కళాంజలి

మాధ్యమాల వారధి.. మన ‘వోలేటి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.వోలేటి పార్వతీశం గారి పేరు వినని, చూడని తెలుగువాళ్లు బహుశా చాలా అరుదుగా ఉంటారు. ఒక శ్రవ్య మాధ్యమం, ఒక దృశ్యమాధ్యమం, వెరసి ప్రసార మాధ్యమం, వీరిని తెలుగు ప్రజానీకానికి అత్యంత సన్నిహితుణ్ణి చేసింది.
వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన వోలేటి పార్వతీశంగారి పౌత్రుడు, విద్వత్కవి కందుకూరి రామభద్రరావు గారి దౌహిత్రుడు, సుప్రసిద్ధ గేయకవి శశాంక తనయుడు, ఇవన్నీ జన్మతహా లభించిన అదృష్టవంతులు డా.వోలేటి పార్వతీశం, ప్రసార మాధ్యమంలో నలభై సంవత్సరాల అవిశ్రాంత ప్రస్థానం వారిది. శ్రవ్య సుభగమైన కంఠస్వరం, పార్వతీశం చిరునామా. విషయాన్ని విపులీకరిస్తూ సులభగ్రాహ్యంగా, పొందికగా, ఆహ్లాదకరంగా మాట్లాడటంలో పార్వతీశం అగ్రగణ్యుడు. ఉభయ రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలోనూ, సాంస్కృతిక వేదికలపైనా, విశ్వవిద్యాలయం సదస్సులలోనూ, కళాశాల వేదికలపైనా, పాఠశాల వేదికలపైనా ఎనిమిదిన్నర వేలకు పైబడిన ప్రసంగాలు చేసిన ఘనత పార్వతీశంగారిది. గేయకవిగా, వచన కవిగా, వ్యాసకర్తగా వీరు లబ్ధిప్రతిష్టులు.
బాల్యం నుంచే ఆకాశవాణితో పరిచయాలున్నా, 1976వ సం. నుంచి యువతీ యువకుల కోసం కార్యక్రమాల రూపశిల్పిగా ఆకాశవాణితో అనుబంధాన్ని సుస్థిరం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు హైదరాబాద్ ఆకాశవాణిలో యువవాణి విభాగంలో స్వేచ్ఛాయుత, కార్యక్రమ రూపకర్త. తర్వాత 1980వ సం.లో ఆకాశవాణి ఉద్యోగ జీవితం కడపలో ప్రారంభమైంది. దాదాపు నాలుగు పదుల సాహిత్య, సంగీత రూపకాలు వీరు రూపొందించారు. డా.బెజవాడ గోపాలరెడ్డిగారి అధ్యక్షతన శ్రీశ్రీ, పుట్టపర్తి, సినారె, దాశరథి, శేషేంద్ర వంటి ప్రముఖులతో ఆహూతుల సమక్షంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక కవి సమ్మేళనం నిర్వహణలో వీరు ప్రధాన భాగస్వామి. అలాగే కడప ఆకాశవాణి వింశతి వసంతాల సందర్భంగా నిర్వహించిన కథక సమ్మేళనానికి వీరే ప్రయోక్త. వర్తమాన తరంలోని వాగ్గేయకార శిఖరం డా.బాలాంత్రపు రజనీకాంతరావు గారిని, ఆకాశవాణి జాతీయ కార్యక్రమాల కోసం, వీరు పరిచయం చేశారు. ‘మీ ఉత్తరాలు’ కార్యక్రమం నిర్వహణ ద్వారా, కడప ఆకాశవాణిలో ఒక సంచలనం కలిగించి, రాయలసీమ జిల్లాలలో శ్రవ్య మాధ్యమానికి కొత్త స్వరాలు పొదిగారు.
హైదరాబాద్ దూరదర్శన్‌లో ప్రవేశించిన తరువాత వారు రూపొందించిన కార్యక్రమాల విస్తృతి పెరిగింది. దృశ్యమాధ్యమం తొలిసారిగా ఆహూతుల సమక్షంలో జాతీయ సమైక్యత ఇతివృత్తంగా నిర్వహించిన ‘సుమదళాలు ఎన్నైనా సురభిళం ఒక్కటే’ కవి సమ్మేళనానికి ఆయనే రూపకర్త. తొలిసారిగా దృశ్యమాధ్యమంలో ప్రసారమైన అష్టావధాన కార్యక్రమానికి ఆయనే సూత్రధారి. అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు.. ఇవన్నీ విస్తృతంగా వారి నేతృత్వంలోనే బుల్లితెరపైన ప్రదర్శితం అయ్యాయి. కృష్ణవేణి నదీ జలాలపైన కవులను విహరింపజేస్తూ జలవిహార నౌకలపై పార్వతీశంగారు రూపొందించిన ‘మా తెలుగు తల్లికి’ కవి సమ్మేళనం, దృశ్యమాధ్యమ చరిత్రలో ఒక రికార్డు. నలుపు తెలుపు టీవీ, రంగుల టీవీగా రూపాంతరం చెందినప్పుడు, రాష్టవ్య్రాప్తంగా ఉన్న టీవీ రిలే కేంద్రాలన్నీ, హైదరాబాద్ దూరదర్శన్‌తో అనుసంధింపబడినప్పుడు, నిర్వహింపబడిన అనేక కార్యక్రమాల రూపకల్పనలో డా.వోలేటి పార్వతీశం ప్రధాన భాగస్వామి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తొట్టతొలి ప్రసారకర్త పార్వతీశం. పద్యాల తోరణం, సమస్యాపూరణం వంటి కార్యక్రమాలతో, దృశ్యమాధ్యమంలో నూతన ప్రక్రియలకు శ్రీకారం చుట్టారాయన.
