కడప

కుదేలవుతున్న రైతన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 6: ఈ ఏడాది సాగు చేసిన పంటల్లో దిగుబడి ఆశించినంతగా రాదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం పదిరోజుల్లో వర్షాలు కురవని పక్షంలో చేతికందే పంటలు సైతం రైతులకు అందేలాకన్పించడం లేదు. మార్కెట్ కమిటీ, యార్డుల అధికారులు ఈ ఏడాది భారీ ఎత్తున వ్యవసాయ దిగుబడులు వస్తాయని వివిధ రకాల సెస్సులు వస్తాయని గొంతెమ్మకోరికల్లో ఉన్నారు. ఈ ఏడాది జిల్లా నుంచి రూ.15.65కోట్లు ఆదాయం వస్తుందని కాకిలెక్కలు వేస్తున్నారు. గత ఏడాది రూ.13.40కోట్లు ఆదాయానికిగాను పెద్దగా రుసుము రాలేదు. మార్కెట్ కమిటీలో కొంతమంది అధికారులు, సిబ్బంది పందికొక్కుల్లాగా దొరికిన కాడికి దోపిడీ చేస్తుంటే మార్కెట్ కమిటీలకు ఆదాయం ఎలా వస్తుందని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కొంతమేరకు సెస్సులు వస్తున్నా అందులో చాలా మంది అనధికార వసూళ్లు చేస్తూ జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ కమిటీ, సిబ్బంది, అధికారుల నిర్వహణలోపం కారణంగా కొంతమంది వ్యాపారస్తులతో లాలూచితో అనధికార సెస్సులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రైతులు ఆరుగాలాలు కష్టపడి అరకొరపంటలు పండిస్తే వ్యాపారస్తులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. వ్యాపారస్తులు, మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది కుమ్మక్కై రైతుల పేరిటనే రవాణా చేస్తున్నారు. అలాగే వివిధ వారాంతపు సంతలు, పశువుల సంతలు, వాణిజ్యపంటలు వ్యాపారం చేసే దళారులపై మార్కెట్ కమిటీ సంబంధిత అధికారులు, సిబ్బంది ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో రైతులకు మార్కెట్ సౌకర్యం కానీ, పండించుకున్న పంటలకు భద్రత కల్పించడం కానీ, రుణాలు ఇవ్వడం కానీ లేదు. రుణాలు ఇవ్వడంలో నామమాత్రంగా కొన్ని మార్కెట్ కమిటీల్లో సిఫార్సులు ఉన్న వారికే రుణాలు దక్కుతున్నాయి. గత ఏడాది 182 మందికి రూ.210.99 లక్షలను కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా సంబంధిత అధికారులు రైతులపై సవతితల్లి ప్రేమ చూపుతూ రైతుల నుంచి సెస్సులు వసూళ్లు చేస్తు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ఉన్నారనేది జగమెరిగిన సత్యం. జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, రాజంపేట ,కమలాపురం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, సిద్దవటం మార్కెట్ కమిటీల్లో వార్షిక ఆదాయం లక్ష్యంగా పెట్టుకుని వసూళ్లు చేస్తున్నారు. అయితే మార్కెట్ కమిటీల్లో ఆదాయం ఉన్నా రైతులకు ఏమాత్రం మేలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్కెట్ కమిటీల ఆదాయం పెంచి కరువు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉపాధ్యాయులే దేవుళ్లు..

సుండుపల్లె, సెప్టెంబర్ 6: ఉపాధ్యాయుడే విద్యార్థులకు దేవుడని, వారికి సరైన మార్గనిర్దేశం చూపే మహోన్నత వ్యక్తి ఉపాధ్యాయుడు అని టీడీపీ మండల అధ్యక్షుడు రాజకుమార్‌రాజు, కృష్ణారెడ్డి చెరువు నీటి సంఘం అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. మండలంలోని జికె రాచపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆటల పోటీల్లో గెలుపొందిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేసే కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు రవినాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మండలంలోని ఉపాధ్యాయులందరికీ ఏర్పాటు చేసిన పలు ఆటల పోటీల్లో గెలుపొందిన 40 మందికి బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా సుండుపల్లె మండలం నుండి ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డును తీసుకున్న ఉపాధ్యాయులందరికీ హాజరైన నాయకులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. అలాగే జడ్పీ హైస్కూల్ నుండి ఆకేపాటి ట్రస్టు తరపున ఉత్తమ అవార్డు అందుకున్న శంకర్‌నాయక్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పింఛా కుడికాలువకు నీరు విడుదల

