విశాఖపట్నం

ట్రాఫిక్ జామ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుబజారు దగ్గర ఆదివారం వచ్చిందంటే చాలు నడవడానికి కూడా దారి ఉండదు. రెండు వైపులా తోపుడుబళ్లు, వాటి మధ్యలో వాహనాల పార్కింగ్. రోడ్లపైనే అమ్మకాలు సాగిపోతుంటాయి. లోపలికెళ్లడానికి విపరీతమైన శ్రమ. అటు నుండి కూరగాయాల బ్యాగుతో రావడం మరీ శ్రమ. కొంచెం దూరంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇద్దరుంటారు. మెయిన్‌రోడ్డుపై వాహనాలను కంట్రోల్ చేస్తుంటారు గానీ ఇటు వైపు చూడరు.
రాజుకి ప్రతి ఆదివారం రైతుబజారుకు వెళ్లాలంటే ఇబ్బంది. వాహనం పార్కింగ్ ఓ శ్రమ. లోపలికి వెళ్లడం కష్టం. బయటికి రావడం అబ్బో ఓ తెలుగోడా! ఏమిటీ క్రమశిక్షణ లేని వ్యక్తిత్వం! వీరు మారరా’ అనుకున్నాడు.
ఆ ఆదివారం కూడా వచ్చాడు. బండి పార్కింగుకు అవకాశం లేకపోవడంతో మెయిన్‌రోడ్డు దగ్గర ఓ షాపు ఎదురుగా పార్క్ చేశాడు. బజారు లోపలికి వెళ్లి కాయగూరలు కొనుక్కుని అరగంటలో తిరిగి వచ్చాడు. ఎదురుగా కానిస్టేబుల్.
‘‘ ఏమయ్యా! బండిని ఇక్కడ పార్క్ చేశావ్! ఇది నో పార్కింగ్ ఏరియా ఫైన్ కట్టు’’ అన్నాడు కరుగ్గా.
‘‘రైతుబజారు దగ్గర ఖాళీ లేదు సార్. అందుకే ఇక్కడ పార్క్ చేశాను. అక్కడున్న రోడ్డు మీద గల తోపుడుబళ్లను ఖాళీ చేయించండి సార్. అప్పుడు పార్కింగుకి చాలా ప్లేస్ ఉంటుంది’’
‘‘నాకే ఎదురు చెబుతావా? తీయ్ మూడొందలు’’
‘‘నేనెందుకు కట్టాలి సార్! అక్కడ పార్కింగుకి మీరు అవకాశం కల్పించాలి. అలా కానప్పుడు నేను బండిని ఎక్కడ పార్క్ చేస్తాను’’
‘‘మర్యాదగా డబ్బులు తియ్. పోలీసులతో పెట్టుకోకు’’ కోపంగా అన్నాడు.
గొడవ పెద్దదయింది. జనం మూగారు. తలో మాట అన్నారు. రాజు ఎంత వాదించినా లాభం లేకపోయింది. బాధపడుతూ, పోలీసులను తిట్టుకుంటూ ఫైన్ కట్టాడు.
* * *
ఆరోజు ఉదయం పనె్నండు గంటలు.
రాజు మళ్లీ బైక్‌పై రైతుబజారు దగ్గరకి వెళ్లాడు. తోపుడుబళ్లు కనిపించాయి. దాంతో బైక్ పార్కింగుకి కూడా స్థలం ఉంది. తన బైకుని పార్క్ చేసి వెళుతూ అక్కడ జరుగుతున్న సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు తోపుడుబళ్ల వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ కనిపించారు. ప్రతి బండికీ ముప్ఫై రూపాయలు వసూలు చేస్తున్నారు. కనీసం ఇరవై బళ్లున్నాయి. అంటే ఈ రోజు సంపాదన ఆరువందల రూపాయలు. అప్పనంగా వచ్చిన సొమ్ము. కష్టపడి సంపాదించుకుంటున్న వారి నుండి అన్యాయంగా లాక్కుంటున్న సొమ్ము.
