నెల్లూరు

రాంబాబు - బామ్మ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒరేయ్ వెధవకాన’’ అంటూ రాంబాయమ్మగారు వీపుమీద చరిచేసరికి ఉలిక్కిపడ్డాడు రాంబాబు. ‘ఏం చేస్తున్నావురా వెధవ నీకెన్నిసార్లు చెప్పానురా పొద్దునే ఆ తెల్లకాగితాలు టేబుల్ మీద వేసుకు కూర్చోవద్దని వెధవ... చవటా... ఛీ ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధిరాదురా’ అంటూ అపర కాళికలా విజృంభించింది రాంబాయమ్మ. ‘అబ్బ బామ్మ ఈ ఒక్కసారికే లేవే... ఇక రాయను గాక రాయను’ అంటూ బతిమాలుకున్నాడు బామ్మ గడ్డం పట్టుకుని రాంబాబు.
‘్ఛ వెధవ... ముప్పయ్యేళ్లు వస్తున్నా మీ మనవడికి పెళ్లికాలేందేమిటమ్మా.. అంటూ అందరూ నా మొహాన ఉమ్మేస్తున్నారు. నీకు చీమ కుట్టినట్లయినా లేదురా, ఎన్నిసార్లు చెప్పాలిరా ఒక్క పైసాకి పనికిరాని ఆ రచనలు చేయొద్దని? అంత సరదా అయితే ఉద్యోగం తెచ్చుకుని, రంభలాంటి పెళ్లాన్ని ముడేసుకుని ఓ మనవడిని నా మొహాన పడేసి ఏ తీరిక దొరికినపుడో ఒక కథో.. కాకరకాయో రాసేసుకో... అంతేకాని ఉద్యోగం లేకుండా ఇలా పొద్దునే్న కూర్చున్నావనుకో అట్లకాడతో వాతపెడతా జాగ్రత్త’ అంటూ తలమీద చెంగు లాక్కుని కూలబడింది రాంబాయమ్మ.
‘ఒరేయ్ సన్నాసి మొనే్నమన్నావు? ఒక కథకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది పదిహేను వేలు అన్నావు... కాని చివరికి అది అచ్చుకూడా కాలేదు. ఒక కాణీ విలువ చేయని ఆ కథలెందుకురా సన్నాసీ? చివరికి నీ పెళ్లికాకుండా కూడా అడ్డుపడుతున్నాయిరా ఆ తెల్లకాగితాలు... ఛీ వెధవన్నర వెధవ’ అంటూ రాగాలు తీసింది రాంబాయమ్మ.
‘ఒరేయ్ పాతిక ఎకరాల మాగాణిరా.. చివరికి నీ దయవలన పదెకరాలు అయింది. నీ వయసేమో ముప్పయి అయింది. చదువు అయిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా పెళ్లిలేదు ఉద్యోగం లేదు. నీకంటే ఐదేళ్లు చిన్నోడు ఆ పురుషోత్తమ్‌గారి అబ్బాయి .. సాల్వేడ్ కదూ వాడిపేరు... బంగారం లాంటి భార్య సింగారం చిందులేసే బాబు... బండిమీద దర్జాగా పోతుంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారు. ఉద్యోగం పురుష లక్షణంరా వెధవా! మొన్నామధ్య నీ కథ ప్రింట్ అయిందని, పేపరు మిస్ అయిందని నానా హంగామా చేసి లాప్‌టాప్‌లో నీ కథ ప్రింట్ తీసుకుంటే ఆ ప్రింటు సరిగ్గా రాలేదని ఒకటే నస. నీవు అన్నం తినకుండా మమ్మల్ని తినకుండా పస్తులు పెట్టేసావు కదరా? ఐనా నీ కథ ప్రింట్ చేస్తున్నట్లు తెలపని వాళ్లకి నీవెందుకురా కథలు రాయడం?’ అంటూ మెటికలు విరిచింది రాంబాయమ్మ. ‘నేను రాయకపోతే నాలాగా రాసేవాళ్లు సవాలక్ష బామ్మా... వాళ్లందరి పేర్లు పత్రికల్లో చదువుతుంటే నాక్కూడా రాయాలని దుగ్ధ’ అన్నాడు రాంబాబు.
‘ఒరేయ్ నీకు దుగ్ధగా ఉంటే ముందు ఉద్యోగం చూసుకుని పెళ్లిచేసుకుని ఒక మునిమనవణ్ణి నా మొహాన పడెయ్యరా... ఆతర్వాత రాసుకోరా నీ పనికిమాలిన కథలు. నామాట కాదని ఈ కథ తర్వాత మళ్లీ కథలు రాసావో నేను ఏ కాశీకో లేదా రామేశ్వరానికో పోయి ఆ పదెకరాలు మన కరణంతో అమ్మించేసి దానధర్మాలు చేసేసి నిన్ను బికారి వెధవను చేసేస్తాను జాగ్రత్త! ఇది తథ్యం!’ అంటూ వీధిలోకెళ్లిపోయింది రాంబాయమ్మ.
ఏటూ తోచలేదు రాంబాబుకి. నిజమే కాసులివ్వని కళలెందుకు? తనకుమాలిన ధర్మం ఎందుకు? కనీసం ప్రింట్ అయిందని తెలపని పత్రిక యాజమాన్యం మీద తను పడిన నానా హైరానా గుర్తుకువచ్చి గొంతువరకు కోపం వచ్చింది రాంబాబుకి. ఐనా ఒకప్పుడు రచయిత అంటే ఎంత గౌరవం కాని, ఇపుడో పైసా సంపాదన లేని పని అంటూ ఈసడిస్తున్నారు. చివరిగా తాను రాసిన కథను కవర్లో పెట్టి అంటించి డబ్బాలో పడేసివచ్చాడు. కడుపులో ఆకలి నకనకలాడింది. మొన్న సంబంధం తీసుకుని వచ్చిన సాంబశివరావు చేసిన ఎద్దేవా గుర్తుకు వచ్చేసరికి నిజంగా బామ్మ ఎందుకంత ఫైర్ అయిపోతుందో అర్ధమైంది.
అమ్మాయి చెప్పిందంట ‘అబ్బాయి పొట్టిగా నల్లగా ఉన్న నాకు అభ్యంతరం లేదు కాని పనీపాట లేకుండా కథలు వ్రాసుకునే వాణ్ణి చేసుకోను గాక చేసుకోను... ఏ రిక్షావాడితోనో పారిపోతాను జాగ్రత్త ఈ పెళ్లి చేస్తే...’’ అంటూ వార్నింగిచ్చిందట.
ఆ మాటలు విన్నప్పటి నుండి బామ్మ ఇలా ప్రవర్తిస్తోంది. ఐనా బామ్మ తప్పేముంది. ఈ వయసులో హాయిగా ఉండాల్సింది పోయి తనకు ముప్పూటలా వండిపెట్టాలంటే ఎంత నరకం? కౌలుకిచ్చిన మాగాణికి వచ్చే ఆదాయం తిండికి పోను అంతంత మాత్రమే. ఏదో తలదాచుకోడానికి కాస్త స్వంత కొంప ఉంది కాబట్టి సరిపోయింది లేకుంటే ఏంకాను?
ఔను బామ్మ మాట చద్దన్నం మూట - సీన్సియర్‌గా అటక ఎక్కించాడు తెల్లకాగితాలు, కలం అన్నీను. అప్పట్నుండి ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఇలా కష్టపడగా.. పడగా డి ఎస్సీ ప్రకటన చూసి ప్రిపేర్ అయి వ్రాసేసి వచ్చాడు. ఓ శుభముహూర్తాన ఉద్యోగం పక్క పల్లెటూర్లో వచ్చింది. బామ్మ సంతోషానికి అవధులే లేవు. ‘పిల్లాడు రూట్లోకొచ్చాడు. అనుకుని ఇంకెవరు అనమంటారో అననీండి’ చెబుతాను అంటూ కొంగు దోపింది.
