రాజమండ్రి

లోకం తీరు! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడలో ఓ అడ్రసు కాగితం పట్టుకుని సందుల్లో అపార్ట్‌మెంట్ల పేర్లు చదువుతూ, అలా చూసుకుంటూ తన వేలు విడిచిన మేనమామ ఇంటి కోసం ఎండన పడి తిరుగుతున్నాడు వంశీ.
అమ్మకి దూరపు బంధువైన చలపతిరావుని కలవమని ఆమె ఎన్నాళ్లగానో అతనికి చెబుతోంది. వీలైతే అతన్ని ఒకసారి తీసుకురమ్మని కూడా చెబుతోంది. తీరిక లేక వంశీయే అతన్ని తీసుకురాలేకపోయాడు.
మధ్యాహ్నం పనె్నండు దాటింది. కానీ ఆ అడ్రసు దొరకలేదు. ఓ ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు కాబోలు వీధి గుమ్మంలోనికి వచ్చి వంశీ అడిగిన అడ్రసు గురించి వింది. ‘‘ఆ పేరు గలవాళ్లెవరూ ఈ వీధిలో లేరండి. అడ్రసు సరిగ్గా కనుక్కోవలసింది కదా’’ అనేసి తలుపు గడియ పెట్టేసుకుంది ఒకింత అనుమానంగా చూస్తూ.
అతను ఇంకో ఇంటి తలుపు తట్టాడు.
‘‘వేళాపాళా ఉండదా బాబూ మీకు? అడ్రసులు చెప్పడానికే ఉన్నామనుకున్నారా? వెళ్లండి’’ అని తలుపు గడియ వేసేసుకుంది.
‘ఏమిటో దొంగలు కూడా మంచి డ్రస్సులోనేగా వచ్చి మోసం చేస్తారు. అందుకే వీళ్లు అలా గడియలు వేసేసుకుంటున్నారు. అయినా ఇంత వేసవిలో అదీ మిట్టమధ్యాహ్నం తలుపులు తడితే ఏమైనా అనుకుంటారు మరి. చలపతి మామయ్యని తీసుకు రమ్మని సతాయిస్తోంది కాబట్టి వచ్చాను కానీ లేకపోతే ఇలా వీధివీధి తిరగాల్సిన పని నాకేమిటి?’ అనుకున్నాడు వంశీ.
ఇంతలో ‘‘ఏమండీ’’ అంటూ వినిపించి తిరిగి చూసాడు అతను.
‘‘ఎవరండీ గంట నుండీ ఎండలో తిరగడం చూసాను. మీకెవరు కావాలి? ముందు లోపలికి రండి’’ అని వంశీని ఇంట్లోకి రమ్మని కుర్చీ చూపించింది ఆమె.
వంశీ ఆ ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు.
ఆమె పెద్ద గ్లాసు నిండా మజ్జిగ తీసుకుని వచ్చింది.
‘‘ముందు మీరు మజ్జిగ తాగండి’’ అంది.
వంశీ దాహానికి తాళలేక ఉన్నాడేమో గటగట ఆమె ఇచ్చిన మజ్జిగ తాగేశాడు.
‘‘నేనెవరో తెలీదు. అయినా మీరు ఫ్యాన్ కింద కూర్చోబెట్టి దేవతలా దాహం తీర్చారు. చాలా థ్యాంక్సండీ’’ అన్నాడు.
‘‘్ఫర్వాలేదు. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకులెండి. ముందు ఆ అడ్రస్ కాగితం ఇలా ఇవ్వండి’’ అంటూ తీసుకుంది.
‘‘ఈ అడ్రసులో ఉన్నాయన మా అమ్మకి తమ్ముడు. ఈ వీధిలోనే ఉండేవారట. కొంచెం చూడండి’’ అన్నాడు వంశీ.
ఆమె ఆ అడ్రసులో పేరు అదీ చదివి ‘‘ఇతను ప్రస్తుతం ఇక్కడ ఉండడం లేదండీ. వేరే చోట ఉంటున్నారు. అడ్రసు, ఫోన్ నెంబరు చెబుతాను వెళ్లగలరా?’’ అంది.
‘‘వెళతాను’’ అన్నాడు వంశీ.
