కడప

కాయ్ రాజా కాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 18: స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి జిల్లాలో శుక్రవారం జరిగిన ఓటింగ్ ప్రక్రియపై ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి నేతలతోపాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, పలువురు వైద్యులు, పలువురు ప్రముఖులు శనివారం జోరుగా పందేలు కాశారు. ఏకంగా కొంతమంది మెజార్టీపైనా, కొంతమంది గెలుపుపైన జిల్లా వ్యాప్తంగా రూ.200 కోట్లు పైబడి పందెం కాశారు. సోమవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియలోపు మరో రూ.200కోట్లు పందేలు కాసేందుకు సిద్దపడుతున్నట్లు తెలిసింది. టిడిపి, వైకాపాకు చెందిన నేతలే రెవెన్యూ డివిజన్ల వారీగా ఓట్లు, మెజార్టీపై పందెం కాస్తున్నారు. ఎక్కువమంది నేతలు గెలుపుపై మాత్రమే పందెంకాస్తున్నారు. ఇరుపార్టీలకు చెందిన నేతలు ఓటింగ్‌లో పాల్గొన్న ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఓటు ఎవరికి వేశారని ప్రశ్నిస్తు కాకిలెక్కలు వేసుకుంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఓటరుకు రూ.5లు పైబడి నగదు, రూ.20లక్షలు పైబడి పనులు ఇచ్చినట్లు బాహాటంగా చెప్పుకుంటున్నారు. వైసిపి నేతలు తమ పార్టీ తరపున గెలుపొందిన స్థానిక ప్రజాప్రతినిధులకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాదిరిగానే నగదును అందజేశామని, క్రాస్ ఓటింగ్ జరిగిందని తమ గెలుపునకు ఢోకా లేదని వైసిపి అగ్రనేతలే ప్రకటిస్తున్నారు. టిడిపి నేతలు అవన్నీ ప్రచారమేనని ఒకవేళ అలా జరిగితే రాజంపేట, కడప రెవెన్యూ డివిజన్లలో తమకే ఆధిక్యత ఓట్లు వస్తాయంటున్నారు. దీంతో ఇరుపార్టీల నాయకులు పందేలు పోటీపడి కాస్తున్నారు. కొంతమంది డివిజన్ల వారీగా కూడా గెలుపు ఎవరనేది పందెం కాస్తున్నారు. రహస్య బ్యాలట్ పేపరు వినియోగించినందున ఓటర్లు ఏమి చెప్పినా నేతలు తలలు ఊపుతున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఓట్లను అన్ని కలిపి లెక్కించనున్నారు. దీంతో ఓటరు ఏ అభ్యర్థికి ఓటువేసింది బ్యాలెట్‌లో కన్పించదు. ఇరుపార్టీల నేతలు వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రక్రియను అవలంభించడం, మరీ పోటీపడి నజరానాలు అందజేయడం, పోటీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరగణం చెప్పిన మెజార్టీ ప్రకారం పందేలు ఊపందుకుంటున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు గెలుపొందినా 20 నుంచి 30 ఓట్ల మధ్యనే మెజార్టీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే పందేలు కాసే రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, రియల్డర్లు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఇంజనీర్లు గెలుపుపైనే బెట్టింగులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరుపార్టీల నేతల అధిష్ఠానాలు కూడా జిల్లా నుంచి సమాచారం తెప్పించుకుని నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ ప్రక్రియను బేరీజు వేసుకుంటున్నారు. ఇందులో ఏమాత్రం తేడాలు వచ్చినా జిల్లా అగ్రనేతలకు పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి గురికావాల్సివుంటుంది. దీంతో ఇరుపార్టీల జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసి గెలుపు తమదేనంటే తమదేనని ప్రకటిస్తుండటంతో పందెం కాసే వారు కాయ్ రాజా కాయ్ అని కోట్లలో పందేలు కాస్తున్నారు.

ఐటి అధికారుల హిట్ లిస్టులో
బడా వ్యాపారులు..!