తన దగ్గర ఫైన్ వసూలు చేసిన కానిస్టేబుల్ దీనికంతటికీ లీడర్. రాజు గుండె రగిలిపోయింది. ఆవేశంగా కానిస్టేబుల్ దగ్గరకి వెళ్లాడు.
‘‘ ఇక్కడ ట్రాఫిక్‌కు ఇంత అంతరాయం జరుగుతున్నా కనీసం మీరు స్పందించకపోవడానికి కారణం ఇదన్నమాట’’ కోపంగా అన్నాడు.
కానిస్టేబుల్ ముఖం ఎర్రబడింది. కోపంగా రాజు వైపు చూశాడు.
‘‘వీళ్లందరూ చిన్నచిన్న వ్యాపారులు. అందుకే ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తున్నా ఊరుకుంటున్నాం’’ ఒక కానిస్టేబుల్ అన్నాడు.
‘‘నా బైక్ ఒక షాపు దగ్గర పెట్టాను. అది ట్రాఫిక్‌కు ఏమాత్రం అంతరాయం కలిగించలేదు. అయినా మీరు’’ మాట పూర్తి కాలేదు మరొక పోలీసు అన్నాడు ‘‘ ఏది ఎలా చెయ్యాలో మాకు తెలుసు. నువ్వెవడివిరా అడగడానికి?’’ అంటూ తిట్టాడు.
రాజు ఇగో దెబ్బతింది. ‘‘హోల్డ్ యువర్ టంగ్. మీరు పోలీసులు కావచ్చు. నేను పౌరుడిని. నన్ను గౌరవించాల్సిన బాధ్యత మీకుంది’’
కానిస్టేబుళ్లు పకపకా నవ్వారు.
‘‘నేను ఎస్పీని కలుస్తాను’’ అని కోపంగా వెళ్లిపోయాడు రాజు.
* * *
ఆ సాయంత్రం ఎస్పీగారు లేకపోవడంతో వన్‌టౌన్ ఎస్సైని కలిసాడు. జరిగింది వివరంగా చెప్పాడు. పోలీసులు లంచాలు తీసుకుని ఏ విధంగా ట్రాఫిక్‌ని నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాడు.
ఎస్సై సావధానంగా విన్నాడు. ఆరోజు డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు ఎవరో తెలుసుకున్నాడు. ఆనక తీరుబడిగా అన్నాడు. ‘‘ ఈ విషయాన్ని పరిశీలిస్తాను. అక్కడ డ్యూటీ కానిస్టేబుళ్లు డబ్బులు వసూలు చేస్తున్న సంగతి నాకు తెలియదు. పిలిచి వారిని మందలిస్తాను. అది నో పార్కింగ్ ఏరియా. మీకు ఫైన్ వేయడం సబబే’’
‘‘కానీ సార్’’ ఏదో అనబోయాడు రాజు. ఇన్‌స్పెక్టర్ అడ్డుకున్నాడు. ‘‘ప్లీజ్ మీరు వెళ్లండి’’ అన్నాడు.
రాజు విసురుగా బయటికి వెళ్లిపోయాడు.
రాత్రి ఎనిమిది గంటలకి ఎస్సై డ్యూటీ కానిస్టేబుళ్లని పిలిచాడు.
వాళ్లు చేతులు కట్టుకుని నిలబడ్డారు.
‘‘మీరు ప్రతిరోజూ రైతుబజారు దగ్గర డ్యూటీ ఎందుకు వేయించుకుంటున్నారో నాకు అర్ధమయింది. మర్యాదగా వసూలు చేసిన మొత్తంలో సగం నాకివ్వండి. మిగతాది మీరు పంచుకోండి. ప్రతిరోజూ ఇలాగే జరగాలి అర్ధమయిందా?’’
వాళ్లు తలలూపారు.
రైతుబజారు దగ్గర ట్రాఫిక్ సమస్య షరా మామూలే!

- మల్లారెడ్డి రామకృష్ణ,
బుడితి-532427,
సారవకోట మండలం,
శ్రీకాకుళం జిల్లా. సెల్ : 8985920620.

-మల్లారెడ్డి రామకృష్ణ, బుడితి