కళాంజలి

శ్రుతిలయలే నృత్యానికి ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి కందాళ రోహిణి ప్రఖ్యాత నర్తకి, పరిశోధకురాలు, గురువు. వీరు కూచిపూడి, భరతనాట్యం రెండింటిలో నిష్ణాతులు. తల్లిగా, గృహిణిగా, ఒకవైపు వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో పిహెచ్.డి. చేస్తున్నారు. వీరి పరిశోధనాంశం ‘నాట్య సిద్ధాంతాలను ప్రతిపాదించిన ప్రముఖ లక్షణ గ్రంథాలు - పరిశీలన’. ఇదే విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (కూచిపూడి) చేసి, రెండు స్వర్ణ పతకాలు పొందారు. నాట్యంతోపాటు శ్రీమతి రోహిణి నాటకంలో కూడా నిష్ణాతురాలు. ‘నాయకురాలు నాగమ్మ’గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మృదంగం కూడా నేర్చుకుంటున్నారు. వీరితో ముఖాముఖి...

‘నేను స్ర్తి పురుష పాత్రలు రెండూ వేశాను. ‘రామ’ నాటకంలో శ్రీరాముడు, ‘గంగా గౌరీ సంవాదం’లో గంగ, ‘గిరిజా కళ్యాణం’లో శివుడు, ‘్భగవద్గీత’లో శ్రీకృష్ణుడు, ‘వార్ అండ్ పీస్’లో సీత, ‘లక్ష్మణరేఖ’లో గాంధారి, ‘గోదా కళ్యాణం’లో మహావిష్ణువు, ‘అన్నమయ్య పద నర్తనం’లో శ్రీనివాసుడు.. ఇలా ఎన్నో పాత్రలు పోషించాను. చాలావరకు బాలేలు గురువుగారు ఆచార్య శ్రీ భాగవతుల సీతారాంగారివే. వారి ఆశీస్సులు నాకు కొండంత అండ. డా.ఉమారామారావుగారు, ఆచార్య అలేఖ్య పుంజాల గారి బాలేలలో కూడా చేశాను. అదొక అదృష్టం. కోట్ల హనుమంతరావు గారి దర్శకత్వంలో ‘నాయకురాలు నాగమ్మ’ నాటకం చేశాను. ప్రతాపరుద్ర ట్రైలాజీలో ‘రుద్రమ’గా.. అన్నీ మధుర స్మృతులే. అందులో మా పాప గౌరీ అలేఖ్య యువ రుద్రమగా చేస్తోంది.
నేను నర్తకిగా శిక్షణ పొందాను చిన్నప్పటి నుంచి. నాటకంలో చేయడం మాటల్లో చెప్పలేని అనుభూతి. 2016లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేశాము. రసమంజరి ఫెస్టివల్, ఒంగోలు థియేటర్ ఫెస్టివల్, బెంగళూరు, హైదరాబాద్.. ఇలా ఎన్నో నగరాల్లో ప్రదర్శనలిచ్చాము. ఇది నా మనస్సుకు నచ్చిన స్మృతి. ప్రతాపరుద్రమ ట్రైలాజీలో ఫస్ట్ పార్ట్‌లో రుద్రమదేవిగా చేస్తున్నాను. మా పాప గౌరీ అలేఖ్య యువ రుద్రమ. తల్లీ కూతుళ్లు ఇద్దరం ఒకే స్టేజీ మీద ప్రదర్శన ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా, మనస్సు పొంగిపోయేలా అనిపిస్తుంది.
ఎం.ఏలో రెండు స్వర్ణ పతకాలు పొందానను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి యుజిసి నెట్ పరీక్ష పాసయ్యాను. ఇప్పుడు పిహెచ్.డి. చేస్తున్నాను. నాట్యాంజలి కూచిపూడి నృత్యాలయ 2018లో నాకు ‘నృత్య కళా ప్రవీణ’ బిరుదునిచ్చారు. అలాగే ‘ఎక్సలెన్స్ ఇన్ డాన్స్’ విమెన్స్ డే సందర్భంగా జాలీ ఫ్రెండ్స్ అసోసియేషన్ అవార్డు 2017లో వచ్చింది. 1999లో అలహాబాద్ కల్చరల్ ఫెస్టివల్‌లో, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదర్శించాను. 1999లో ఆగ్రా, తాజ్ మహోత్సవ్‌లో ప్రదర్శించాను. న్యూఢిల్లీ ఎయిర్‌ఫోర్స్ ఆడిటోరియం ప్లాటినమ్ జూబ్లీ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2007లో చేశాను. సంగీత నాటక అకాడెమీ, నర్తనం మరియు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కూచిపూడిలో ‘రామ’ నాటకంలో శ్రీరాముడిగా వేశాను. 2009లో దుబాయిలో రసమయి ఆధ్వర్యంలో ప్రదర్శన ఇచ్చాము. నా గురువుల ఆశీస్సులు పొందటం, ప్రేక్షకుల మన్నన అదే నిజమైన గౌరవం.
నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. మా అమ్మ నాన్న నూతి రాజగోపాల్ - విజయలక్ష్మి. మా వారు కె.డి.వి.ప్రసాద్. వీరు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్. నేను 10 సంవత్సరాల వయసులోనే నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. సాధనా పరంజీగారి వద్ద. తర్వాత ఆవిడ అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలయ్యారు. అప్పుడు డా.ఉమారామారావు గారి వద్ద, తర్వాత ఆచార్య భాగవతుల సేతురాంగారి వద్ద నృత్యం నేర్చుకున్నాను. కూచిపూడి, భరతనాట్యం రెండింటిలో డిప్లొమా ఉంది. 1995-97 హెచ్‌ఆర్‌డి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారి స్కాలర్‌షిప్ లభించింది. లాస్యాంగ స్కూల్ ఆఫ్ కూచిపూడి పేరిట సైనిక్‌పురి, అల్వాల్‌లో ఇన్‌స్టిట్యూట్ ఉంది. దాని ద్వారా పలువురికి నృత్యం నేర్పిస్తున్నాను.
నాట్య శాస్త్రం మీద సెప్టెంబర్ 2017లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్‌లో
ఐఎస్‌ఎస్‌ఎన్ - 2277 - 7881.
మహారాజా స్వాతి తిరునాళ్ మీద - సాహితీ సరోవరంలో డిసెంబర్ 2016లో ఐఎస్‌బిఎన్ 978 -81- 932961 -1 -0. శ్రీ హస్త ముక్తావళి మీద తెలుగు విశ్వవిద్యాలయం సావనీర్‌లో.
ప్రస్తుతం గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో మృదంగ విద్వాంసులు నాగేశ్వరరావు గారి వద్ద మృదంగం నేర్చుకుంటున్నాను. ఒక నర్తకి తాళ జ్ఞానం, లయ గురించి ఎంతో నేర్చుకోవాలి.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి