కళాంజలి

కష్టాల్లో గట్టెక్కి.. కళల్లో రాణించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్ను కృష్ణమూర్తిగారు ప్రఖ్యాత కవి, కథకుడు, వ్యాసకర్త, పరిశోధకుడు. ఇన్ని సంగతులు ఒకరిలో దాగి ఉండటం చాలా అరుదైన విషయం. వీరు రాసిన ‘రాముడండే ఎవరు? రామాయణమంటే ఏమిటి?’ ఎంతో అద్భుతమైన పరిశోధనా గ్రంథం. కృష్ణాయణం ఒక నక్షత్ర మహాయానం, ఋషి హృదయం - వేదాల మీద.. చతుర్వేద సాగర మథనం బృహద్గ్రంథాలు. మహా అపభంజనం, యార్లగడ్డ వారి వస్త్రాపహరణం, రంగనాయకమ్మ గారి రామాయణ పరిజ్ఞానం? వంటి సాహిత్య విమర్శలు ఎన్నో రాశారు. వీరు రాసిన కవిత్వ గ్రంథాలు కొన్ని - అడవి పూలు, కవితా కాళింది, ఈ మట్టి నన్ను వెళ్లనీదు, మహాసంకల్పం, కృష్ణవేదం, కత్తుల కౌగిలి, శ్రీకృష్ణ రమ్య రామాయణం, అంతరంగం - మినీ కవితలు, ఒక మానవతా వృక్షఛాయ. వీరు హిందీ కవిత్వం రాయటంలోనూ నిష్ణాతులు. ‘ఏక్ లహర్ సాగర్ కీ’ అనే గ్రంథం ప్రచురించడం ఒక విశేషం. ఏ విషయమైనా సూటిగా, కుండబద్దలు కొట్టినట్లు చెబుతారీయన. హాస్య రసం పండించటంలో ఉద్ధండులు. పేరడీలు రాయటంలో ఘనులు. ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఎత్తుకు ఎదిగిన గన్ను కృష్ణమూర్తిగారు అభిలేఖినీ రచయితల సంఘం అధ్యక్షులు.
ఆయనతో ముఖాముఖి ఇలా సాగింది...
జీవితమే ఒక పోరాటంగా సాగింది నాకు. బాల్యంలో బీదరికంతో పోరాటం, చదువుకై పోరాటం, ఆపై ఉద్యోగంతో, అధికారులతో పోరాటం. చివరికి అసాహిత్యంతో, సాహిత్య రాజకీయాలతో పోరాటం, అజ్ఞాన, అవివేకాలతో పోరాటం.. ఇలా సాగింది నా జీవితం.
నేను పదవ సంతానాన్ని. మా అమ్మ జగదంబ, నాన్న వైకుంఠం. మా తాత ముత్తాతలది వరంగల్. నేను పుట్టి పెరిగింది వరంగల్ జిల్లాలోని చిననెక్కొండలో. మా నాన్నగారు అత్యంత మేధావి. వారి వద్దే నేను అక్షరాలు దిద్దుకున్నాను. వారు నాకు పాటలూ, పద్యాలూ వినిపించేవారు. కాశీ మజిలీ కథలూ, రామాయణ భారత కథలూ చెప్పేవారు. వారు నాచే పెద్ద బాలశిక్ష, ఆంధ్ర నామ సంగ్రహం చదివించారు. నాకు సుమతీ శతకం, కృష్ణ శతకం కంఠతా వచ్చేవి. నేను సర్కారీ బడిలో 8వ తరగతి వరకు చదువుకున్నాను. నేనే క్లాసు ఫస్టు. నన్నొక హీరోలా చూసేవారు వాళ్లంతా. మొదట నేనే గాయకుణ్ణి. ఆపై చిత్రకారుణ్ణి. ఆ తరువాతే రచయితని. మా నాన్నగారి సంపాదన లేనందునా, వృద్ధుడైనందున, నేను మా అన్న (జనార్దన్‌గారు) మా వదిన (శ్రీమతి భాగ్యలక్ష్మి) పైనే ఆధారపడ్డాను. నన్ను బస్తీకి పంపి 9వ తరగతి చదివించనన్నాడు మా అన్నయ్య. కానీ నేను ఏడ్చి గీపెట్టి మొండికేస్తే అత్యంత అయిష్టంగా చదివించాడు. 8 వరకు నెక్కొండలో, 9 నుండి 12 వరకు హన్మకొండలో, మా అక్కాబావల ఇంట్లో చదివాను. అప్పుడే నాకు కష్టాలు మొదలయ్యాయి. ఇటు అన్నా వదినలతో, అటు అక్కాబావలతో వేగాను. చాలా క్షోభపడ్డాను.
