కళాంజలి

నృత్య రూపకం.. నిత్య వ్యాపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్యుతుని రాధాకృష్ణగారు రచయిత, కవి, పరిశోధకుడు. 30కి పైగా నాట్య రూపకాలు రచించారు. వారి వృత్తి కంప్యూటర్స్‌తో సాగింది. అయినా ప్రవృత్తి సాహిత్యం, నాటకరంగం, నాట్యం. వీరి జీవిత భాగస్వామి శ్రీమతి శ్రీదేవి ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు. భార్యాభర్తలిద్దరూ కళాసేవకే అంకితమయ్యారు. వీరు రాసిన నృత్య రూపకాలు - శ్రీలలిత దర్శనం, శ్రీ త్రిపురసుందరీ విజయం, మహాశక్తి, మహిషాసురమర్దిని, దక్ష యజ్ఞం, గిరిజా కళ్యాణం, నవరస నటేశ్వరి, అరుణాసుర భంజని, శ్రీభ్రమరి, ఉమాపుత్రం నమామ్యహం, పద్మావతీ శ్రీనివాసం, కృష్ణలీలామృతం, రాధా మాధవీయం, గోదా కళ్యాణం, చిదంబర నటంభజే, కృష్ణ పారిజాతం, త్రిపుర దాహం, శ్రీ కళ్యాణం, శ్రీపతి వైభవం, శ్రీరాయ విజయం, దేవీ అభయం, సిద్ధేంద్రయోగి చరిత్ర, దేవదాసి, ఊర్వశి, శ్రీసీతారామ కళ్యాణం, ఆర్య-మహాదేవి, జాతి వెలుగులు, సమైక్య జీవన సౌందర్యం, భారతీయం, భావిభారతం.
అచ్యుతుని రాధాకృష్ణ గారితో ముఖాముఖి-
ప్రస్థానం..
మాది ప్రకాశం జిల్లా, చీరాల తాలూకా వేటపాలెం గ్రామం. మా నాన్నగారు వేంకటరావుగారు స్కూల్ టీచర్. మా అమ్మ కమలమ్మ. గృహిణి. నేను బీకాం చదువుకున్నాను. తరువాత హైదరాబాద్ వచ్చి ఎన్‌ఐఐటిలో కంప్యూటర్స్ చేశాను.
మా నాన్నగారు ఆంగ్ల ఉపాధ్యాయులు అయినప్పటికీ తెలుగులో మంచి పాండిత్యం ఉండేది. వారు ఎన్నో నాటకాలు రచించి విద్యార్థులతో ప్రదర్శనలు ఇప్పించారు. చిన్నప్పుడు నేను కూడా వాటిలో వేషాలు వేసేవాడిని. రుక్మిణీ కల్యాణంలో కృష్ణుడి వేషం వేసి పద్యాలు నేర్చుకోవడం మంచి అనుభూతి. మా నాన్నగారు పోతనాది కవుల గురించి, పద్య రచన గురించి చెప్పే విషయాలు సాహిత్యాభిలాషకు పునాదులు వేశాయి.
తరువాత ఆ ప్రాంతంలో ప్రముఖుడయిన వాయులీనం విద్వాంసులు కీ.శే.నాయిని నాగరాజుగారి సాంగత్యం, మిత్రుల ప్రోత్సాహంతో రాజుగారి స్వరాలకు పాటలు రాయడం వంటి ఔత్సాహిక కార్యక్రమాలు ఆ పునాదిని గట్టి చేశాయి.
ఆ తరువాత చదువు, ఉద్యోగం వంటి విషయాలలో సాహిత్యం వెనుక పట్టు పట్టింది.
1993వ సం.లో నా వివాహం నృత్య కళాకారిణి, గురువు అయిన గోవిందరాజు శ్రీదేవితో జరిగింది. ఒక కళాభిమానిగా ఆమె ప్రదర్శనలను తిలకించడం ఆనందించటం తప్ప పెద్దగా వాటిలో ఆసక్తి చూపలేదు. నా ఉద్యోగం చూసుకోవడమే సరిపోయేది. తను కూడా ఒక వృత్తి కళాకారిణిగా కాక, గృహిణిగానే స్థిరపడింది.
2004వ సం.లో ఒక యాక్సిడెంట్ వలన పక్షవాతం రావడంతో, నేను ఉద్యోగానికి వెళ్లటం కుదరలేదు. కుటుంబ పోషణ కోసం శ్రీదేవి తిరిగి వృత్తి కళాకారిణిగా నృత్య శిక్షణ ప్రారంభించింది. ఆ సమయంలోనే మేం పాతబస్తీ నుండి వనస్థలిపురానికి కుటుంబాన్ని మార్చాం.
ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో, చిన్నప్పటి ఆసక్తి మళ్లీ బయటకు వచ్చింది. ముందుగా సిద్ధేంద్రుని భామాకలాపాన్ని చదివాను. అప్పుడు నాకు అది అంతగా అర్థం కాలేదు. ఒక ప్రముఖ నృత్య కళాకారిణిని, వివరం అడగగా ‘్భర్యావియోగంతో పిచ్చెక్కిన సిద్ధేంద్రుడు పచ్చి శృంగారంతో భామా కలాపాన్ని రచించాడు’ అని చెప్పటం జరిగింది. కానీ నాకు అది అంత సబబుగా అనిపించలేదు. అప్పుడు డా.ఉషారాణిగారు నన్ను భాగవతుల లక్ష్మీనరసింహం గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన నృత్యం పట్ల కనీస అవగాహన లేని నాకు ఎంతో ఓపికతో భామాకలాపాన్ని గురించి వివరించారు. వారు స్వదస్తూరీతో వ్రాసిన ‘అమృత కలశం భామాకలాపం’ అనే వ్యాసాన్ని నాకు ఇచ్చారు. అది ఇప్పటికీ నా దగ్గర ఉన్నది. వారి ద్వారానే నాకు అప్పారావుగారి నాట్యశాస్త్ర గ్రంతంతో పరిచయం కలిగింది. నిజానికి అది శ్రీదేవి దగ్గర ఉన్నా ఎప్పుడూ పట్టించుకోలేదు.
ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నాట్యం గురించి, కూచిపూడి గురించిన పుస్తకాలు చదివి నా పరిజ్ఞానాన్ని పెంచుకొన్నాను. తరువాతి కాలంలో పసుమర్తి కేశవప్రసాద్ గారు, వేదాంతం రాధేశ్యాంగారు వంటి పెద్దల పరిచయంతో అది మరింత విస్తృతమయింది. డా.ఉషారాణిగారు ఎటువంటి సందేహం వచ్చినా ఓపికగా వివరాలు చెబుతుండేవారు. శ్రీదేవి ఎలాగూ ఉండనే ఉన్నది. అలా నాట్యశాస్త్రం గురించి, కూచిపూడి నాట్యం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను.
2007వ సం.లో టి.బి. కారణంగా వెనె్నముక దెబ్బతినడం, బ్రెయిన్ ఆపరేషన్ జరగడంతో సంవత్సరం పాటు మంచం మీదనే గడిపాను. నా కాళ్ల మీద నేను నిలబడలేక పోయేవాడిని. డాక్టర్లు కూడా వీల్ చెయిర్ కొనుక్కోమని సలహా ఇచ్చారు. కానీ ‘నీకేం కాదు. లే! లేచి నడువు!’ అనే ఆజ్ఞ లాంటి ప్రోద్బలంతో తిరిగి నేను నా కాళ్లతో నడిచేలా చేసిన వ్యక్తి మా అన్నయ్య. నా పరిస్థితిని గమనించి సహనంతో నన్ను భరించింది శ్రీదేవి. అయితే, మానసికంగా నేనున్న పరిస్థితిని అధిగమించేందుకు నాకు తోడ్పడింది ‘నాట్యశాస్త్రం’. ముఖ్యంగా ‘నాట్యోత్పత్తి కథ.’
ఓటమిని ఎదుర్కోవడానికి, జీవితాన్ని లక్ష్యం వైపు నడపడానికి కావలసిన సాధన విషయమంతా నాట్యోత్పత్తి కథలో ఉన్నది. ఈ విషయం సర్ట్ఫికెట్, డిప్లొమా పరీక్షలను ప్రైవేటుగా కట్టడానికి శ్రీదేవి వద్దకు వచ్చే విద్యార్థులకు చెప్పాలనే ఉత్సాహం నన్ను ఆ పరీక్షలకు సంబంధించిన థియరీని బోధించే ఉపాధ్యాయుడిగా మార్చింది. ఇప్పుడు అది నా ప్రధాన వ్యాపకంగా మారింది.
2005లో శ్రీదేవి తిరిగి నృత్య శిక్షణ ప్రొఫెషనల్‌గా ప్రారంభిచినప్పుడు, తను షాద్‌నగర్‌లో ఒక సంస్థ భాగస్వామ్యంతో శిక్షణ తరగతులు నిర్వహించేది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ప్రముఖులయిన గజవాడ హనుమంతరావు గారు 2006 దసరా సందర్భంగా ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శించమని అడిగారు. రూపకాన్ని ప్రత్యేకంగా రాయించుకొనేందుకు తగిన ఆర్థిక వనరులు లేనందున, నేనే నాకున్న కొద్దిపాటి అనుభవంతో, ఆసక్తితో, అవసరంతో ‘లలితా దర్శనం’ అనే రూపకాన్ని రచించాను. ఆ దేవి కరుణ వల్ల అది ప్రశంసలు అందుకున్నది. దానినే 2007లో రవీంద్ర భారతిలో శతరూపకాల ప్రారంభం రోజున ప్రదర్శించినపుడు అప్పటి సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్‌గారు ప్రత్యేకంగా ప్రశంసించటం జరిగింది. ఆ విజయం అందించిన ప్రోత్సాహంతో ఇప్పటికి దాదాపు 30 నృత్యరూపకాలు రచించాను. అందులో దాదాపు 20 నృత్య రూపకాలు ఇప్పటికే ప్రదర్శింపబడ్డాయి. వాటిలో శ్రీత్రిపుర సుందరీ విజయం, నవరస నటేశ్వరి వంటివి పలు ప్రదర్శనలు ఇచ్చాము. షాద్‌నగర్ ఠాగూర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్‌గారి ప్రోద్బలంతో సాంఘిక నృత్య రూపకాలు రచించి వారి స్కూల్ వార్షికోత్సవాలలో ప్రదర్శించాం.
లలితా దర్శనం ప్రదర్శన చూసిన ఒక విద్వాంసుడు, నీవు కాకుండా ఎవరైనా ప్రముఖులతో రాయిస్తే బావుండేది అని అన్నప్పుడు చాలా బాధపడ్డాను. తరువాత తెలుగులోని ప్రముఖ కావ్యాలను ప్రత్యేకంగా చదువుకొని నా తెలుగు పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను. ఆ కావ్యాలు చదివి ఆ ఆనందాన్ని అనుభవించేలా చేసిన ఆ వ్యక్తికి రోజూ ఒక నమస్కారం పెట్టుకుంటాను.
క్రిందటి సంవత్సరం వనపర్తి వాస్తవ్యులు నీరజ గారికి ‘శ్రీకృష్ణ పారిజాతం’ రాయడం జరిగింది. నిజానికి నాకు సంబంధించినంతవరకు నాకు అది అద్భుతమయిన విషయం. ఎందుకంటే కృష్ణుని గురించి తలచుకోవడం ‘అధరం మధురం, వదనం మధురం, వచనం మధురం’ అన్నట్లు మధురమయిన విషయం. ఆ వరుసలోనే ‘రుక్మిణీ కళ్యాణం’ కూడా రాయడం జరిగింది.
