కథ

ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో సాధారణ ప్రచురణకు
ఎంపికైన రచన
***

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ మరి కొద్ది సేపటిలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నదన్న అనౌన్స్‌మెంట్ విని పెద్దపెద్ద అంగలతో ఫ్లైఓవర్ దిగి ఏడో నెంబర్ ఏసీ కోచ్ దగ్గరికి పరిగెత్తాడు సుమంత్.
డోర్ దగ్గర సుమారు పది మంది బోగీ ఎక్కే ప్రయత్నం చేస్తుండటంతో రెండో డోర్ వైపు పరిగెత్తి ట్రెయిన్ ఎక్కాడు. బెర్త్ నెంబర్ వెతుక్కుంటూ లోపలకి నడిచాడు.
ఎప్పుడూలాగే సైడ్ అప్పర్‌బెర్త్ కన్ఫర్మ్ కావడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు. తన ఒంటరి బతుకుని గుర్తుచేసే సైడ్ అప్పర్ బెర్త్ అంటే అతనికి జాలి. సాధారణంగా ఆ బెర్త్ మీద ప్రయాణం చేసే వాళ్లకి అందరూ కనిపిస్తారు కానీ అందరితో కలిసి ప్రయాణిస్తున్న ఫీల్ ఉండదని అతని భావన. తోటి ప్రయాణీకులతో మాటామంతీ పంచుకునే అవకాశం తక్కువ అని అతని ఉద్దేశం.
కిక్కిరిసిపోయిన జనారణ్యంలో మసలుతున్నప్పటికీ నా అనేవారు లేని ఒంటరి జీవితం గడిపే అతనికి జీవిత గమనమంతా సైడ్‌బెర్త్ ప్రయాణంలాగే తోస్తుంది.
బెర్తులను వెతుక్కుంటున్న కొంతమంది ప్రయాణీకులు భారీ లగేజీలతో అటూ ఇటూ తిరుగుతుండటంతో వాళ్లకి ఇబ్బంది కలిగేలా కింది సీట్లో కూర్చోడమెందుకని భావించి సుమంత్ తన అప్పర్ బెర్త్ ఎక్కి రిలాక్స్‌డ్‌గా చేరబడి ల్యాప్‌టాప్ తెరిచాడు.
ఎదురుగా ఉన్న సీట్లలోకి ఓ పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తులు వచ్చి చేరుతున్నారు. కొంతమంది లగేజీని సీట్ల కింద సర్దుతూంటే మరి కొందరు పై బెర్త్‌ల్లో కొంత లగేజీ పెడుతున్నారు. ప్రయాణించేవాళ్లూ, వాళ్లను సాగనంపడానికొచ్చిన వాళ్లతో సందడిగా ఉంది.
‘పెదనాన్నా... రాత్రికి డిన్నర్ కోసం కట్టిన ప్యాకెట్లివి... ఆ వైపు పై బెర్తులో పెట్టు’
‘మూడు సూట్‌కేసులూ, నాలుగు బ్యాగులూ... లెక్క సరిపోయిందా పెద్దమ్మా?’
‘తమ్ముడూ... ట్రెయిన్ బయల్దేరేలా ఉంది.. మీరు కిందకి దిగి కిటికీ దగ్గర నిలబడండి’
‘రేయ్ విస్సు... పిన్ని చాలా ఫుడ్ ఐటెమ్స్ కట్టి ఇచ్చిందిరా... మళ్లీ కొనుక్కొచ్చేశావేంరా...’
‘ఏం పర్లేదత్తా... చాలామంది ఉన్నారుగా’
‘నానాజీ అన్నయ్య వాళ్లకి పక్క బోగీలోనే బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయంట.. సో... డిన్నర్ కానిచ్చేవరకూ ఇక్కడే ఉండొచ్చు’
‘అల్లుడుగారూ... మీరు ఈ విండో దగ్గర కూర్చోండి... కంఫర్ట్‌గా ఉంటుంది’
‘ఒరే... ఆ సెల్‌ఫోన్‌లో ఆటలు కాసేపు ఆపరా’
బండి కదలడంతో కిటికీలోంచి పిన్ని, బాబాయ్, పిల్లలందరికీ టాటా చెప్పేరంతా.
