కథ

వృథా ప్రయాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో ఎంపికైన రచన
**

కారు స్టీరింగ్ తిప్పుతున్న ఆనంద్ మనసు ఉద్విగ్నతకి గురి అవుతోంది. ఎక్కడ ఓటమిపాలై మానసికంగా దెబ్బ తిన్నామో తిరిగి అక్కడే విజయ బావుటా ఎగరేయడంలో ఓ రకమైన మత్తుంది. ఆనంద్ ఆ మత్తును అనుభవించడం కోసం తహతహలాడుతున్నాడు.
ఇప్పుడు కోమలి ఎలా ఉందో? ఆ సుదర్శన్‌గాడితో హాయిగా కాపురం చేసుకుంటూ ఉండి ఉంటుందేమో. ఆస్తిపరుడు, పైగా కళ్ల ముందే బిజినెస్ మేగ్నెట్‌గా ఎదిగినవాడు. తన ప్రేమని నిర్దాక్షిణ్యంగా త్రుంచి మరీ అతన్ని పెళ్లి చేసుకున్నది. హాయిగానే ఉంటుంది మరి! అతని ఆలోచనలు క్రమంగా గతంలోకి జారుకున్నాయి.
ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టాడు ఆనంద్. తండ్రి అతనికి ఎన్నో నీతి కథలు చెప్పాడు. తులసి మొక్క నాటితే గంజాయి మొక్క పెరగదన్నట్టు ఆనంద్ కూడా నీతి, నిజాయితీలని ఊపిరిలోనూ, మంచితనాన్ని హృదయంలోనూ నింపుకుని పెరిగాడు.
ఒకానొక క్షణంలో కోమలికీ, అతనికీ మధ్య ఆకర్షణ ఏర్పడింది. దాన్ని ప్రేమ అనుకున్నాడు. ప్రేమ మైకంలో పడిన ప్రతీ కుర్రాడూ తన మంచితనం తాను ప్రేమించే అమ్మాయి దృష్టిలో పడాలని ఆరాట పడుతుంటాడు. అవినాశ్‌గాడు టైఫాయిడ్ బారిన పడి హాస్పిటల్లో ఉంటే ప్రతీరోజూ హాస్పిటల్‌కి వెళ్లి వాడి బాగోగులు చూశాడు. మందులు కొని తీసుకురావడం దగ్గర నుంచి, హాస్పిటల్‌కి భోజనం తేవడం వరకూ అన్నీ అతనే బాధ్యతగా నెత్తిన వేసుకున్నాడు. అదంతా కోమలి దగ్గర కూడా ప్రస్తావించాలని చూసేవాడు. స్నేహానికే అంత విలువ ఇచ్చేవాడు ప్రేమకి ఇంకెంత విలువ ఇస్తాడో అని కోమలి అనుకోవాలని అతని వాంఛ.
కానీ కోమలి అవేమీ సరిగ్గా వినేది కాదు. మనిద్దరి మధ్య మూడో మనిషి ప్రస్తావన ఎందుకులే ఆనంద్? అని కొట్టిపారేసేది. తన మంచితనాన్ని ఆమె గుర్తించకపోవడం అతనికి ఎంతో వెలితిగా అనిపించేది. అంతేకాదు - ఆమె అప్పుడప్పుడూ సుదర్శన్ గురించీ, అతని దర్జా గురించీ గొప్పగా మాట్లాడుతుండేది. అది మూడో మనిషి ప్రస్తావనగా ఆమెకి ఎందుకనిపించలేదో అతనికి ఎంతకీ అర్థమయ్యేది కాదు.
ప్రియురాలి మనసు గెలుచుకోవడం ఖరీదుతో కూడుకున్నదని ఒకసారి ఆనంద్‌కి అనుభవ పూర్వకంగా అర్థమైంది. ఎగ్జిబిషన్‌లో ఒక అందమైన పెయింటింగ్ చూసి చాలా ముచ్చట పడింది. వెంటనే జేబు చూసుకున్నాడు. ఏడువందలు ఉంది. పెయింటింగ్ ఖరీదు చూశాడు. రెండు వేలు. నీరుగారిపోయాడు. ఆమె దాన్ని కొనిపెట్టమని అడగలేదు. అయినా ఎందుకో గిల్టీగా ఫీలయ్యాడు. ఆమె తన చేతగానితనాన్ని ఎద్దేవా చేస్తున్నట్టే అనిపించసాగింది.
అతను రాజీ పడలేదు. మరునాడు మిత్రుల దగ్గర అప్పు చేసి అదే షాప్‌కి వెళ్లి పెయింటింగ్ కోసం చూశాడు. దురదృష్టంకొద్దీ ఆ పెయింటింగ్ అక్కడ లేదు. స్టాల్ అతన్ని అడిగితే ఎవరో కొనుక్కుపోయారని చెప్పాడు. నిరాశగా వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఆ రోజంతా అతనికి నిద్ర పట్టలేదు. రాత్రంతా పెయింటింగే కళ్ల ముందు మెదిలింది.
అయితే కొన్నవాళ్లు ఎవరో తెలిసాక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తనంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడన్న అభిప్రాయానికి వచ్చేశాడు. ఎవరి పెళ్లిలోనో ప్రెజెంట్ చేయడానికి అవినాశ్ గాడే ఆ పెయింటింగ్ కొన్నాడని తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇంకేం? పెళ్లి కోసం మరొకటి కొనమని ఈ పెయింటింగ్‌ని తాను తీసుకోవచ్చు. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
అయితే అక్కడ మళ్లీ చుక్కెదురయింది. అవినాశ్ ఆ గిఫ్ట్ మార్చడానికి ఒప్పుకోలేదు. గిఫ్ట్ పేకింగ్ అయిపోయింది. పైగా ఇవ్వబోయే గిఫ్ట్ గురించి అవతలి వాళ్లకి ముందే చెప్పేయడం వల్ల అది కుదరదని నిష్కర్షగా చెప్పేశాడు.
అయితే చిత్రమేమిటంటే మరునాడు అవినాశ్ ఆ పెయింటింగ్‌ని సుదర్శన్‌గాడు అడగ్గానే ఇచ్చేశాడు. అది విన్నాకా ఆనంద్‌కి తల కొట్టేసినట్టయింది. తాను అడిగితే ఇవ్వనని నిర్మొహమాటంగా చెప్పిన వాడు సుదర్శన్ అడగ్గానే ఎలా ఇచ్చేసాడు? అతను చేసిన మేలేమిటి? తాను చేసిన కీడేమిటి? ఆ మాటకొస్తే వాడు టైఫాయిడ్‌తో హాస్పిటల్లో ఉన్నప్పుడు తానెంత సహాయం చేశాడు? అదంతా ఎక్కడికి పోయింది?
సుదర్శన్ గాడికి కారుంది. బోలెడంత ఆస్థి ఉంది. తానో? ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాధారణ వ్యక్తి. అవును. అదే కారణం. డబ్బు మనిషిని ఎలా ఆడిస్తుందో అప్పటి నుంచే అర్థం చేసుకోవడం ప్రారంభించాడు.
కోమలి పుట్టినరోజు నాడు ఫంక్షన్‌కి తననే ఆహ్వానించిందనుకున్నాడు. కానీ అక్కడ అవినాశ్, సుదర్శన్ కూడా ఉన్నారు. సుదర్శన్ అక్కడ ఉండడం ఆనంద్‌కి అస్సలు నచ్చలేదు. పాయసం తాగబోతే చేదు విషం నోటికి తగిలినట్టు ఫీలయ్యాడు. పైగా బర్త్ డే గిఫ్ట్‌గా అతను ప్రెజెంట్ చేసినది చూసి తల తిరిగిపోయిందతనికి. కొన్నాళ్ల క్రితం దేన్ని చూసి ఆమె ముచ్చట పడిందో, దేన్ని కొనడానికి తన దగ్గర డబ్బులు చాలక ఒకరోజు ఆగాల్సి వచ్చిందో, దేన్ని తాను గిఫ్ట్‌గా కొనిద్దామనుకుని ప్రయత్నించి ఇవ్వలేకపోయాడో... ఆ పెయింటింగ్ అది! ఆనంద్ మనసు బాధగా మూలిగింది.
ఈ మధ్య ఒక విషయం అతని హృదయాన్ని ముల్లులా తాకుతోంది. ఎప్పుడు ఫోన్ చేసినా ఆమె తడి, పొడిగా మాట్లాడి మరో మాటకి అవకాశం లేకుండా ఆమె ఫోన్ పెట్టేస్తోంది. మార్పు తెలుస్తూనే ఉంది. ఒకరోజు అననే అనేసింది. మా డాడీ నాకు సంబంధాలు చూస్తున్నార్ట. నన్ను మరిచిపో ఆనంద్ అని.
ఎంత తేలిగ్గా చెప్పేసింది? హతాశుడై చూస్తూండిపోయాడు. తర్వాత కొన్నాళ్లకి తెలిసింది. ఆమె తరచూ సుదర్శన్‌తో కలిసి తిరుగుతోందని. అతనితో పరిచయం పెరిగాకే తనతో అంతంత మాత్రంగా ఉండడం ప్రారంభించిందని. అది విని భరించలేక పోయాడు. ఆకాశం విరిగి నెత్తిన పడితే బాగుండునని భావించాడు. సునామీ చుట్టుముట్టి లోకాన్ని కబళిస్తే బాగుండునని ఆశించాడు. ఉన్నచోటునే డైనమైట్లు పేలి ప్రపంచం భస్మీపటలం అయిపోతే బాగుండునని వాంఛించాడు. కానీ అవేమీ జరగలేదు. గుండెని కాల్చేసే ఆశాభంగం మాత్రం అలాగే మిగిలిపోయింది.
అతనిలో కసి పెరిగిపోయింది. తనను భంగపరచింది కోమలి అయినా పరోక్షంగా తన పేదరికమే అన్న సంగతి మనసులో బాగా నాటుకుపోయింది.
ఓ నిశీధి రాత్రి. నిబిడాంధకారంలో ఒంటరిగా కూర్చుని, పాలపుంతలోని నక్షత్రాల వైపు తదేకంగా చూస్తూ నిశ్శబ్దలోచనా తరంగాల మధ్య ఓ భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏది ఏమైనా డబ్బు బాగా సంపాదించాలని. అందుకోసం మంచి, చెడు, నీతి, నియమం లాంటివి వదిలేయాలని. పాపభీతి, ఆత్మసాక్షి లాంటి వాటిని పట్టించుకోకూడదని.
ఆ మరునాడే అతను ముగ్గురు నలుగురు స్నేహితుల దగ్గర ఇంట్లో అర్జంటు అవసరం ఏర్పడిందనీ, నాలుగు రోజుల్లో సర్దేస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గరా పదిహేను వేలు చొప్పున అప్పు తీసుకున్నాడు. వాళ్లల్లో సుకుమార్ అనే వాడు అప్పు ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు. ఈ డబ్బు మా నాన్న ఆపరేషన్ కోసం దాచి ఉంచింది ఆనంద్. ఎప్పుడూ అడగని వాడివి అడిగావు. ఏదో పెద్ద ఇబ్బందే వచ్చి ఉంటుందని ఇస్తున్నాను. స్నేహితుడివి కాబట్టి లేవు అని చెప్పలేక పోతున్నాను. నిజంగా నాలుగు రోజుల్లో ఇచ్చేస్తావు కదూ?
ఆనంద్ మనసు ఒక్క క్షణం కలవరపాటుకి గురి అయ్యింది. అంతలోకే గుండెని రాయి చేసుకున్నాడు. అనుకున్నది సాధించాలంటే ఇలాంటి సున్నితమైన భావావేశాల్ని తొక్కిపెట్టాలన్న కఠోరమైన నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయాడు. రెండు రోజుల తర్వాత ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వెళ్లే రైలు ఎక్కేసాడు - కృతనిశ్చయుడై, దృఢచిత్తుడై, ఏకైక దీక్షాబద్ధుడై.
అలా వెళ్లినవాడు ఇప్పుడు కోటీశ్వరుడై తిరిగి వస్తున్నాడు. సుదర్శన్‌కన్నా నాలుగు రెట్లు సంపన్నుడై వస్తున్నాడు. కోమలి మీద కసితో సాధించిన ఘన విజయంతో వస్తున్నాడు.
ఆ విజయం అతనికి అనుక్షణం మత్తు ఇస్తూనే ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడూ తాను స్నేహితుల దగ్గర అప్పు చేసి ఎగ్గొట్టిన సంగతి గుర్తొచ్చినప్పుడు మాత్రం ఏదో తెలీని గిల్టీ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సుకుమార్ సంగతి మరీను. అడిగింది స్నేహితుడు కాబట్టి ఇవ్వనని చెప్పడం చేతకాని అసహాయత ఒకవైపు, చావు బ్రతుకుల్లో ఉన్న తండ్రి ప్రాణం మరోవైపు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతూ దీనంగా ముఖం పెట్టి అతను అడిగిన మాట -నిజంగా నాలుగు రోజులకే ఇచ్చేస్తావు కదా? - అని గుర్తొచ్చినప్పుడు మాత్రం మనసు అలజడికి గురవుతూ ఉంటుంది. అయితే అది రెండు క్షణాలు మాత్రమే. తర్వాత మనసుని నిలదొక్కుకుని మామూలుగా అయిపోతుంటాడు.
చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే రావడం ఈ ఊరుకి. కేవలం కోమలికి కనిపించి తన ఎదుగుదలని చూపించి ఆమెకి కనువిప్పు కలిగించడం కోసమే ఇప్పుడు వస్తున్నది. తనను కాదని ఆ సుదర్శన్ గాడిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె కుమిలి కుమిలి ఏడవాలి.
ఊళ్లోకి ప్రవేశించే కొద్దీ అతనిలో ఉద్వేగం ఎక్కువ కాసాగింది. ఆమె ఫోన్ నెంబర్ ఎవరినో అడిగి ఇదివరకే తీసుకుని ఉన్నాడు. బయల్దేరేముందే ఫోన్ చేసి అడిగాడు ‘ఎక్కడున్నావు కోమలీ? చాలా కాలమైంది నిన్ను చూసి’ అని. ఆమె తాను ఉంటున్న వీధి పేరు చెప్పింది. అది అతను ఊహించినదే. సుదర్శన్‌గాడు ఉండే వీధి తనకి తెలియనిదేం కాదు కదా?
కారు నాలుగైదు మలుపులు తిరిగాక ఒక ఖరీదైన భవనం ముందు ఆగింది. ఒకప్పుడు తన పేదరికాన్ని వెక్కిరించిన సుదర్శన్ ఇల్లది. ఇప్పుడు హైదరాబాద్‌లో తాను కట్టించుకున్న ఇంటితో పోల్చితే ఎందుకూ పనికిరాదు.
భవంతి ముందు కారాపి అందులో కూర్చునే కోమలి నెంబర్‌కి ఫోన్ చేశాడు. ‘ఒకసారి బయటకు రాగలవా కోమలి? ఆహ్వానం లేకుండా లోపలికి రావడం మర్యాదగా ఉండదు కదా?’ అన్నాడు. ఆమె రావడం, తన మెర్సిడెస్ కారుని చూసి కళ్లల్లో ఈర్ష్య కలగడం తాను కళ్ళారా చూడాలని ఇంటి గుమ్మం వైపే కన్నార్పకుండా చూడసాగాడు.
అతని ఫోన్ మోగింది. ‘ఎక్కడున్నావ్ ఆనంద్? నేను బయటికి వచ్చాను’ అన్నది.
‘నేను నీ ఇంటి ముందే ఉన్నాను కోమలీ. నీ ఇంటి తలుపులు ఇంకా తెరచుకోనే లేదు’ అన్నాడు.
‘అయ్యో! తలుపులు తెరుచుకోవడం, నేను బయటికి రావడం, వాకిట్లో నిలబడటం అన్నీ జరిగాయి. నువ్వే కనబడ్డం లేదు. ఎక్కడున్నావ్?’
‘మీ ఇంటి ముందు మెర్సిడెస్ - బెంజ్ కారు ఉంది చూడు. దానిలో ఉన్నాను’ అన్నాడు గర్వంగా.
‘ఓ అందులో ఉన్నావా? అయితే నువ్వు మా ఇంటి ముందు కాదు. సుదర్శన్ ఇంటి ముందున్నావు. కొంచెం వెనక్కి రా’ అన్నది గలగలా నవ్వేస్తూ.
ఈసారి తలమునకలుగా ఆశ్చర్యపోవడం ఆనంద్ వంతయింది. ‘ఇదేమిటి? సుదర్శన్ ఇల్లు, ఆమె ఇల్లు ఒకటి కాదా? వేర్వేరా?’ అని ఆలోచిస్తూ కారుని రివర్స్ చేసి వెనక్కి తీసుకువచ్చాడు. ఒక సామాన్యమైన మధ్యతరగతి డాబా ఇంటి ముందు నిలబడి ఉంది కోమలి. అతను కారు దిగి నడిచాడు. ఆమె లోపలికి రమ్మన్నట్టు తల ఊపుతూ ఇంట్లోకి దారితీసింది.
మంచినీళ్లు, టీ లాంటి మర్యాదలు అయ్యాక ‘చెప్పు ఆనంద్ ఎలా ఉన్నావ్? చాలాకాలానికి చూస్తున్నాను.’ అన్నది. ఆమె కళ్లల్లో ఈర్ష్య కానీ, బాధ కానీ ఏమీ కనిపించలేదతనికి. ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితుణ్ణి చూస్తున్నానన్న ఆనందం తప్ప మరేం కనిపించలేదామె కళ్లల్లో.
‘మీ ఆయన ఏడీ?’ అని అడిగాడు తన సందేహాన్నీ ఎలా నివృత్తి చేసుకోవాలో తెలీక.
‘వస్తారు. చిన్న పని మీద బయటికి వెళ్లారు. అదిగో మాటల్లోనే వచ్చారు’ అన్నది.
అప్పుడు లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి మరింత ఆశ్చర్యపోయాడు ఆనంద్. అతనెవరో కాదు, సుకుమార్. ఒకప్పుడు తాను అప్పు అడిగితే ‘మా నాన్న ఆపరేషన్ కోసం దాచిన డబ్బు. నిజంగా నాలుగు రోజుల్లో ఇచ్చేస్తావు కదా?’ అని బేలగా అడిగిన సుకుమార్. మధ్యతరగతి కన్నా కొంచెం దిగువగా ఉండే కుటుంబం అతనిది.
‘ఏం ఆనంద్ బాగున్నావా ? ఎప్పుడో ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయావు. మళ్లీ ఇటువైపే రానే లేదు నువ్వు’ అంటూ పలకరించాడు సుకుమార్.
‘కోమలీ! నువ్వు సుదర్శన్‌ని కదా ప్రేమించింది’ అని అడగబోయి ఆమె భర్త ముందే ఆ ప్రస్తావన చేయడం బాగోదని ఠక్కున ఆగిపోయి ‘నువ్వు పెళ్లి చేసుకున్నది.. సుకుమార్‌నా?’ అంటూ మాట మార్చేశాడు.
ఆమె గలగలా నవ్వేసింది. ‘నీ సందేహం అర్థమైంది ఆనంద్. సుదర్శన్‌ని ప్రేమించి సుకుమార్‌ని పెళ్లి చేసుకున్నానేమిటనేగా నీ సందేహం?’ అన్నది. సుకుమార్ జేబులో మొబైల్ మోగితే మాట్లాడడానికన్నట్టు బయటికి వెళ్లాడు.
‘సారీ కోమలీ! నువ్వు మంచి స్థితిలో ఉండి సంతోషంగా బ్రతుకుతూ ఉండి ఉంటావని ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చాను. అప్‌సెట్ అయ్యాను’ అన్నాడు. మనసులో లేని ఫీలింగ్‌ని బయటికి వ్యక్తం చేయడం ఎంత కష్టమో ఆ మాట అంటున్నపుడు తెలిసిందతనికి.
కోమలి గలగలా నవ్వేసింది. ‘ఏం అప్‌సెట్ అవ్వకు ఆనంద్. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నాకేం తక్కువ ఇప్పుడు?’ అన్నది. ఆమె ఆ మాటలు మనస్ఫూర్తిగా అంటున్నట్టు ఆమె కంఠస్వరమే చెప్పేస్తోంది.
ఆనంద్‌కి ఆ సమాధానం రుచించలేదు. తనకి సంతృప్తి కలిగించే సమాధానం ఆమె నోట ఎలా రాబట్టాలా అని మాటలు వెదుక్కోసాగాడు. ఎదురుచూసిన కిక్ అందడం లేదు మరి.
‘ఆ టాపిక్ ఇంక వదిలేయ్ ఆనంద్. ముసుగులో గుద్దులాటలొద్దు. నీ మనసులో మెదులుతున్న ప్రశే్నమిటో నాకు తెలుసు. నిజమే. ఒకప్పుడు నేను నీ ప్రేమని తిరస్కరించి సుదర్శన్ వెంట పడ్డాను. అది డబ్బు వల్ల వచ్చే ఆకర్షణ అని అప్పట్లో నాకు తెలియలేదు. మనిషికి రెండు ఛాయిస్‌లు ఉన్నప్పుడు వాటిల్లో బెటర్ ఛాయిస్ వైపు మొగ్గు చూపడం సహజం కదా? అప్పట్లో నేనూ అదే చేసి ఉంటాను. అయితే ఒక విషయాన్ని నేను గ్రహించలేక పోయాను. అవతలి వ్యక్తికి కూడా బెటర్ ఛాయిస్‌లు ఉంటాయి కదా? ఆ వయసులో ఈ చిన్న విషయం అర్థం కాకపోవడంలో వింతేమీ లేదు కదా? కానీ అర్థమయ్యాక అదో గుణపాఠం అయ్యింది నాకు. అందుకే ఈ డబ్బు మీద, అది తీసుకువచ్చే కృత్రిమ దర్పాల మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి నా ప్రేమని అతి సామాన్యమైన కుటుంబంలో ఉన్న సుకుమార్‌కి పంచి అతనే్న పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను సంపూర్ణమైన సంతృప్తితో బ్రతుకుతున్నాను’ అంది.
ఆనంద్ అయోమయంలో పడిపోయాడు. తానొకటనుకుని వచ్చాడు. ఇక్కడ మరొకటి ఎదురైంది. అప్పట్లో తమ మధ్య ఏర్పడిన చిన్న స్పర్థ ఈనాటి వరకూ తనని పట్టి పీడిస్తూనే ఉంది. తన ఎదుగుదలని చూసి ఆమె కుళ్లుకపోవాలని ఆశపడి ఇక్కడి వరకూ రావడమే అందుకు నిదర్శనం. ఆమెకి కూడా సుదర్శన్‌గాడి వల్ల అలాంటి స్పర్థే ఎదురైనా అది ఆమెని ఏ మాత్రం బాధ పెట్టలేకపోయింది. పైగా సంతృప్తిగా బ్రతుకుతోంది. ఎక్కడుంది తేడా?’ అని ఆలోచించాడు.
మొబైల్ మాట్లాడ్డం పూర్తి అయ్యాక సుకుమార్ లోపలికి వచ్చి కూర్చున్నాడు.
ఆనంద్ బ్రీఫ్‌కేసులోంచి చెక్‌బుక్ తీసి ముప్పై వేలకి రాసి సుకుమార్‌కి అందిస్తూ ‘సుకుమార్! ఒకప్పుడు నీ దగ్గర పదిహేను వేలు తీసుకున్నాను. తిరిగి తీర్చడం ఆలస్యమైంది. ఏమనుకోకు. ఇదిగో ఇది ఉంచు’ అన్నాడు.
అయితే సుకుమార్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ‘ఆ రోజు నేను నిన్ను గుచ్చిగుచ్చి ఎప్పుడు తీర్చుతావు అని అడిగింది మా నాన్న ప్రాణాల్ని ఎక్కడ కాపాడుకోలేక పోతానోనన్న భయంతో. ఇప్పుడు ఆయనే లేరు. ఏం చేసుకోను ఈ డబ్బు?’ అన్నాడు. ఆనంద్‌కి ఏం చెప్పాలో తోచలేదు. సూటిగా సుకుమార్ కళ్లల్లోకి చూడలేకపోయాడు.
ఐదు నిమిషాల తర్వాత ‘మరి ఉంటాను కోమలీ. బై సుకుమార్’ అంటూ లేచాడు ఆనంద్.
బయటికి వచ్చేస్తోంటే కోమలి అన్న మాటకి షాక్ అయ్యాడు. ‘నీకు తెలుసా ఆనంద్? డబ్బు మీద వ్యామోహం పూర్తిగా తొలగిపోయాక ఒకలాంటి వైరాగ్యం కూడా అబ్బింది నాకు. అప్పుడు నేను నీ కోసం వేయి కళ్లతో వెదికాను. మన ప్రేమని తిరిగి పండించుకోవాలని ఎంతగానో ఆశించాను. కానీ నువ్వు కనపడలేదు. నీ అడ్రస్ ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. చివరికి సుకుమార్‌ని పెళ్లి చేసుకున్నాను’
ఆ కొసమెరుపు విన్నాక ఆనంద్ ఖంగు తిన్నాడు. అంటే తాను ఇన్నాళ్లు పడిన కష్టం అంతా ఉత్తుత్తి హంగామాయేనా? వ్యవస్థ పట్ల కసి పెంచుకోవడం, హైదరాబాద్ వెళ్లిపోవడం, మానసికంగా మొరటుదేలి నీతి, నిజాయితీల్లాంటి వాటిని వదిలిపెట్టేయడం, డబ్బు వెంట పరుగులు తీయటం.. ఇవన్నీ ఎందుకోసం చేసినట్టు? అంతా వృథా ప్రయాసేనా?
కారు రివర్స్ చేసుకున్నాడు. కాలంలో కూడా ఇలాగే తిరిగి వెనక్కిపోయే సదుపాయం ఉంటే ఎంత బాగుణ్ణు? అని అనుకోకుండా ఉండలేకపోయాడు.

పసుపులేటి తాతారావు.. 9491974648