సుండుపల్లె, సెప్టెంబర్ 6: తీవ్ర వర్షాభావంతో ఎండిపోతున్న పంటలు- దిక్కుతోచక రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో ఆంధ్రభూమిలో వచ్చిన కథనంతో స్పందించిన పింఛా ప్రాజెక్టు అధికారులు, అధికార పార్టీ నాయకులు కుడికాలువకు నీటిని విడుదల చేశారు. ఈ నీటితో రైతులు ఎండిపోతున్న వేరుశెనగకు పింఛా నీటితో తడిపి పంటను కాపాడుకున్నారు. మండలమంతా అధికార పార్టీ నాయకులు, అధికారులు, ట్యాంకర్లు, స్ప్రింకర్ల ద్వారా నీటిని అందించారు. కానీ మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీలో మాత్రం మరిచిన సమయంలో పింఛాలో అరకొరగా ఉన్న నీటిని పింఛా కుడికాలువకు విడుదల చేయడంతో రైతు కళ్లలో ఆనందం ఉప్పొంగింది. దీంతో పల్లె ప్రాంతాల్లో వేసిన వరి, వేరుశెనగతో పాటు మామిడిచెట్లు ఎండిపోయే దశలో కుడికాలువలో నీరు విడుదల చేయడంతో రైతులు తమ సాగు భూములకు నీటిని తడిపారు. అయితే మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీలో ప్రజాప్రతినిధులపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రజాప్రతినిధులు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని మిట్టబిడికి, కటారుమడుగు, మాచిరెడ్డిగారిపల్లెకు చెందిన రైతులు తెలిపారు. తమకు వేరుశెనగ పూర్తిగా ఎండిపోతున్నదని చెప్పినా కూడా పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు.

వైఎస్ వర్ధంతి రోజే
జగన్‌కు ప్రజలు గుర్తుకొస్తారా..

వేంపల్లె, సెప్టెంబర్ 6: పండుగలు, వైఎస్ జయంతి, వర్ధంతి వేడుకలకు వచ్చినపుడే వైఎస్‌ఆర్ సీపీ నేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు గుర్తుకు వస్తారని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన వేంపల్లెలో తన స్వగృహంలో విలేఖరులతో మాట్లాడారు. పులివెందుల శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యేగా ప్రజల నుండి ఎన్నుకోబడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను ఏనాడో పక్కన పెట్టేశాడన్నారు. ఆయన కేవలం జిల్లాకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా రావడం, పోవడం జరుగుతుందన్నారు. ఏనాడైనా జిల్లా ప్రజా సమస్యలపై పోరాడారా అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలి అని నిత్యం ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. రాత్రింబవళ్లు ప్రాజెక్టుల వద్ద ఉంటూ శ్రమించి కష్టపడి పనిచేస్తుంటే చంద్రబాబును విమర్శించడం ఎంత వరకు సమంజసమన్నారు. చంద్రబాబు చేపట్టిన ప్రతి పథకం ప్రజలకు చేరువవుతుందన్నారు. ముఖ్యంగా రైతుల కోసం రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు త్వరితగతిగా కృషి చేసేందుకు చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పులివెందుల మార్కెట్‌యార్డు కమిటీ ఛైర్మన్ రాఘవరెడ్డి, టీడీపీ నేతలు షబ్బీర్, బాలస్వామిరెడ్డి, రామమునిరెడ్డి, జగన్నాధరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

సిఎం చంద్రబాబు మోసాలను
ప్రజలు గమనిస్తున్నారు...

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరముందని నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. గడపగడపకూ వైకాపాలో భాగంగా మంగళవారం స్థానిక 7వ వార్డులోని సంజీవనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి అనుకూలంగా నీటిని అందించేలా చర్యలు తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం కెసి, తెలుగుగంగ కాలువల ఆయకట్టు రైతాంగానికి నీరందించకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. విద్యార్థులకు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అని నేటికీ ఆ హామీని నెరవేర్చుకోలేదని, ప్రస్తుతం విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేటీకరణ చేసి కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ నిరుపేదలకు నాణ్యమైన విద్యను దూరం చేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ అని రైతులను, మహిళలను నిలువునా మోసం చేసింది చాలక నేడు రెయిన్‌గన్లతో భూములకు పుష్కలంగా నీరందిస్తామంటూ రైతులను మరింతగా మభ్యపెడుతున్నాడని, ప్రజలు చంద్రబాబు మాయలో పడరాదని పేర్కొన్నారు.
వైకాపా అధినేత వై ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షాన నిలబడి ధర్నాలు చేస్తుంటే మంత్రులు, ఎంపిలు జగన్‌ను విమర్శించడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. ప్రజలు తగిన సమయంలో చంద్రబాబుకు తగు విధంగా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.