కథ

కీర్తివంతుడి కొలువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో
ఎంపికైన రచన
**
ఉదయం లేచీ లేవగానే - ‘ఆ సురేష్‌గాడి పెళ్లాం వాకిట్లో పొద్దున్న నుంచే కూర్చుంది. మీతో ఏదో మాట్లాడాలంట’ అంటూ చెప్పింది మా ఆవిడ.
‘నాతో ఏం మాట్లాడుతుంది?’ అన్నాను చిరాగ్గా.
‘ఏముంది? ఆ సురేష్‌గాడు ఏదో వెధవ పని చేసుంటాడు. ఆ తరువాత వాడూ వాడి పెళ్లాం మిమ్మల్ని కలిసి బ్రతిమిలాడి ఓనర్‌గారి నచ్చజెప్పడం మామూలే కదా. కాస్త ఆ దేవుడి పటాలు చూసి బయటకు వెళ్లండి’ అంటూ చెప్పి ఆమె లోపలికి వెళ్లిపోయింది.
నేను షర్ట్ వొంటికి తగిలించుకుని వాకిట్లోకి అడుగుపెట్టాను.
ఎప్పటిలా గుమ్మం ముందు దీనంగా, దిగులుగా కూర్చుని నా కోసం ఎదురుచూస్తోంది పార్వతి. ఆమె మా సురేష్‌గాడి భార్య. తెల్లటి ముద్ద మందారానికి చిటికెడు పసుపు అద్దినట్లుండే చక్కని మోముతో ఉంది. చెమట పట్టడం వలన ఆమె పెట్టుకున్న కుంకుమ బొట్టు మా సురేష్‌గాడి స్థితికి ప్రతీకగా జావగారుతున్నట్టుగా ఉంది.
నన్ను చూడగానే వినయంగా లేచి నిలబడబోయింది. ‘కూర్చోమ్మా.. కూర్చో’ అంటూ ఆమెను వారించి పక్కనే ఉన్న కొయ్య కుర్చీలో కూర్చున్నాను. డైరెక్ట్‌గా విషయంలోకి వస్తూ ‘ఓనరు గారు చాలా కోపంగా ఉన్నారు పార్వతీ.. ఏం చెప్పినా వినడం లేదు’ అన్నాను.
‘అలా అనకండి బాబూ.. మీరే దయ చూపాలి’ అంటూ చేతులు జోడించింది.
‘నేనేం చెయ్యను పార్వతీ. ఓనర్‌కి ప్రతిసారీ సర్దిచెప్పడం నాకైనా వీలు కాదు కదా. వాడికీ, నీకూ ఏమిటి సంబంధం అంటూ నన్ను నిలదీస్తాడు. అయినా ఓనరుగారి సొంత కారులో వీడు పాసింజర్లను ఎక్కించడం ఏమిటి? అదేమయినా అద్దె కారా.. ఎలా సర్ది చెబుదామనుకున్నాడు?’ అన్నాను కోపంగా.
‘అతని సంగతి మీకు తెలియనిదేముంది బాబూ.. ఆ మందు నీళ్లకు కక్కుర్తిపడి అలా చేసుంటాడు. మీరే కాపాడాలి. మీరు నచ్చజెబితే అయ్యగారు సెమిస్తారయ్యా. మళ్లా అలాంటి పనులు సేయకుండా నేను చూసుకుంటాను బాబూ’ అంటూ ప్రాధేయపడసాగింది.
‘ఇలా చాలాసార్లు చెప్పావులే పార్వతీ. కానీ వాడు విన్నాడా? నీవు మాత్రం వచ్చి నన్ను బ్రతిమిలాడుతావు. ఏరికోరి వాడ్ని పెళ్లి చేసుకున్నావు కదా అనుభవించు’ అంటూ విసుగ్గా లేవబోయాను.
‘అట్టా అనకండయ్యా.. రాత్రంతా భయంతో అస్సలు పడుకోలేదు బాబూ. నేనూ తిట్టిపోశాను. తాగినపుడు కోపం వచ్చినా మామూలపుడు ఆ ముఖం చూస్తే జాలేత్తాది. ఎవరే పని సెప్పినా మేకలా తలొంచి చేస్తాడు కదా బాబూ - ఈసారికి కనికరం సూపండయ్యా’ అంటూ కాళ్ల మీద పడబోయింది కన్నీళ్లతో.