లలితా సహస్ర నామాలలోని నామాలను ఉపయోగిస్తూ, ఒక భక్తుని దృష్టి కోణంలో నుండి, ఒక తటస్థుని దృష్టి కోణంలో నుండి, ఒక అసురుని దృష్టి కోణంలో నుండి వ్రాసిన పాటలు త్రిపురసుందరీ విజయంలో ఉపయోగించాము. అలాగే ఆడపిల్లలపై జరిగే యాసిడ్ దాడి వంటి వాటిని ఖండిస్తూ శక్తిరూపాలు మీరు ధైర్యం చూపండి అంటూ మహాశక్తి రాశాము. అన్నీ అన్నమాచార్య కీర్తనలే ఉపయోగిస్తూ శ్రీపతి విభవం, శ్రీ కళ్యాణం (పద్మావతీ కళ్యాణం) వంటివి సంకలనం చేశాము. వీటికి చాలా ప్రశంసలు దక్కాయి. ప్రముఖ నాయకులను పరిచయం చేస్తూ జాతి వెలుగులు, వివిధ రాష్ట్రాలను కీర్తిస్తూ, వారివారి భాషలలోని గీతాలతో సమైక్య జీవన సౌందర్యం వంటి సాంఘిక రూపకాలు కూడా ప్రదర్శించాము.
‘నా నృషి కురుతే కావ్యం’ అన్నట్లుగా - సిద్ధేంద్రుడు, సిద్ధ యోగీంద్రునిగా, సిద్ధ యోగీంద్ర సత్కవిగా మార్పు చెందిన విధానం కథాంశంగా రచించిన ‘సిద్ధేంద్రయోగి’, తిల్లై అడవులలో మునుల గర్వాన్ని అణచిన నటరాజు కథ ఆధారంగా సప్తతాండవాల ప్రదర్శనకు అనుకూలంగా రచించిన ‘చిదంబర నటేశం భజే’. వావి వరుసలు మరచి ఆడవారిపై అత్యాచారాలు చేస్తున్న వారిని ఎదిరించి పోరాడమనే ‘ఆర్య మహాదేవి’ ఇంకా ప్రదర్శించవలసి ఉన్నది.
నాట్యశాస్త్రంలోనూ, అభినయ దర్పణంలోనూ చెప్పబడిన దృష్టి, భ్రూ, గ్రీవా భేదాలు, హస్తాలు, నృత్త హస్తాలను పోలిన వ్యాయామాలను పక్షవాతం వచ్చిన వారిచేత ఫిజియో థెరపిస్టులు చేయిస్తారు. వారు చేయించే వ్యాయామాలు, పై విషయాలలోని పోలికలు, మనం చేసే నృత్యం వల్ల నాడీ కేంద్రంలో కలిగే ఉత్తేజాల పైన, నాట్యోత్పత్తి కథలోని విషయాలు, చతుర్విదాభినయాలు విద్యార్థులకే కాక ఉపాధ్యాయులకు కూడా ఎలా ఉపయోగపడతాయి అనే విషయంపైన కాకినాడలో, మదర్స్ ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ కాలేజీ (డిఇడి మరియు బిఇడి కాలేజ్) విద్యార్థులకు సెమినార్ నిర్వహించాము. 2015లో తెలంగాణ కళావైభవం సంస్థ, మహబూబ్‌నగర్ వారు ఉగాది పురస్కారం ఇవ్వటం - ఆ కామాక్షి కృప.
భరతుడు చెప్పినట్లు నాట్యంలో లేనిది లేదు. విద్యార్థులు తల్లిదండ్రులూ దీనిని పాఠ్య ప్రణాళికకు అదనపు విషయంగానే పరిగణించకుండా, అత్యవసర విషయంగా పరిగణించాలని నా మనవి. ‘స్వధర్మే నిధనం శ్రేయః’. స్వధర్మం పాటిస్తే సమాజంలోని అశాంతి తొలగిపోతుంది. నాట్యం ఆవిర్భవించిందే అందుకు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి సరైన పోషక విలువలున్న ఆహారం ఎలా అవసరమో, విద్యార్థులు తమ చదువు ఒత్తిళ్లను అధిగమించే శారీరక, మానసిక బలం కోసం నాట్యం, ముఖ్యంగా కూచిపూడి నాట్యం అంత అవసరం అని నా అభిప్రాయం.
చిత్రం...అచ్యుతుని రాధాకృష్ణ

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి