కథ

చిన్నిచిన్ని ఆశ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(కథల పోటీలో ఎంపికైన రచన)

మమీ, డాడీల గారాలపట్టి చింటూ. అసలు పేరు అంకిత్. పుస్తకాలకే అంకితమవ్వాలని ఏరి కోరి మరీ ఆ పేరు పెట్టారు వాడి పేరెంట్స్. వాడు పుట్టినప్పుడే ఇంజనీర్ అవుతాడని డిసైడ్ చేసేశారు ‘3 ఇడియట్స్’ సినిమాలోలా. ఇక ఆ రోజు నుంచి వాడికి నాలుగేళ్లు ఎప్పుడు వస్తాయా? స్కూల్లో చేర్పిస్తే ఇంజనీరింగ్ వైపు వాడి తొలి అడుగు ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు వాడి పేరెంట్స్. మొత్తానికి ఆ శుభ ఘడియ రానే వచ్చింది. వాడికి ఇలా మూడో పుట్టిన రోజు గ్రాండ్‌గా చేశారో లేదో ఆ మరుసటి రోజే స్కూల్లో జాయిన్ చేసేశారు. పైగా ఇంచుమించు ప్రతీ విషయంలోనూ తూర్పు, పడమరలా ఉండే వాడి మమీ, డాడీ ఒక నెల రోజుల ముందు నుంచీ కలసికట్టుగా మరీ ఏ స్కూల్ అయితే వాడికి బాగుంటుందో, తమ ఇంజనీరింగ్ కలకి పునాది ఎవరు బాగా వేస్తారో రీసెర్చ్ చేసి మరీ వాడిని ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో చేర్పించారు. ఆ కార్పొరేట్ స్కూల్‌ని నగరంలో ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్నారు. కాబట్టి సహజంగానే దానికి ప్లేగ్రౌండ్ లేదు. పైగా ఆ స్కూల్ వాళ్లు ప్లేగ్రౌండ్ లేకపోవటాన్ని ఒక క్రెడిట్‌లా చెప్పుకుంటున్నారు. పిల్లలకి ఆటల మీద ధ్యాస మళ్లకుండా బుద్ధిగా చదువుకుంటారని తల్లిదండ్రులకి తెగ ఊదరగొట్టేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అది నిజమే కదా అని తమ పిల్లలని అటువంటి స్కూళ్లలోనే జాయిన్ చేయడానికి చాలా ఉబలాటపడుతున్నారు. అందుకే చింటూగాడి పేరెంట్స్ కూడా ఎన్నో రికమండేషన్లతో మొత్తానికి వాడిని ఆ స్కూల్లోనే చేర్పించేశారు.
* * *
ఇక ఆ రోజు నుంచి మొదలయ్యాయి వాడి కష్టాలు. పొద్దున్న లేచి స్కూల్‌కి తయారయి వెళ్లడం, సాయంత్రం వరకు స్కూల్లో క్లాసుల మీద క్లాసులు. సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే ట్యూషన్‌కి పరుగులు పెట్టడం, రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకోవడం. అబ్బో వాడిది చాలా బిజీ బిజీ షెడ్యూల్. కనీసం కాసేపు కూడా వాడికి ఆడుకోవడానికి అవకాశం చిక్కడం లేదు. పోనీ ఆదివారమైనా ఆడుకుందామా అంటే, ఆ అదృష్టం కూడా లేదు. ఆదివారం కూడా ఎక్స్‌ట్రా ఏక్టివిటీస్ పేరు చెప్పి మ్యూజిక్, కరాటే, స్విమ్మింగ్ క్లాసుల్లో చేర్పించేశారు. కాకపోతే ఆదివారం ఒక్కరోజు వాడికిష్టమైన కార్టూన్ షో ఒక గంట చూడనిస్తున్నారు. పాపం వాడికి వారంలో అదొక్క గంటే హేపీ అవర్. రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి వాడికి. స్నేహితులతో కలిసి రోజూ కాసేపైనా ఆడుకోవాలని చింటూ కల. కాలం కరిగిపోతోంది కానీ ఆ కల కలగానే మిగిలిపోతోంది. వాళ్ల అపార్ట్‌మెంట్‌లో పిల్లలందరిదీ ఇంచుమించు అదే పరిస్థితి.
* * *
చింటూ స్కూలు నుంచి వచ్చే దారిలో ఒక ప్లేగ్రౌండ్ ఉంది. కొంతమంది పిల్లలు రోజూ అక్కడ సాయంకాలం రకరకాల ఆటలు అంటే క్రికెట్, కబడ్డీ, కోకో, బంతాట ఎవరికి నచ్చినవి వాళ్లు ఆడుకుంటూ ఉత్సాహంగా ఉరకలేస్తూ కనిపిస్తుంటారు. ఆ దృశ్యం చూస్తే వాడిపోయిన చింటూకి ప్రాణం లేచి వచ్చేస్తుంది. కొంతసేపు ఆటోవాడిని అక్కడ ఆపమని వాళ్లనే అలా చూస్తూ ఉండిపోతాడు. తను కూడా అలా ఆడుకోవాలని మనసులో తెగ తహతహలాడిపోతుంటాడు. కాసేపటికి ఆటోవాడు విసుక్కుంటూ రమ్మని కేక వేస్తే అత్యంత విలువైంది ఏదో పోగొట్టుకున్నట్టు తెగ బాధపడిపోతుంది ఆ చిట్టి మనస్సు. స్కూల్లో చేరేటప్పుడు వాడి ఊహల ప్రపంచమే వేరు. ఇంట్లో ఎలాగూ మమీ డాడీలు వాడిని ఆడుకోనివ్వరు. కనీసం స్కూల్లో అయినా రోజూ గేమ్స్ పిరియడ్ ఉంటుంది కాబట్టి అక్కడ బోలెడు ఆటలు ఆడుకోవచ్చని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ వాడు ఆశించింది ఏదీ జరగడంలేదు. రోజురోజుకీ వాడికి బెంగ పెరిగిపోతోంది. సరిగా అన్నం కూడా తినలేక పోతున్నాడు. పోనీ మమీ డాడీలతో చెప్దామా అంటే ఫలితం ఎలా ఉంటుందో వాడికి తెలుసు. ప్లేగ్రౌండ్ ఉన్న స్కూల్లో చేర్పించమని అడుగుదామని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. కాని అడిగే ధైర్యం చేయలేకపోతున్నాడు. అయినా నిజానికి అటువంటి స్కూళ్లు ఆ నగరంలో వేళ్ల మీద లెక్కపెట్టేలా ఉన్నాయి. ఇంచుమించు కొత్తగా వచ్చినవన్నీ వాడి స్కూలులాంటివే. ఎలాగో భారంగా ఒక ఎకడమిక్ ఇయర్ పూర్తి చేశాడు. రెండు నెలలు వేసవి సెలవలను ప్రకటించారు. ఇక వాడి ఆనందానికి అవధుల్లేవు.
* * *
ఆ రెండు నెలల్లో ఏమేం ఆటలు ఆడుకోవాలో అన్నీ ప్లాన్ వేసేసుకున్నాడు. రోజూ తను స్కూల్‌కి వెళ్లే దారిలో ఉండే ఆ ప్లేగ్రౌండ్‌కి వెళ్లి అక్కడి పిల్లలతో చక్కగా తాను కూడా ఆడుకోవచ్చని ఎంతగానో సంబరపడ్డాడు. అమ్మా నాన్నలు ఇప్పుడింక ఏమీ అనలేరు కదా, సెలవులే కాబట్టి తను ఆడుకున్నా ఏమీ కాదని ఎంతో సంతోషంగా మొదటి సెలవు రోజును ఎలా గడపాలో తలుచుకుంటూ హాయిగా నిద్రపోయాడు. కానీ పాపం వాడికేమి తెలుసు తన రెండు నెలల సెలవును కూడా మమీ డాడీలు తమకి నచ్చినట్లు డిజైన్ చేస్తున్నారని. రోజూ వాడి మమీ ఎంత లేపినా నీరసంగా లేచే చింటూ ఈ రోజు వాడంతట వాడే లేచి చక్కగా బ్రష్ చేసేసి, స్నానం చేసేసి, బ్రేక్‌ఫాస్ట్ చేసేసి చాలా హుషారుగా రెడీ అయిపోయాడు. ఇక అమ్మా నాన్నలతో ప్లేగ్రౌండ్‌కి వెళ్లి ఆడుకుంటానని చెప్దామని అనుకునేంతలో వాళ్లే ఓ పేపర్ పట్టుకుని వాడి ముందు ప్రత్యక్షమైపోయారు. ఇది నీ సమ్మర్ టైంటేబుల్ అంటూ వాడి చేతిలో పెట్టారు. చింటూ, నీ హాలిడేస్ మొత్తం అరవై రోజులు కాబట్టి వాటిని ఏ ఆటలాడుకుంటూనో వేస్ట్ చేసెయ్యకుండా నీకొక షెడ్యూల్ వేశాము. మొదటి నెల రోజులు నీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మ్యాథ్స్, ఇంగ్లీష్ ట్యూషన్ క్లాసెస్ ఉంటాయి.
భవిష్యత్తులో ఆ రెండు సబ్జెక్టులంటే భయం లేకుండా ఉండటానికి నీలాంటి పిల్లలకి ఇప్పటి నుండే ఫౌండేషన్ వేస్తున్నారు ఆ కోచింగ్ సెంటర్ వాళ్లు. ఇక మరుసటి నెలలో ఎండలు మరీ ఎక్కువగా ఉంటాయి కనుక వాళ్లు కోచింగ్ క్లాసులు ఒక నెలే చెప్తారంట అంటూ ఇద్దరూ కలిసి వాడికి బ్రెయిన్ వాష్ చేసేశారు. హమ్మయ్య పోనీలే ఒక నెలపోతే మరొక నెలైనా ఆడుకోవచ్చన్న మాట అని వాడు మనసులోనే సంతోషించేలోపుగానే వాళ్లు మళ్లీ మొదలుపెట్టారు. సో, చింటూ అందుకే మరుసటి నెలలో ఒక పది రోజులు మేము హాలీడే ట్రిప్ ప్లాన్ చేశాం. ఇక మిగిలినవి ఇరవై రోజులు. ట్రిప్ నించి వచ్చాక, సెలవుల్లో నేర్చుకున్నవన్నీ ఒకసారి బ్రష్ అప్ చేసుకోవాలి కాబట్టి ఇంట్లోనే స్కూల్‌కి వెళ్లినట్టు అనుకుని ఆ టైమింగ్‌లో మొత్తం అన్నీ రీకలెక్ట్ చేసుకుందువుగాని. మేమిద్దరం చాలా టాలెంటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లం కదా. నువ్వు మమ్మల్ని ఇద్దరినీ మించిపోవాలి కన్నా అని ఎంతో ప్రేమగా వాడి నెత్తి మీద పిడుగు పడేశారు అమ్మా నాన్న. అంతా విన్న చింటూగాడు గాలి తీసిన బెలూన్‌లా తయారయ్యాడు. మొత్తానికి వేసవి సెలవులు తన ప్రమేయం లేకుండానే హౌస్‌ఫుల్ అయిపోయాయి. సెలవుల్లో ఇక ఎంజాయిమెంట్ లేదనుకుని నిట్టూర్చాడు. ఏమీ అడగకుండానే తనకి అన్నీ సమకూర్చే తన తల్లిదండ్రులు ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారో వాడి చిన్న బుర్రకి అర్థంకాక బాధగానే డాడీతో కారులో కోచింగ్ సెంటర్‌కి బయలుదేరాడు. కోచింగ్ సెంటర్‌కి వెళ్లే దారిలో మళ్లీ అదే ప్లేగ్రౌండ్ కనిపించే సరికి వాడికి ఏడుపొచ్చినంత పనైంది. ఎలా అయితే ముప్పై రోజుల కోచింగ్ పూర్తయ్యింది. అలాగే మమీ డాడీలతో పది రోజుల ట్రిప్ కూడా అయిపోయింది. ఇక మిగిలింది ఇరవై రోజులు. అవి కూడా ఇలాగే బోరింగ్‌గా గడవబోతున్నాయని తల్చుకుని వాడిలో వాడే కుమిలిపోతున్నాడు. కాకపోతే మండుటెండలో పిల్లతెమ్మెర కలిగించే హాయిలా వాడి నాయనమ్మ, తాతయ్యలు ఎలాగూ సెలవులు కదా అని చింటూగాడిని చూడటానికి ఒక పది, పదిహేను రోజులు ఉందామని వచ్చారు. వాళ్ల రాకతో చింటూగాడు చాలా హ్యాపీ అయిపోయాడు. కనీసం బామ్మ దగ్గర మంచి మంచి కథలన్నా కొంతసేపు వినొచ్చని వాడి ఆశ. వాళ్లు ఉన్న పదిహేను రోజులూ ఎలా గడిచిపోయాయో వాడికి తెలీలేదు. ఒక పక్కన చదువుకుంటున్నా, వాడి బామ్మ చెప్పే కథలు, తాతయ్య చెప్పే చిన్ననాటి సంగతులు వాడిలో ఉత్సాహాన్ని కలిగించాయి. తాతయ్య అయితే వాళ్ల చిన్నప్పుడు బడి అయిపోగానే ఏమేం ఆటలు ఆడుకునేవారో, అదే విధంగా సెలవుల్లో అయితే అసలు ఇంటి పట్టునే ఉండకుండా స్నేహితులతో ఎలా సరదాగా గడిపేవారో కళ్లకి కట్టినట్లుగా వాడికి చెప్పేసరికి వాళ్లు వెళ్లిపోయినా అదే తల్చుకుని చాలా బాధపడుతున్నాడు. పాపం తనని కూడా తాతయ్య పుట్టినప్పుడే ఎందుకు పుట్టించలేదని ఏడుస్తూ దేవుడిని అడుగుతున్నాడు. నేను కూడా రోజూ ఆడుకోవాలి. నా ఈ చిన్ని కోరిక తీర్చమని వేడుకుంటున్నాడు. వాడి నాయనమ్మ చెప్పింది మనకి ఏవైనా కోరికలుంటే అవి భగవంతుడికి దండం పెట్టుకుని చెప్తే భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు అని. అది గుర్తు పెట్టుకుని వాడు రోజూ అదే చేస్తున్నాడు. చివరి ఐదు రోజుల సెలవులు కూడా అలాగే చప్పగా గడిచిపోయాయి. ఇక మరుసటి రోజు నుంచి మళ్లీ అదే రొటీన్. పోయిన ఏడాదిలాగే గడుస్తుందన్న మాట అని తల్చుకుని గాడ్ ఏదైనా చెయ్యవా అని ఏడుస్తూ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేచాక బాధగా చింటూ స్కూల్‌కి రెడీ అవుతుండగా వాడి పేరెంట్స్ దేనికో టెన్షన్ పడటం గమనించాడు. డాడీ ఏమైంది, నువ్వు, మమీ అలా ఉన్నారేంటి? ఈ రోజు నా స్కూల్ ఫస్ట్ డే కదా మరి అలా డల్‌గా ఉన్నారెందుకు అని అడగ్గానే ‘ఒరేయ్ చింటూ! ఇప్పుడే పేపర్‌లో చదివానురా... పిల్లలకి చదువుతోపాటూ ఆటలు కూడా చాలా ముఖ్యం అట. అప్పుడే పిల్లల్లో శారీరక ఎదుగుదలతోపాటూ మానసిక ఎదుగుదల కూడా బాగుంటుందట. రెట్టించిన ఉత్సాహంతో పిల్లలు ఇంకా బాగా చదువుతారంట. అందుకే ప్రతీ ప్రైవేటు స్కూల్లో ప్లేగ్రౌండ్ తప్పనిసరిగా ఉండాలంట. రోజూ గేమ్స్ పిరియడ్ ఒక్కటైనా ఉండాలంట. మీ స్కూల్ లాగా ప్లేగ్రౌండ్ లేని అన్ని స్కూల్స్‌కి వారం లోపు ప్లేగ్రౌండ్ ఏర్పాటు చెయ్యాలని, లేదంటే వాటిని మూసేస్తామని, లైసెన్స్ రద్దు చేస్తామని గవర్నమెంట్ జిఓ పాస్ చేసిందిరా. ఈ గవర్నమెంటు వాళ్లకి ఇంతకంటే ఏ పనీ లేనట్లుంది. అలా ఆటలకి టైం వేస్ట్ చేస్తే ఈ పోటీ ప్రపంచంలో నీ భవిష్యత్తు ఏమవుతుందో అనే మీ మమీ, నేను ఇందాకటి నుంచి తల పట్టుకుని కూర్చున్నాం’ అని డాడీ బాధగా చెప్పడంతో వాడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అప్పుడే డాన్స్ చేద్దామన్నంత ఉత్సాహం వచ్చింది వాడికి. కానీ మమీ, డాడీ ఏమంటారో అని దేవుడి దగ్గరకెళ్లి ‘గాడ్! నువ్వు చాలా గ్రేట్... నానమ్మ చెప్పింది నిజం. నువ్వు నేను కోరుకుంది నిజం చేశావు. చాలాచాలా థాంక్స్ దేవుడా’ అని హుషారుగా స్కూల్‌కి వెళ్లడానికి రెడీ అయిపోయాడు. వాడే కాదు వాడి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వాడిలాంటి పిల్లలంతా ఆ రోజు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా తమతమ స్కూళ్లకి బయలుదేరారు.

-లక్ష్మి దిరిశల
8-2-269/19/5/ఎ, ఇందిరానగర్
రోడ్ నెం.2, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034.

-లక్ష్మిదిరిశల