కథ

ఉప్మా ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏవండీ రంగనాథంగారూ! ఇక నా వల్ల కాదండీ. చచ్చీ చెడి నేను సంబంధాలు చూడటం... మీవాడేమో ఏదోక వంకపెట్టి వద్దనడం. ఇలా అయితే ఎలాగండీ! ఇప్పటికి నలభై తొమ్మిది సంబంధాలు చూశాను. ఇంకొక్కటి చూస్తే హాఫ్ సెంచరీ పూర్తవుతుంది. చక్కగా గోల్డెన్ జూబ్లీ చేసుకోవచ్చు’ అన్నారు శాస్ర్తీ కాస్త వ్యంగ్యంగా.
‘అది కాదయ్యా శాస్ర్తీ! మా వాడికి చదువైతే అబ్బలేదు గానీ వంటల్లో మాంఛి ప్రావీణ్యం ఉంది. వాడికి కాబోయే భార్య కూడా చక్కగా వంట చేసి పెట్టాలనేది వాడి కోరిక. ఇంతవరకూ చూసిన సంబంధాల్లో అమ్మాయిలు చేసి పెట్టినవేవీ వాడి నోటికి రుచించలేదయ్యా. అందుకే ఇంత బాధ పడాల్సి వస్తోంది. ఈసారి నువ్వు మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కుని పెళ్లిచూపులు ఎరేంజ్ చెయ్యి. చూసి ఫైనలైజ్ చేసేద్దాం’ అన్నాడు రంగనాథం.
‘ప్రస్తుతానికి ఒకటి రెడీగా ఉంది. కనుక్కుంటాను. ఇంక ఇది కూడా ఫైనలైజ్ చెయ్యకపోతే ఇక నావల్ల కాదు మీ వాడికి సంబంధాలు తేవడం’ అని చెప్పి బయల్దేరాడు శాస్ర్తీ.
* * *
ఆనంద్‌కి పెద్దగా చదువు అబ్బకపోయినా చిన్నప్పటి నుండి వాళ్ల అమ్మ వెనకాల తిరగటంవల్ల వంట చేస్తూండగా, వండినవి రుచి చూసి చెప్పడం చేసేవాడు. దాంతో మాంఛి భోజన ప్రియుడిగా తయారయ్యాడు. చూడ్డానికి అందంగా, ఆరు అడుగులు ఉంటాడు. ఉన్న ఊళ్లోనే కిరాణా వ్యాపారం చేస్తూ సమయం కుదిరినప్పుడు వాళ్ల అమ్మా నాన్నలకు సహాయపడుతూంటాడు.
తన కోసమని శాస్ర్తీ తెచ్చిన సంబంధాలన్నింటిలోనూ అమ్మాయిలకి వంటల్లో పరీక్షలు పెట్టడం, అందులో వంకలు ఎంచి సంబంధాలు వద్దనుకోవడం అలా వచ్చిన సంబంధాలన్నీ వదులుకుని మూడు పదుల వయసుకు చేరాడు.
‘రండి శాస్ర్తీగారు. కూర్చోండి’ అని గుమ్మంలోకి వచ్చిన శాస్ర్తీని లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది ఆనందం తల్లి లలిత.
‘బాగున్నావా శాస్ర్తీ. ఇదేనా రావడం. ఏమిటీ విషయం?’ అంటూ పలకరించాడు లోపలి నుండి వస్తూనే రంగనాథం.
‘అదేనండీ మీ అబ్బాయి సంబంధం గురించి మాట్లాడ్డానికి వచ్చాను. అమ్మాయి వాళ్లది పక్కనే ఉన్న నర్సాపురం. అబ్బాయి గురించి అంతా చెప్పాను. జాతకాలు కూడా బాగా కుదిరాయి. మీకు వీలు కుదిరినప్పుడు చెప్తే పెళ్లిచూపులకు బయల్దేరదాం’ అంటూ తను వచ్చిన విషయం చెప్పాడు శాస్ర్తీ.
‘ఇంతకీ ఆ అమ్మాయికి కమ్మగా వండిపెట్టడం వచ్చా?’ అని అడిగాడు ఆనందం గుమ్మంలో చెప్పులు విప్పుతూ.
‘తినబోతూ రుచి ఎందుకయ్యా. నువ్వు చూపులకి రెడీ అయిపో’ అన్నాడు శాస్ర్తీ.
‘అయితే శాస్ర్తీగారు. ఎల్లుండి ఏకాదశి మంచి రోజు కదా. అప్పుడు వస్తాం అని కబురు పెట్టండి’ అంది లలిత కాఫీ అందిస్తూ.
‘ఏమంటారు రంగనాథంగారూ!’ అన్నాడు శాస్ర్తీ రంగనాథం వైపు చూస్తూ.
‘దానిదేముంది. తప్పకుండా. కానీ మా వాడి కండిషన్ ముందే చెప్పు’ అన్నాడు రంగనాథం.
‘అదంతా నేను చూసుకుంటాను కదండీ. శుభం! వెళ్ళొస్తాను మరి’ అని బయల్దేరాడు శాస్ర్తీ.
* * *
‘అమ్మాయి రెడీ అయ్యిందా. పెళ్లి వాళ్లు వచ్చే టైం అవుతోంది’ అంటూ భార్యని కంగారు పెడుతున్నాడు పెళ్లికూతురి తండ్రి పద్మనాభం.
‘అబ్బా అవుతోందండీ’ అంది పెళ్లికూతురి తల్లి కుమారి.
‘మరి ఫలహారాల సంగతి ఎంతవరకూ వచ్చింది’
‘అన్నీ రెడీగా ఉన్నాయి. అమ్మాయి రెడీ అయ్యాక వేడివేడిగా తయారుచేయిద్దాం అని నేనే ఆగమన్నాను’
‘ఏడ్చినట్టుంది. అంతా రెడీ అయ్యాక చేస్తే అమ్మాయి అలంకారం పాడవదా?’
‘అదంతా నేను చూసుకుంటాను. మీరేం కంగారుపడకండి’ అనేసి కూతురి గదిలోకి వెళ్లిపోయింది కుమారి.
‘ఏదో ఒకటి ఏడవండి. దానితోపాటు కాస్త కాఫీ కూడా చేయించి ఆ ఫ్లాస్క్‌లో తగలబెట్టండి. మరీ వాళ్ల ముందు హడావిడి పడకుండా’ అంటూ హాల్లోంచి అరిచాడు పద్మనాభం.
‘నమస్కారం పద్మనాభంగారూ’ అంటూ ఇంట్లోకి అడుగుపెడుతూ పలకరించాడు శాస్ర్తీ.
‘రండిరండి శాస్ర్తీగారూ. మీ గురించే ఎదురుచూస్తున్నాం. బాగున్నారా?’ అన్నాడు పద్మనాభం.
‘ఆ... ఆ... బాగానే ఉన్నాను. రండి రంగనాథంగారూ.. ఇదిగో ఈయనే పద్మనాభంగారు..’ అంటూండగానే వచ్చిన కుమారిని చూసి.. ‘వారి భార్య కుమారి. వీరు రంగనాథంగారు. వారి సతీమణి లలిత. అబ్బాయి ఆనందం’ అంటూ అందరినీ పరిచయం చేశాడు శాస్ర్తీ.
అందరూ కూర్చుని మాటల్లో పడ్డారు. ‘దుర్ముహూర్తం వచ్చేలోపే కార్యక్రమం ముగించేస్తే బాగుంటుంది’ అన్నాడు శాస్ర్తీ.
‘అయ్యో తప్పకుండా. కుమారీ! వెళ్లి అమ్మాయిని తీసుకుని రా’ అని కుమారిని లోపలికి పంపాడు పద్మనాభం.
కుందనపు బొమ్మలా తయారైన తన కూతురు ప్రమీలని చూసి మురిసిపోతూ తీసుకువచ్చి వారి ముందు కూర్చోబెట్టింది కుమారి. ఫలహారం తీసుకురమ్మని సైగ చేశాడు పద్మనాభం. అది చూసి అర్థం చేసుకుని వంట గది ముఖం పట్టింది కుమారి.
ఆనందానికి అమ్మాయి బాగా నచ్చింది. కానీ తన ఒప్పందం ప్రకారం అమ్మాయితోపాటు అమ్మాయి వంట కూడా నచ్చాలి.
ఈ పిల్ల వంట ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో ఘుమఘుమలాడే ఉప్మాని నాలుగు ప్లేట్లలో పెట్టి వారి ముందు పెట్టింది కుమారి.
చూస్తూంటేనే నోరూరింది ఆనందానికి. వెంటనే ఒక ప్లేటు తీసుకుని గబగబా రెండు స్పూన్లు నోట్లో వేసుకున్నాడు. నెయ్యి, జీడిపప్పు వేసి వండినదేమో నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. రెండు నిమిషాల్లో ప్లేటు ఖాళీ చేసేశాడు ఆనందం.
తిన్నాడే కానీ ఎక్కడో అనుమానం. అది పిల్ల చేసిందా? తల్లి చేసిందా? అని. ఇక ఆత్రుతని ఆపుకోలేక అడిగేశాడు.
‘ఈ ఉప్మా ఎవరు చేశారండీ’ అని.
‘మా అమ్మాయి ప్రమీలే బాబూ’ అంది కుమారి.
‘మీరు ఏమీ అనుకోకపోతే ఇంకొక ప్లేటు ఇప్పుడు మళ్లీ చేయిస్తారా’ అని అడిగాడు తన అనుమానం తీర్చుకోవడానికి.
‘అయ్యో! ఎంత మాట. తప్పకుండా’ అన్నాడు పద్మనాభం.
‘కుమారీ! అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి ఆ ఏర్పాట్లు చూడు’ అని చెప్పి.. ‘మీరూ వెళ్లండి ఫరవాలేదు’ అన్నాడు లలిత వైపు చూసి, అబ్బాయి అనుమానం గ్రహించి.
‘అయ్యో! ఫరవాలేదు అన్నయ్యగారూ’ అంది. కానీ తన కొడుకు ఆనందం గురించి తెలుసు కనుక ఇంకొకసారి ఆ మాట అనేసరికి తను కూడా వంట గదిలోకి ప్రవేశించక తప్పలేదు.
పావుగంటలో అమ్మాయి తన చేతుల్తో తానే స్వయంగా చేసిన ఉప్మా ఒక ప్లేటులో, వెనుకే కుమారి ఒక ట్రే నిండా కాఫీ కప్పులతో, లలిత మంచినీళ్ల గ్లాసుల ట్రేతో బయటకు వచ్చారు.
ఆత్రుతతో ప్లేటు అందుకున్నాడు ఆనందం. మళ్లీ అదే రుచి పడింది ఉప్మాకి. దానితో ఇంతకాలానికి వంట అద్భుతంగా చేయగల అమ్మాయి దొరికిందనుకున్నాడు మనసులో. అలాగే ఒక కప్పు కాఫీ కూడా అందుకుని తాగేశాడు. అది కూడా చాలా నచ్చింది ఆనందానికి. ఇక మారుమాట్లాడకుండా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఆనందం. అందరూ ఆనందపడ్డారు. ముందుగా శాస్ర్తీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
పెళ్లి కుదరడమే తడవుగా నెల రోజుల్లో అన్నీ హడావిడిగా జరిగిపోయాయి.
కొడుక్కి పెళ్లి జరిగిన తర్వాత తీర్థ యాత్రలకి బయలుదేరారు జగన్నాథం, లలిత. అత్తవారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి అత్తగారి వంటతో గడిచిపోయింది ప్రమీలకి. ఇప్పుడు ఆవిడ ఊరెళ్లింది. వంట బాధ్యత ప్రమీల మీద పడింది. పెందళాడే లేచి ఆనందం రెడీ అయ్యి బయలుదేరేసరికి వేడివేడిగా ఉప్మా, కాఫీ రెడీ చేసింది ప్రమీల. చక్కగా లొట్టలు వేసుకుని తినేసి మధ్యాహ్నం భోజనానికి తను ఏం తినాలనుకుంటున్నాడో లిస్ట్ ఇచ్చి బయల్దేరాడు ఆనందం.
ఆ లిస్ట్ చూసి ప్రమీలకి కొంచెం బెదురుపుట్టింది. మొత్తానికి భర్త అడిగిన ఐటమ్స్ అన్నీ ఎరేంజ్ చేసింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన ఆనందం ఒక్కొక్కటీ వడ్డించుకు తింటూ తనకి పట్టిన అదృష్టానికి మురిసిపోయాడు. అదే విధంగా సాయంత్రం కూడా ఆర్డర్ ఇచ్చాడు. ఇలా వారం రోజులు గడిచాయి.
‘ఈ రోజు ఆదివారం. ప్రమీ చేత మంచి నాన్‌వెజ్ ఐటమ్స్ చేయించుకోవాలి’ అనుకుంటూ టిఫిన్ కోసం టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ప్లేటులో ఉప్మా తీసుకువచ్చి ఆనందం ముందు పెట్టింది ప్రమీల. ‘అబ్బా! ప్రమీలా ఎంత నువ్వు ఉప్మా బాగా చేస్తావంటే మాత్రం రోజూ ఇంక అదే టిఫినా’ అన్నాడు.
‘ఏమండీ బాగోలేదా’ అని అడిగింది ప్రమీల. ‘బావుంది. కాని రోజూ ఉప్మా అంటే కష్టం కదా. రేపట్నుండి మార్చు’ అన్నాడు.
సరే అన్నట్టుగా తల ఊపింది ప్రమీల.
‘ప్రమీ మార్కెట్‌కి వెళ్లి చికెన్ తెస్తాను. చక్కగా బిర్యానీ చెయ్యి’ అని చెప్పి మార్కెట్‌కు వెళ్లాడు ఆనందం.
భర్త ఆ మాట అనేటప్పటికి గుండెల్లో బండ పడ్డట్టయ్యింది ప్రమీలకి. ఈ వారం రోజులు ఏదోలా మేనేజ్ చేసింది.
ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అని ఒక్కసారిగా భయం పట్టుకుంది. ‘ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి’ అని తనలో తనే అనుకుంది.
‘ప్రమీ వంట అయ్యిందా. ఆకలేస్తోంది. తొందరగా రా’ అంటూ అరుస్తున్నాడు ఆనందం టేబుల్ దగ్గర నుండి.
భర్త మాట విన్న ప్రమీల తను వండిన వంటకాన్ని తెచ్చి ఆనందం ముందు పెట్టింది. ఒక్కసారిగా ఆనందం కళ్లు బైర్లు కమ్మాయి. ‘ఇదేం వంటకం. దీని పేరేంటి ప్రమీ?’ అని అడిగాడు అర్థంకాక. ‘మీరే కదండి బిర్యానీ చేయమన్నారు’ అంది ప్రమీల భయంతో.
‘ఓహో! ఇది బిర్యానీనా ఆ...’ అని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వాంతి వచ్చినంత పనైంది ఆనందానికి. ‘ఏంటే ఏం చేసావే. పచ్చి చికెన్‌ని రుబ్బేసి ఉప్పు, కారం వేస్తే అది బిర్యానీ ఎలా అవుతుందే’ అని భార్య మీద విరుచుకుపడ్డాడు. ఆనందం కొడతాడేమో అని భయం పట్టుకుంది ప్రమీలకి. ‘నీకు ఏమైందే. ఇన్ని రోజులు బాగానే చేసావుగా. ఇప్పుడేమైంది. నోరు విప్పి సమాధానం చెప్పు’ అని గదమాయించేసరికి ప్రమీల ఏడుపందుకుంది. ఏడుస్తూనే ‘నాకు ఉప్మా తప్ప ఇంక ఏ వంటకం రాదండీ’ అంటూ అసలు విషయం చెప్పింది ప్రమీల.
ఒక్కసారిగా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అనిపించింది ఆనందానికి. కాసేపటికి తేరుకుని ‘మరిన్ని రోజులూ మధ్యాహ్నానికి, రాత్రికి ఎలా ఉండేదానివి’ అని అడిగాడు సందేహంగా.