మొదట 1964లో ‘సర్వే ఆఫ్ ఇండియా’లో సర్వేయర్ ఉద్యోగం వచ్చింది. అష్టకష్టాలు పడ్డాను. 1965లో ‘పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్’ (పి అండ్ టి)లో క్లర్క్‌గా ఉద్యోగం వచ్చింది. మైసూరులో ట్రైనింగ్. డబ్బులివ్వనన్నాడు అన్నయ్య. అప్పు చేయాల్సి వచ్చింది. 1965 నుండి 71 వరకు ఆరేళ్లు అందులో పని చేశాను. సుఖ సంతోషాల్ని మూటగట్టుకున్నాను. 1966లో ఖమ్మంలో నా పెళ్లైంది (నా భార్య శ్రీమతి విజయభారతి). అక్కడే 1967లో సాయం కళాశాలలో (ఎస్‌ఆర్ అండ్ బిజిఎన్‌ఆర్ కాలేజీ)లో బి.కాం చేరాను. బదిలీ అయినందువల్ల బి.కాం. ద్వితీయ,

కళల్లో రాణించి... (14వ పేజీ తరువాయ)
తృతీయ కరీంనగర్ (ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల)లో చదివాను. 1971 నుండి 73 వరకు వరంగల్ పీజీ సెంటర్‌లో ఎం.కాం. చేశాను. సెలవు దొరక్క, అధికారుల వేధింపుల వల్ల, ఆర్థికంగా, మానసికంగా నానా బాధలు పడాల్సి వచ్చింది. రెండో సంవత్సరంలో రాజీనామా చేసి, ‘పీజీ’ పూర్తి చేశాను అత్యంత సాహసోపేతంగా. బంధుమిత్రుల నుండీ, అత్తామామల నుండీ ఏ రకమైన సహాయ సహకారాలూ అందలేదు. ఏలినాటి శని అన్నారు జ్యోతిష్కులు.
1974లో పీపుల్స్ కాలేజ్, వాంకూరులో లెక్చరర్‌గా ఉద్యోగం దొరికింది. తరువాత 1975లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం, నారాయణ ఖేడ్‌లో. 1979లో నిజామాబాద్‌కు బదిలీ అయింది. అక్కడే, 1982లో సీనియర్ లెక్చరర్‌గా ప్రమోషన్ పొంది, అక్కడి సాయం కళాశాలలో పని చేశాను. తరువాత 1989లో సిద్ధిపేటకు బదిలీ అయింది. 2004లో సిద్ధిపేటలోనే రిటైరయ్యాను. నా శ్రీమతి విజయభారతి 2014లో కీర్తిశేషురాలైంది. ప్రస్తుతం మా పెద్దమ్మాయి (శ్రీమతి లక్ష్మీలీల) వద్ద ఉంటున్నాను. నాకు చిన్నతనం నుండీ సంగీత సాహిత్యాల పట్ల శ్రద్ధాసక్తులు మెండు. నాకు ఏడాదో, రెండేళ్లో ఉన్నప్పుడు నన్ను ‘సంసారం’(?) సినిమాకు తీసుకెళ్లారు వరంగల్‌కు మా అన్నావదినలు. మరునాడుదయం ‘టకుటకు! టకుటకు! టమకుల బండీ, లంకణాల బండీ! జోడెద్దుల బండీ’ అంటూ ఆ సినిమాలోని పాటని సాంతం పాడేశాను. అంతా ఆశ్చర్యపోయారు (ఇప్పటికీ ఆ పాటంతా నాకు గుర్తు) తరువాత నేను ఏ నాలుగో ఐదో చదివేప్పుడు ‘గన్నువారి మాట గడదాటరాదయా! విశ్వదాభిరామ! వినురవేమ!’ అంటూ ఆశువుగా చెప్పి, మిత్రుల్ని అలరించాను. ఆ తరువాత 1960లో నేను తొమ్మిది చదువుతున్నప్పుడు ‘పీడకల’ అన్న కథని రాశాను. ఓ రెండేళ్ల పిల్లాడు చెప్పిన కథ అది.