‘సర్లే.. సర్లే పొద్దునే్న గుమ్మం దగ్గర ఏడవకు.. అమ్మగారు చూస్తే కోప్పడతారు. ఆ సురేష్‌గాడ్ని ముందు అయ్యగారి దగ్గరకు వెళ్లి క్షమించమంటూ కాళ్ల మీద పడమని చెప్పు. తరువాత నేను ఏదో చెబుతాను’ అంటూ లోపలకు వెళ్లబోతున్న నేను ఏదో స్ఫురించి - ‘ఇదిగో పార్వతీ.. సురేష్‌గాడితో నువ్వు కూడా వెళ్లు’ అంటూ చెప్పి ఇంట్లోకి వెళ్లాను.
పార్వతితో ఏదో సర్ది చెప్పేశాను కానీ - కృష్ణయ్యగారితో ఈ రోజు సురేష్‌కు జరగబోయే పరాభవం గురించి తలచుకోగానే మనసు చివుక్కుమంది.
కృష్ణయ్యగారు అని అందరితో పిలువబడే మా కాంట్రాక్టర్‌గారి వద్ద నేనూ, మరో ఎనిమిది మంది వరకూ ఆయన ఆఫీసులో పని చేస్తుంటాం. సురేష్ అనబడే ఈ ముప్పై ఏళ్ల కుర్రాడు ఆయన కారు డ్రైవర్. ఇతను కాక మరో ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నారు. వారు సైట్ పని మీద తిరుగుతారు. కృష్ణయ్యగారితో ఏదో బీరకాయ పీచు సంబంధం కలిగి ఉన్నందున నేను ఆయన ఆఫీసు వ్యవహారాలు, కొండొకచో ఆతని పర్సనల్ పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
వర్కర్స్‌కు ఎలాంటి స్వేచ్ఛ ఉండకూడదనుకునే చాలామంది యజమానుల్లానే మా కృష్ణయ్యగారు కూడా వర్కర్స్‌తో ఎంత స్ట్రిక్ట్‌గా ఉండాలో ముందే స్కెచ్ గీసుకుని, ఆ విధంగా ఉండటానికే ప్రయత్నిస్తూ, తనను చూసి అందరూ భయపడాలని భావిస్తుంటాడు. భయపెట్టడం, బాధ పెట్టడం అతనికో వేడుక. ఆయన నీతిబోధలు, నిబంధనలు మాకు బలవంతంగా వినిపిస్తుంటాడు. అవి ఒక్కోసారి శృతి మించడం కూడా జరుగుతుండటంతో మా వర్కర్స్‌లో ఒక జోక్ చెలామణీలో ఉండేది. అదేమిటంటే - కృష్ణయ్య దగ్గర జీతం తీసుకునేది పని చేయడానికి కాదు. కృష్ణయ్య సోది భరించడానికి అంటూ.
నిజమే - ఆయన చెప్పుకునే తీరులో తమ కుటుంబం చాలా కీర్తివంతుల కుటుంబం అనీ, తాము చాలా పద్ధతిగా జీవిస్తుంటామంటూ, ఎలాంటి తప్పిదాలను క్షమించే ప్రశే్న లేదంటూ ఆయన చెప్పే సొంత డబ్బా వినీవినీ మా కందరకూ మెదడులో నాళాలు చిట్లిపోయేటంత తలనొప్పి తన్నుకు వచ్చినా మాకు తప్పదు కదా. మేం ఆయన వద్ద సేవకులం. ఆయన నంది అనమంటే నంది అనాలి, పంది అనమంటే పంది అనాలి. అది మా కీర్తివంతుడి కొలువు మరి.
ఇలాంటి పరిస్థితుల్లో మా సురేష్‌గాడు మా ప్రాణాలకు సంకటంగా తయారయ్యాడు. మంచివాడే కానీ కొంచెం తాగుబోతు. మా కృష్ణయ్యను కారులో తీసుకువెళ్లేటపుడు, ఆయన వేసే హేమర్‌కు పిచ్చెక్కిపోయే వాడు అలా తాగేస్తాడని కొందరంటారు. మా కృష్ణయ్యగారు అతన్ని ఉపయోగించుకునే విధానం మరీ దారుణంగా ఉంటుంది. కారు డ్రైవర్ కావడం వలన ఇంట్లో అమ్మగారి షాపింగ్‌లకు మొదలుకుని, కృష్ణయ్యగారి అతిథులకు కావాల్సిన సరుకులు మోసుకురావడం, పిల్లలను కానె్వంట్‌లో దింపి మళ్లీ ఇంటికి తీసుకురావడమే కాదు - మా కృష్ణయ్యగారు ఏదైనా పని మీద ఎవరి వద్దకైనా వెళ్లిన సమయంలో - అవతలి వారికి ఆయన స్వోత్కర్షలు వినిపిచడానికి కృష్ణయ్య కూర్చుంటే, ఆయన కోసం గంటలు వెయిట్ చేయాలి. అర్ధరాత్రీ, అపరాత్రీ అనకుండా రెస్టారెంట్‌లకు, బార్‌లకు, పేకాట క్లబ్బులకు, పబ్‌లకు వెళితే నిద్ర మానుకుని ఆయనొచ్చే వరకూ కాపలా కాయాలి.
అసలు పనివాళ్లను ఖాళీగా ఉంచకూడదనుకుంటూ ఆయన చేసే పనులే చాలా చిత్రంగా ఉండేవి.
మా కాంట్రాక్టర్‌గారికి ఊళ్లో కూరగాయలు పండించే నారుమడి, కొంత అరటి తోట ఉంది. ఎప్పుడైనా వర్కర్స్ టిఫిన్ కోసం ఓ పది రూపాయలు అడిగినా ఇవ్వడానికి గింజుకు చచ్చే మా కృష్ణయ్య ఇంచుమించు పది మైళ్ల దూరంలో ఉన్న తన బావగారికి కారులో ఓ అయిదారు అరటికాయలను జాగ్రత్తగా అందించి రమ్మంటాడు. అయిదారు అరటి కాయల ధర ఇరవై రూపాయలు ఉంటే ఇతను రెండొందల రూపాయలతో పెట్రోల్ కారుకు పోయించి, సురేష్‌ను ఇచ్చి రమ్మంటాడు.
ఈ విషయానే్న ఎవరయినా చెప్పడానికి ప్రయత్నిస్తే - ‘మన తోటలో కాయలురా అవి. మనం ఇస్తే వాళ్లు మహా ఇష్టంగా తింటారు’ అంటూ మరో ఉపన్యాసం ఇస్తాడు. చివరకు తోటకూర కట్టలను కూడా అలానే తనకు తెలిసిన వాళ్ల ఇళ్లకు సరఫరా చేస్తూ - తమ తోటలో తోటకూర నవనవ లాడుతుందని, అలాంటి కూర మరెక్కడా దొరకదని చెప్పుకుంటాడు. అలా చేయడం వలన తనకు బంధువుల్లో ఎనలేని కీర్తి తెచ్చి పెడుతుందని ఆతని వాదన. అసలు రీజన్ ఏమిటో మాకందరకూ తెలుసు. అది పనివాడిని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పని చెప్పాలన్నదే అతని కానె్సప్ట్. ఇది ఆయనలో ఒక కోణం.
ఇక రెండవ కోణానికి రేపు సురేష్ బలి కాబోతున్నాడన్న విషయం గుర్తుకు వచ్చి మనస్సు చివుక్కుమంది. రాత్రి సురేష్ గురించి కృష్ణయ్యతో మాట్లాడాక నాకు అర్థమయింది ఇదే. ఆ పొరపాటు చిన్నదే కాని కృష్ణయ్య దృష్టిలో మహాపరాధం.
‘మన కారులో ఆ సురేష్‌గాడు పాసింజర్లను ఎక్కించి డబ్బు చేసుకుంటున్నాడటరా!’ అంటూ ఉక్రోశంగా చెప్పాడు కృష్ణయ్య.
‘డ్రైవర్ అన్న ప్రతీవాడు ఎంతో కొంత అలాంటి పని చేయడం సాధారణమే కదండీ’ అన్నానే్నను.
అంతే అతను తోకతొక్కిన త్రాచులా కస్సుమంటూ లేచి, ‘ఏంటి? మన కారులో ప్రతీ అణా, కాణీ గాన్ని ఎక్కించేస్తే మన ప్రెస్టేజీ ఏముంటుందిరా? మా మావగారు నాకు గౌరవంగా కొనిచ్చిన కారు అది. అది వాడికీ తెలుసు. నా గౌరవాన్నీ, ప్రతిష్టను అలా గంగలో కలిపే పని చేస్తాడా?! రేపు వాడికి గట్టిగా బుద్ధి చెబుతాను. చంపేస్తాను వాణ్ణి. రేపు పది గంటలకల్లా మన పనోళ్లందరినీ ఆఫీసులో ఉండమని చెప్పు. నన్ను మోసగిస్తే ఏమవుతుందో అందరికీ తెలియాలి’ అంటూ నాకు ఆర్డరేసి వెళ్లిపోయాడు.
కనుక ఈ రోజు సురేష్‌గాడికి పరాభవం తప్పదు.
ఈ విషయం రాత్రే మరొక వర్కర్ ద్వారా తెలుసుకున్న సురేష్ భయపడి తన భార్యను కృష్ణయ్యగారికి నాతో నచ్చజెప్పేలా చేయమని పంపించాడులా ఉంది.
కానీ ఎవరైనా బ్రతిమిలాడే కొద్దీ రెచ్చిపోయే మనస్తత్వంగల మా కృష్ణయ్యగారు నేను చెప్పడం వలన శాంతిస్తాడనుకోవడం వారి అమాయకత్వమే అవుతుంది. పోనీ సురేష్‌ను ఎక్కడికైనా పారిపొమ్మని సలహా ఇద్దామన్నా సురేష్ వాళ్లది ఊళ్లోనే సొంతిల్లు. పైగా ఊరంతా తెలిసిన మా కృష్ణయ్యగారికి ఏ విషయం అయినా క్షణాల్లో తెలిసిపోతుంది. కనుక నేను చేయగలిగేది అంటూ ఏమీ లేదని తెలిసి, కనీసం ఆడమనిషి బ్రతిమిలాడితే ఏదైనా కనికరిస్తాడేమోనన్న ఆశతో పార్వతిని కూడా బ్రతిమలాడమని సలహా ఇచ్చి ఊరుకున్నాను.
* * *
కృష్ణయ్యగారి కచేరీ ప్రారంభమైంది.
పాత సినిమాల్లో కొయ్య కుర్చీపై కాలు మీద కాలేసుకున్న జమీందారు పోజులో - కళ్లల్లో నిప్పులు కక్కుతూ అందరి వైపు చూస్తున్నాడు కృష్ణయ్య.
అతని ఎదురుగా చేతులు కట్టుకుని దీనంగా, భయంభయంగా నిలబడి ఉన్నారు సురేష్, అతని భార్య పార్వతి. మిగతా వారంతా ఏం జరగబోతోందో అన్నట్టుగా చూస్తున్నారు.
కృష్ణయ్య పనివాళ్లను ఉద్దేశించి - ‘ఏరా ఇంతేసి జీతాలిచ్చి నేను మిమ్మల్ని పోషిస్తున్నది ఎందుకోసం..? నాకు విశ్వాసంగా ఉండి ఉంటారనే కదా’ అన్నాడు ఒక పనివాడ్ని ఉద్దేశించి.
‘అవున్సార్’ అన్నాడా పనివాడు.
‘మరి ఈ సురేష్‌గాడు ఏం చేశాడో తెలుసా? నా ఖరీదయిన కార్లో, ఊళ్లో పల్లెటూరి జనాల్ని అయిదు పది రూపాయలకు తిప్పుతూ నా కారును అద్దెకు తిప్పే కారు స్థాయికి దిగజార్చేశాడు. నేనూ.. నా కుటుంబం ఎక్కే కారు అలగా జనాలు కూడా ఎక్కుతుంటే ఇక నాకు విలువ ఎక్కడుంటుంది. వీణ్ణి ఏం చేయాలి?’ అంటూ ఉరిమి చూశాడు.
రెండు క్షణాల నిశ్శబ్దం తరువాత ‘తప్పయిపోయింది సార్’ అంటూ నెమ్మదిగా చెప్పాడు సురేష్.