ఆంధ్రభూమి బ్యూరో
కడప,మార్చి 18: పెద్దనోట్ల రద్దుకు ముందు జరిగిన లావాదేవీలు, ప్రస్తుతం జరుగుతున్న లావాదేవీల వ్యత్యాసాలపై ఇన్‌కమ్‌టాక్స్ అధికారుల దృష్టిలో జిల్లాకు చెందిన ఐదు వేల మంది పైబడి పారిశ్రామిక, వ్యాపార, ప్రైవేట్ విద్యాసంస్థలు, రియల్డర్లు, కొంతమంది డాక్టర్లు, పలువురు ఇంజనీర్లు ఐటి హిట్‌లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌కమ్‌ట్యాక్స్ చెల్లింపుల్లో, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు క్లైమ్ చేయడంలో ఈనెల 31వరకు గడువు ఉండటంతో ఐటి అధికారులు నియోజకవర్గాల వారీగా సంబంధిత సహాయ అధికారులచేత జాబితాలు తయారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో కొనే్నళ్లుగా వీరంతా ఎటువంటి పన్నులు చెల్లించకుండా తమ ఇష్టారాజ్యంగా సంపాదనకు అలవాటుపడటంతో వీరి గుట్టురట్టయ్యింది. 5వేల మంది చోటామోటా నల్లకుబేరులు వెయ్యికోట్ల రూపాయలు పైబడే ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తున్నట్లు వారి లావాదేవీలు, పెద్దనోట్ల ముందు వారి బ్యాంకు ఖాతాలు, వారు జారీ చేసిన చెక్కులు, బ్యాంకుల్లో వారు నిల్వచేసుకున్న నగదుపై ఐటి అధికారులు ఆరా తీసి జిల్లాలో ఐదువేల మంది పైబడే పన్ను ఎగవేతదారులు ఉన్నట్లు తేల్చారు. దీంతో వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. గత రెండేళ్లుగా ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు పలుమార్లు సంబంధిత పన్ను ఎగవేతదారులను హెచ్చరించినా, నోటీసులు జారీ చేసినా ఖాతరు చేయకపోవడంతో ప్రస్తుతం ఐటి అధికారులు ఆ దేశముదుర్లను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకే అప్పగించినట్లు తెలుస్తోంది. జిల్లాలో బంగారు నగల వ్యాపారులు, అరటి, బొప్పాయి, మామిడి తదితర పండ్ల ఎగుమతులు చేసే బడా వ్యాపారులు, పసుపు, పత్తి, వివిధ రకాల వ్యాపారస్తులు తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాల్లో లావాదేవీలపై, ఇతర రాష్ట్రాల ఎగుమతులపై ఐటి అధికారులు ఆరా తీసి వారిపై ఈనెల 31 తర్వాత కొరఢా ఝళిపించేందుకు సర్వసిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతి కేంద్రంగా ఉన్న ఐటి ఉన్నతాధికారి డిసిటిఓలకు, ఏసిటిఓలకు టార్గెట్లు ఇచ్చి రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ఐటి అధికారులు కడప జిల్లాపై ముప్పేట దాడి చేయాలని, సీమ జిల్లాల్లో పన్ను ఎగువేత దారులు కడప జిల్లాలో అధికంగా ఉన్నారని, ప్రభుత్వాదాయానికి గండికొట్టే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కేవలం జిల్లాలో సంబంధిత ఐటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారు మామూళ్లుమత్తులో జోగుతుండటంతో సంబంధిత ట్యాక్స్ చెల్లింపుదారులు జిల్లాలో అధికారుల సహాయ సహకారాలతోనే నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐటి ఉన్నతాధికారులే రంగ ప్రవేశం చేయడంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కొంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, చివరకు ఆడిటర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు వారిలో చలనం వచ్చి ఐటి ఉన్నతాధికారుల ఉచ్చు నుంచి భయటపడేందుకు జుట్టుపీక్కుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వారంతా టాక్స్ చెల్లించినా గత మూడేళ్లుగా టాక్స్ చెల్లింపు విషయంపై ఐటి అధికారులు బహిరంగ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో అధికారులు, ట్యాక్స్ చెల్లింపుదారులు జుట్టుపీక్కుంటున్నారు.