అసంకల్పితంగానే ఈ కోలాహలం సుమంత్ దృష్టి వాళ్ల వైపు మళ్లేలా చేస్తోంది. యధాలాప దృష్టితోనే వాళ్ల బంధుత్వాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
సుమారు ఏభై ఐదేళ్ల వయసు ఉండే రుక్మిణమ్మ మూర్త్భీవించిన మాతృత్వానికి ప్రతీకలా ఉంది. అరవై వయసున్న అనంతమూర్తి మోమున చెరగని నవ్వు ప్రత్యేక ఆకర్షణ. కూతురూ, అల్లుడూ, కొడుకూ, కోడలూ, వాళ్ల ఇద్దరేసి పిల్లలూ...
వీళ్లతోపాటు పక్క కోచ్ నుంచి వచ్చి ఇక్కడే ఎడ్జస్ట్ అయి కూర్చున్న నానాజీ, అతని భార్యా.
హైదరాబాద్‌లో ఓ గృహ ప్రవేశం కార్యక్రమానికి వాళ్లంతా బయల్దేరినట్లు అర్థమవుతోంది.
వరదల్లే ప్రవహిస్తున్నాయి మాటలు. నవ్వుతూ తుళ్లుతూ ఆనందంగా కబుర్లాడుకుంటున్నారు. అందరి మాటల్లోనూ, ప్రవర్తనల్లోనూ పెద్ద దంపతులంటే ఎనలేని గౌరవం ప్రతిఫలిస్తోంది.
‘తాతా... బండి కదిలిన తర్వాత మాతో యునో కార్డ్ గేమ్ ఆడతానన్నావు’ మాట నిలబెట్టుకోవాలి సుమా అన్నట్లు చూశాడో మనవడు.
‘అలాగేలేరా తప్పకుండా. కానీ మనం ఆడుకుంటూంటే మరి మమీ, డాడీ, ఇంకా అందరికీ బోర్ కొడుతుంది కదరా’
‘ఊ... సరే అయితే... అందరం కలిసి ఆడే ఆట ఏదైనా చెప్పూ... అదే ఆడదాం’
‘ఏ ఆట ఆడదాం?.. అంత్యాక్షరి?’
‘ఓ.. అంత్యాక్షరి. ఓకే’ మనవలందరూ గోల చేశారు. వాళ్లతోబాటు కూతురూ, కోడలూ, రుక్మిణమ్మ, నానాజీ జంట కూడా ఆటకి సిద్ధపడ్డారు. కొడుకునీ అల్లుణ్ణీ కూడా బరిలోకి లాగేరు.
అందరూ రెండు గ్రూపులుగా విడిపోయారు. అనంతమూర్తి ఒక గ్రూపు లీడరైతే రెండో గ్రూపు నాయకత్వం రుక్మిణమ్మది.
ఇహ ఆట ఎవరు మొదలెట్టాలన్న ప్రశ్నకు సమాధానం కోసం చర్చించే అవకాశం ఇవ్వకుండా మనవరాలు డిసైడ్ చేసింది. అందర్లోకి తాతయ్య పెద్ద కాబట్టి అతనిదే ఫస్ట్ ఛాన్స్.
అర నిముషంసేపు ఆలోచించి ఏ పాట పాడాలా అని నిర్ణయించుకున్నాడు అనంతమూర్తి. ఘంటసాలని అభిమానించే అతని నోటి వెంట శ్రావ్యమైన పాట ప్రవహించింది. ‘ఈనాటి ఈ బంధమేనాటిదో... ఏనాడో పెనవేసి ముడివేసెనో...’
పెద్దవాళ్లందరూ పాటకు పరవశిస్తే, పిల్లలంతా చివరి అక్షరం ఏం వస్తుందా అనే ఉత్సుకతతో ఎదురుచూశారు. పాట వెనుక కొంటె చూపుని రుక్మిణమ్మ మాత్రం కళ్లతో జవాబిచ్చింది.
‘ఆ... చివరక్షణం న... అమ్మమ్మ ‘న’తో పాడాలి...’ అందరూ గోల చేస్తూ రుక్మిణమ్మ ఏ పాటతో కౌంటర్ ఇస్తుందా అని చూస్తున్నారు.
‘నీ దాననన్నదిర.. నినే్న నమ్మిన చిన్నదిర...’ శ్రావ్యమైన గొంతుతో
రుక్మిణమ్మ పాడుతూంటే అనంతమూర్తి చిరునవ్వులు చిందించాడు.
ఈ పాటకి చివరి అక్షరం ‘ర’ అని డిసైడయిపోయి పాట వెతుక్కోవడంలో మునిగిపోయారు ఆపోజిట్ టీం వాళ్లు. అలా కొనసాగిన ఆట ఎన్నో పాత కొత్త పాటల మేళవింపుగా సాగింది. ప్రయాణంలో సరదా నింపుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అన్న దానికి ఉదాహరణగా నిలిచిన ఆ కుటుంబం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఆ సందడి చూస్తే సుమంత్‌కి ముచ్చటేస్తోంది. పెనవేసుకున్న అనుబంధాలు ఎంతటి ఆనందాన్ని విరబూస్తాయో కదా అనే భావన కలుగుతోంది.
ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన సుమంత్ ప్రేమసమాజంలో ఆశ్రయం పొందాడు. చదువు మీద పెట్టిన శ్రద్ధ కారణంగా టీచర్ల అభిమానాన్ని చూరగొని ఎదిగే అవకాశాన్ని పొందాడు. మంచి ఉద్యోగంతో సంపాదనాపరుడిగా మారినప్పటికీ ఒంటరితనం నిండిన జీవితంలో నిస్తేజం పరుచుకుంది. సంతోషాన్నయినా, బాధనైనా తనకు తానే పంచుకునే పరిస్థితి ఏదో తెలియని వెలితిని నింపుతోంది. తను ఏకాకినన్న వాస్తవం అనుక్షణమూ మదిలో మెదులుతుంటుంది.
అనంతమూర్తి కుటుంబంలో వెల్లివిరుస్తున్న ఆనందం ఓ పక్క ముచ్చట గొలుపుతున్నా ఇంకో పక్క తన జీవితంలోని లోటును గుర్తుచేస్తూ బాధకు గురి చేస్తోంది.
ఇన్నాళ్లూ పెళ్లి గురించి సీరియస్‌గా ఆలోచించలేదు గానీ - ఇలాంటి మంచి కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకుని తనూ ఆ ఇంటిలోని మనిషిలా కలిసిపోగలిగితే ఎంత బావుణ్ణు అనే ఆలోచన మెదిలింది. ఊహల్లో ఆ భావన ఎంతో హాయిగా అనిపించింది. మనసులో గూడు కట్టుకున్న స్తబ్దతను తరిమేసింది. హృదయం తేలికపడింది.
ఆ ఆలోచన ఎంత బావున్నదని అనుకుంటూనే - ఏదైనా మేట్రిమొనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసి పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న అమ్మాయి కావాలో స్పష్టంగా స్పెసిఫై చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.
‘అంకుల్.. తీసుకోండి’
ఆలోచనల్లో పూర్తిగా మునిగిపోయిన సుమంత్‌కి మళ్లీ అంకుల్ అన్న పిలుపు వినపడి ఉలిక్కిపడి చూశాడు. అనంతమూర్తి మనవడు తన సీటు దగ్గరకొచ్చి ఓ పేపర్ ప్లేట్లో పులిహోర అందిస్తూ తీసుకోమన్నట్లు చూశాడు.
‘అరెరె... వద్దు బాబూ... నేను డిన్నర్‌కి ఆల్రెడీ ఆర్డర్ చేశాను..’ నవ్వుతూ అన్నాడు సుమంత్.
‘్ఫర్వాలేదు బాబూ.. తీస్కో’ అనంతమూర్తి అన్నాడు. ఓ పెద్ద స్టీలు గినె్నలోంచి పులిహోరను పేపర్ ప్లేట్లలో వడ్డిస్తూ అందరికీ అందిస్తోంది రుక్మిణమ్మ ‘మొహమాటపడకు బాబూ.. ఇదిగో ఇంకా చాలా ఉంది’
అందరూ అదేమాట వల్లె వేసేసరికి సిగ్గు పడిపోయాడు సుమంత్. ఇక తప్పనిసరై ప్లేటు అందుకున్నాడు.
‘ఆంటీ.. తీస్కోండి’ అనంతమూర్తి మనవడి మాట మళ్లీ వినపడితే ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థంకాక చూశాడు సుమంత్. సైడ్ లోయర్ బెర్త్‌లో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు.
‘హహ... వద్దు బాబూ... నేను టిఫిన్ తెచ్చుకున్నాను’
‘పర్లేదు ఆంటీ.. కొద్దిగానే.. తీస్కోండి’
రుక్మిణమ్మ కల్పించుకుని చెప్పడంలో ఆమె పులిహోర ప్లేటుని అందుకుంది.
సైడ్ లోయర్ బెర్త్‌లో కూర్చున్నామె మాటలు బట్టి ఆ గొంతు ఎక్కడో విన్నట్లే అనిపించి కాస్త వంగి కిందకు చూశాడు సుమంత్. తెలిసిన మొహమే అని పరీక్షగా చూసి గుర్తుపట్టాడు.
తమ సేల్స్ ఆఫీసు పక్కనే ఉన్న బ్యాంక్‌లో పనిచేసే ప్రతిమను గుర్తు పట్టి కిందకు దిగి పలుకరించాడు ‘బాగున్నారండీ’
సుమంత్‌ని చూసి ప్రతిమ నవ్వింది. ‘అరె.. మీరా... అనకాపల్లిలో ఎక్కినప్పుడు మిమ్మల్ని గమనించలేదు’
ఆమె కాళ్లు ముడుచుకుని కూర్చుంటే రెండో విండో దగ్గర కూర్చున్నాడు సుమంత్. ‘నిన్నా ఇవాళా సేల్స్ మీట్ ఉంటే ఇక్కడికొచ్చానండీ’
సబ్ మెర్సిబుల్ పంపులకు సంబంధించిన రీజనల్ సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సుమంత్ ఆఫీస్ పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచిలో పని చేస్తోంది ప్రతిమ. గతంలో అప్పుడప్పుడూ కొన్ని చెక్స్ ప్రాసెస్ చెయ్యడం కోసం ఇవ్వడానికెళ్లడం కారణంగా కాస్త పరిచయం కలిగింది.
‘మీరు కూడా ఆఫీసు పని మీద వచ్చారా?’
‘ఉహూ... కాదు’ ప్రతిమ ముఖ కవళికల్లో బాధ కనపడి తను అనాలోచితంగా ప్రశ్నించానా అని ఆ క్షణమాత్రంలో అనుకున్నాడు సుమంత్.
‘రెండు వారాల క్రితం మా అమ్మగారు చనిపోయారు. అనకాపల్లిలో కార్యక్రమాలు చేయించడానికొచ్చాను’
‘అయ్యో.. సారీ... అండీ’
జన్మనిచ్చిన తల్లిని ఊహామాత్రంగా కూడా నోచుకోని సుమంత్‌కి ఆ లోటు ఎంత తీవ్రమైనదో తెలుసు. ఆత్మీయులు ఒక్కసారిగా కనుమరుగైతే కలిగే బాధను అతను ఊహించగలడు.
కొద్దిసేపు ఏం మాట్లాడాలో తోచలేదు. అయితే ఆమెను ఏదో ఒకటి మాట్లాడించి బాధ నుంచి మరల్చాలనిపించింది ‘మరి నాన్నగారు ఎక్కడున్నారు?’
ఆమె మొహం మీద పేలవమైన నవ్వు మెరిసి మాయమైంది.
‘నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడే ఓ ప్రమాదంలో నా పేరెంట్స్ చనిపోయారు. నేను మాత్రం ప్రాణాలతో బైటపడ్డాను. బంధువులంటూ ఎవరూ లేకపోవడంతో ఊళ్లో ఒకామె నన్ను పెంచుకోడానికి తీసుకుంది...’ పక్కకి తిరిగి మాట్లాడుతున్న ఆమె మొహంలోని భావాలు సుమంత్‌కి కనిపించడం లేదు. ‘ఇప్పుడు చనిపోయింది నన్ను పెంచుకున్న అమ్మ... ఇవాళ నేనీ లోకంలో నా అన్న వాళ్లెవరూ లేని ఒంటరిని...’
క్లుప్తంగా ఆమె చెప్పిన మాటలు అతని కళ్ల ముందు ఆమె జీవితాన్ని చిత్రించాయి. ఆమె కూడా తనలాగే ఒంటరి అన్న వాస్తవం తెలియని ఆవేదన కలిగించింది.