‘‘వద్దులెండి! మీరు వెతుక్కోగలరో లేదో. నేనే తీసుకువెళతాను. నాకు అటు వెళ్లాల్సిన పని కూడా ఉంది’’ అంటూ తన స్కూటీ స్టార్ట్ చేసి ‘‘రండి’’ అంది.
అతను వెనక కూర్చున్నాడు.
‘‘నా పేరు వసంత. టీచర్‌గా పనిచేస్తున్నాను’’ అంది.
‘‘నా పేరు వంశీ. మీరెంత మంచివారండీ. ఒక్కరు కూడా నాకు సాయపడలేదు. మీలాంటి మంచి మనుషులు కూడా ఉంటారా?’’ అన్నాడు.
ఆమె వౌనంగా నవ్వేసింది.
అతనికి కావలసిన అడ్రసులో దింపింది.
అతను ఆ ఇంట్లోకి వెళ్లాడు. అడ్రసు కోసం తనెంత హైరానా పడిందీ, అప్పుడు తనకి వసంత ఎలా సాయపడిందీ చెప్పాడు.
‘‘ఓహో ఆవిడా తెలుసు. అందంగా, తెల్లగా ఉంటుంది. అంత మంచిది కాదు. కులం తక్కువది. వీధిలో ఆవిడకి మంచిపేరు లేదు’’ అన్నాడు చలపతిరావు.
‘‘అలా మాట్లాడకు మామయ్య. ఆవిడ ఎలాంటిదైనా కానివ్వు. ఈరోజు ఇక్కడికి సజావుగా వచ్చానంటే ఆవిడ చలవే కదా’’ అన్నాడు వంశీ.
చలపతిరావు మాట్లాడలేదు.
భోజనం గట్రా చేసి విశ్రాంతి తీసుకుంటుండగా వసంత గుర్తుకొచ్చింది వంశీకి.
‘తనకి సహాయం చేసిన వసంత మంచిది కాదా? అయినా నిప్పు లేకుండా పొగరాదు. ఆవిడ గురించి ముందే తెలుసుంటే స్కూటీ మీద ఆవిడ వెనక కూర్చున్నప్పుడే ట్రై చేద్దును కదా. అయ్యయ్యో మంచి ఛాన్స్ మిస్సయిపోయాను’ అనుకున్నాడు.
* * *
ఆఫీసులో కొలీగ్స్‌తో ఈ విషయమంతా చెప్పాడు.
మండుటెండలో తాను తన మామయ్య అడ్రసు గురించి వెతకడం, ఎవరూ సాయం చేయకపోవడం, వసంత కోరి పిలిచి మజ్జిగ ఇచ్చి మరీ అడ్రస్ చెప్పి, దగ్గరుండి ఆ అడ్రస్‌కి తీసుకెళ్లడం గురించి వివరంగా చెప్పాడు. వసంత గురించి మామయ్య చెప్పాడని కాకుండా ఆమె మంచిది కాదని, అందుకే అంత విచ్చలవిడిగా ఉందని, తాను ట్రై చేసి ఉంటే ఛాన్స్ దొరికి ఉండేది కానీ టైం లేక వీలు పడలేదని గొప్పగా చెప్పాడు.
అతను చెప్పింది విని కొలీగ్స్ ఒకరిద్దరు ‘అవునవును’ అన్నారు. ప్రసాద్ మాత్రం ‘‘మనకి సాయం చేసిన వారి గురించి అలా నీచంగా మాట్లాడకూడదు. నీ అవస్థ చూసి, నీకెవరూ సాయం చేయకపోవడం గమనించి ఆమె ఆదుకుని ఉండొచ్చు. అంత మాత్రానికే ఆవిడని బ్యాడ్ చేసేయడం సంస్కారం కాదు’’ అన్నాడు.
దానిని వంశీతో పాటు మిగిలిన వారు కూడా ఖండించారు. ఆమె కచ్చితంగా తిరుగుబోతే అయి ఉంటుందని, అందుకే ముక్కూమొహం తెలియని మగాడిని స్కూటీ మీద వెనక కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి దింపిందని అన్నారు.
ఆరోజు మధ్యాహ్నం వంశీ ఆఫీసు పనిలో బిజీగా ఉండగా ఫోను వచ్చింది. వాళ్లమ్మగారు చేశారు. ‘‘వంశీ! నీ భార్య అనితకు ఏక్సిడెంట్ అయింది. సాగర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంటికి ఫోన్ వస్తే నేను పక్కవాళ్లని తీసుకుని ఆటోలో వచ్చాను. హాస్పటల్లోనే ఉన్నాను. నువ్వు తొందరగా హాస్పటల్‌కి రా. నాకసలే గుండెదడగా ఉంది’’ అంటూ కంగారుగా చెప్పింది.
వంశీ సెలవు చీటీ రాసి కొలీగ్‌కి ఇచ్చి బయటపడ్డాడు. అతను హాస్పిటల్‌కి వెళ్లేసరికి అనితకి తెలివి లేదు.
బ్లడ్ ఎక్కిస్తున్నారు. నిద్రకి కూడా ఇంజెక్షన్ ఇచ్చినట్లున్నారు. కళ్లు మూసుకుని ఉంది. తలకి కట్టు కట్టి ఉంది. ‘‘అనితా’’ అన్నాడు బెడ్ దగ్గరకి వెళ్లి.
ఆమె మాట్లాడలేదు. అక్కడే ఉన్న తల్లి వైపు చూసాడు. ఆమె బేలగా చూసింది.
‘‘బండి మీద ఇంటికి వస్తుండగా ఆటో ఢీకొట్టిందట. పక్కనే ఉన్న రాయి మీద పడిపోయిందట. ఎవరూ సాయం చేయలేదట. రక్తం చాలా పోయింది. ఆ సమయంలో ఒకావిడ ఎవరో చూసి ఆటోలో ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేసిందట. ట్రీట్‌మెంట్ చేద్దామంటే అనిత గ్రూపు బ్లడ్ లేదిక్కడ. అనితని ఇక్కడ చేర్చినావిడే తన బ్లడ్ సరిపోతుందేమో చూడమందట. చూస్తే సరిపోయింది. దాంతో డాక్టర్లు వైద్యం మొదలుపెట్టారు. మగాళ్లు కూడా చొరవ తీసుకోని టైములో ఆడదైనా ఆవిడ ఎవరో కానీ నీ భార్యని ప్రాణాపాయం నుండి కాపాడింది. ఆమె నిజంగా దేవతే’’ అంది వంశీ తల్లి.
‘‘ఇంతకీ ఎవరమ్మా ఆవిడ?’’ అన్నాడు వంశీ.
‘‘అదిగో అక్కడ గదిలో ఉంది. బ్లడ్ ఇచ్చింది కదా వైద్యులు కాసేపు ఉండి వెళ్లమన్నారు. పద ఆమె దగ్గరకి వెళదాం’’ అంటూ లేచింది వంశీ తల్లి.
తల్లితో పాటు ఆ గదిలోకి వెళ్లాడు వంశీ.
ఆమె నీరసంగా పడుకుని ఉంది.
‘‘అమ్మా!’’ ఆమెని పిలిచింది వంశీ తల్లి.
ఆమె కళ్లు తెరచి చూసింది.
ఆమెని చూసిన వంశీ ఒక్కసారిగా షాక్ తిన్నాడు.
ఆమె ఎవరో కాదు వసంత. మామయ్య, అతని మాటలు విని తనూ నోటికొచ్చినట్లు మాట్లాడిన వసంత ఆమె. ఆరోజు తనెవరో తెలియకపోయినా ఒక మగాడిని తన బండి వెనుక కూర్చోబెట్టుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచించకుండా ఎండలో తనకి సహాయం చేసిందీవిడ. తన భార్య చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు మగాళ్లు ఎవరూ ముందుకు రాకపోయినా హాస్పిటల్‌కి తీసుకొచ్చి, బ్లడ్ ఇచ్చి కాపాడిందీ రోజు.
మంచిది కాదని, కులం తక్కువదని మామయ్య అన్నాడు. మరి ఆవిడ రక్తమే ఇప్పుడు తన భార్య అనిత శరీరంలో ప్రవహిస్తోంది. మంచివాళ్లని ఎప్పుడూ లోకం అర్థం చేసుకోలేదు. సేవాదృక్పథంతో ఆమె ప్రవర్తించిన తీరును విచ్చలవిడితనంగా అర్థం చేసుకునే సమాజంలో తానూ ఒకడిని. ఛీఛీ ఇలాంటి దేవత గురించి ఎంత నీచంగా ఆలోచించాను’ అనుకుంటూ లెంపలేసుకుని ఆమె కాళ్లు పట్టుకున్నాడు.

