ఉత్తర తెలంగాణ

కన్న తీపి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజారామ్-సత్యవతిలకు ప్రవీణ్ ఒక్కగానొక్క కొడుకు. చిన్నాచితక వ్యాపారం చేసుకుంటూ కొడుకును ఉన్నత చదువులు చదివించి అమెరికాలో స్థిరపడే స్థాయికి చేర్చాడు. ప్రవీణ్‌కు అక్షయతో పెళ్లైన రెండేళ్లకే కొడుకు అరుణ్ పుట్టాడు. వాడికిప్పుడు నాలుగేళ్లు. ప్రవీణ్ ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు. ఎప్పటినుంచో తల్లిదండ్రులను ఒకసారి అమెరికాకు వచ్చి వెళ్లమని అడుగుతున్నాడు. రాజారామ్‌కు ఇప్పటికి గానీ వీలుపడలేదు. భార్యాసమేతంగా ఓ రెండు నెలల కొరకు బయలుదేరి వెళ్లాడు. ప్రవీణ్ వాళ్లున్న సిటీలో ఎముకలు కొరికే చలి వాతావరణం. ఇంట్లో వున్నప్పుడు తప్ప బయటకు వెళ్లాలంటే వెచ్చని దుస్తులతో ఓ చిన్నపాటి వేషం వేసుకోవాలి. ఏడాదికి మూడు నాలుగు నెలలు మంచు పడుతుంది. శని, ఆదివారాలు వస్తే తప్ప కొడుకు, కోడలుతో అందరు కలిసి బయటకు వెళ్లలేరు. కోడలుకు కూడా మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. ఓ రెండు వారాల తరువాత ఇద్దరూ వాళ్లు పని చేస్తున్న కంపెనీలకు పది రోజుల పాటు సెలవు పెట్టి, ఒక పెద్ద కారు అద్దెకు తీసుకొని చూడాల్సిన చాలా ప్రదేశాలు తిప్పుకొచ్చారు. చాలా ఏళ్ల తరువాత కుటుంబమంతాకలిసారు. హాయిగా గడిచింది. ఈ కొన్ని రోజుల్లోనే అమెరికా ఎందుకు ఇంత అభివృద్ధి చెందిన దేశమో కొంత వరకు అవగాహన వచ్చింది. అంతలో ఇండియాకు తిరిగివెళ్లే రోజు రానే వచ్చింది. ఎందుకో రాజారామ్‌కి బరువుగా, బాధగా అనిపించింది. మనవడితో గడిపిన ఈ కొన్ని రోజుల్లో గట్టి బంధం ఏర్పడింది. ‘ఏరా ప్రవీణ్! అరుణ్‌ను మాతో పాటు ఇండియాకు ఓ నెల రోజులు పంపించరా.. మాతో పాటు తీసుకువెళ్తాం. మాకు వాడిని వదిలి వెళ్లాలని అనిపించడం లేదురా’ అని ఉండబట్ట లేక అడిగేశాడు రాజారామ్. ‘వద్దు నాన్న గారు! వాడిని వదిలి మేము ఒక్క రోజు కూడా బ్రతకలేము. వాడు లేకుండా నెల రోజులు మేమిక్కడ.. ఇంకేమన్నావుందా? ఊహించుకోలేం!’ ఇంకో అవకాశం ఇవ్వకుండా ప్రవీణ్ అన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం తండ్రి రాజారామ్ వంతయింది.
‘అవును! నీవు నీ కొడుకును వదిలి ఒక్కరోజు వుండలేవు. మరి, నీవు.. నా కొడుకువే! నీ చిన్నప్పుడు అల్లారుముద్దుగా పెంచినవాళ్లమే. నీకు ఏ చిన్న దెబ్బ తగిలినా నేను మీ అమ్మ తల్లడిల్లిపోయేవాళ్లం. నీవు చదువుకునే రోజుల్లో నిన్ను హాస్టల్‌లో వదిలి మేము ఉండలేదా? ఆ తరువాత పై చదువులకని అమెరికా వచ్చినప్పుడు నిన్ను వదల్లేక మేమెంత తపించామో.. నీకు తెలుసా! మీ అమ్మ అయితే.. నిన్ను మరువలేక..్భజనాలప్పుడు ప్రతీసారీ నీకు ప్లేట్ పెట్టేది. మరిప్పుడేమో.. మీకు గ్రీన్‌కార్డ్, ఆ తరువాత అమెరికా పౌరసత్వం! మేమేమో ఇండియాలో.. మీరేమో అమెరికాలో. మీరు మా దగ్గర ఉండరనీ.. మేమెంత బాధపడాలి బేటా! అరుణ్ నీకు కొడుకైతే.. నీవు నాకు కొడుకువి కదా? మా బాధ ఎవరికి చెప్పుకోవాలె’ అన్నాడు రాజారామ్.
ఎన్నడూ కంటతడి పెట్టని రాజారామ్ కళ్లలో నీళ్లు తిరుగడం చూసి సత్యవతి చలించింది. ప్రవీణ్‌కు తన తల్లిదండ్రుల వ్యధ అర్థమైంది. ఏమీ చెయ్యలేని పరిస్థితి. మరేం మాట్లాడలేక వౌనం వహించాడు. సరదాగా పిల్లల దగ్గర గడుపుదామని వచ్చి బరువైన హృదయాలతో ఇండియాకు తిరిగొచ్చారు. ప్రవీణ్ దాదాపు వారానికి రెండు మూడు మార్లు ఫోనులోనో, వాట్సాప్‌లోనో తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. మరో ఆరు నెలలు గడిచాయి..
‘నాన్నా! నాకు, అక్షయకు హైటెక్ సిటీ, హైదరాబాదులోని కంపెనీ ద్వారానే పోస్టింగ్స్ వచ్చాయి. ఇక మేమంతా ఇండియాకు వచ్చేస్తున్నాము. మన ఇంట్లోనే అందరం కలిసి ఉంటాము. ముందు ముందు నేనెక్కడికి మిమ్మల్ని విడిచి పోవాల్సిన అవసరం ఉండదు. రెండు మూడు నెలలకొకసారి మాత్రం ఓ వారం పాటు అమెరికా వెళ్లి రావాల్సి ఉంటుంది. వి ఆర్ సో ఎక్సైటెడ్! వచ్చే సోమవారమే మేము పూర్తిగా శాశ్వతంగా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాము అన్నాడు ప్రవీణ్.
తన ప్రయత్నం ఫలించినందుకు తల్లిదండ్రుల దగ్గర ఉండేందుకు అవకాశం వచ్చినందుకు, సంతోషాన్నంతా మూకుమ్మడిగా ఫోనులోనే కుమ్మరించాడు ప్రవీణ్. రాజారామ్ ద్వారా విషయం తెలుసుకున్న సత్యవతి తన తల నీలాలు తిరుమలలో సమర్పించుకుంటానని మొక్కుకుంది.

- ఆచార్య కడారు వీరారెడ్డి, కరీంనగర్
సెల్.నం.7893366363

పుస్తక సమీక్ష

‘బొట్ల’ ఆలోచనలకు..అక్షర రూపం ‘బ్రతుకు చిత్రం’!

పేజీలు: 120
వెల : 85/-
ప్రతులకు: బొట్ల లక్ష్మణమూర్తి
పోస్ట్: బొట్లవనపర్తి గ్రామం
మండలం: ధర్మారం
జిల్లా: కరీంనగర్
సెల్.నం.9985960614

నిజం ఒక్కటే నా ఇజం..
నిజాన్ని నిర్భయంగా చెప్పడమే...
నా నైజం.. అంటూ సవినయంగా ప్రకటించుకున్న యువకవి సతీష్ కుమార్ బొట్ల తన అలోచనలకు అక్షర రూపమిస్తూ..‘బ్రతుకు చిత్రం’ కవితా సంపుటిని వెలువరించారు. కలం కదపలేని క్షణం.. నా కరం ఓ కంచు సంకెళ్ల బంధనం.. భావం పలికించలేని క్షణం.. నా హృదయం కఠిన శిలానిలయమని భావించే బొట్ల సతీష్ కుమార్ ఈ గ్రంథంలో అరవై కవితల్ని పొందుపరిచారు. కవి తన వయసుకు మించిన పరిణతితో.. తాత్త్వికతో రాసిన ఇందలి కవితలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. జనన మరణాల మధ్య బ్రతుకు ఒక సజీవ చిత్రమనీ..ఆ సజీవ చిత్రానికి అక్షర రూపమే ఈ ‘బ్రతుకు చిత్రమని’ నిరూపించేలా యువ కవి తమ రచనను కొనసాగించడం విశేషం!
ఈ కవితల్లో.. పొలం గట్టు మీది గరక పోసలపై మంచు బిందువుల తడి అరి పాదాలను తాకినట్టి భావాన్ని గుర్తు చేస్తాయి. జీవితంతో పోరాటం చేయలేనివాడు.. పోరాడి జీవితాన్ని గెలవలేని వాడు.. గెలిచిన దాన్ని పది మందికి పంచలేని వాడు మరణించిన నాడు చరిత్రలో ఏ మార్పు నమోదు కాదని విడమరిచి చెబుతాయి. ఆవేశం అణువు అణువునా రగిలించిన కష్టాలు కన్నీళ్లు కనులను విడకున్న సందర్భంలో ఒకింత సాంత్వననిస్తాయి! పువ్వులు రాలిన కాడలు.. తెగి పడిన తారలు.. వెలుగుతూ కరిగే కొవ్వొత్తి.. వికసించి మోడుబారే వృక్షాలు ఇలా.. అన్నింటి పయనం జనిస్తూ మరణం వైపుకేనని తేల్చి చెబుతాయి! ఈ రోజు అనుభవం రేపటి జ్ఞాపకం అని తెలిసినా..రేపటి కోసం అనే్వషణ ఆగదని తెలియజేస్తాయి. ఆధునీకరణ పేరుతో పల్లెల రూపురేఖలు మారి ప్రకృతితో పాటు చెరువులకు చోటు లేకుండా పోతున్న విధానానికి ఇకనైనా తెరవేసి.. మనసున్న మనుషులుగా ఆలోచించి.. మళ్లీ మన ఊళ్లను పునఃనిర్మించుకోవడానికి ఇందలి కవితలు స్ఫూర్తినిస్తాయి. గతాన్ని తవ్వుకుంటే గాయమే అవుతుంది.. వర్తమానంలోకి నడిస్తేనే మార్గమవుతుందనీ.. నిన్ను నీవు జయించినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని కవి సతీష్‌కుమార్ ‘చెప్పుకుంటే’ కవితలో చక్కగా ఆవిష్కరించారు.