‘తప్పు ఎందుకు చేస్తావురా’ అంటూ కుర్చీ మీద నుంచి దిగ్గున లేచి ‘ఒరేయ్ వీణ్ణి బల్లకు కట్టేయండ్రా... తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వీడికి బుద్ధి రావాలి’ అంటూ మిగతా పనివాళ్ల కేసి ఉరిమి చూడగానే ఓ ఇద్దరు పనివాళ్లు అక్కడ ఉన్న కిటికీ చువ్వలకు రెండు చేతులు కలిపి సురేష్‌ను కట్టేశారు.
‘వీడి మీద నాకు మొదట్నించీ అనుమానంగానే ఉంది. కారు టాంక్ నిండా పెట్రోల్ పోసినా నాలుగు రోజులు కూడా రావడం లేదు. డబ్బులకు అమ్మేసుకుంటున్నాడులా ఉంది’ అన్నారు కృష్ణయ్య.
‘నేను అలాంటి వాడ్ని కాదండి’ అన్నాడు సురేష్ ఎలాగో నోరు పెగుల్చుకుని.
అంతే సురేష్ దవడ ఫటేల్మని పేలిపోయింది.
ఇంకా కోపంతో ఊగిపోతూ. ‘... కొడకా మళ్లా ఎదురు మాట్లాడితే చంపేస్తాను. అయినా నీకు ఇలా కాదురా’ అంటూ తన షర్ట్ విప్పేసి, నడుముకు ఉన్న బెల్ట్ తీసి పాత సినిమాల్లో హీరో విలన్లను బాదేస్తున్న లెవల్‌లో బెల్టుతో బాదేయసాగాడు.
పార్వతి రోదిస్తూ - ‘బాబూ కొట్టకండయ్యా.. అతన్ని కొట్టకండి. మీకు దణ్ణం పెడతాను. ఇంకెప్పుడూ అలా చేయడు. మీ కాళ్లొట్టుకుంటాను. బాబూ విడిచిపెట్టండయ్యా’ అంటూ కృష్ణయ్యగారి పాదాల మీద పడింది.
ఒక స్ర్తి తన కాళ్ల మీద పడిన సన్నివేశాన్ని అద్భుతంగా ఆస్వాదించిన మా కృష్ణయ్యగారు తన నుదుటికి పట్టిన చెమటను చేతితో స్టైల్‌గా తుడుచుకుని-
‘నా కాళ్లు పట్టుకోవడం కాదు. నీ మొగుడికి నీవే బుద్ధి చెప్పాలి. నీ కాలి జోడుతో వాడి చెంపలపై ఓ నాలుగు దెబ్బలేస్తే బుద్ధి వస్తుంది వెధవకి. అప్పుడు కట్లు విప్పిస్తాను’ అంటూ మళ్లీ కుర్చీలో కూర్చున్నాడు.
‘నేనెలా చేయగలను బాబూ’ అందామె వణికే స్వరంతో.
‘అయితే అలా ఉండనీ’ అన్నాడు కృష్ణయ్య నిర్లక్ష్యంగా. అతను చెప్పింది ఎవరైనా ఆచరించి తీరాలనే మనస్తత్వం అతనిది. కాదంటే పిచ్చెక్కిపోతాడు.
పాపం పార్వతికి ఏం చేయాలో తోచడంలేదు. ఆశగా నా వైపు చూసింది. కానీ అక్కడ అందరమూ నిస్సహాయులమే. కృష్ణయ్యగారి మాట ఒక పనివాడి పెళ్లాం కూడా వినలేదంటే అది తనకు ఎంతో అవమానంగా భావించి సురేష్‌ను ఇంకా బాధిస్తాడు.
కనుక నేనే చొరవ తీసుకుని-
‘చెబుతున్నారు కదమ్మా.. ఓ నాలుగు దెబ్బలేసి నీ మొగుణ్ణి ఇంటికి తీసుకెళ్లు.. లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దుమ్ములేరించేయగలరు అయ్యగారు’ అంటూ వేగిరపరిచాను.
తను ఎంతగానో అభిమానించి, తల్లిదండ్రులను కాదని సురేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పార్వతికి కృష్ణయ్యగారు చెప్పినట్టు చేయడం నరక సదృశమే.. కానీ మా ఆఫీసు వారందరి వొత్తిడితో పాపం పార్వతి మా సురేష్‌గాడి చెంపలపై ఆమె కాలిజోడుతో కొడుతూ ఉంటే-
‘గట్టిగా... ఇంకా గట్టిగా కొట్టు’ అంటూ కేకలేస్తున్నాడు మా కృష్ణయ్య.