ఆచార్య ఎన్.జి.రంగా వంటి రాజకీయ ప్రముఖులు, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి సామాజిక సేవాతత్పరులు, మాదల వీరభద్రరావు వంటి స్వాతంత్య్రోద్యమ చరిత్రకారులు, దివాకర్ల, దాశరథి, సినారె, శేషేంద్ర, ఆరుద్ర, శ్రీశ్రీ, కరుణశ్రీ, ఉత్పల, బోయి భీమన్న, మల్లాది చంద్రశేఖర శాస్ర్తీ, ఏలూరిపాటి అనంతరామయ్య వంటి సాహితీ ప్రముఖులు, శ్రీపాద పినాకపాణి, బాలాంత్రపు రజనీకాంతరావు, బాలమురళీకృష్ణ, చిట్టిబాబు, నేదునూరి కృష్ణమూర్తి వంటి సంగీతజ్ఞులు, ఎ.ఆర్.కృష్ణ, ఆచంట వెంకటరత్నం నాయుడు వంటి రంగస్థల ప్రముఖులు, అక్కినేని, ఎన్‌టిఆర్, గుమ్మడి, కె.విశ్వనాథ్ వంటి చలనచిత్ర ప్రముఖులు వీరంతా, పార్వతీశంతో ముచ్చటిస్తూ బుల్లితెరపై హృదయావిష్కరణ చేశారు. శ్రీమతి పి.సుశీల, ఎస్.జానకి, వాణీజయరామ్, వేదవతీ ప్రభాకర్, పాలగుమ్మి విశ్వనాథం, చిత్తరంజన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వంటి సుప్రసిద్ధ గాయనీ గాయకులు వోలేటి రచించిన పాటలు పాడారు.
శతాధిక లలిత గీతాలనే కాదు, చలనచిత్రాలకు వీరు రచన చేశారు. ‘అంకితం’ సినిమాకు సంభాషణలు సమకూర్చారు. ‘శ్రీ తాతావతారం’ సినిమాకు పాటలు రాశారు. డజన్ల కొద్దీ శ్రవ్య సంపుటలలో వారి పాటలు ధ్వనిముద్రితమయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ వారు ఏర్పాటు చేసిన బహుభాషా కవి సమ్మేళనంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పక్షాన ఏకైక తెలుగు కవిగా కవితాగానం చేశారు.
‘ఊహ నుంచి ఊపిరికి’, ‘తెలుగునాట ప్రసార మాధ్యమం’ ‘రెక్క సాచిన ఊహలు’ ‘వ్యాసార్థం’ వంటి గ్రంథ రచనలు చేసిన పార్వతీశంగారు దూరదర్శన్ నిర్వహించిన విలక్షణ కార్యక్రమాలకు ముద్రిత రూపాన్ని సంతరించడంలో ప్రధాన భాగస్వామ్యం వహించి, ‘అమ్మ’ ‘మహాకవులకు నీరాజనం’ ‘నా దేశం’ వంటి గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ‘అవధానం ఆణిముత్యాలు’ అనే కార్యక్రమానికి ప్రతిష్ఠాత్మక నంది బహుమతిని పొందారు. ప్రసార కళాప్రవీణ, మధుర వచోధురీణ, ఉపన్యాస సుధాకర, సాహిత్యరత్న, గేయ కళాప్రపూర్ణ, వక్తృత్వ విశారద, వాగ్గేయ వాచస్పతి, వాక్‌శిల్పి వంటి బిరుద వాచకాలు వారి నామధేయం ముందు అలంకారాలయ్యాయి.
విజయనగరం (గరివిడి) శ్రీసూర్యపీఠం, పీఠాధిపతులు సద్గురు శ్రీకృష్ణయాజి గురుదేవులు, ‘సువర్ణ సింహతలాట’ కంకణాన్ని తొడిగి సమాదరించారు. డా.అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని కినె్నర సంస్థ, వంశీ సంస్థ అందజేశాయి. నందమూరి తారక రామారావు గారి పేరిట ఏర్పాటు చేసిన ‘ఎన్‌టిఆర్ జీవన సాఫల్య పురస్కారాన్ని’ 2018 ఎన్‌టిఆర్ జయంతి సందర్భంగా బహూకరించటం జరిగింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన సాహితీ, సాంస్కృతిక సంస్థలన్నీ ఎనె్నన్నో సన్మానాలు, సత్కారాలు అందించాయి.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి