏదో పొయ్యేకాలం వచ్చింది వెధవకి..
కోమలి మా కాలేజీ బ్యూటీ! కళ్లు చెదరగొట్టేంత అందంతో పాటు ఒళ్లు జలదరింపజేసేంత కరుకుదనం కూడా ఉంది ఆమెలో... ఆమె దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎంతటి వారికయినా పరాభవం తప్పదు గాక తప్పదు.
ఆ సంగతి కృష్ణమూర్తికీ తెలుసు.
మరి తెలిసితెలిసి గోతిలో ఎందుకు దిగబోతున్నాడో నాకు తెలిసి చావటం లేదు.
ఓ గంట క్రితం...
మా టేబుల్ మీదున్న డిక్షనరీలోంచి ఏదో కాగితం బయటకి తొంగి చూస్తూంటే - కుతూహలం కొద్దీ ఏమిటని దాన్ని ఇవతలకి లాగానే్నను.
అప్పుడు కృష్ణమూర్తి రూమ్‌లో లేడు. బ్లేడు కొనుక్కురావటానికి బయటికి వెళ్లాడు.
ఆ కాగితాన్ని మడతలు విప్పి చూసేసరికి మతిపోయినట్టనిపించింది నాకు.
ఎందుకంటే - అదొక లవ్‌లెటరు.. ఏ సరోజకో, శ్యామలకో, షర్మిలకో, మంజులకో రాసింది కాదు... కోమలికి రాసిన లవ్ లెటరు..
పరాయివాళ్ల ఉత్తరాలు చదవటం సభ్యత కాదని తెలిసినా.. గాడిదగుడ్డు.. ఎవరు పాటిస్తున్నారు?
‘‘ప్రియమైన కోమలీ!..
నిన్న రాత్రి నువ్వు నా కలలోకొచ్చి ఎంత అల్లరి చేశావో తెలుసా? తెలిసే ఉంటుంది..అల్లరి చేసింది నువ్వే గదా!
నా గుండెలనిండా నువ్వే నిండి ఉన్నప్పుడు కల్లోకి రావటంలో ఆశ్చర్యం ఏముందిలే కానీ.. ఒక చిన్నముద్దు అడిగినా ఇవ్వలేదు నువ్వు.. నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఏమ్మా? కల్లోనే కదా? ఏం? ఒక్క ముద్దిస్తే అరిగిపోతావా? కరిగిపోతావా?’’
నేనంతవరకే చదివాను.
ఎందుకంటే.. మధ్యలో కృష్ణమూర్తి బ్లేడు కొనుక్కుని వచ్చేశాడు. నేను కంగారుగా ఆ ఉత్తరాన్ని మళ్లీ డిక్షనరీలో దోపేస్తుంటే - అది కాస్తా కృష్ణమూర్తి కళ్లబడిపోయింది.
‘‘ఏంట్రా... చదివేశావా ఆ ఉత్తరాన్ని?’’ అన్నాడు కాస్త కోపంగానే.
నాకెందుకో గానీ తప్పు చేసిన ఫీలింగ్ కలగలేదు...
‘‘మొత్తం చదవలేదులే గానీ, నీకిదేం పొయ్యేకాలంరా? దొరక్క దొరక్క నీకూ ఆ కోమలే దొరికిందా ప్రేమించటానికి? ఊర్కే సరదాకి రాసిపెట్టావా, లేక నిజంగానే ఆమెకు ఇవ్వాలనుకుంటున్నావా? ఆమె జోలికి పోవటం ఎంత డేంజరో తెలిసుండి కూడా, నీకీ పాడుబుద్ధి ఎలా పుట్టింది?’’ అంటూ తగులుకున్నాను.
‘‘సరదాకి రాసి పెట్టడానికి నాకేం పనీపాటా లేవనుకుంటున్నావా? సరదాక్కాదు.. నిజంగానే రాశాను.. ఐ లవ్ హర్..’’ అన్నాడు వాడు తొణుకూబెణుకు లేకుండా..
‘‘ఏం - నీక్కూడా ఆ రమేష్ గాడిలా పళ్లు రాలగొట్టించుకోవాలనుందా? ఆ కామేశ్వర్రావ్ గాడిలా చెంప పగలగొట్టించుకోవాలనుందా? ఆ చిదంబరంగాడిలా ముఖం చట్నీ చెయ్యించుకోవాలనుందా?’’ అంటూ బెదిరించాను.
‘‘కోమలి నన్నలా ఎన్నటికీ చెయ్యదు..’’ అంటూ బింకంగా తలెగరేశాడు
‘‘ఏం? ఎందుకు చెయ్యదూ? నువ్వేమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డావా?’’ అన్నాను ఎకసెక్కంగా.
‘‘కాదు - అవనిగడ్డ నుండి ఊడిపడ్డాను.. నా ప్రియాతి ప్రియమైన కోమలి ననే్నమి చెయ్యదు..’’
వాడిలోని బింకం ఏమాత్రం సడల్లేదు.
నాకు ఈడ్చిపెట్టి కొట్టాలనిపించింది వాడిని. లేకపోతే - అవనిగడ్డంటే అదేదో అమెరికా అయినట్లు బోడి ఫోజు.
‘‘తంతే అవనిగడ్డలో పడతావ్!’’ అన్నాను బెదిరిస్తూ
‘‘ఏదీ తన్ను చూద్దాం..’’ అంటూ బోర విడుచుకుని నిలబడ్డాడు.
‘‘నేను కాదు తనే్నది.. నీ బోడి ప్రేమలేఖని నువ్వు నిజంగా ఆ కోమలికి ఇవ్వాలేగానీ.. ఆమే తంతుంది నిన్ను..’’
‘‘నో.. కోమలి నా విషయంలో అలా ఎన్నటికీ ప్రవర్తించదు..’’
వాడి ధైర్యం ఏమిటో.. వాడి వ్యవహారం ఏమిటో, ఎందుకిలా సాగదీస్తున్నాడో - ఏం అర్థం కాలేదు నాకు.
‘నేను తేలుకొండీ దగ్గర కాలుపెడతాను.. అయినా అది నన్ను కుట్టదు..’ అని మనతో ఎవడైనా అంటే - వాడిని పిచ్చివాడిగా జమకట్టకుండా ఉండగలమా?
‘‘ఏంట్రా నీ పిచ్చివాగుడు? ఆ కోమలి ఎలాంటి కరోడా మనిషో తెలుసుండి కూడా ఎందుకలా అర్ధంపర్ధం లేకుండా వాగుతావ్? బుద్ధీ, జ్ఞానం, సిగ్గూ, శరమూ ఉన్నవాడెవడూ పోయిపోయి ముళ్లకంప మీద పడడు..’’ అంటూ ప్రారంభించి, రాజకీయనాయకుడి చేతికి మైకు అందితే ఎలా పేట్రేగిపోతాడో అలా చెలరేగిపోయానే్నను. అంటే - అంత సుదీర్ఘమైన ఉపన్యాసం (హితబోధ) చేశానన్న మాట.
కానీ, ఏంలాభం?
అదంతా వాడికి సుత్తిలా - వీరబాదుడులా అనిపించిందే తప్ప - వెధవకి ఏ కోశానా జ్ఞానోదయం కలగలేదు.
అంతేలెండి.. వినాశకాలే విపరీతబుద్ధిః అన్నారు పెద్దలు. పొయ్యేకాలం వచ్చినవాడిని ఎవరాపగలరు?
‘‘సరే నీ ఖర్మ అఘోరించు’’ అని ఊరకుండిపోయాను.
కాళ్లా వేళ్లా పడి వాడిని బ్రతిమాడాల్సినంత ఖర్మ నాకేం పట్టింది?
***
కృష్ణమూర్తి నా రూమ్మేటే గానీ, క్లాస్‌మేట్ కాదు.
కొమలిదీ, వాడిదీ మాత్రం ఒకే క్లాసు.
మర్నాడు సాయంత్రం...
‘‘కోమలికి నేనా ఉత్తరం పోస్ట్ చేసేశాన్రా..’’ అని వాడు చెబుతుంటే ‘‘ఏం నాయనా నేరుగా చేతికివ్వటానికి నీకు ధైర్యం చాల్లేదా?’’ అన్నాను రవ్వంత ఎగతాళిగా.
ఏదో అలా అన్నాడే గానీ, ఆ ఉత్తరాన్ని నిజంగానే వాడు పోస్ట్ చేసి ఉంటాడని అనిపించలేదు నాకు. నా దగ్గర వాడు హీరోయిజాన్ని ప్రదర్శించటానికి అలా కోస్తున్నాడేమో అనిపించింది.
‘‘్ధర్యం చాలకపోవటం కాదు.. కోమలికి నేనెప్పుడు ఉత్తరం రాసినా పోస్ట్ ద్వారానే పంపిస్తాను.. కోమలికి ఫోన్లూ గట్రా ఇష్టం ఉండదు. ఉత్తరాలయితే హాయిగా వెల్లకిలా పడుకుని చదువుకోవచ్చంటుంది. ఆ ఉత్తరాలు కూడా పోస్ట్‌లో పంపితేనే ఇష్టం తనకు, చేతికిస్తే ఒప్పుకోదు. చేతికివ్వను..’’ అని వాడు అంటుంటే - ఆ వెధవ నా చెవిలో పువ్వు పెడుతున్నాడని నాకు చాలా స్పష్టంగా అర్ధమైపోయింది.
కోమలికీ వాడికీ మధ్య ఎన్నాళ్లగానో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతున్నట్లుగా ఉంది వాడి బిల్డప్పు.
కానీ, నమ్మేయడానికి నేనేవన్నా వెర్రిపప్పనా? వెర్రి ఎధవనా?
‘‘ఓహో! అల్లాగా? అయితే కోమలికి నువ్వు నిన్న రాసింది ప్రథమ ఉత్తరం కాదన్నమాట! మీ మధ్య ఇంతకు ముందు నుంచే గ్రంథం నడుస్తోందన్న మాట!’’ అన్నాను కంఠంలోంచి కడవల కొద్దీ వ్యంగ్యాన్ని ఒలికిస్తూ.
‘‘అనుమానమా?! కావాలంటే కోమలి నాకు రాసిన ఉత్తరాలు కట్టలకొద్దీ ఉన్నాయ్.. చూపిస్తానాగు..’’ అంటూ చటుక్కున లేచి వెళ్లి, తన సూట్‌కేస్‌లో చెయ్యి పెట్టి, బట్టల క్రింద నుండి ఓ ఉత్తరాల కట్టని బయటికి తీశాడు కృష్ణమూర్తి.
‘‘చదువ్..’’ అన్నాడు - ఆ కట్టలోంచి ఓ రెండు ఉత్తరాల్ని ఇవతలికి లాగి నా చేతికి అందిస్తూ.
‘‘వద్దులే...’’ అన్నాను సంకోచంగా.
‘‘్ఫర్వాలేదులే.. చదువ్... నేను చదవమని ఇస్తున్నప్పుడు నీకు సంకోచం దేనికి?’’ అన్నాడు కృష్ణమూర్తి సిగ్గులేకుండా.
కుతూహలం మనసుని పురుగులా తొలిచేస్తుండటం వల్ల నేను మారు మాట్లాడకుండా - ఆ రెంటిలో ఓ ఉత్తరాన్ని మడతలు విప్పి అందులోకి దృష్టి సారించాను.
‘‘ప్రియమైన కృష్ణమూర్తి బావకి....
..........................
ఇట్లు
నీ మరదలు
కోమలి
కంటెంట్స్ జోలికి పోకుండా ఆశ్చర్యంతో నోరు తెరిచానే్నను.
‘‘ ఏంటీ? కోమలి నీ మరదలా?’’ అన్నాను కాస్త తేరుకున్నాక.
‘‘య్యా!’’ అంటూ కించిత్ గర్వంగా తల ఎగరేశాడు కృష్ణమూర్తి.
‘‘మరి నాతో ఎప్పుడూ చెప్పావు కాదేం? కాలేజీలో మీరిద్దరూ ఎప్పుడూ పలకరించుకోలేదేం?’’ అన్నాను కాస్త అనుమానంగా చూస్తూ.
‘‘నా కోమలి మన కాలేజీలో ఉన్న కరోడ కోమలి కాదు. ఈ అవనిగడ్డ అబ్బాయి కోసం అవనిగడ్డలోనే పుట్టి, ప్రస్తుతం కూడా అవనిగడ్డలోనే ఉంటున్న అన్నుమిన్న ‘‘మా మేనత్త కూతురు...’’ అంటూ విరగబడి నవ్వేశాడు కృష్ణమూర్తి.
ఆ నవ్వు - నా చెవిలో పువ్వుగా మారింది!

- కోలపల్లి ఈశ్వర్
చరవాణి : 8008057571
***

రచనలకు
ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

- కోలపల్లి ఈశ్వర్ చరవాణి : 8008057571