అసూయా పరులలో పైశాచికత్వం, విచక్షణా రాహిత్యం ఒకేసారి చేరుతాయంటారు. దానికి ప్రతీకలా తోచాడా క్షణంలో మా కృష్ణయ్య.
* * *
మా కృష్ణయ్యగారు తనకు చేసిన పరాభవంతో చాలా సిగ్గుపడిపోయాడు సురేష్. పైగా మా కృష్ణయ్య సురేష్‌ను పనిలో నుండి కూడా తీసేశాడు. ఆ విధంగా చేయడం వలన మిగతా పనివాళ్లందరికీ తనంటే భయం కలుగుతుందనీ, తన వద్ద తప్పులు చేయడానికి భయపడతారని అతని నమ్మకం. అలా తానంటే అందరూ భయపడటం కూడా కీర్తే అని అనుకుంటాడు. ఒకానొక సందర్భంలో అతని దగ్గర పని చేయడం కూడా మాకు కలిగిన అదృష్టం అని సెలవిస్తుంటాడు. ఆ కీర్తివంతుని కొలువులో మేమిలా ఇబ్బంది పడుతూ భయపడుతూ పని చేయడం కూడా కీర్తే అనుకోవాలి మరి.
సురేష్‌కు జరిగిన పరాభవ సంఘటన క్రమంగా మా జ్ఞాపకాల నుండి జారిపోతున్నా, సురేష్ లేని లోటు మాకందరికీ స్పష్టంగా కనిపించసాగింది. చిన్నచిన్న పనులు అప్పగిస్తూ మేమూ అతన్ని ఉపయోగించుకున్న వాళ్లమే. ఏది చెప్పినా కాదనకుండా చేసే సురేష్‌ను వాళ్లావిడ డ్రైవింగ్ పనిని పూర్తిగా మాన్పించేసి, ఏదో కాంట్రాక్ట్ లేబర్‌గా పనికి కుదిర్చి, తనూ ఆ పనికే వెళుతోందని ఎవరో చెబితే విన్నాను.
* * *
ఇంటికి వచ్చిన మిత్రుని చూసి పలకరింపుగా నవ్వాను.
త్రినాథ్.. నా బాల్యమిత్రుడు. చాలా అరుదుగా కలుస్తుంటాడు. సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి కుశల ప్రశ్నలవీ అయాక-
‘మీ అమ్మగారికెలా ఉంది త్రినాథ్’ అనడిగాను.
‘ఏముంది? మామూలే వారానికొకసారి డయాలసిస్‌కు కంపల్సరీగా తీసుకెళ్లాలి వేణూ’ చెప్పాడు త్రినాథ్.
‘చాలా ఖర్చవుతుందనుకుంటాను’
అతను చిన్నగా నవ్వి - ‘అవుతుంది తప్పదుగా మరి’ అన్నాడు.
‘డబ్బులేమయినా అవసరపడితే అడుగు త్రినాథ్ - సంకోచపడకు. డయాలసిస్ లాంటి వాటికి చాలా ఖర్చవుతుందని నాకు తెలుసు’
‘అందుకని అందర్నీ పీడించాలా వేణూ’ నవ్వుతూ అన్నాడు త్రినాథ్.
‘మనిషిని మరో మనిషి ఆదుకోవడం, పీడింపబడటం ఎందుకవుతుంది త్రినాథ్. ఒకరిని ఆదుకునే అవకాశం రావడం అంటే భగవంతుడు తన జన్మ పునీతం కావడానికి ఇచ్చే అవకాశంగా భావించాలి. మనకు అదే కదా పుణ్యం’
‘అలా అయితే ఆ సాయం నువ్వు నాకు ఎప్పుడో చేసేశావు వేణూ’ నవ్వుతూ చెప్పాడు త్రినాథ్.
ఈసారి ఆశ్చర్యపోవటం నా వంతు అయింది.
‘నేనా? నేనేం సాయం చేశాను?’ ఆశ్చర్యంగా అడిగాను- నాకేం అర్థంకాక.