- పుష్ప గుర్రాల, విజయనగరం.
సెల్ : 9491762638.

శబ్ద చమత్కార కవి... వేంకట కవి!

17వ శతాబ్ది ప్రథమార్ధంలో తంజావూరు రఘునాథ భూపతి ఆస్థానంలో చేమకూర వెంకటపతి అనే కవి వుండేవాడు. ఆయన శృంగార రస ప్రధాన గ్రంథాలు రెండు రాశాడు. మొదటిది సారంగధర చరిత్ర. ఇది ఆయన ప్రథమ ప్రయత్నం అవటం వల్ల అంత బాగా కుదరలేదు. అయినా కొన్ని పద్యాలు అద్భుతంగా వుంటాయి.
కలరా యిలరాయనికిం
కులసతి రత్నాంగి భోగ కుటిల శిరోజా
తిలకము చిత్రాంగియు నన
నెల జవ్వను లిరువు రంబుజేందు నిభాస్యల్.
ఆ రాజుకు కులసతి రత్నాంగి, భోగ కుటిల శిరోజా తిలకము చిత్రాంగి అని ఇద్దరున్నారు. రత్నాంగి భార్య, చిత్రాంగి ఉంపుడుగత్తె. ఇద్దరూ వయస్సులో వున్నవారే. వారు అంబుజేందు నిభాస్య లన్నాడు. ఇది క్రమాలంకారం. రత్నాంగి ముఖం పద్మము వలెనూ, చిత్రాంగి ముఖం చంద్రుని వలెనూ వున్నవని భావం. అంటే వీళ్లిద్దరికీ పడదని తాత్పర్యం. పద్మం వుంటే చంద్రుడుండడు. చంద్రుడుంటే పద్మము వుండదు. ఇదీ కవి చేసిన చమత్కారం. మరొక పద్యం. యువరాజు సారంగధరుడు పావురము నిమిత్తం చిత్రాంగి ఇంటికి వెళ్తాడు. అప్పుడతనిని చూసి ఆమె మోహిస్తుంది. ఆ ఘట్టంలోని పద్యం.
చందురునిన్ జయంతుని వసంతుని కంతుని ఆదిగా జనుల్
కొందరు మోహనాంగులను కోవిని పోవుటెగాని చూడలే
దెందును వారి రూపమది ఎట్టిదియో యిదే నిన్నుగంటి నా
నందముగాగ నేడు సుదినంబుగ నా సదనంబు రంజిలెన్
ఈ పద్యంలో శబ్దాలంకారం ఎంతో హృద్యంగా వుంది.
ఇక రెండో గ్రంథం విజయవిలాసము. తెనుగు భాషాభిమానులెవరైనా ఈ పుస్తకాన్ని చదువకుండా విడువరు. ఇందులో వేంకటకవి పద్యాల్ని పట్టాలెక్కించి పరుగెత్తించిన తీరు అమోఘం. ప్రతి పద్యం ఆణిముత్యమే. వ్యంగ్య ప్రధానమే. రసాస్పదమే. శబ్దార్థాలంకార శోభితమే. చదివిన ప్రతిసారి ఆనంద పారవశ్యంలో మునిగి తేలవలసినదే. ఒకసారి గదుడనేవాడు ద్వారక నుంచి ఇంద్రప్రస్థ పురానికి వస్తాడు. కుశల సమాచార సేకరణ పిదప అతడు అర్జునుని విడిగా కలుసుకొని సుభద్రను గురించి చెపుతాడు. ఆ ఘట్టంలోని పద్యం.
కనస్సుభద్రకు న్సమంబుగాగనే మృగీవిలో
కనన్ నిజంబుగాగ నే జగంబునందు జూచికా
కనన్ దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః
కనన్మనోజ్ఞ రేఖలెన్నగా దరంబె గ్రక్కునన్
ఈ పద్యానికి ఎన్నుకున్న పదాలు, చెప్పిన పద్ధతి, నడిపించిన తీరు అద్భుతం. ఈ పద్యం పంచచామరము. మరో పద్యంలో గంగానదిని వర్ణించిన తీరు శభాషనిపిస్తుంది.
సునాసీరసూనుండు సూచన్నిమజ్జ / జ్జనౌఘోత్పతత్పంక శంకాకరాత్మో
ర్మి నిర్మగ్న నీరేజ రేఖోన్న మద్భృం / గ నేత్రోత్సవశ్రీని గంగా భవానిన్
ఈ పద్యం భుజంగప్రయాతము. గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలు తొలగిపోతాయని, పాపం నల్లగా వుంటుందని ప్రసిద్ధి. ఆ నదిలోని తామర పూవులలో తిరుగాడుతున్న తుమ్మెదలు తరంగాలు తగిలి పైకి లేచిపోతూ వుంటే, అవి స్నానం చేస్తున్న వారి పాపాలా అన్నట్లున్నై. అటువంటి ప్రకృతి సౌందర్యంతో కనువిందు చేస్తున్న గంగానదిని అర్జునుడు చూశాడు. ఇట్లా ఎన్ని పద్యాలనైనా ఉటంకించవచ్చు. చివరగా ఒక పద్యం.
కానుకగాగనిత్తు బిగికౌగిలి పల్కవె కీరవాణి నీ
దౌ నుడితేనె నా చెవుల నాన, గృపారసధార నాన న
నాన్ననమెత్తిచూడు నలినానన గోలతనాన నేలలో
నాన చలంబు నీకు మరునాన సుమీ విడు నాన యింకిటన్.
అర్జునుడు పాండ్యరాజు కుమార్తె చిత్రాంగదను పెళ్లి చేసుకుంటాడు. ఆరోజు రాత్రే శోభనం ఏర్పాట్లు అన్నీ జరుగుతై. పిల్లను గదిలోకి నెట్టి తోడువచ్చిన చెలికత్తెలు తలుపువేసి వెళ్లిపోతారు. మంచం మీద ఆసీనుడై వున్న అర్జునుడు ఆమె అందాన్ని చూసి మోహము ఆపుకోలేక ఆమె కొంగుపట్టి లాగుతాడు. మంచం మీద అతని పక్కనే కూర్చుంటుంది బెల్లంకొట్టిన రాయిలా. ఉలుకూ పలుకూ లేదు. ఒక్క మాటైనా మాట్లాడు.. బిగికౌగిలి కానుకగా ఇస్తానంటాడు. కీరవాణీ! అని సంబోధిస్తాడు. చిలుక పలుకులదానా అని అభిప్రాయం.
‘నీ పలుకులు నా చెవి ఆనేట్లు చెయ్. అవి నాకు తియ్యగా వుంటయ్. నా చెవులకు విందు చేస్తయ్. నీ దయా రసంలో నన్ను నానేట్లు చెయ్. తలపైకెత్తి చూడు నలినానన’ అంటాడు. పద్మము వంటి గుండ్రని శోభాయమానమైన ముఖం కలదని భావం. ‘ఎందుకింత చిలిపితనం? ఎందుకింత పట్టుదల? నామీద కోపమా? సిగ్గును ఒదిలిపెట్టు? మన్మథుని మీద ఒట్టుపెడుతున్నా’నన్నాడు. ఈ పద్యంలో కవి ఎనిమిది ‘నాన’లు ఎనిమిది అర్థాలలో వాడాడు. అదీ వెంకటకవి చమత్కారం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈతని కవిత్వం సుధారసంతో పెంచిన మామిడి చెట్టుకు కాసిన పండ్లరసంలో తేనె కలిపి తాగుతున్నట్లుంటుంది. మొదటగా ‘కీరవాణీ! నీ పలుకులనే తెనెను నా చెవులకు ఆనేట్లు, అనగా సోకేట్లు’ చెయ్యమన్నాడు. తర్వాత దయారసంలో నానేట్లు చేయమన్నాడు. తదుపరి నన్ను అననమెత్తి చూడమన్నాడు. పిమ్మట నలినానన అని సంబోధించాడు. గోలతనాన - అమాయకంగా - ఎందుకు నీకు నాపై కోపం - లోనాన చలంబు నీకు అన్నాడు. మన్మథునిపై నాన - ఒట్టు అన్నాడు. విడునాన యింకిటన్. ఇక ఇక్కడ సిగ్గుపడరాదు. దాన్ని విడిచిపెట్టమన్నాడు. ఇది శబ్ద చమత్కారం. అసలీ పుస్తకం నిండా అలంకారాలే. ఈ గ్రంథ కృతిపతి రఘునాథరాయలు గొప్ప విద్వాంసుడు. మహాభారత సంగ్రహం, రామాయణ కథాసారం, సంగీతసుధ, సాహిత్యసుధ, భారతసుధ, వాల్మీకి చరిత్ర, రఘునాథ రామాయణం, శృంగార సావిత్రి, నల చరిత్ర మొదలైన గ్రంథాలు ఎన్నో రచించాడు. అటువంటి రాజు ఈ కవిని ఎంతగానో ప్రశంసించాడు అదీ ఒక పద్యంలో..
‘ప్రతి పద్యమునందు చమ/ త్కృతి గలుగం జెప్పనేర్తు వెల్లడ బెళుకే
కృతివింటి మపారముగా / క్షితిలో నీ మార్గమెవరికిన్ రాదుసుమీ’ అన్నాడు. ఇంతటి మనోహర కవిత్వాన్ని అందించిన వేంకట కవి ధన్యులు.

- ప్రయాగ కృష్ణమూర్తి,
చరవాణి : 8179063842

పుస్తక పరిచయం

‘నేల తల్లి పొత్తిళ్లలో’
నిలిచిన స్ర్తి కవితలు

ఆలోచన విత్తు నాటడానికి మేథోశక్తే కాదు, శ్రమశక్తితో పాటు ఆర్థిక శక్తి ఎంతో అవసరం. కవిత్వాన్ని రాయటమే కాదు. పుస్తకాలుగా తెచ్చిన ప్రజల దగ్గరకు చేర్చటం దూరాభారం, వ్యయ భరితం తప్పడం లేదు. ఖర్చును ఒకరే మోసుకునే కన్నా సహకార పద్ధతిలో ఇద్దరు ముగ్గురు తమ కవిత్వాన్ని వెలుగు పరచటం ఇప్పటి కొత్తదనం ప్రచురణ భారమూ కాదు. ప్రమోషన్ చేసుకోవడం సులువు. నలుగురు షేర్ చేసుకోవడం వల్ల కష్టం ఒకరిపైనే పడి శ్రమ బరువు అవ్వదు. ఆ తోవలోనే ఇది కచ్చితంగా తెచ్చారనలేము కాని అదొక మార్గం.నేలతల్లి పొత్తిళ్లలో ఓ అయిదుగురు అమ్మలు తమ కవితా పత్రికను ప్రసవించారు. కన్న పుత్రికలపై మమకారం ఎక్కువ. అయిదురూ అయిదేసి కవితల్ని ప్రసవించారు.
కాకిపిల్ల కాకికి ముద్దని కోనేరివారి ముచ్చట తీర్చుకున్నారని కాదు అన్యాయం పైన అవినీతిపైన దుర్మార్గంపైన ధైర్యంతో సంఘటితం చేసే చొరవ ఈ కవయిత్రుల్లో కనిపిస్తుంది. సమాజంలో సగభాగమై సమస్యల సుడిగుండంలో దండాగుండమయ్యేది మహిళలే. విద్య విజ్ఞాన విషయాల్లో అణగదొక్కబడుతున్నా అనేక రంగాల్లో పడిలేచే కెరటంలా దూసుకొస్తున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని తమపై కొనసాగిస్తున్న వివక్షతను, నిరసిస్తూ, నినదిస్తూ తమ గళాలనే కాదు తమ కలాలను ఝళిపిస్తున్నారు. ‘నేల తల్లి పొత్తిళ్లలో’ అంటూ చాలా పొయిటిక్ థాట్‌తో పెట్టిన శీర్షిక. దాని కింద ట్యాగ్ అయిదైదులు ఇరవై ఐదు అని పెట్టారు. కమర్షియల్ నవలా రచయిత రెండు రెళ్లు ఆరు టైటిల్‌లా స్ఫురించినా చాలా భావుకతతో ఉట్టిపడిన కవిత్వంగా తోస్తోంది. లోపల పేజీల్లోకి వెళితే. అయిదు కవితలతో ఇనుగంటి జానకి గారు ‘పూలతోటలో స్వాతంత్య్ర పోరాటం’ అంటూ పదునైన భావాలతో మన మెదళ్లలో చిక్కని భావావేశాన్ని గుబాళింపజేశారు. చాలా భావస్ఫోరకంగా సాగిన కవిత.
అహంభావంతో ఆత్మన్యూనతను సోధింప చేసే సాటి సమాజాన్ని ప్రశ్నించి ప్రచోదన పరిచిన కవిత ‘యువతి’ సహజంగా పల్లవించనీయమని మనిషిగా బతకనీయమని అర్ధిస్తున్న కవిత ఆమే2 కూడా ఆలోచన రేకెత్తించిన కవిత ఎవరి మనోభావాలు2ఎలా ఉంటే / వారికి అలానే కనపడుతుందన్న బాణంతో పెట్టిన పాదాలు కనిపిస్తాయి. తన చుట్టూ జరుగుతున్న సమాజ పోకళ్లని, పరిస్థితిని అంచనా వేయటంలో స్థిర చిత్రతను చూపెట్టిన గృహిణి కవిత్వం.
చివ్వున తలయెత్తేలా అడుగుతున్న ప్రశ్న, నలభైయేళ్ల స్వరాజ్య చిరునామాను అడుగుతున్నారు ‘ఏదీ? నీ చిరునామా’2కవితలో ఉప్పులూరి శైలజ. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మరిచే రాజకీయ నేతల అల్జీమర్స్ రోగానే్న అడుగుతున్నారు. అవినీతి, అక్రమాలతో రోజూ పెరిగే నిత్యావసర వస్తు ధరల చిట్టాను, వాస్తు పిచ్చితో కోట్లాది రూపాయల భవంతులు కూలగొట్టి, గ్రామాల్లో కనీస సదుపాయాలు కనిపించనీయని గ్రామ స్వరాజ్యాన్ని ఈసడించి అడుగుతున్నారు ఏది? నీ చిరునామా? వీళ్లంతా రోడ్డు పక్క రైల్వే జంక్షన్లు బస్టాండులు ఒకటేమిటి పార్కులు పేమెంట్‌ల మీద చింపిరి జుట్టు మురికి వస్త్రాలు2 బతుకుచెడి కడుపు మాడి ఈ దేశ దరిద్ర జాతికి అభాగినుల గురించి యోగినివా?
పిరికి పాలు తాగుతూ జీవితాన్ని హరింప చేసుకుంటున్న వారికి ధైర్య గీతాన్ని నూరుపోస్తున్నారు. ఆవేదన ఉంటే మనసులో, ఆక్రోశం ఉంటుంది. ఆలోచనకు పదునుపెట్టి చూపిస్తాయి, ఆమె ఐదు కవితలు. కవిత్వమే ఆలోచనీయం. ఆచరణకు సుబోధపరచటమే ఆ కవితా లక్షణం.
కార్యేషు మాత కరణేషు మంత్రి ఆమె ఏమేమి చేస్తుంది. ఎవర్ని తీర్చిదిద్దుతుంది. ఎలా సాకుతుంది. వివిధ పాత్రల్లో విభిన్న రూపాల్లో ‘అతివ2 నిర్వహించిన విధుల్ని విశదీకరించిన జీవన మాధుర్యాన్నందించే / శరత్కాల వెనె్నల / నిరాశా ఎడారిలో చిరపుంజిగా / అంటూ మహిళను మాతృమూర్తిని భార్యను అక్కను చెల్లెను వివరించిన కవిత ‘వాడూ మనిషే’నట2 అంటూ పురుషాధిక్య సమాజంలో పురుష దుర్నీతిని ఎండగట్టి ఎరుకపరచిన కవిత ఇది. మహామనిషిని ఒలువలుడదీసి అడిగిన వైనం ఈ కవితలో కనిపిస్తుంది. వీటితోపాటు సంక్రాంతి సంబరాలు2సీనియర్ సిటిజన్స్ ‘వస్త్ర కళా - జీవన గమనం’ ఉదాత్తనీయమైన వచనంతో తమ కవితలు కురిపించారు కొంకేపూడి అనురాధ.
అసలైన గొంతుకను అహర్నిశలు నినదించేలా గుండె గొంతుకన వినిపించే స్వరం కవయిత్రి లక్ష్మీది. పుస్తకానికి టైటిల్‌తో ప్రాణం పెట్టిందీ కవితలకు పురుడు పోసిందీ ‘నేల తల్లి పొత్తిళ్ల అంచున2... కవిత ప్రస్తుత పరిస్థితుల్ని ఉతికి ఆరేసి పాలకుల ద్వంద నీతిని ఎండగట్టిన కవిత సారవంతమైన భూముల్ని రాజధాని నిర్మాణంలో లాక్కుని ఆకాశహర్మ్యాలు నిర్మించడానికి పూనుకుంటున్న ప్రభుత్వాల సంగతి తెలిసిందే. ‘రాజధాని ఇరుసు విరగకొట్టడానికి ముందు / పిరికి వేర్లను పీకివేద్దాం2 అని పిలుపునిచ్చిన కవిత. ‘నాగలితో దున్నాల్సింది / భూములను కాదు / అవినీతి గుండెల్ని’ అని హెచ్చరిస్తున్నారు. ఈ కవిత ప్రస్థానం పత్రిక కవితల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది.
పుష్కరం ఎప్పుడొచ్చినా పుష్కరాలకోసం 29 మందిని బలిదానం చేసిన ఎక్యుజుడు ముద్దాయి పుష్కరాలు వచ్చినప్పుడల్లా తప్పక గుర్తుండిపోతాడు. దాని కారకులను, పాపికొండల కింద పాతి పెడదామని ‘ఆగిన గుండెల ఆత్మశాంతికై’ కవితలో గోదారిలో పిండం పెట్టడానికి రమ్మంటున్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించడం ఈమె నైజం. తనెవరో కవయిత్రి చెప్పిన కవిత తన అస్తిత్వాన్ని ప్రశ్నింపచేసి తానేమి చేయాలో తెలియజేసిన కవిత. సమాజానికి మేలు చేసే క్రమంలో ఉపాధ్యాయురాలి పాత్ర ఎంత అవసరమో ‘అవసరమొచ్చింది’లో చెప్పారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయిని కావటం ఇక్కడ గమనార్హం. పీడన నుంచి ఎదుర్కొనేది ఎలానో సుబోధపర్చడం కర్తవ్య పరంగా తెలపడమే కాదు స్ర్తి పక్షం నుంచి సాహసోపేతంగా తయారుచేయాల్సిన ప్రస్తుత అవసరాన్ని బాగా ఎరుక పరిచారు.
అలా ఓ చక్కని ఆలోచనకు అంకురార్పణ చేసిన ఈ పుస్తకం నన్ను బాగా ఆకర్షించింది. ఇది ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఉగాది శత కవి సమ్మేళనంలో శైలజ పరిచయం చేసుకొని నాకు ఈ పుస్తకాన్ని అందించారు. సభా నిర్వహణకు విసుగు చెందకుండా ప్రధాన వేదిక నుంచి కొందరితో కవి సమ్మేళనం జరిగినప్పటికీ చిరునవ్వుతో అందరి కవితలు చివరాఖరి వరకు ఆస్వాదించి అభినందనలు తెలపటం ముచ్చటేసింది.
తమ కవితను చదవగానే సభ నుంచి నిష్క్రమించే వారికి ఆమె సహృదయత ఆదర్శం కావాలి. చివరగా స్ర్తివాద కవిత్వం కాదు, ప్రగతివాద కవిత్వంతో పదునుపరిచారు ఈ పుస్తకాన్ని. అయిదుగురు తమ కవిత్వాన్ని వెలుగులోకి తెచ్చుకొనే క్రమంలోనే కవిత్వంతో జీవితాలు వెలుగుపర్చాలనే ఆరాటం కన్పిస్తుంది. వారి అక్షరాశయాన్ని స్వాగతిద్దాం.

- రవికాంత్, సెల్: 9642489244

మనోగీతికలు

ఇసుక మనిషి
మనిషి ధన మత్తులో
ఇసుకను ముద్దాడుతున్నాడు
వీధులన్నీ ఇసుక గుట్టలే
చివరకు మనిషే ఇసుక పర్వతం
కాలం ఇసుకను అవినీతిలోకి దింపింది
కళ్లల్లో ఇసుక కళ ఆనందంగా
పచ్చ కాగితాల వరదలో
చిగురిస్తున్న దోపిడి
ఇసుక భాషలో భావం
తడిసి ముద్దవుతోంది
గుండె బ్యాంక్ ఖాతాలో
లక్షలు పడితేనే వేడుక
రోడ్డు మీద వాహనాలతో రాత్రి
ఇసుక ప్రవహిస్తుంటే
వౌనం చీకటి దారుల్లో పరుగెడుతోంది
గోదారి కంటతడి పెట్టినా
కరగని ఇసుక మనిషి హృదయం
ఇసుకగా మారిపోయింది
సామాన్యునికి ఇసుక బంగారమైంది
రెండు కంటి రెప్పల మధ్య
కన్నీరుంటుంది
కానీ ఇసుకే కళ్లయింది
అణువు అణువునా
అనుక్షణం మనిషి హృదయంలో
కరెన్సీ వికసించే ఇసుక
పువ్వులా నవ్వుతోంది
అర్థం కాని జీవితాన్ని చూసి

- నల్లా నరసింహమూర్తి, అమలాపురం, చరవాణి: 9247577501

అమృతత్త్వం
ఆత్మను అమ్మేసుకున్న గుండెల్లో
ఇంక అనురాగానికి తావెక్కడిది
జీవితాన్ని త్యాగించలేనివాడు
ఎలా మహాయోగి కాగలుగుతాడు?
మృగతృష్ణల్లో నీటిని వెదకేవాడికి
ఎన్నడైనా దప్పిక తీరుతుందా?
కళ్ల కిటికీలను మూసేసుకున్న వాడికి
ఇంక నిజాలతో పని ఉంటుందా?
అక్షరం పట్ల మమకారం లేనివాడు
మృతప్రాయుడేననడంలో
సందేహముందా!
జన్మనిచ్చిన తల్లిని
నీడనిచ్చిన చెట్టును
శత్రువుగా చూసే మహాపాపికి
ఏనాటికైనా విముక్తి ఉందా!
త్యాగమే అమృతత్త్వం
స్వార్థమే మృత్యుతత్త్వం
స్వార్థాన్ని త్యజించు
అమృతత్త్వాన్ని వరించు
అమృత పురుషుడవై జీవించు!

- ఎంవిఎస్ శాస్ర్తీ,
చరవాణి : 99484 09528

email: merupurjy@andhrabhoomi.net
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- పుష్ప గుర్రాల