తల్లిదండ్రులకు రుణపడి ఉండాలి

కడప,(లీగల్)మార్చి 18: జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అందరూ రుణపడి ఉంటామని జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో ఒక్కరోజు పారాలీగల్ వాలంటీర్ల సదస్సు శనివారం జరిగింది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అలాగే వారిని నిరాదరణకు గురిచేయకుండా దేవుళ్లలాగా పూజించాలని అలాగే తల్లిదండ్రులను పోషించకుండా నిర్లక్ష్యం చేస్తే చట్టం ద్వారా వారిని దండిస్తామని, అలాగే చిన్నతనం నుంచి పెళ్లి చేసేంతవరకు కుమారునికి ఎలాంటి బాధలు ఉన్నా వాటిని తీర్చేందుకు కష్టపడతారని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గౌరవప్రధంగా చూసుకుని వారికి భద్రత కల్పించాలని, కుమారుల నుంచి నిరాదరణకు గురైన తల్లిదండ్రులు రెవెన్యూ డివిజనల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చునని, అలాగే లోక్ అదాలత్ ద్వారా కూడా ఖర్చులేకుండా వారికి న్యాయం చేస్తామని ప్రభుత్వం ఎన్నో పథకాలను తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు కల్పిస్తోందన్నారు. ఎవరైనా తల్లిదండ్రులను నిరాదరణ చేస్తే అలాంటి వారికి మూడునెలలు జైలుశిక్ష, రూ.5వేలు అపరాధ రుసుం లేదా రెండింటిని విధిస్తారన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సమాజాన్ని నడిపేది పెద్దలేనని అలాగే అమ్మ అనే నవలలో సమాజానికి మూలం అమ్మ అని అందులో కవి రచించారని, అలాగే చట్టం వరకు తల్లిదండ్రులను తీసుకురావద్దని కోరారు. పర్మినెంట్ లోక్ అదాలత్ జడ్జి విష్ణుప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులపట్ల ఎలా వ్యవహరించాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అలాగే తల్లిదండ్రుల మధ్య సయోధ్యతో మనస్పర్తలు లేకుండా జీవించాలన్నారు. ఎవరైనా బిడ్డల వల్ల నిరాదరణకు గురైతే వృద్ధాశ్రమంలో వారిని చేర్పించేందుకు ప్రభుత్వం వృద్ధాశ్రమం నెలకొల్పాలన్నారు. లోక్ అదాలత్ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ 2007లో చట్టం వచ్చిందని ఎవరైనా వృద్ధులు, కుమారుల వల్ల బంధువుల వల్ల హింసకు గురైతే వారిని చట్ట పరిధి ద్వారా శిక్షించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఏపి తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ సంక్షేమ గోడపత్రాన్ని జిల్లా జడ్జి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సమావేశానికి న్యాయవాదులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న 100 మంది పారా లీగల్ వాలంటరీలు హాజరయ్యారు.

మున్సిపల్ వార్డులకు
ఏప్రిల్ 9న ఎన్నికలు

ఆంధ్రభూమి బ్యూరో
కడప,మార్చి 18: రాష్టవ్య్రాప్తంగా వివిధ కారణాలచేత ఖాళీగా ఏర్పడిన పురపాలక సంఘం వార్డు సభ్యులు, కార్పొరేటర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 9న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ డా.ఎం.రమేష్‌కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలో రాయచోటి పురపాలక సంఘంలో 2,4,12,21వ వార్డులకు, బద్వేలు పురపాలక సంఘంలో ఒకటవ వార్డుకు, జమ్మలమడుగులో రెండవ వార్డుకు ఉప ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఈనెల 20వ తేది నుంచి నామినేషన్లు స్వీకరించి ఈనెల 27 వరకు నామినేషన్లు ఉపసంహరించుకుని, వచ్చేనెల 9న ఎన్నికలు నిర్వహించి, 11న ఫలితాలు వెల్లడించనున్నారు. శుక్రవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయాలో లేదో అధికారపార్టీ నేతలకు, ప్రతిపక్షనేతలకు మున్సిపల్ వార్డుల ఎన్నిక ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే శుక్రవారం జరిగిన ఎన్నిక పోలింగ్‌పై జిల్లాలో అన్ని పార్టీనేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. గతంలో నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా రాజకీయ తమ చెప్పుచేతుల్లో ఉండగా ప్రస్తుతం వీడియోలు, వెబ్‌కాస్టింగ్ తదితర చర్యలతో తమ ఆటలు సాగవని ప్రచారం చేసుకుని ఓటర్ల దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడం తప్ప మరి ఏ ఇతరత్రా వ్యవహారం ఉండదని నేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఫలితాలపై పార్టీల రాజకీయ భవితవ్యం కూడా తేలనుంది. పురపాలక సంఘాల ఉప ఎన్నికలు ఏ స్థాయిలో ఉంటాయోనని అధికార, ప్రతిపక్షనాయకులు సమాలోచనలు చేస్తున్నారు. కాగా 2014లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో వార్డుల వారీగా ఎన్నికైన కౌన్సిలర్లు మృతి చెందడం, రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

