కథ

అక్వేరియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో ఎంపికైన రచన
***

‘ప్రయాణీకులకు గమనిక, తిరుపతి నుండి కాచిగూడ వెళ్లు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మరి కొద్ది నిమిషాల్లో ఒకటవ నెంబరు ప్లాట్‌ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది’ - సాయి ఆటోలోంచి తన బ్రీఫ్‌కేస్‌తో దిగి స్టేషన్‌లోకి అడుగుబెట్టేసరికి స్పీకర్లోంచి రైల్వే వారి అనౌన్స్‌మెంట్ వినిపిస్తోంది. హడావిడిగా తనకి అలాట్ చేసిన ఎస్3 కంపార్ట్‌మెంట్ వెతుక్కుని, చార్ట్‌లో తన పేరు చూసుకొని సాయి రైలెక్కిన రెండు నిమిషాలకే పెద్దగా కూత వేసి బయలుదేరింది ట్రైన్.

సాయి జేబులోంచి టికెట్ బయటకు తీసి నంబర్ చూసుకొని తనకు కేటాయించిన ఇరవై ఐదవ నెంబరు సీటు వద్దకు చేరుకొని, బ్రీఫ్‌కేస్‌ను సీటు కిందికి తోసి కూర్చున్నాడు. ‘ట్రైన్‌లో ఏదో ఒకటి తినేస్తాను, కేరియర్ వద్దని చెప్పినా వినకుండా అతని భార్య సుమతి పులిహోరా, అందులో నంజుకోను టమోటా పచ్చడి చేసి టిఫిన్ బాక్స్‌లో సర్ది ఇచ్చింది. టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ ఉన్న చిన్న సంచీని, కంపార్ట్‌మెంట్ గోడల కమర్చబడిన హేంగర్‌కి తగిలిచించి ఊపిరి పీల్చుకున్నాడు సాయి. ‘టిఫిన్ బాక్స్ సర్దడంలో కొంత లేటైనా ట్రైన్ సమయానికి అందుకోగలిగాను’ అనుకున్నాడు ఆనందంగా.
విండో సీటు సాయిది. అతని పక్కనే లాప్‌టాప్‌లో బిజీగా ఏదో చూసుకుంటూ ఆఫీసర్లా కనిపిస్తున్నా పెద్ద మనిషీ, అవతలి పక్క నుదుట తిరునామమూ, పంచెకట్టులో ఉన్న మరో నలభై ఏళ్ల శాల్తీ కూర్చుని ఉన్నారు. ఎదురు సీట్లో దంపతుల్లా కనిపిస్తూ నలభైయవ వడిలో ఉన్న ఇద్దరు కూర్చుని చిన్నగా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి పక్కన ప్రసాదాల కవర్ చూసి, వారు తిరుమల దర్శనానికి వచ్చిన వారిగా సులభంగా గుర్తుపట్టవచ్చు. వారి పక్క సీట్లో మరో యువకుడు సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ తన లోకంలో తానున్నాడు. విండో సీట్లో కూర్చున్న జీన్స్, టీషర్ట్‌లో వున్న ఓ ఇరవై రెండేళ్ల అమ్మాయి తన సెల్లో ఎవరితోనో చిన్నగా మాట్లాడుతూ, పదేపదే నవ్వుతూ ఏదో చెబ్తూ ఉంది.
సాయి చేనేత జౌళి శాఖలో సూపరింటెండెంట్‌గా తిరుపతిలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మరుసటి రోజు హైదరాబాద్‌లో శాఖాపరమైన కాన్ఫరెన్స్ ఉంది. దానికి హాజరు కావలసిన ఆఫీసరు హఠాత్తుగా జబ్బు పడటంతో ఆ భారం సాయిపై పడింది. తత్కాల్లో అప్పటికప్పుడు రిజర్వేషన్ లక్కీగా దొరికింది. మీటింగ్ నోట్స్ తీసుకొని, బట్టలు, ఆఫీసు కాగితాలు బ్రీఫ్‌కేస్‌లో సర్దుకొని హడావిడిగా హైదరాబాద్ పయనమయ్యాడు సాయి.
రైలు రేణిగుంట దాటింది. ఆఫీసరులా ఉన్న వ్యక్తి లాప్‌టాప్ మూసి, కళ్లు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చున్నాడు. తిరునామంలో వున్న వ్యక్తి పేపరు బయటకు తీసి వార్తలు బిగ్గరగా చదువుతూ వాటిపై వ్యాఖ్యానాలు చేయసాగాడు.
‘ఇదిగో ఈ న్యూస్ చూశారా, గనుల స్కాముల కేసు హైకోర్టులో ఐదేళ్లు నడిచి, ఎట్టకేలకు ఈ రంగారెడ్డికి ఐదేళ్ల జైలుశిక్ష పడిందా, ఆరోగ్యం బాగా లేదని నెల రోజుల్లో బెయిలు తెచ్చుకొని విడుదలయ్యాడు. కోట్లు దిగమింగిన వాళ్లు లక్షణంగా తిరుగుతూ ఉన్నారు. ఇంకెందుకీ కోర్టులూ, విచారణలు’ దంపతుల్లో భర్తనుద్దేశించి నవ్వుతూ చెప్పాడు తిరునామాల వ్యక్తి.
‘అలాంటి వారికందరికీ నెల రోజుల బెయిలుకు రెండు లక్షలు ష్యూరిటీగా వసూలు చేస్తే కోట్లలో ఆదాయం వచ్చి దేశం బాగుపడుతుంది’ నవ్వుతూ అన్నారు ఆఫీసరు.
రైలు ఏదో స్టేషన్‌లో ఆగింది. వాటర్ బాటిళ్లూ, టిఫిన్లు అమ్మే హాకర్లు హడివిడిగా తిరుగుతూ ఉన్నారు. టికెట్ కలెక్టర్ వచ్చి వారి టికెట్లు చెక్ చేసి వెళ్లాడు.
మరో వార్త చదివి మళ్లీ వ్యాఖ్యానం మొదలుపెట్టాడు తిరునామం. ‘సిద్దార్థా అకాడెమీలో మరో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య అట. ఐనా ఈ స్టూడెంట్స్‌కిదేం పోయే కాలమండీ? తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు కట్టి చదివిస్తుంటే, హాస్టల్లో సుష్ఠుగా తిని చదువుకోక ఇలా ప్రాణాలు తీసుకుంటారాండీ? వాళ్లకు బుద్ధిలేదా?’
ఎదురుగా ఉన్న భార్యాభర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడడం గమనించాడు సాయి. భార్య తలదించుకొని కళ్లొత్తుకుంటూ ఉంది.
‘ఐనా ఈ కాలేజీ మేనేజిమెంటుననాలండీ! ఒకటే చదువు, చదువు అని ఇరవై నాలుగ్గంటలూ గోల, తోముడూను. వయసులో ఉన్న కుర్రాళ్లకు ఒక సినిమా, షికారూ రోజుకో రెండు గంటలు రిలాక్సేషన్ అవసరం లేదా? ఏ మాత్రం వెనుకబడినా, కాలేజీ వాళ్లు ‘నువ్వు పనికిరావు, మట్టికొట్టుకొని పోతావు’ అని అందరి ముందూ ఏవో శాపనార్థాలు పెడతారు. దాంతో ఇన్సుల్టుగా ఫీలై పిల్లలు ఏ సూయిసైడో చేసుకుంటారు. మా కొలీగ్ కూతురు కూడా అదే కాలేజిలో చదువుతూ, మార్కులు తక్కువొచ్చాయని మాస్టారు తిట్టడంతో ఈ మధ్యనే ఉరి వేసుకొంది’ ఆఫీసరు అందుకొని చెప్పాడు.
ఈసారి సాయి ఎదురుగా విండో సీట్లో కూర్చున్నావిడ తల ఒళ్లో దాచుకొని భోరున విలపించసాగింది. అందరూ ఆమె వంక ఆశ్చర్యంగా చూశారు. ఆమె భర్త ఆమె భుజంపై చేయి వేసి చిన్నగా సముదాయించాడామెను. కాసేపటికి తేరుకొని, భర్త బలవంతపెడితే లేచి వెళ్లి వాష్‌బేసిన్‌లో మొఖం కడుక్కొని వచ్చిందావిడ.
‘మీరు హైదరాబాదేనా?’ సాయి పలకరించాడు వారిని.
‘ఔను సార్. తిరుమల దర్శనానికి వెళ్లొస్తున్నాం. దేవుడి దయ వల్ల దర్శనం బాగా జరిగింది’ అన్నాడాయన.
‘ఐయామ్ సారుూ. సూపరింటెండెంట్, హేండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్’ తనను తాను పరిచయం చేసుకున్నాడు సాయి.
‘నా పేరు హనుమంతరావు, భూగర్భ జల వనరుల శాఖల్లో సూపరింటెండెంట్‌గా ఉన్నాను’ చెప్పాడాయన. ఆయన భార్య విండోలోంచి దిగులుగా చూస్తూ కూర్చుంది. కాసేపు వారు ఇరు శాఖల కష్టనష్టాలూ, ప్రమోషన్ ఛానళ్ల గురించి మాట్లాడుకున్నారు.
‘మీ పిల్లలేం చేస్తున్నారు?’ అడిగాడు సాయి.
‘పెద్దవాడు వరంగల్ ఆర్‌ఈసీలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతూ ఉన్నాడు. రెండోవాడు కొద్దిగా ఫిజిక్స్‌లో వీక్. ఇంటర్ సెకండ్ క్లాస్‌లో పాసయ్యాడు. ఎమ్సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదు. లాంగ్‌టర్మ్ కోచింగ్‌కని మానసా అకాడెమీలో విజయవాడలో జాయిన్ చేశాను’ కొద్దిగా అన్యమనస్కంగా చెప్పాడాయన. ఆయన ఏదో దాస్తూ ఉన్నాడనిపించింది సాయికి. ఇంతలోనే ఆయన భార్య అందుకొని చెప్పింది.
‘మా హరికి ఇంజనీరింగ్ చదవడం ఇష్టం లేదు బాబూ. ఆ సబ్జెక్ట్స్ అస్సలు ఇంట్రెస్టు లేదు. బీకాం చేయాలనుకున్నాడు. ఈయనగారికేమో ఇద్దరు కొడుకులనూ ఇంజనీర్లు చేసేయాలని మహా పట్టుదల. కాలేజీ వాళ్లేం చిత్రహింసలు పెట్టారో తెలీదు. రెండు నెలల క్రితం కోర్సు కష్టంగా ఉందని, వచ్చేస్తానని ఫోన్ చేశాడు. ఈయన ససేమిరా ఒప్పుకోలేదు. దాంతో కాలేజీ నుండి ఎక్కడికో పారిపోయాడు. ఎక్కడున్నాడో, ఏమో అసలున్నాడో లేక...’ తరువాత చెప్పలేక ఆమె గుడ్లనీరు కుక్కుకుంది.
‘చెప్పాను కదమ్మా, ఈ కాలేజీల నిర్వాకమే అంతనీ. సార్, మీరేం వర్రీ అవకండి. పేపర్లో ప్రకటనలు ఇవ్వలేదా?’ ఆఫీసరు అందుకొని అడిగాడు.
‘ఇచ్చామండి, టీవీలో కూడా ఇచ్చాము. ఐనా లాభం లేకపోయింది. మావాడి కోసం వాళ్లన్న, బంధువులు చాలాచోట్ల వెతికారు. ఆచూకీ దొరకలేదు. వాడు దొరకాలని దేవుడికి మొక్కుకోవడానికే తిరుపతి వెళ్లొస్తున్నాము’ దిగాలుగా అన్నాడు హనుమంతరావు.
‘దొరుకుతాడు లేండి. కంగారు పడకండి’ అనునయంగా అన్నాడు సాయి. ఆ కాలేజీల తంతు గురించి ఆఫీసరూ, తిరునామమూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు.
రైలు రాజంపేట దాటడంతో అందరు కేరియర్లు విప్పి, భోం చేయడం ప్రారంభించారు. హనుమంతరావు రైల్వే కేటరింగ్ వాళ్ల వద్ద పెరుగన్నం పాకెట్ ఒకటి తీసుకొని తినసాగాడు. అతను భార్యను భోం చేయమన్నా, ఆమె ససేమిరా అంది. సాయి కూడా తన బేగ్లోంచి కేరియర్ తీసి, పులిహోరా తిని, వాష్‌బేసిన్‌లో దాన్ని కడిగి మూత వేసి, వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగి, బాటిలూ, బాక్సూ బేగ్‌లో ఉంచి తిరిగి దాన్ని హేంగర్‌కు తగిలించాడు.
‘హరి గురించి పెద్దగా ఆలోచించక, నిశ్చింతగా పడుకో. దర్శనానికి వెళ్లొచ్చాంగా, తిరిగొస్తాడు చూడు వాడు’ భార్యతో చెప్పాడు హనుమంతరావు ధీమాగా.
‘తిరిగొస్తే మాత్రం, మళ్లీ మీరా ముదనష్టపు కాలేజీలో వాణ్ణి చేర్చి సతాయించడం మానరు గదా. వాడికిష్టమైన చదువు చదవనిచ్చుంటే ఇలా జరిగుండేదే కాదు’ కోపంగా చెప్పిందావిడ.
‘అలాగేలేవే తిరిగొస్తే వాడికిష్టమైన బి.కాంలోనే జాయిన్ చేద్దాం’ చెప్పాడాయన అప్పర్ బెర్తు ఎక్కడానికి ఉద్యుక్తుడౌతూ.
ఇంతలో పక్కనున్న సీట్ల నుండి ఒక పెద్ద మనిషి వచ్చి చుట్టూ కలియజూసి, సాయిని ‘సార్, మీది ఇరవై ఐదవ నంబరు బెర్తా’ అని అడిగాడు. సాయి ఔనన్నాడు.
‘సార్ మా ఫ్యామిలీ అంతా ఈ పక్కనున్న సీట్లలో ఉంది, మా మరదలుకు ఎస్-8 కోచ్‌లో సైడ్ అప్పర్ బెర్తు అలాట్ అయ్యింది. మీ కభ్యంతరం లేకపోతే మీరు ఆమె బెర్తుకు వెళ్లే ఆమె ఇక్కడకు వస్తుంది. లోయర్ బెర్త్ లేడీస్‌కి కన్వీనియంట్ కదా’ అన్నాడు. రిక్వెస్టుగా, పరోపకారం సాయికలవాటే కాబట్టి సరేనన్నాడు. బ్రీఫ్‌కేసు తీసుకొని ఆయన వెంట నడిచాడు. వెస్టిబ్యూల్ గుండా ఎస్-8 కంపార్టుమెంట్ చేరుకున్నాడు.
రైలు వేగంగా వెళ్తోంది. సాయి ఎస్-8 కోచ్‌లో తాను మారిన సీట్లో కూర్చున్నాడు. నందలూరు స్టేషన్‌లో రెండు నిమిషాలాగి కదిలింది ట్రైన్.
సాయి పక్కనున్న సీట్లో పంచెకట్టులో ఉన్న ఒక లావుపాటి శాల్తీ కూర్చున్నాడు. చూస్తే వ్యాపారస్థుడిలా ఉన్నాడు.
‘సార్, మీరూ హైదరాబాదుకేనా?’ పలకరించాడాయన సాయిని. సాయి ఔనని ఆయన వివరాలు అడిగాడు.
‘నా పేరు ఓబులేసు. మాది మదనపల్లె సార్, మగ్గల బిజినెస్ మాది, నాకు రెండు షెడ్లలో ఇరవై జకార్డు మగ్గాలున్నాయి. పట్టుచీరలు నేయించి హైదరాబాద్, బెంగుళూర్లలో షాపులకు వేస్తూ ఉంటాం. సరుకు ఇచ్చి రావడానికి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను’ అని సాయి ఉద్యోగం గురించి అడిగాడు.
సాయి తాను చేనేత శాఖలో పని చేస్తున్నట్లు చెప్పాడు.
‘ఐతే మీకు తెలిసే ఉంటుంది సార్. పట్టుచీరల వ్యాపారం ఇప్పుడు బొత్తిగా గిట్టుబాటు కావడంలేదు. రేషం (పట్టు నూలు) రేటు బాగా పెరిగిపోయె. రెండేళ్ల ముందు రెండు వేలు ఉండే కేజీ పట్టు ధర ఇప్పుడు మూడున్నర వెయ్యి అయ్యింది. జలతారు, కూలీలు పెరిగినాయి. చీరల రేటు మాత్రం అట్నే ఉండాది’ అన్నాడాయన విచారంగా.
సాయిగా వాళ్ల సాధక బాధకాలు తెలుసు కాబట్టి కాసేపు ఆ వ్యాపారం గురించి మాట్లాడాడు.