‘అత్తయ్య ఇంటి ఖర్చులకని ఇచ్చిన డబ్బులతో బైట హోటల్ నుండి తెప్పించేదాన్ని’ అని నెమ్మదిగా విషయం చెప్పింది. దాంతో ఆనందానికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. కానీ ఉప్మా మాయలో పడి తను చేసుకున్న స్వయంకృతాపరాధానికి ఎవరూ బాధ్యులు కాదు కదా అని అనుకుని ఇంక ఏం మాట్లాడలేక పోయాడు.
అప్పటికే భయంతో ఏడుస్తూ వణుకుతున్న ప్రమీల దగ్గరకు వెళ్లి ‘ఏడవకు! నీకు వచ్చిన ఉప్మానే చేసి తగలెట్టు’ అని చెప్పి వంట గదిలోకి పంపాడు.
కొన్ని రోజులకు మూడు పూటలా ఉప్మాని తినితిని విసుగు పుట్టిన ఆనందానికి.. ‘ప్రమీ ఈ రోజు ఆ వెధవ ఉప్మా వద్దు. పద బయటకు వెళ్లి తిని వద్దాం’ అన్నాడు.
ఇద్దరూ హోటల్‌కి వెళ్లి ఒక టేబుల్ దగ్గరున్న సోఫాలో కూర్చున్నారు. వెయిటర్ వచ్చి మెనూ కార్డ్‌ని ఆనందం చేతుల్లో ఉంచాడు. అయ్యగారికి చదువు రాదాయె. ఏం ఆర్డర్ ఇవ్వాలో అర్థం కాలేదు. భార్యని అడిగితే చిన్నతనం అని ఆలోచించి... వెయిటర్‌ని పిలిచి ‘ఏమయ్యా! నేను కళ్లు మూసుకుని ఒక ఐటమ్ మీద వేలు పెడతాను. అది తీసుకురా’ అన్నాడు.
పది నిమిషాల్లో వెయిటర్ రెండు ప్లేట్లలో ఉప్మాని తీసుకుని వాళ్ల ముందు పెట్టాడు. ‘ఇదేమిటయ్యా! ఉప్మా తెచ్చావ్’ అన్నాడు. ‘మీరు కార్డ్‌లో అక్కడే వేలు పెట్టారు సార్’ అని చెప్పి వెళ్లిపోయాడు.
రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పనట్టు నాకు ఈ ఉప్మా గోలేంటిరా అనుకుంటూనే ప్లేటు ఖాళీ చేశాడు. ఆనందం ఈసారి ఇలా కాదు పక్కవాడు ఏం చెప్తే అదే నేను చెప్తాను అని మనసులో అనుకుని, వాడు ఏం చెప్తాడా అని వింటున్నాడు. పక్క టేబుల్ దగ్గరకు వెయిటర్ వచ్చాడు. పక్కవాడు ‘రిపీట్ ది సేమ్’ అని అనడం విన్నాడు ఆనందం.
ఇదేదో కొత్త వంటకం లాగ ఉందే.. ఇదే ఆర్డర్ ఇద్దాం అనుకున్నాడు.
ఇంతలో తన టేబుల్ దగ్గరకి వెయిటర్ వచ్చి ‘ఇంకా ఏమైనా కావాలా సార్’ అని అడిగాడు. ఆనందం ఏదో గొప్పగా కుర్చీలో వెనక్కి జారపడుతూ ‘రిపీట్ ది సేమ్’ అన్నాడు.
మరో పది నిమిషాల్లో రెండు ప్లేట్ల ఉప్మా ఆనందం ముందు ప్రత్యక్షమయింది. అది చూసిన ఆనందం మొహంలో ఆనందం పోయి రంగులు మారాయి. ఇక తన దురదృష్టాన్ని ఎవరూ మార్చలేరని గ్రహించి హోటల్‌లో బిల్ కట్టి నెమ్మదిగా బయటకి జారుకున్నాడు ఆనందం, ప్రమీలతో పాటు.
*

మహతి కమల, ఫోన్: 9703770890