కవితకు కాదేదీ అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు సతీష్ కుమార్ ‘చేతి సంచిపై’ కవితను రాసి పాఠకులను మెప్పించారు. అతడి అక్షరాక్షరం ఓ ఆయుధమనీ.. అతడిలోని ప్రతీ లక్షణం ఓ సాయుధమని ఓ కవితలో శ్రీశ్రీని కొనియాడారు. తెలుగు భాషకు మూలం.. తెలుగు సంస్కృతికి ప్రతిబింబం.. కోటిలింగాల క్షేత్రమని కోటిలింగాల గురించి రాశారు.
ప్రేమను ప్రేమగా ప్రేమించిన నాడు ఏ ప్రేమైనా నిజమైన నిర్మలమైన ప్రేమేనని ఒక కవితలో తేల్చి చెప్పారు.
‘బ్రతుకు చిత్రం’ పేరుతో రాయబడిన కవిత ఆర్ద్రంగా రూపుదిద్దుకుంది.. వ్యథలకు, సుధలకు భాష్ప రుధిర భావోద్వేగాలకు బందీయై.. బ్రతుకుచిత్రం చితికి పోయిందని వాపోయారు. ‘చరమాంకం’ కవితలో వృద్ధాప్యంలో నిరాదరణకు గురవుతున్న కన్నవారి కన్నీటి వ్యధలకు కవి అద్దం పట్టారు. కరిగిపోని నిజాలను, సమాధానాలు లేని సత్యాలను ‘నిజం’ కవితలో ఏకరువు పెట్టారు.
‘మత తత్వం కాదు మానవత్వమే.. భారత తత్వమని ఎలుగెత్తి చాటిన గతం నా వందేమాతరం’ అంటూ కవి తమ దేశభక్తిని చాటుకున్నారు.
మార్పు ఉండేది మనలోనే.. కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందని మరో కవితలో కాలం గురించి ఉన్నతంగా చిత్రించారు. అవిరామ కృషీవలుడు సార్థక నామధేయుడు కరీంనగర్ కళా తపస్విగా వారాల ఆనంద్‌ను అభివర్ణిస్తూ ఆయన పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. శివ, అలిశెట్టి ప్రభాకర్, కవితలు రాసి.. వారి ప్రతిభా విశేషాలను కవి పది మందికి పంచారు. ఆయన ఆప్తమిత్రుడు నల్ల సందీప్ రెడ్డికి అక్షరాంజలి ఘటించారు.
కలలను కన్నీళ్లను.. ఆశలను అశృధారలను తన కలం నుండి జాలువార్చే వాడే కవి అని గట్టిగా విశ్వసించే కవి సతీష్ కుమార్ కొత్తను ఆహ్వానించాలే కానీ.. పాతను పాతరేయకూడదని సూచించారు.
జీవితమంటే.. ఎప్పటికీ ఆరని ఆశల తడి.. ఎన్నడు విడివడని చిక్కుముడి అని కవి తమ తాత్త్వికతను చాటుకున్నారు.
నిశ్శబ్దం వర్ణనకు అందనిదనీ.. అది నింగికి నేలకు మధ్య వారధి.. నిన్నకి, రేపటికి మధ్య సారధి అని వ్యాఖ్యానించిన తీరు బాగుంది.
పగలు ఒక మోసకారి.. రాత్రి ఒక భయంకారి అనీ.. ఈ రెండింటి మధ్యలో.. జీవితం అలుపెరుగని బాటసారని ‘పగలు-రాత్రి’ కవితల్లో చక్కగా వివరించారు. పాటల పూదోటలో వికసించే ‘తేజోమయుడు’గా సుద్దాల అశోక్ తేజను పాఠకుల ముందు నిలిపారు.
ఇలా ఎన్నో కవితలు ఈ గ్రంథంలో ఉదహరించడానికి యోగ్యంగా వున్నాయి. భావావేశంతో పాటు తాత్త్వికతతో రాసిన ఈ కవితలు అందరినీ ఆకట్టుకుంటాయి. మున్ముందు మరింత కవిత్వాంశతో కవిత్వం రాయాలని కోరుకుందాం.

