కడప

ఎక్స్ అఫిషియో మెంబర్‌గా కొనసాగించాలని దరఖాస్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 4:స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో వైకాపా, టిడిపిలకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును వినియోగించుకునేందుకు ఎక్స్ అఫిషియో మెంబర్‌గా కొనసాగించాలని దరఖాస్తులు చేసుకున్నారు. అయితే గతంలో జడ్పి, పురపాలక సంఘాలకు ఎక్స్ అఫిషియోగా కొనసాగించాలని ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అటువంటి వారికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో వైకాపా ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పురపాలక సంఘాలు, కడప నగర పాలక సంస్థ, జడ్పిల్లో ఓటు హక్కును నమోదుచేసుకున్నారు. టిడిపి నేతలు మాత్రం తమకు సంఖ్యబలం లేదని గతంలో ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా నమోదు చేసుకోనట్లు తెలిసింది. అధికారపార్టీకి చెందిన నేతలు గతంలో వైసిపి ప్రజాప్రతినిధులు ఎక్స్ అఫిషియో సభ్యునిగా స్థానిక సంస్థల్లో ఓటు హక్కు నమోదు చేసుకున్నారని వారి ఓటును స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి చెల్లుబాటు కావని ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిసింది. వైకాపాకు చెందిన రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి రాయచోటి పురపాలక సంఘానికి గతంలో ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆశ్రయించినట్లు తెలిసింది. వైకాపాకు చెందిన పులివెందుల, కమలాపురం, కడప, రైల్వేకోడూరు, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు ఎమ్మెల్యేల ఓట్లు, వైకాపా ఎంపిలు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిల ఓట్లను స్థానిక సంస్థలైన పురపాలక సంఘాలు, జడ్పి, మండల పరిషత్‌లు ఆశ్రయించినట్లయితే వారి ఓట్లు చెల్లుబాటు కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారపార్టీ నేతలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిసింది. వైసిపి నుంచి టిడిపిలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములు, ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, వైసిపి ఎమ్మెల్సీ టిడిపిలో చేరిన సి.నారాయణరెడ్డి, విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, శాసన మండలి డిప్యుటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, టిడిపి రాజ్యసభ్య సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియోగా ఓటు హక్కు ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తుచేశారు. అదేవిధంగా వైకాపా తరపున ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల్లో ఎక్స్‌అఫిషియోగా కొనసాగుతున్న వారి జాబితాను సంబంధిత అధికారుల నుంచి ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా లేఖలు రాయించినట్లు తెలిపారు. మొత్తం మీద ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కెవి సత్యనారాయణ, ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన అధికారులు ఎదురుచూస్తున్నారు.

ఊపందుకున్న సంప్రదింపులు..!
రాజంపేట, మార్చి 4: అన్ని రాజకీయ పార్టీలు, స్థానికంగా ఉండే వర్గనేతలు గ్రామస్థాయిలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించడం జరుగుతూవస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను తలదనే్నలా ఈ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల తీరు ఉంటుంది. తాజాగా కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార తెలుగుదేశం, విపక్ష వైకాపా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజంపేట డివిజన్ పరిధిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు డిమాండ్ అధికమైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలే అధికార, విపక్ష నేతల్లో కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పలు కారణాలతో కోర్టు కారణంగా పదవులు కోల్పోయిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిరిగి కోర్టుద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును తెచ్చుకోవడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. దీంతో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల మద్దతుకే ప్రాధాన్యత ఇస్తూ వారు ఏ పార్టీకి చెందిన వారన్నది అప్రస్తుతమన్నట్టుగా రాజకీయం సాగుతుంది. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ ఘట్టం ముగియక ముందు నుండే అధికార, విపక్ష పార్టీలు స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పార్టీలతో, గ్రూపులతో పనిలేకుండా సంప్రదింపులు.. చర్చలు మొదలెత్తారు. ఈ సంప్రదింపులు, చర్చలు ఇంకా లోపాయికారిగా ఎవరి పరిధిలో వారు కొనసాగిస్తూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులచే క్రాస్ ఓటింగ్ చేయించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే దిశగా డివిజన్ పరిధిలో రాజకీయం కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. అధికారపార్టీ నేతలు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పవచ్చు. ఆ పార్టీ అధిష్టానం నుండి గట్టి హెచ్చరికలు రావడంతో అధికార పార్టీ నేతలు తమకున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతు సాధించే దిశగా ఎత్తుగడలు కొనసాగిస్తున్నారు. ఎలాగైనా జిల్లాలో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు శత్రువులతో సైతం చెలిమికి యత్నాలు మొదలయ్యాయంటే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా నేతలు భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇస్తే భవిష్యత్తు రాజకీయాల్లో అనుసరించాల్సిన అంశాలపై కూడా ఒప్పందాలు జోరందుకుంటున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు పూర్తిస్థాయి మద్దతు ఉందని ఇరుపార్టీలు పైకి చెపుతున్నా లోలోపల క్రాస్ ఓటింగ్ భయంతో అవకాశమున్న ప్రతిచోట స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతు సాధించేందుకు పావులు కదుపుతూనే ఉన్నాయి. అయితే ఆయా పార్టీల్లోని నేతల మధ్య ఉన్న విభేదాలు ఎదుటిపార్టీకి అనుకూలమయ్యే పరిస్థితులు కూడా లేకపోలేదు. పార్టీలతో పనిలేకుండా వ్యక్తిగతంగా కూడా మద్దతుకై నేతలు యత్నాలు చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. దీంతో గ్రామాల్లో రాజకీయం కూడా రానున్న రోజుల్లో రసవత్తరంగా మారనుంది. వర్గాలకు అలవాలమైన డివిజన్ రాజకీయాల్లో పార్టీల కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరు ప్రధాన పార్టీల నేతలు అనుసరిస్తున్న విధానాలు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలమవుతాయన్నది ఇప్పుడే ఊహించి చెప్పడం కూడా కష్టమే అవుతుంది. ఆయా పార్టీలకు ఆయా పంచాయతీల్లో ఉన్న పరపతిని ఆధారం చేసుకుని ఓటింగ్ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలపై ఇరుపార్టీలు దృష్టిసారించినట్టు సమాచారం. పార్టీల వ్యూహం, రోజురోజుకు మారుతున్న ఎమ్మెల్సీ ఎన్నికతీరు, ప్రధాన పక్షాల ముఖ్యనేతల ప్రవేశంతో ఎమ్మెల్సీ ఎన్నికల తీరుతెన్నులు పలు గ్రామాల్లో రాజకీయ వేడిని రగిలిస్తుందని చెప్పవచ్చు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి
బిటెక్ రవిని గెలిపించండి

ఆంధ్రభూమి బ్యూరో
కడప,మార్చి 4:కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బిటెక్ రవితోపాటు గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కెజెరెడ్డి, బచ్చల పుల్లయ్యలను గెలిపించాలని ఏదైనా పొరపాటు జరిగితే పార్టీతోపాటు నేతల రాజకీయ భవితకు ప్రమాదకరమేనని తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు శనివారం జిల్లా నేతలందరీకీ ఫోన్ ద్వారా సూచించారు. ప్రతిపక్షనేత, వైసిపి నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేవలం అధికారదాహంతో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చేపట్టిన అభివృద్ధి పనులకు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు పార్టీని బలోపేతం చేస్తుంటే అర్థంపర్థం లేకుండా అవాకులు చవాకులు అల్లుతున్నారని ఆరోపించారు. జగన్ ప్రెస్టేషన్‌లో పడి అర్థం పర్థం లేకుండా ఎటువంటి అవగాహన లేకుండా ప్రభుత్వంపై, పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జగన్ సొంత జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూస్తే నేతల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన గుర్తు చేశారు. కడప జిల్లాలో తాగునీరు, సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహోరాత్రులు కృషి చేసి కృష్ణాజలాలను గండికోట రిజర్వాయర్‌కు వదిలి తద్వారా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల ప్రాంతాల్లో ప్రజలకు, రైతులకు కొండమేర ఉపశమనం కల్పించారని ఆయన గుర్తు చేశారు. ఈ తరుణంలో జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు, లోకేష్‌ల కృషి ఫలంగా ఫలితం దక్కే విధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ముగ్గురు అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న అత్యంత అనుభవం కలిగి దేశస్థాయిలో నూతన రాష్ట్రంలో బాబు చేపట్టిన సంస్కరణలు ఆదర్శంగా తీసుకుని సంబంధిత రాష్ట్రాల అభివృద్ధికి అయా ప్రాంతాల ముఖ్యమంత్రులు పాటుపడుతున్నారని ఆయన గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అత్యధిక మెజార్టీతో పాలనలోకి వస్తుందని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీకి ప్రతిపక్షహోదా కూడా దక్కదని, జగన్ అధికారంలోకి వస్తానని పగటికలలు కుంటున్నారని, మైండ్‌గేమ్ ఆడుతున్న జగన్‌కు ప్రజలే బుద్దిచెప్పాలని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ బరిలో దిగిన టిడిపి ముగ్గురు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎటువంటి తేడాలు వచ్చినా కడప జిల్లాలో పార్టీ నేతల ఉనికికే ప్రమాదం పొంచివుందని , ప్రతి ఒక్కరు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని ఆయన కోరారు.

18 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

ఆంధ్రభూమి బ్యూరో
కడప,మార్చి 4: జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జిల్లా పోలీసులు నిర్వహించిన దాడుల్లో 18మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) బి.సత్యయేసుబాబు తెలిపారు. శనివారం స్థానిక పోలీసుపేరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఓఎస్‌డి మాట్లాడుతూ అరెస్టయిన ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద నుంచి సుమారు 550 కిలోల బరువున్న 21 దుంగలు, 3సెల్‌ఫోన్లు, ఒక మహీంద్ర జైలో, మారుతి 800, సుమో, ఫోర్ట్‌కారు, ఫోర్ట్ ఐకాన్ కారు, రెండు మోటార్ వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన వారిలో తమిళనాడు రాష్ట్రం వేలూరుజిల్లాకు చెందిన వెంగి గోవిందరాజు (22), పెరుమాల్ శివ పెరుమాల్ (21), కలి కుమారేషన్ (24), గోవిందు పెరుమాల్ (32), సాగకుప్పన్ పెరుమాల్ (38), పగల రాజేష్ (22)లు అన్నారు. వీరి వద్ద నుంచి ఏడు దుంగలు, సెల్‌ఫోన్, మహేద్రజైలో, మారుతి 800 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే కడప జిల్లా సిద్దవటం మండలం వడ్డెవారిపల్లెగ్రామానికి చెందిన డేరంగుల గండి ఆంజనేయులు (28), చలమారెడ్డిపల్లెకు చెందిన తమ్మిశెట్టి శివకృష్ణ (24), కడప సాయిపేటకు చెందిన షేక్ మహబూబ్ బాషా అలియాస్ బబ్లూ (25), కడప సమీపంలోని తిలక్‌నగర్‌కు చెందిన గండికోట సురేష్ (20), షేక్ ముజీర్ (26), బ్రహ్మంగారిమఠం చీకటివారిపల్లెకు చెందిన గంగి చిన్నబ్బి నాయుడు (30)లు ఉన్నారని వీరివద్ద నుంచి 7 దుంగలు, ఒక సెల్‌ఫోన్, సుమో, పోర్ట్‌వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా కడప జిల్లా బి.మఠం చీకటివారిపల్లెకు చెందిన మల్లిక అంకయ్య అలియాస్ నాయుడు (29), చాపాడు మండలం ఖాదర్‌వల్లి గ్రామానికి చెందిన జంకానా రజాక్ వల్లీ (38), బి.మఠం మండలం బగధిపల్లె గ్రామానికి చెందిన నల్లు గంగులు (45), నీలం శ్రీనివాసులు (28), కొమ్మతి సుబ్బు అలియాస్ మట్టెన్న (35)లు అరెస్టయిన వారిలో ఉన్నారన్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలు నరికి అక్రమంగా తరలిస్తుండగా అరెస్టుచేసినట్లు ఓఎస్‌డి సత్యయేసుబాబు తెలియజేశారు. కాగా ఇటీవల అరెస్టయిన పలువురు అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను నివారించిన సందర్భంలో వారు తెలిపిన సమాచారం మేరకు పై స్మగ్లర్లపై నిఘా ఉంచామన్నారు. ఈ నేపధ్యంలో ఖాజీపేట మండలం కనె్నలవాగు చెరువు వద్ద గల సీతానగరం గ్రామానికి తూర్పువైపున గల అటవీప్రాంతం వద్ద, బి.మఠం మండలం జెడ్ కొత్తపల్లి గ్రామానికి ఉత్తరం వైపున గంగమ్మ ఆలయం వద్ద గల అటవీప్రాంతం వద్ద, దువ్వూరు మండలం నీలాపురం గ్రామానికి తూర్పువైపున గల తెలుగుగంగ కాలువ వద్ద గల అటవీప్రాంతం వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి దుంగలు, వాహనాలు, కార్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కేసులను చేధించేందుకు కృషి చేసిన మైదుకూరు డిఎస్పీ బిఆర్ శ్రీనివాసులు, ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ శ్రీనివాసులు, మైదుకూరు రూరల్ సిఐ ఎం.నాగభూషణం, ఎస్‌ఐలు రంగారావు, రంగస్వామి, విద్యాసాగర్, హేమకుమార్, కొండారెడ్డి, జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బంది, మైదుకూరు సబ్ డివిజనల్ స్పెషల్ పార్టీ సిబ్బంది, ఖాజీపేట, దువ్వూరు, బి.మఠం పోలీసు స్టేషన్ల సిబ్బందిని ఓఎస్‌డి సత్యయేసుబాబు అభినందించారు.

చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు

కమలాపురం, మార్చి 4: చంద్రబాబు మాటలు విని మోసపోవద్దు అని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం భారతి సిమెంట్సులో వెన్నపూసగోపాలరెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్ట్భద్రుల ఎన్నికలు తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక రెఫరెండం లాంటివని అన్నారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలంటే వైసిపి బలపరుస్తున్న వేణుగోపాల రెడ్డికి పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
కార్మికులే కాక తమ బంధువులు, సన్నిహితులకు కూడా తెలియచేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రజలకు తెలుసునని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతానికి ఎవరు ఏమి చేశారో తెలుసునని, ఈసారి ఎన్నికల్లో మీకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఆయన వెంట మండల నేతలు ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, కొండారెడ్డి, పుల్లారెడ్డి, రాజ శేఖరరెడ్డి, ప్రసాదరెడ్డి, కృష్ణారెడ్డి, భారతిసిమెంట్సు అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న
ఆరు ట్రాక్టర్లు పట్టివేత
పెండ్లిమర్రి,మార్చి 4: మండలంలో అనుమతులు లేని క్వారీల నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను మైన్స్ రెవెన్యూ అధికారి కొండారెడ్డి శనివారం పట్టుకుని ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2వేలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అనుమతులు లేని క్వారీల వద్ద నుంచి, మైన్స్ వద్ద నుంచి కానీ అక్రమంగా గ్రావెల్‌ను, ఇనుపరాయిని తరలించినట్లు తెలిస్తే ఇకమీదట కోర్టుకు హాజరుపరుస్తామని హెచ్చరించారు. ట్రాక్టర్ల యజమానులు పర్మిట్ ఉన్న క్వారీల వద్దనుంచే గ్రావెల్ తరలించుకోవాలన్నారు. అదేవిధంగా ట్రాక్టర్‌కు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపిదే విజయం

పులివెందుల, మార్చి 4: ఈనెలలో జరగబోయే పట్ట్భధ్రులు, ఉపాధ్యాయ, స్థానికసంస్థల ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులు విజయఢంఖా మోగించడం ఖాయమని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన జరగబోయే పట్ట్భధ్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుల గెలుపు ఖాయమేనని ఆయన స్పష్టంచేశారు. సిఎం చంద్రబాబు ఎంతో చిత్తశుద్ధితో ప్రజల అభివృద్ధికై ఎన్నో పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్ష నాయకుడైన జగన్ అడ్డుకోవడమే ఆనవాయితీగా పెట్టుకున్నాడని, ఈప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. జగన్ తన ఇష్టానుసారంగా మాట్లాడడం తగదని, కృష్ణాజిల్లా కలెక్టర్‌ను ఏ విధంగా దుర్భాషలాడడం ప్రజలకు తెలుసునని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని సతీష్ అన్నారు. ముందు కడపజిల్లాలో ఎంపి, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు ఎవరు గెలుస్తారో మీకే తెలుస్తుందని, వైకాపాకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతానికి ఎవరు ఏమి చేశారో తెలుసునని, ఈసారి ఎన్నికల్లో మీకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మెన్ తూగుట్ల మధుసూధన్‌రెడ్డి, పుత్తా మారుతీవరప్రసాదరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి నంద్యాల హేమాద్రిరెడ్డి, పట్టణాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తొండూరు మండల కన్వీనర్ శివమోహన్‌రెడ్డి, కులశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

ఆంధ్రభూమి బ్యూరో
కడప,మార్చి 4: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తొందరపాటుకు, పొరపాట్లకు తావివ్వకుండా ఎమ్మెల్సీ పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహరావు ప్రిసైడింగ్ అధికారులను, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన జరిగే ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నియమనిబంధనల మేరకు పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా ఓటు వేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి నిర్ణయించిన సమయం కంటే ఒక గంట ముందుగానే చేరుకుని, బ్యాలెట్ బాక్సులను సరిచూసుకోవాలని, బ్యాలెట్ పేపర్సు చూసుకుని ఓటరుకు బ్యాలెట్ పేపరు అందించే ముందు బ్యాలెట్ పేపరుపై సంతకం, సీలును వేసి నమోదు చేసుకుని ఇవ్వాలన్నారు. ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసరు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని, డైరీని రాయాలని, తీసుకున్న బ్యాలెట్ పేపర్లకు నిర్ణీత ఫారాలు అకౌంట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఓటింగ్‌లో బ్యాలెట్ బాక్సు ఓటింగ్, టెండరు ఓటింగ్, ఛాలెంజ్ ఉంటుందని ఎన్నికల విభాగం అధికారి గుణభూషణరెడ్డి, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, తదితరశాఖల అధికారులు పాల్గొన్నారు.

మూసేసిన ఆల్విన్ కర్మాగారంవద్ద
వేచిఉన్న నిరుద్యోగ యువత

నందలూరు, మార్చి 4: నందలూరులో మూసేసిన ఆల్విన్ కర్మాగారం వద్ద నాలుగో రోజు కూడా వందలాది నిరుద్యోగ యువత దరఖాస్తుల కోసం పడిగాపులుపడ్డారు. ఫార్చ్యూన్ కంపెనీ పేరుతో పరిశ్రమలు నెలకొల్పుతామని ఇచ్చిన ప్రకటనలతో జిల్లా నలుమూలల నుండి నిరుద్యోగ యువత పెద్దఎత్తున విచ్చేశారు. నూతన పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించడంతో వేలాది మంది యువత మొదటి రోజు ఎగబడడం జరిగింది. బోగస్ కంపెనీగా పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ రాజేంద్ర ఆరా తీయడం కంపెనీ డైరెక్టర్ వెంకటకృష్ణను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినా నిరుద్యోగులలో ఆశ చావక కర్మాగారంచుట్టూ తిరగడం అందరిని ఆశ్చర్యంకు గురిచేస్తుంది. ఏదీ ఏమైనప్పటికి జిల్లాలోని నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని పలు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని స్థానికులు అంటున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి

కమలాపురం, మార్చి 4 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచేందుకు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు గట్టిగా కృషి చేయాలని జడ్పీ చైర్మెన్ గూడూరు రవి కోరారు. ఆయన శనివారం సాయంత్రం మండలంలోని నల్లింగాయపల్లె ప్రభుత్వ జడ్పీ బాలుర హైస్కూల్లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డితో కలసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు యస్‌యస్‌సి పరీక్షల్లో 10పాయింట్లు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని ఈ పాఠశాలలో విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉండడం స్వాగతించ విషయమన్నారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు భారతి సిమెంట్సు యాజమాన్యం ఎంతోగానో కృషి చేస్తోందన్నారు. వౌలిక వసతుల కల్పనలో భారతి సిమెంట్సు మరింతగా చేయూతనిస్తుందని చెప్పారు. ఎమీవో జాఫర్‌సాదిక్ మాట్లాడుతూ ఈ పాఠశాల విద్యార్థులు ఎస్‌ఎస్‌సి పరీక్షల్లో 10పాయింట్లు సాధించి జిల్లాలో గుర్తింపు పొందారన్నారు.
ఈ ఏడాది కూడా మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతిసిమెంట్సు ప్రతినిధులు భార్గవరెడ్డి, అనిల్, పాఠశాల హెచ్‌ఎం రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.