కొద్దిసేపు మాటలేం లేవు. అతనికి మాటలు దొరకడంలేదు. యధాలాపంగా అనంతమూర్తి కుటుంబ సభ్యుల వైపు దృష్టి మరల్చాడు.
పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆహ్లాదంగా గడపడం, బాంధవ్యాల పరిపూర్ణతను ఆస్వాదించడం - ఎంత చూసినా అతనికి ముచ్చటేస్తోంది.
‘ఆ ఫ్యామిలీని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తోంది కదా?’ నిశ్శబ్దాన్ని భరించలేని సుమంత్ టాఫిక్ మారుస్తూ మాట్లాడేడు.
అవునన్నట్లు తలూపింది ప్రతిమ. ‘ఐనా లక్ ఉంటేనే గానీ దక్కని అవకాశం అది. మనకంటూ అంతమంది ప్రేమించే వాళ్లుండటం నిజంగా అది అదృష్టం ఉంటేనే గానీ కలగదేమో’
అనంతమూర్తి, రుక్మిణమ్మ కళ్లల్లో వ్యక్తమయ్యే ఆనందం వారిద్దరికీ అర్థమవుతోంది.
‘పులిహోర చాలా బాగుందమ్మా.. థాంక్సండీ’ మాట కలుపుతూ అన్నాడు సుమంత్.
‘ఇంకొంచెం తింటావా బాబూ’ నవ్వుతూ అన్నది రుక్మిణమ్మ.
‘అయ్యో వద్దండీ... ఎంత బాగా తయారుచేశారో చెప్దామని అన్నాను’
‘నువ్ తింటావా అమ్మా’
సిగ్గు పడుతూ వద్దన్నది ప్రతిమ.
క్యాజువల్‌గా అనంతమూర్తి అడిగే ప్రశ్నలకు ఇద్దరూ సమాధానమిచ్చేరు. అలా అందరితోపాటు పిచ్చాపాటీ కబుర్లలో కాలక్షేపం చేశారు.
మళ్లీ మనవళ్ల కోసం అందరూ కల్సి ఆటలు మొదలెట్టేరు. ఈసారి డంబ్ షరద్స్ గేమ్ మొదలైంది. ఒక గ్రూపులో వాళ్లిచ్చిన సిన్మా పేరుని రెండో గ్రూపులోని
ఒక వ్యక్తి చేసే సంజ్ఞల ఆధారంగా మిగిలిన వాళ్లు గుర్తించాలి. ఆ సంజ్ఞలబట్టి ఒక్కో పదాన్నీ ఊహించి చెప్పడం బోలెడంత కామెడీ పండడం, నవ్వులు విరబూయడం జరుగుతుంది.
ఓ సిన్మా పేరుని సుమంత్ గెస్ చేసి క్లూ ఇవ్వడంతో అనంతమూర్తి మనవడు సుమంత్‌ని తమ గ్రూపులో కలిపేసుకున్నాడు ‘అంకుల్.. మీరు మా పార్టీ’
అది చూసి రెండో మనవడు ప్రతిమని తమ వైపు లాగేడు. ‘ఆంటీ మీరు మా టీం’
ఓ గంటసేపు సాగిన ఆ ఆటలో రెండు టీములూ పోటీలు పడ్డాయి. మాట్లాడకుండా సినిమా పేరుని వివరించడానికి చేసిన సంజ్ఞలూ, ఎక్స్‌ప్రెషన్లూ హాస్యాన్ని పండించాయి.
అన్నీ మర్చిపోయి ప్రతిమ ఆహ్లాదంగా గడపడాన్ని గమనించేడు సుమంత్.
రాత్రి తొమ్మిదయింతర్వాత ఒక్కొక్కళ్లుగా నిద్రకి ఉపక్రమించేరు.
‘మీరు నిద్రపోతానంటే నేను పైకి వెళతా’ సుమంత్ లేవబోతూంటే వారించింది ప్రతిమ. ‘్ఫర్వాలేదు కూర్చోండి.. నాకింకా నిద్ర రావడంలేదు’
సైడ్ మిడిల్ బెర్త్ కోసం ఏ ప్యాసింజరూ రాలేదు.