‘ప్రతిసారీ, మీరే హైదరాబాదు, బెంగుళూరు వెళ్లి రావాలంటే కష్టంగదా. గుమాస్తా లెవరినైనా పెట్టుకోక పోయారా?’ అడిగాడు సాయి.
‘ఏం గుమాస్తాల్లేండి సార్. అప్పటికీ కొందరు పిలకాయలను జీతమిచ్చి అసిస్టెంట్లుగా పెట్టుకొంటి. కొందరు కలెక్షను డబ్బులతో పారిపోతారు. ఇంకా కొందరు మూడు, నాలుగుసార్లు అంగిళ్లకు సరుకేసి అక్కడ వ్యాపారం గుట్టుమట్లు అన్నీ తెలుసుకొని, కమీషనుకు వాళ్లే సొంత వ్యాపారం మొదలుపెడ్తారు. కానీ ఇప్పుడు శంకర అనే మంచి పిలకాయ దొరికుండాడు. బాగా సహాయంగా ఉన్నాడు. ఇప్పుడు చీరలు తీసుకొని కడప, ప్రొద్దుటూరు పోయుండాడు. షాపుల్లో ఇచ్చేసినాక కడపలో ఇదే రైలెక్కమంటిని, హైదరాబాదులో హెనీ బిజినెస్సు గదా, నాకు తోడొకరుండాలిలే, రిజర్వేషనుండాదిలే ఇద్దరికీ’ అన్నాడు ఓబులేసు నవ్వుతూ.
కొందరు బెర్తులు వాల్చుకొని పడుకొంటూ ఉన్నారు. సాయికి నిద్ర రావడంలేదు. విండోలోంచి కొండలనూ, చెట్లనూ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు.
రైలు కడపలో ఆగింది. వాటర్ బాటిళ్లూ, టిఫిన్లు అమ్మే హాకర్లు కేకలు వేస్తూ ప్లాట్‌ఫామ్‌పై తిరుగుతూ ఉన్నారు.
ఓబులేసు చెప్పిన శంకర ట్రైను ఎక్కి సీటు వద్దకు వచ్చాడు. కడపలో వ్యాపారం ఎలా జరిగిందీ కనుక్కొంటూ ఉన్నాడు ఓబులేసు ఆ అబ్బాయిని. పద్దెనిమిది, పంతొమ్మిదేళ్లుండే ఆ అబ్బాయి చూడగానే చురుగ్గా అనిపించాడు సాయికి.
‘మావాడే సార్, శంకర్, బాగా కష్టపడతాడు. అకౌంటు పుస్తకాలన్నీ రాస్తాడు. అంగళ్లో కూర్చుంటాడు. బాగా నమ్మకం. నైటు కాలేజీలో డిగ్రీ కూడా చదవతా ఉండాడు’ సాయికి పరిచయం చేశాడు ఓబులేసు శంకర్‌ని.
ఇందాక ఎస్-3 బోగీలో హనుమంతరావు చెప్పిన అతడి కొడుకు కూడా దాదాపు ఇదే వయసులో ఉండవచ్చు ననుకున్నాడు సాయి. ఓబులేసు, శంకర్ కబుర్లలో మునిగి తేలుతూ ఉన్నారు. సాయి ఎదురు సీట్లో కూర్చుని ఉన్న కుర్రాడు లాప్‌టాప్‌లో ఏదో వెబ్‌సైట్ చూసుకుంటూ బిజీగా ఉన్నాడు.
‘ఏం చదువుతున్నావు బాబూ, నీకు చదువుకొనే టైమెక్కడిది?’ పలకరించాడు సాయి శంకర్‌ని.
‘నైట్ కాలేజీలో బి.కాం. చేస్తూ ఉన్నాను అంకుల్, రాత్రిళ్లు చదువుకుంటూ ఉంటాను. కస్టమర్లు లేనప్పుడు షాప్‌లో కూడా కొంత టైం దొరుకుతుంది. అప్పుడు చదువుకుంటూ ఉంటాను’ చెప్పాడు శంకర్ వినయంగా.
‘మీదేవూరు? మీ నాన్నగారి పేరేమిటి?’ అడిగాడు సాయి కుతూహలంగా.
‘మా ఫాదర్ పేరు రామదాసు, కో-ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడు’ చెప్పాడు శంకర్.