1961లో అప్పుడు నేను విద్యార్థిని (1960-64) మల్టీపర్పస్ హైస్కూలు హన్మకొండలో చదువుకొంటున్నాను. గాంధీజీపై రెండు గేయాల్ని వ్రాసి, పాడి వినిపించి, బహుమతి గెల్చుకున్నాను. అదొక ఒక విచిత్ర సంఘటన. ఆదికవి వాల్మీకి బోయవాణ్ణి శపిస్తూ ‘మానిషాద’ శ్లోకాన్ని రచించినట్లుగా, ఒక విద్యార్థి భాషనూ, భావాన్నీ ఖూనీ చేస్తూ, మాట్లాడగా (కవితా రచన చేయగా) చూచి, అతన్ని తిట్టుకుంటూ చేసిన రచన ఇది. సాహసం అది. ఆ తరువాత (1964లో) నా చదువు పూర్తయ్యాక వచన కవితా రచనకి పూనుకొన్నాను. ఆ తరువాత నాకు ఉద్యోగం దొరికాక (1978లో) 14 ఏళ్ల తరువాత నా మొదటి కవితా సంపుటి ‘అడవి పూలు’ ప్రచురించాను. మహబూబ్‌నగర్ టౌన్ హాల్లో, హాలు జనంతో కిటకిట లాడిపోయిందంటే నమ్మండి. ఆ తరువాత దాదాపు 30 ఏళ్లు కవిత్వంలోనే గడిపాను. కవితా, మినీ కవితా, హైకూలూ, అధివాస్తవిక కవితా.. ఇలా అన్నీ వ్రాశాను. పద్యాలూ, గేయాలూ రచించాను. పేరడీలు వ్రాశాను. మూడు దీర్ఘ కావ్యాలు కూడా రచించి ప్రచురించాను. (1.వాసవి మహాసంకల్పం 2.కత్తుల కౌగిలి 3.శ్రీకృష్ణ రమ్య రామాయణం). నా ‘కత్తుల కౌగిలి’ని ఆవిష్కరించిన యుగకవి శేషేంద్ర ‘నా కవిత్వం మిల్టన్’ స్థాయిలో వెళ్లిందంటూ ప్రవంసించారు. నేనవాక్కయ్యాను. ఇక నా శ్రీకృష్ణరమ్య రామాయణాన్ని చూచి నన్ను కాళిదాసుతోనూ, విశ్వనాథతోనూ పోల్చారు సాహితీవేత్తలు - నన్ను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతూ.
నేను విద్వాన్ వరకు చదివాను. (1964లో) ఫీజు కట్టినా పరీక్షకు కూచోలేదు, టైఫాయిడ్ రావడంతో. అంతేకాదు ‘ఇందూర్ హిందీ సమితి’ (నిజామాబాద్) సంస్థాపకుల్లో నేనొకణ్ణి. ‘ఏక్ లెహర్ సాగర్ కీ’ని ప్రచురించి, హిందీ జగత్తుని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాను. అనేక హిందీ సభల్లో, వర్క్‌షాపుల్లో పాల్గొన్నాను. ఉత్తర దక్షిణ భారతాల్లో తిరిగాను.
నావి ముఖ్యంగా నాలుగు ప్రక్రియలు. 1.కవిత్వం 2.కథ 3.విమర్శ 4.పరిశోధన. కథలో పదేళ్లు, విమర్శలో పదేళ్లు మునిగి తేలాను. దాదాపు ముప్పై ఏళ్లుగా పరిశోధన గావిస్తున్నాను.