సాహిత్య సమాచారం

6న సామల సదాశివ స్మారక
సాహితీ పురస్కార ప్రదానం
కరీంనగర్ తెలంగాణ కళావేదిక ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్టస్థ్రాయి సామల సదాశివ స్మారక సాహితీ పురస్కారానికి నల్లగొండ జిల్లాకు చెందిన ‘రెండు దోసిళ్ల కాలం’ రచయిత రామోజు హరగోపాల్ ఎంపికైనట్లు సంస్థ అధ్యక్షులు, పురస్కార కమిటీ కన్వీనర్ అనుముల దయాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సాహితీవేత్తలు డా. తిరునగరి, డా. గండ్ర లక్ష్మణరావు, దాస్యం సేనాధిపతి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని తెలిపారు. మార్చి 6వ తేదీన ఆదిలాబాద్‌లో జరిగే పురస్కార ప్రదాన కార్యక్రమంలో ఐదువేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో హరగోపాల్‌ను సత్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జోగు రామన్న, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వి.శోభారాణి, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ హాజరుకానున్నారు.

మనోగీతికలు

మానవతా
సిరులు
కవిత్వ పొరలు
తెరలు తెరలుగా కదలాడుతున్నాయి!
తెరల పొరల మధ్యన..
కొన్ని దోబూచులాడుతుంటే..
మరికొన్ని
విజయతీరం వైపు దూసుకుపోతున్నాయి!
ముసుగు తెరలు తొలిగించుకున్న
ఇంకొన్ని కలాలు..
ప్రజలకు రక్షణ కవచాలై..
అధికార ప్రతిఘటనలనెదుర్కొంటూ
అవాంతరాలతో ముందుకు సాగుతున్నాయి!
కులాల మధ్య నలుగుతూ
మతాల సిరాలను నింపుకుంటున్న కొన్ని
కలాలు రాజకీయ చదరంగంలో పావులై..
వృధా సేద్యం చేస్తూ ప్రవహిస్తున్నాయి!
అయినా.. కొన్ని కలాలు ఇంకా
మానవత్వపు సిరాలను నింపుకుని
అనునిత్యం సమసమాజ స్థాపనలో..
పాలక పక్షాన్ని ఎండగడుతూ..
పేద ప్రజలకు అండగా నిలుస్తూ
మానవతా సిరులు పంచుతునే ఉన్నాయి!

- ఎస్.వేణు, కరీంనగర్
సెల్.నం.9440064033

కవుల కాలం
రైతులు మారాజులన్కుంటనే
ఎవుసం జేసే ఆసాముల
మోసం జేయ సూత్తుర్రు..
ఆరుగాలం కష్టపడ్డోళ్లకు
పోయేకాలం దగ్గరపడితే
ఐదువేళ్లు నోట్లకోక
అర్ధాకలితో బతకలేక
ఆడోళ్ల మెడల పుస్తెలిగ్గి ఫరారైతుండ్రు..
యాడి సాలు వడ్డదో
కల్తీల కెగవడ్తుర్రు
జల్ది పాణమిడ్తుర్రు..
ఈ యేటి పంతుళ్ల మాటలైన
తూటాలై గుండెల సొచ్చి..
మేటి పౌరులు పుట్టుకొచ్చి
సాటోళ్లకు సాయం జెయ్యాలే
దీటుగా దేశానే్నలాలే..
కలికాలం గాదిది కవుల కాలం గావాలే!!

- ఎన్.హరిప్రియా గిరిధర్ రావు
కరీంనగర్, సెల్.నం.9133293384

నేల విడిచి
పయనం
నీలి నీలి గగనంలో
నేల విడిచి పయనం
సరిహద్దులను చెరిపేసి
సాగుతోంది ప్రయాణం
జననం మరణం మధ్యలో
ప్రవహించే కాలం
తొలిపొద్దు మలిసంధ్యను
వీక్షించిన వింత అనుభవం
నరనరాన కలిగించెను
నవజీవన ఉత్సాహం
వెండికొండల పైకి ప్రాకి
పాల నురగల ఊయలూగి
తారకలను ఎగిరికోసి
మనసు దోచే మాలలల్లి
సృష్టికర్త మెడలో వేసి
మోకరిల్లుదు భక్తితో
పరవశించెద ముక్తితో!

- వురిమళ్ల సునంద,
బుర్హాన్‌పురం, సెల్.నం.9441815722

చూడాలనుకుంటే..?
ఒకవేళ
నువు చూడాలనుకుంటే..?
కోహినూర్ వజ్రాన్ని
నీ అమ్మలో చూసుకో!
అమ్మ ప్రేమ!
అంతకంటే తక్కువేం కాదు
ఒకవేళ..
నువు చూడాలనుకుంటే
హిమాలయాన్ని
నీ నాన్నలో చూసుకో!
నాన్న మమకారం
దాని ఔన్నత్యం కంటే..
తక్కువేం కాదు!
ఒకవేళ నువు చూడాలనుకుంటే..
గంగా ప్రవాహాన్ని
స్ర్తిమూర్తిలో చూసుకో!
పవిత్రత
ఆ పావని గంగకంటే
నూరు రెట్లెక్కువ..!

- ఖాజా ముబశ్శీర్
జగిత్యాల, సెల్.నం.7386805062

మా మనసంతా నువ్వే!
ఓ అమ్మా!
అనుబంధాలను పంచి
ఆత్మీయతను పెంచి..
అనురాగాల పూదోటలో మమ్మల్ని విహరింపజేశావు!
నీ జ్ఞాపకాల నదిలో..
మా అందరినీ ఒంటరిగా వదిలేసి..
సప్త సముద్రాలు దాటి
ఏ ఒంటి స్తంభపు మేడలో..
దీపమై నిలిచావమ్మా!
ఏ మల్లెల పరిమళం ఆస్వాదించినా..
నీ ఆత్మీయ స్మృతులే!
వేకువజామున పరుచుకున్న..
లేలేత వెలుగులోనూ..
నీ అనురాగమే మమ్మల్ని పరవశింపజేస్తోంది!
తెరుచుకున్న కిటికీలోంచి..
ప్రభాతవేళ తొంగిచూసే ఉదయభానుని కిరణమై..
మధ్యాహ్నపు మార్తాండ కిరణాల్లోనూ
పూల ఎరుపు నీ కళ్లలోని కరుణగా మారి..
సాయంత్రపు నీరెండలో నిలిచిన..
నీడల ఆశగా మా అండగా వున్నదీ నీవేనమ్మా!
నిశీధి నింగిలో నక్షత్రాలలో జాలువారే మెరుపువై..
మా మనసంతా ఆవరించిన నువ్వు..
మళ్లీ వస్తావని..
వంగిన ఆకాశంలోకి చూపుల దోసిల్లతో
ఆత్రంగా ఎదిగి చూస్తూనే ఉంటామమ్మా!!

- టి.వసంత, నిజామాబాద్

పసిపాప నవ్వు!
నులి వెచ్చని చిరుజల్లు
నింగిలోని హరివిల్లు
నిండు వెనె్నల్లోని సిరిమల్లె
ఆకాశంలో నాట్యం చేసే పక్షులు
గుడిలో మ్రోగే గంటలు
గమ్మత్తుగా గంతులేసే లేగదూడలు
కమ్మని స్వరాన్ని వినిపించే..
కోయిలల కిలకిల రావాలు..
పూదోటలో విరబూసిన సుమాలు
సుందర నృత్యంతో అలరించే
మయూరాలు..
కువకువలాడే పిచ్చుకల సవ్వడులు
ఎగిరే తుమ్మెదల ఝంకారాలు..
అరవిచ్చిన మందారాలు
ఇలా ఇవన్నీ కలిస్తే..
కనిపించేదే పసిపాప నవ్వు!