పనిచేసేవాడంటే ఇప్పుడు ఉన్నాడో, లేదో, అడిగితే బాగుండదేమో. ఐనా ఇతను వేరేవాడు. ఆ హనుమంతరావు కొడుకు కాదు. పాపం వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలున్నాడో లేడో- బాధతో నిట్టూర్చాడు సాయి, రాత్రి పది గంటలు కావస్తుండటంతో పై బెర్త్‌పైకెక్కి నిద్రకుపక్రమించాడు. కొద్ది నిమిషాల్లోనే అతనికి గాఢంగా నిద్ర పట్టింది.
‘కాఫీ, కాఫీ’ ప్లాట్‌ఫామ్‌పై వెండార్ల కేకలతో మెలకువ వచ్చింది సాయికి, సెల్‌ఫోన్‌లో టైం చూసుకున్నాడు. ఉదయం ఐదున్నర దాటింది టైం.
‘మరో అరగంటలో కాచిగూడ చేరుకుంటాము’ ఎవరో ఫోన్లో చెప్తున్న మాటలు వినిపించాయి సాయికి. బెర్త్ దిగి బాత్రూంకి వెళ్లి ముఖం కడుక్కొని వచ్చి ఒక కప్పు వేడి కాఫీ తాగడంతో ప్రాణం లేచి వచ్చినట్లైంది. అప్పటికే ఓబులేసు, శంకర్ లేచి తమ లగేజి సర్దుకుంటూ ఉన్నారు.
‘బాగా నిద్రపట్టిందా సార్?’ చిరునవ్వుతో ఓబులేసు పలకరించాడు సాయిని. ‘బాగా నిద్రపోయాను. ట్రైను రైట్ టైంకే నడుస్తూ ఉన్నట్లుంది’ అన్నాడు సాయి. తన బ్రీఫ్‌కేస్ తెరచి బ్రష్, పేస్టు తీసుకుంటూ ఉంటే హఠాత్తుగా అతనికి తన టిఫిన్ బాక్సు, వాటర్ బాటిల్ ఉన్న బేగ్ ఎస్-3 కంపార్ట్‌మెంట్‌లో మరచిపోయినట్లు గుర్తు వచ్చింది. బ్రష్ చేసుకొని వచ్చిన తరువాత బ్రీఫ్‌కేస్ లాక్ చేసి ఎస్-3 కంపార్ట్‌మెంట్‌కు ట్రైన్‌లోని వెస్టిబ్యూల్ ద్వారా వెళ్లాడు.
సాయి వెళ్ళేసరికే హనుమంతరావు, అతని భార్య లగేజి సర్దుకొని ట్రైన్ దిగడానికి తయారుగా ఉన్నారు. సాయిని చూసి చిరునవ్వు నవ్వి ‘ఏ కంపార్ట్‌మెంట్‌లో ఉన్నావని’ అడిగాడాయన. సాయి బదులు చెప్పి, హేంగర్ నుండి టిఫిన్ బాక్సు ఉన్న తన సంచీ తీసుకున్నాడు. కాసేపు హనుమంతరావుతో మాట్లాడాలనిపించి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. ‘తిరుమల దర్శనానికి వెళ్లొచ్చారు గదా, మీ బాబు తప్పక దొరుకుతాడు లేండి’ అన్నాడు అనునయంగా, ‘మేమూ అదే అనుకుంటున్నాము నాయనా’ అన్నది హనుమంతరావు భార్య జ్యోతి విచారంగా.
‘బెర్త్ కింద మరేదైనా సామాన్లు పెట్టి మరచిపోయావా?’ అంటూ హనుమంతరావు వంగి సీటు కింద చెక్ చేయబోయాడు. అతని పాకెట్ నుండి కొన్ని నోట్లు, చిల్లర, టికెట్‌తోపాటూ ఒక ఫొటో కూడా కిందపడింది. ‘మీకు తొందర జాస్తి’ అని అరుస్తున్నది ఆయన భార్య. సాయి ఆయనకి హెల్ప్ చేయాలని కిందపడ్డ వాటిని తీసి ఆయన చేతికిచ్చి, ఫొటో నొకసారి తేరిపార జూసి ‘మీ అబ్బాయా?’ అన్నాడు. ‘ఔను. బాబూ ఫొటో జేబులోనే పెట్టుకొని తిరుగుతూ ఉన్నారాయన’ అన్నదావిడ. ఫొటోను నిశితంగా చూసి గతుక్కుమన్నాడు సాయి. ఫొటోలోని అబ్బాయి తానిందాక ఎస్-8 కంపార్ట్‌మెంట్‌లో ఓబులేసుతో బాటూ చూసిన శంకర్‌గా గుర్తుపట్టాడు.