రంభ లాంటి అమ్మాయి కాకపోయినా చామనఛాయతో ఉన్న స్నిగ్ధజానకితో పెళ్లయిపోయింది రాంబాబుకి. రోజూ ఉద్యోగం నుండి వచ్చేసరికి సాయంత్రం అయ్యేది. ఎలా రాత్రవుతుందో ఎలా పగలౌతుందో తెలియకుండా కాలం దొర్లిపోతోంది రాంబాబుకి. స్నిగ్ధ కూడా హైకోర్టులో టైపిస్టు ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ ఉద్యోగస్థులు కావడంతో అసలు ఒక సెకను కూడా దొరకడం లేదు రాయడానికి రాంబాబుకి.
మునిమనమడు పుట్టలేదు కాని మునిమనమరాలు పుట్టింది. ఏదో ఒకటి ఆ రాముడి దయ అంటూ తూర్పు తిరిగి దణ్ణం పెట్టుకుంది రాంబాయమ్మ. మరో ఏడాది గడిచేసరికి ఓ అబ్బాయి పుట్టాడు. ‘చాల్రా అబ్బాయి మీ తాతయ్య పుట్టేశాడు’ అంటూ సంతోషంతో గంతులేసింది రాంబాయమ్మ.
ఇప్పుడు ఎవరడిగినా సంతోషంతో తన మనవడి కుటుంబం గురించి దర్జాగా చెబుతుంది రాంబాయమ్మ. మరో పదేళ్లు గడిచేసరికి రాంబాయమ్మ గుటుక్కుమంది. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. పిల్లది ఎదిగింది, పిల్లాడు ఏడులోకి వచ్చాడు. వాళ్ల చదువులు, పెళ్లిళ్ల కోసం డబ్బులు వెనకేస్తూ రోజులు నెలలు సంవత్సరాలు దొర్లించేస్తున్నాడు రాంబాబు.
‘ఏం రాంబాబు గారు? మీరు కథలు కవితలు వ్రాసేవారు కదా? ఇపుడు వ్రాయడం లేదా?’ అంటూ ఎవరైనా ఆరాతీస్తే ‘లేదండి బొత్తిగా టైము దొరకడం లేదు’ నవ్వుతూ తప్పించుకుంటున్నాడు రాంబాబు.
ఓ శుభముహూర్తాన రాంబాబు రిటైర్డ్ అయ్యాడు. ఇప్పుడు ఎంతో తీరిక దొరికింది రాంబాబుకి. కానీ, రాంబాబు వ్రాసే కథలు ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అయ్యాయి పత్రికలకు. ‘ఏమండీ బొత్తిగా మీ కథల్లో పసలేదండి. ఈ తరం రచయితలని గమనించండి’ అంటూ ఒక పత్రిక యజమాని సలహా కూడా ఇచ్చాడు. కానీ ఈ తరం రచయితల్లాగా రాయడం ఎలాగో బుర్రలు బద్దలు కొట్టుకున్నా రాంబాబుకి అర్థం కాలేదు. రాంబాబు అవస్థ చూసి వాళ్ల ఇంట్లో వాళ్లంతా ఒకటే నవ్వులు! బామ్మ ఉంటే ‘‘ఒరేయ్ మళ్లీ మొదలుపెట్టావూ’’ అంటూ వీపు చరిచేదేమో! ‘బామ్మ పుణ్యమా అని తన జీవితం ఒక గాడిన పడింది అంతేచాలు’ అనుకుని తృప్తిపడ్డాడు రాంబాబు... తృప్తిగా వెళ్లిపోయిన బామ్మను తలచుకుని.

- డాక్టర్ ఎం. ఎస్. జ్ఞానేశ్వర్ మదనపల్లె, చరవాణి : 9440729701