‘వేణూ... ఆ మధ్య మూణ్నెల్ల క్రితం నిన్ను కలిసినపుడు, నీవు మా బాస్‌గారి పని మీద కారులో వెళుతూ నన్ను ఎక్కించుకున్నావు. మీ కారు డ్రైవర్‌కు నన్ను పరిచయం చేస్తూ -‘ఇదిగో సురేష్.. ఇతను నా చిన్ననాటి స్నేహితుడు. పనుల మీద ఈ రోడ్లమ్మటే ఎక్కువ తిరుగుతుంటాడు. నువ్వు ఈ తోవలో వెళుతున్నపుడు ఇతను ఎపుడు కనిపించినా కారు మీద ఇతన్ని డ్రాప్ చెయ్యి’ అని చెప్పావు కదా. పాపం అతను ఒకసారి నేను మా అమ్మగారిని హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి రోడ్డు మీద ఆటో కోసం ఎదురుచూస్తుంటే ఆ అబ్బాయే కారాపి మమ్మల్ని హాస్పిటల్‌కు తీసుకువెళ్లాడు. అలా రెండు మూడుసార్లు తీసుకువెళ్లాడు కూడా. ఇదిగో అవసరమైతే తనకు ఫోన్ చేయమని సెల్ నెంబర్ కూడా ఇచ్చాడు. డబ్బులివ్వబోయినా తీసుకోలేదు.’
త్రినాథ్ చెప్పిన ఆ విషయం విన్న నాకు బుర్ర తిరిగినట్లయింది. గుండెల్లో సన్నగా వణుకు మొదలై ‘లాస్ట్ టైం నినె్నప్పుడు డ్రాప్ చేశాడు?’ అని అడిగాను.
చెప్పాడు త్రినాథ్.
ఓ గాడ్.. మా కృష్ణయ్య బంధువు చూసి సురేష్ మీద ఫిర్యాదు చేసిన డేట్ అదే.. నాకు వొళ్లంతా కంపించినట్లయింది’
త్రినాథ్‌ను అలా కారులో డ్రాప్ చేయమని నేను చెప్పిన మాట నిజమే. కానీ నేనా విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. మా కృష్ణయ్య వర్క్‌లో పెట్టే టెన్షన్‌ల వల్లనైతేమి, ఆయన స్వోత్కర్షలు కంటిన్యూగా వినవలసి రావడం వల్లనైతేనేమి నేనీ మద్య సాధారణ విషయాలు కూడా మరచిపోతున్నాను. శారీరక శ్రమ కంటే మానసిక భారం ఎక్కువైపోతోంది.
ఏది ఏమయినా నా వల్ల ఒక అమాయకుడు బలైపోయాడు. త్రినాథ్ వెళ్లిపోయాక మంచంపై నిస్సత్తువతో కూలబడిపోయాను. సురేష్ రూపాయకు కూడా ఆశపడతాడని తెలుసు కానీ - నా మాటకు అంత విలువ ఇచ్చి ఇంతటి అపవాదును, అవమానాన్ని నెత్తిన వేసుకున్నాడంటే - ఊహించలేకపోతున్నాను.
నా కళ్లల్లో నీళ్లు చెలమల్లో ఉబుకుతున్న నీటి మాదిరిగా ఊరుతున్నాయి. పోనీ జరిగిన విషయాన్నైనా సురేష్ నాతో చెప్పి ఉండవచ్చు కదా. చెబితే కృష్ణయ్యగారి దృష్టిలో ఆ నేరం నా మీద పడుతుందని ఆలోచించి నోరు మెదపని సురేష్ ఎంతటి ఉన్నతుడు? మరి నేను చేసిందేమిటి?
వెళ్లి ఆ దంపతులిద్దరి కాళ్ల మీద పడితే కానీ నాకు నిష్క్రృతి లేదనిపించింది. వెంటనే వాళ్లింటికి బయల్దేరాను.
నా అదృష్టం కొద్దీ ఆ దంపతులిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడూ ఆమె మా ఇంటి గుమ్మంలో నాకోసం వేచి ఉండేది. ఇపుడు నేను ఆమె గుమ్మంలోకి వచ్చాను. నన్ను ఇరువురూ ఆప్యాయంగానే ఆహ్వానించారు. టీ పెట్టడానికి ఆమె వంట గదిలోకి వెళ్లింది.