- పి.మాలతీలత, వరంగల్

గమ్యం
కష్టాలు కలకాలం
మనతోనే కాపురం చేయవు!
బతుకు బంధాల్లో..
బరువెక్కిన నీ హృదియందు
ఎన్ని కన్నీటి చెలమలో?
నీ కళ్లు కార్చిన కన్నీటితో
నీ జీవితం వికసించదు!
నీ ఆశల నిచ్చెన సైతం
నిన్ను అందలాలు ఎక్కించదు!
నీ శ్రమైక సౌందర్యంతోనే..
కొండలు కండలు కరిగిస్తూ..
వాటినుంచి వచ్చే స్వేదం చుక్కలు
కొంతమేరకైనా..
నీకు సాంత్వన నివ్వగలవు!
నిరంతర శ్రమతోనే..
అల్లంత దూరాన వున్న
నీ గమ్యాన్ని చేర్చగలవు!!

- గంప ఉమాపతి
కరీంనగర్, సెల్.నం.9849467551

స్వప్న లోకంలోకి..
పూసిన ప్రతి పువ్వుకు
గుండెల్లో గాయం తప్పనట్లే
ప్రేమించిన హృదికి
మానని గాయాలు అనివార్యమే..!
వెనె్నల సరస్సులో
వికసించిన కలువలా
వాడిపోని నీ చిరునవ్వు
గత జన్మ స్మృతులను స్మరిస్తూ
కలల కెరటంలా పోటెత్తుతుంటే..
కళాత్మక దృశ్యమేదో
నా ఊహను స్పర్శిస్తుంటే..
తడియారని నీ జ్ఞాపకాలను తడుముతూ
వౌనముద్రలోకి నెమ్మదిగా జారుకుంటూ..నేను!
కనువిందుచేసే మన మమతల పూదోటలో..
ముకుళితమైన కోరికలు పుప్పొడిని
కన్నుల్లోంచి స్వప్నలోకంలోకి జారవిడుస్తూ..
కమనీయ దృశ్యపరంపరను
మనసు కాన్వాసుపై చిత్రిస్తూ..!
మనం స్మృతి నుండి స్మృతిలోకి ప్రవహించడం
సుదీర తీరాలను చిటికెలో అధిగమించడం
కష్టసాధ్యమైనా..చెరిసగమైన మనిద్దరినీ
సృష్టిలో సాధ్యం కానిదేముంది?

- పొద్దుటూరి మాధవీలత
ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9030573354

గూడు
అది పేదరికపు పెంకుటిల్లే కాదు..
అవి అలుకు పూతల మట్టి గోడలే కాదు
సమున్నత విశ్వాసాల నీడై, గూడైంది
అంతరంగపు అంతఃపురమైంది!
ఆ ఇంటి మట్టి వాసన
మనసుకు వౌన భాష నేర్పి..
అనురాగాల్ని పెంచి
మమతలు పంచిన అమ్మైంది!
కడుపు నిండని ఆకలి రహస్యాన్ని
గడప దాటనీయక ఉద్వేగాన్ని ఊరడించి
అవ్వల్లె గుండెకదుముకుని
కంటి నిండా నిద్ర నిచ్చింది!
బ్రతుకు భారమై
గుండె చెదిరిన పక్షులమైన కాలాన..
కన్నీరై చెమ్మగిల్లింది
గువ్వల్లె రెక్కల్ల పొదుపుకుంది!
కష్టాలు సుడిగుండాలై
వేదనలు వెల్లువై ముంచే వేళ..
వెన్ను దన్నై తీరాన్ని చేర్చింది!
ఎదిగే జీవితాలకు
ధన ప్రాతినిథ్యం వహించి
చివరంటూ చెలిమై
అనేకానుభవాలకు
మహా నిశ్శబ్దమై నిలిచింది!
అందుకే ఆ గూడంటే
హృదయం ఉప్పొంగుతుంది
గుండె తడవుతుంది
ప్రాణం నిండుతుంది!

- రామానుజం సుజాత, కరీంనగర్,
సెల్.నం.9701149302

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- ఆచార్య కడారు వీరారెడ్డి