కరవు పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి

కడప,(కల్చరల్)మార్చి 18: వెనుకబడిన ప్రాంతాలకు భరోసా ఇవ్వని బడ్జెట్ అని, రుణమాఫీకి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని, ప్రధానంగా కరవుపీడిత ప్రాంతాల్లో కరవు సహాయక చర్యలు చేపట్టాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నారాయణ డిమాండ్ చేశారు. ఏపి రైతు సంఘం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో శనివారం రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన 2017-18 బడ్జెట్‌పై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ వెనుకబడిన ప్రాంతాలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు గాలేరు-నగరి, తెలుగుగంగ, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నిధులు చూస్తే అరకొరగా కేటాయించారని విమర్శించారు. ప్రాజెక్టులు ప్రారంభించి ఇప్పటికి 35సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. రాయలసీమప్రాజెక్టుల పట్ల పాలకులకు చిత్తశుద్ధిలేదని, ముఖ్యమంత్రులందరూ సీమ వాసులే అయినా అభివృద్ధిచేసింది మాత్రం శూన్యమన్నారు. సీమలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ప్రాజెక్టుల వద్ద, కాలువగట్లమీద ముఖ్యమంత్రి చంద్రబాబు నిద్రపోయినా ఏమీ ఉపయోగం లేదన్నారు. రుణమాఫీకి బడ్జెట్‌లో కేటాయించిన నిధులుచూస్తే ఇంకో అయిదేండ్లకు కానీ రుణమాఫీ పూర్తికాదన్నారు. పట్టిసీమ, పోలవరంపై పెట్టిన శ్రద్ధ సీమ ప్రాజెక్టులపై పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఉపాదిహామీ పథకం పనులు చేపట్టి వలసలు నివారించాలని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రైతాంగానికి రావాల్సిన పంటల బీమాకు రూ.460కోట్లు అవసరమైతే కేవలం రూ.269కోట్లు మాత్రమే కేటాయించారని, బడ్జెట్‌లో ధర స్థిరీకరణకు నిధులు కేటాయించలేదని, పసల్ బీమా పథకం పేరుకే తప్ప నష్టపోయిన రైతాంగానికి పరిహారం లేదన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి, చంద్రవౌళీశ్వరరెడ్డి, నాయకులు అనే్వష్, మనోహర్, సుబ్బిరెడ్డి, జగదీష్, వెంకటేశ్వర్లు, సునీల్, రామకృష్ణారెడ్డి, పాపిరెడ్డి, భగవాన్, మహిళానేత ఐఎన్ సుబ్బమ్మ, ఐద్వాసంఘం నేత కామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

నిర్మించారు.. వదిలేశారు..!

ప్రొద్దుటూరు టౌన్, మార్చి 18: గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఆ అధికారికి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా పట్టణంలో ప్రస్తుతమున్న కూరగాయల మార్కెట్‌ను మైదుకూరు రోడ్డులోని ఆరవేటి థియేటర్ వెనుకవైపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అందుకు తగ్గట్లుగా మున్సిపాలిటీ నిధుల నుంచి రూ.12 లక్షలతో కూరగాయల మార్కెట్‌కు సంబంధించి 24 రూములను నిర్మించారు. అయితే ఆయన ఆలోచన బాగానే ఉందిగానీ అందుకు మార్కెట్‌ను వేరొకచోటకు తరలించేందుకు వీలుకాలేదు. ప్రస్తుతం శివాలయం సెంటర్‌లోనున్న కూరగాయల మార్కెట్ పట్టణ ప్రజలకు అన్నివిధాలా సౌకర్యంగా మారింది. అన్ని హంగులతో మార్కెట్ రూములు నిర్మించినా కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఇక్కడి నుంచి కదిలేదిలేదని తేల్చి చెప్పారు. అక్కడికి వెళితే ఆ రూములకు బాడుగలు వేలాదిరూపాయలు చెల్లించాల్సి వస్తుందో ఏమోనని, ప్రజలు కూరగాయలు కొనేందుకు వస్తారో రారోనని ఇక్కడి నుంచి కదలకుండా మొండికేశారు. అయితే అప్పటి నుంచి ఆ రూములు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. కొంతమందికి ఆ రూములు అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. లక్షలాదిరూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది. మద్యం ప్రియులు ఆ రూములను రెస్టారెంట్లుగా భావించి రాత్రి, పగలు అనే తేడాలేకుండా తమ పనికానిస్తున్నారు. అంతేకాకుండా పక్కనున్న టింబర్‌డిపో వారికి ఈ రూములు చాలా బాగా అనుకూలించాయి. డిపోలో ఉండాల్సిన చెక్క మొద్దులు కూడా రూముల వద్ద పడేశారు. ఇంకా చుట్టుపక్కలవారు కూడా తమ వ్యర్థాలను రూముల వద్దే పడవేసి మున్సిపాలిటీ చెత్తరూములుగా తయారుచేశారు. 2013లో నిర్మించిన ఈ రూములను పట్టించుకునేవారే కరువయ్యారు. ఇప్పటికి మున్సిపాలిటీకి ఇద్దరు కమిషనర్లు మారినా ఆ రూముల గురించి శ్రద్ధతీసుకోవడం లేదు. ఇలా ప్రజాధనం ఖర్చుచేసి ఒరగబెట్టిందేమిటో తెలియడం లేదు. ఇలా నిరుపయోగంగా ఉన్న రూములను ఏదైనా వ్యాపారులకు సంబంధించి లీజుకు ఇచ్చి వుండివుంటే మున్సిపాలిటీకి ఆదాయవనరుగా ఉండేది. ఈ రూములు నిరుపయోగంగా ఉంచడంతో స్థానిక టింబర్‌డిపో వారు, మందుబాబులు, స్థానికులకు వ్యర్థాలు తెచ్చి పడేసేందుకు వీలుగా మారాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ రూములను వాణిజ్యపరంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా వుంది.