తను పడుకుంటే వెంటనే నిద్ర పట్టేస్తుందని తెలుస్తున్నప్పటికీ - ప్రతిమకి కాసేపు కంపెనీ ఇద్దామని నిర్ణయించుకుని కూర్చున్నాడు సుమంత్.
బోగీలో చాలామంది ప్రయాణీకులు నిద్రలోకి జారుకుంటున్నారు. అనంతమూర్తి కుటుంబంలోని అందరూ పడుకోవడంతో వాళ్లకి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో లైట్లు ఆపేశాడు.
అప్పుడప్పుడు ఎవరైనా డోర్ తెరిచినప్పుడు పట్టాల మీద పరుగులు తీసే ట్రైన్ చప్పుడు వినిపిస్తోంది.
ఆమెకు బాధలని గుర్తు చెయ్యని మాటలు ఏం మాట్లాడాలో తెలియక అనంతమూర్తి కుటుంబం గురించి మాట్లాడడం మొదలెట్టాడు సుమంత్. ‘నిజంగా ఈ ఫ్యామిలీని చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. పెద్ద కుటుంబంలో రిలేషన్స్‌కి విలువ ఇస్తూ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ బాండింగ్‌తో వాళ్లు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లని చూస్తుంటే నా లోన్లీ లైఫ్‌లో ఎంత ఆనందాన్ని కోల్పోతున్నానో అనిపిస్తోంది’
‘అవును.. మీరన్నది నిజం... నాకూ అలాగే అనిపించింది’
‘ఎప్పుడూ లేదు గానీ ఈసారి అనిపించింది... ఇలాంటి పెద్ద ఫ్యామిలీలోని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇలాంటి ఆనందాన్ని సొంతం చేసుకోవాలని ఇవాళ అనిపించింది’
సుమంత్ మాటకి ప్రతిమ స్పందించలేదు. ఆమె నుంచి రియాక్షన్ కోసం ఎదురుచూశాడు సుమంత్. తన ఆలోచనపై ఆమె అభిప్రాయం ఏమయ్యుంటుందా అన్న యోచన అతనికి సమాధానం లేని ప్రశ్నలా తొలిచేయడం మొదలెట్టింది.
‘మీకేం అనిపిస్తోంది?’ ఉండబట్టలేక అడిగేశాడు ఆమెని.
చెప్తానన్నట్లుగా ఆమె తలూపడం కనిపిస్తోంది గాని ఆమె మొహంలోన భావాలు తెలియలేదు.
తర్వాత ఒక అరగంటసేపు ఏవేవో టాపిక్స్ మీద సంభాషణలు దొర్లాయి. తెలియకుండానే అలాగే కూర్చొనే నిద్రలోకి జారుకున్నారిద్దరూ.
* * *
స్టేషన్ బయటికొచ్చాక కూకట్‌పల్లి వైపు వెళ్లడానికి ఆటో ఎక్కబోతూ సుమంత్‌తో అంది ప్రతిమ. ‘రాత్రి మీరడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పాలి కదా.. ఆ కుటుంబాన్ని చూశాక నాకేమనిపించిందంటే - నాలా ఒంటరితనంతో బతుకీడ్చే మరో వ్యక్తి జీవితంలో ప్రవేశించి అతని ఒంటరితనాన్ని దూరం చెయ్యాలని... అతనికి తోడుగా మారాలి... అలా మొదలై అనంతమూర్తిగారి కుటుంబమంత పెద్దగా ఎదగాలనీ...’
సుమంత్ నుంచి ప్రతిస్పందన కోసం ఎదురుచూడకుండా ఆమె ఆటో ఎక్కింది.
ఆమె సమాధానం తనవైపు సంధించిన ప్రశ్నలా తోచి, ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ హబ్సిగూడ వైపు వెళ్లాల్సిన ఆటో ఎక్కాడు సుమంత్.
*
సాయిరాం ఆకుండి
ఫ్లాట్ 101, పివిఆర్ రెసిడెన్సీ, ఎంఐజి 99/100, ధర్మారెడ్డి కాలనీ ఫేస్-2
హైదర్‌నగర్, జెఎన్‌టియు
కూకట్‌పల్లి, హైదరాబాద్-500 085.. 9848110790

సాయరాం ఆకుండి