‘హనుమంతరావుగారూ, ఒకవేళ మీ అబ్బాయి తిరిగొస్తే అతడిని తిట్టి మళ్లీ అతనికిష్టం లేని ఇంజనీరింగ్‌లో చేరుస్తారా లేక ఇష్టమైన కోర్సులో చేరుస్తారా?’ ఫొటో రావు గారికిచ్చి అడిగాడు సాయి ఆసక్తిగా.
‘తిరిగి రావాలేగాని మావాడి కిష్టమైన కోర్సులో చేరుస్తాం’ జ్యోతి అందుకొని చెప్పింది. సాయి హనుమంతరావు వంక చూశాడు ‘అంతే’ అన్నట్లు ఆయన తల ఊపాడు.
‘సరే సార్, మీ పూర్తి పేరు హనుమంతరావేనా మరింకేదైనానా?’ అడిగాడు సాయి.
‘పూర్తి పేరు రామదాసు హనుమంతరావు. ఇంట్లో వాళ్లూ, బంధువులు రామదాసు అని పిలుస్తారు. బయటి వాళ్లు హనుమంతరావు అంటారు’ అన్నాడాయన.
‘మీరు మొదటి నుండీ ఇప్పుడున్న డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేసేవారా?’ అడిగాడు సాయి కుతూహలంగా.
‘లేదులేదు, కో-ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో ఇరవై నాలుగేళ్లు పని చేశాను. ప్రమోషన్ తరువాత ఈ డిపార్ట్‌మెంట్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లాను’ అన్నాడాయన.
‘మీ అబ్బాయి అసలు పేరు హరీనా, లేక...’
‘హరిశంకర్, ఇంట్లో అంతా హరీ అంటాం’ ఇన్ని వివరాలడుగుతున్నారేమిటా అని ఏదో ఆశతో చెప్పింది జ్యోతి.
సాయి ఒక్కసారి నిట్టూర్చి ‘మీ వాడిని నేను చూశాను. కనీసం చూశాననుకుంటున్నాను’ అన్నాడు చిన్నగా.
‘నిజంగానా? ఎక్కడున్నాడు వాడు?’ భార్యాభర్తలిద్దరూ ఒకేసారి కూడబలుక్కున్నట్లు అడిగారు ఆత్రంగా.
‘ఇదే ట్రైన్‌లో ఉన్నాడు. ఐతే మీరు మీ అబ్బాయి చేరాల్సిన కోర్సు గురించి మాట తప్పరు కదా’ చిరునవ్వుతో అడిగాడు సాయి.
‘ఈ ట్రైన్‌లోనే ఉన్నాడా? ఎక్కడున్నాడు వాడు?’ ఆత్రంగా అడిగాడు హనుమంతరావు.
‘అంతా స్వామీ దయ, నేను చెప్పాను గదా!’ కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న కొండకు దండం పెట్టి చెప్పింది జ్యోతి.
‘రావుగారూ, చెరువుల్లో, నదుల్లో, స్వేచ్ఛగా తిరగాల్సిన చేపలను అక్వేరియం పేరుతో బంధిస్తే ఏవౌతుంది? చూసే మనకు ఆనందం లభిస్తుందేమో గానీ వాటికి ఆనందం హరించుకొని పోతుంది. ఇంతకు మునుపు చదువుతోబాటు ఆటలూ, వినోదం పిల్లలకందేవి. ఇప్పుడంత తీరికేది? టీనేజ్‌లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లలను అక్వేరియాల్లాంటి హాస్టళ్లలో బందీల్లా ఉంచి రాత్రీ, పగలు వారికిష్టం లేని కోర్సులను బలవంతంగా నేర్పించి, చదువు పేరుతో హింసిస్తూ ఉంటే వారి మనసు గాయపడదా? గాజుపెట్టె కింద పడితే క్షణంలో బద్దలౌతుంది. రాగింగ్ పేరుతో సీనియర్లూ, మార్కులు తక్కువొచ్చాయని లెక్చరర్లూ నానామాటలతో బాధిస్తూ ఉంటే పిల్లలు మనసు పగిలి క్షణాల్లో ‘ఆత్మహత్య’ అనే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. రిషికేశ్వరైనా, మరొకరైనా చేసేది ఇదే. మీ వాడి మనసు ముక్కలవకుండా జాగ్రత్త తీసుకోండి’ ఆవేశంగా చెప్పాడు సాయి వారితో ఆఫీసరూ, తిరునామం చప్పట్లు చరిచి తమ ఆమోదం తెలిపారతనికి.
‘కాచిగూడా స్టేషన్‌కు స్వాగతం...’ లౌక్ స్పీకర్‌లో అనౌన్స్‌మెంట్ వినిపిస్తోంది లౌడ్ వాయిస్‌లో...
‘మా బాబు ఏ బోగిలో ఉన్నాడు, చెప్పండి ప్లీజ్’ అడిగింది జ్యోతి.
‘తొందర లేదు. నేను ఎస్-8 బోగికి వెళ్తున్నాను. ట్రైన్ ఆగాక మీరు ఆ బోగీ వైపు రండి’ అని తన బేగ్ తీసుకొని కదిలాడు సాయి.
సాయి ట్రైన్ దిగుతున్న ఓబులేసు, శంకర్‌లతో కలిసి, తన లగేజ్‌తోపాటు ట్రైన్ దిగాడు. వారితో ఏదో మాట్లాడుతూ నడవసాగాడు. ఎదురుగా వస్తున్న తల్లిదండ్రులను ఆశ్చర్యంగా చూశాడు హరిశంకర్.
‘బాబూ హరీ...’ అని కొడుకును పట్టుకొని భోరున ఏడ్చింది అతని తల్లి. ఆశ్చర్యంగా చూస్తున్న ఓబులేసుకు జరిగింది వివరించాడు సాయి. ఓబులేసు ఆశ్చర్యపోయాడు. ఆయనను హనుమంతరావుకు కూడా పరిచయం చేశాడు సాయి.
‘బాబూ, హరిశంకర్, నీకు దిగుల్లేదు. మీ నాన్న నిన్ను నీకిష్టమైన కోర్సులోనే చేరుస్తాడు. ఇష్టంలేని చదువు బలవంతంగా చెప్పించడు’ హరి భుజంపై చేయి వేసి అనునయంగా చెప్పాడు సాయి.
‘చాలా సంతోషం. మొత్తానికి శంకర్ మళ్లీ ఫ్యామిలీ దగ్గరకు చేరాడు. శంకర్, నువ్వు మీ వాళ్లతో వెళ్లిపో. నేను బిజినెస్ సంగతి చూసుకుంటాను’ నవ్వుతూ చెప్పాడు ఓబులేసు.
‘లేదులేదు, ఇన్నాళ్లూ దేవుడిలా మా బాబు నాదరించారు. మీతోబాటూ వచ్చి మీ పనయ్యాకే ఇంటికొస్తాడు లెండి సాయి’ ఆయన చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు హనుమంతరావు.
‘అవసరం లేదు సార్. శంకర్‌లాంటి అబ్బాయి కొడుకుగా పుట్టడం మీ అదృష్టం. చాకులాంటి కుర్రాడు. ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి వెళ్లమనండి’ నవ్వుతూ చెప్పాడు ఓబులేసు.
‘ఏమో శంకర్ ఇష్టం. ఎక్కడుండాలో వాడే నిర్ణయించుకుంటాడు’ అని కొడుకు వంక చూశాడు హనుమంతరావు. తండ్రి తనను తిడతాడేమోనని భయంగా చూస్తున్న హరిశంకర్ మనసు తండ్రి మాటలకు తేలిక పడింది.
హనుమంతరావు కొడుకును దగ్గరకు తీసుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆసక్తితో వారి వెంట వచ్చిన ఆఫీసరు, తిరునామం వ్యక్తి, సెల్‌ఫోన్‌తో ఉన్న అమ్మాయితోపాటు సాయి కూడా ఆ అపురూప దృశ్యాన్ని ఆనందంగా చూస్తూ ఉండిపోయారు.

రాచపూటి రమేష్ 10/662, బెల్లమండి వీధి కడప-516 001 9866727042, 8978779729