నేను సురేష్‌తో ‘నన్ను క్షమిస్తావా సురేష్.. నా వలన నీకు అనుకోని అవమానం జరిగింది. మా ఫ్రెండ్ కుటుంబాన్ని కారు ఎక్కించి నీవు అభాసుపాలయ్యావు కదూ’ అన్నాను.
‘అదేం లేదు వేణుగారూ.. మన పల్లెటూరి రూట్లలో సమయానికి బస్సులు రావు కదా. వచ్చే ప్రతి బండినీ చెయ్యెత్తి ఆపి, డబ్బులిస్తాం తమ గమ్యానికి చేర్చమని అడుగుతుంటారు. తోటకూరలను, ఆనప కాయలనూ మోసుకెళ్లి ఎవరెవరికో అందించే నేను.. డబ్బులకే వాళ్లను తీసుకెళుతుంటాను. అందులో తృప్తి కూడా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్ కూడా కనిపించాడు. పేషెంట్‌ను తీసుకెళ్లడానికి అవస్థలు పడుతుంటే - మీకు తెలిసిన వాళ్లే కదాని రెండుసార్లు ఎక్కించాను. ఇందులో మీ తప్పేం ఉంది సారూ’ అన్నాడు మామూలుగా.
‘లేదు సురేష్.. నా గొప్ప కోసం.. నా మిత్రుడి దృష్టిలో నేను మంచి పేరు పొందడం కోసం.. సాధ్యాసాధ్యాలు ఊహించకుండా నీకు అప్పజెప్పి నీకు ద్రోహం చేశాను. తరువాత మరచిపోయాను. అయినా నీవు నాకు అప్పుడే చెప్పాలిగా’ అన్నాను.
సురేష్ చిన్నగా నవ్వి ‘సార్ మీ అందరి దృష్టిలో మంచి పేరున్న కీర్తివంతులు. నేను తప్పించుకోవడానికి మీ పేరు చెప్పేయమంటారా, ఏం బాధపడకండి సారూ’ అంటున్న సురేష్ ఎంతో ఎత్తుకి ఎదిగిపోయిన వాడిలా కనిపించాడు.
‘పోనే్ల అయిందేదో అయింది. కృష్ణయ్యగారికి ఏదో నచ్చజెప్పి నీ ఉద్యోగం నీకు అప్పగిస్తాను చేస్తావా’ అని అడిగిన నా గొంతు నాకు చిత్రంగా వినిపించింది.
ఏం చెప్పాలో అర్థంకాక వౌనంగా తలదించుకున్నాడు సురేష్. ఇంతలో వాళ్లావిడ కల్పించుకొని ‘వద్దు బాబూ. గొప్పవారి మనసులు చాలా కురచగా ఉంటాయని మొన్ననే తెలిసింది. వేళకు తిండి కూడా లేకుండా, రాత్రీ పగలూ ఆ అయ్యగారికి సేవ చేసినా ఆ బాబు ఏం చేశాడు? నా చెప్పు చేతే నా దేవుణ్ణి కొట్టించాడు. అది తలుచుకుంటేనే నా కడుపు దేవేస్తోంది. ఆ బాబు కారులో సాటి మనిషిని ఎక్కించినందుకు అంతగా శిక్షించాలా బాబూగారూ’ అంటూ కళ్లనీళ్లతో ప్రశ్నిస్తున్న ఆమెకు ఏం చెప్పాలో నాకు తోచలేదు.
‘ఏం చెప్పనమ్మా - ఈ కీర్తివంతుల కొలువుల్లో మనసు చంపుకొని బ్రతకాలి. మనుషుల్ని ప్రేమించాలి - వస్తువుల్ని వాడుకోవాలి - కానీ ఇప్పటి కాలం వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటోంది. అందులో మేమూ భాగమై పోయాం. మమ్మల్ని క్షమించండి’ అంటూ బయటకు నడిచాను.

‘శ్రీచరణ్‌మిత్ర’
బి.సుబ్బారావు, 36-92-142/1, బర్మా క్యాంప్,
కంచరపాలెం పోస్ట్, విశాఖపట్నం -8.
9573566990

- శ్రీచరణ్‌మిత్ర