నా ‘కథలు’ వైవిధ్యంగా ఉంటాయి. 1988లో నా కథాసంకలనం ‘తపస్సు’ అచ్చయింది. ఇక ‘నా విమర్శ’తో సంచలనాల్నే సృష్టించాను. శ్రీశ్రీ నుండి శివారెడ్డి దాకా సాగింది నా విమర్శ. రంగనాయకమ్మ గారి ‘విషవృక్షం’పై, ‘ఇదీ భారతం’పై,‘వేదాలు/ వేదాలు’పై ఘాటైన, దీటైన సమాధానాల నిచ్చాను. (చూడుడు రంగనాయకమ్మ గారి రామాయణ పరిజ్ఞానం? (2011), నాదమే వేదం, వేదమే దేవం (2017) ఏదండీ భారతం? (వ్యాసం) నా విమర్శతో ఖంగు తింది లోకం. స్వయానా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సినారె నన్ను వెదుక్కుంటూ మా ఇంటికొచ్చారు. మహాకవి శేషేంద్రగారు సైతం మా ఇంటికొచ్చి వెళ్లారు. అంతేకాదు సతీసమేతంగా శ్రీ శేషేంద్ర నన్ను తన ప్యాలెస్‌లో శాలువాతో సత్కరించి తాను నాపై రాసిన కవితని నా కంకితమిచ్చి గౌరవించారు. నేను యార్లగడ్డ వారినీ విస్మరించలేదు. ‘యార్లగడ్డవారి వస్త్రాపహరణం’ అన్న ‘ప్రహసనాన్నీ’ రచించి, ప్రచురించాను. (2010లో)
నాదంటూ ఓ ప్రణాళిక లేదు. కాలమే నన్ను నడిపిస్తోంది. ‘వాల్మీకి రామాయణం’పై 10 సం.లు కృషి చేసి ‘రాముడండే ఎవరు? రామాయణమంటే ఏమిటి?’ అన్న పరిశోధనా గ్రంథాన్ని వెలువరించాను. ‘ఈ కలియుగంలో ఇలాంటి తపస్వి పుట్టలేదు. ఇలాంటి పుస్తకం రాలే’దంటూ మహాకవీ, పుంభావ సరస్వతీయైన మహాకవి గణపతిగారు ప్రశంసించారు నన్ను. ‘ఇది నా బుర్రకందడం లేదు - నా బుర్ర పంజేయడం లేదు’ అంటూ కితాబునిచ్చారు డా.సినారె. ఇది హిందీలోకి సైతం డా.వై.వి.రమణ్‌రావు (హిందీ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ) గారిచే ‘రామ్ కౌన్ హై? రామాయణ్ క్యా హై?’ అన్న పేరిట అనువదించబడి ముద్రించబడింది. ‘రామాయణ రహస్యాలు’ పేరిట ఇది ఆంధ్రప్రభలో సుమారు 2 సం.లు ధారావాహికంగా వచ్చింది.
దీని తరువాత ‘్భరత, భాగవత, హరివంశాల’ ఆధారంగా మరో పరిశోధన గావించాను. ‘కృష్ణాయనం - ఒక నక్షత్ర మహాయానం’ పేరిట. ఇదీ ప్రచురించబడింది. ‘్భక్తి’ పత్రికలో ధారావాహికంగా వచ్చింది. ఇది నా రెండవ పరిశోధన.
ఇక నా మూడవ పరిశోధన ‘ఋషి హృదయం’ (2010). ఇది నా జీవితాన్నొక మలుపు తిప్పింది.
వరంగల్‌లో శ్రీ నల్లాన్ చక్రవర్తుల రఘునాథా చార్యుల వారని గొప్ప వేద పండితులున్నారు. వారు చినజీయర్ స్వామి వారికే గురుతుల్యులు. వారు నా రామాయణ భారతాదులపై పరిశోధనల్ని చూచి అచ్చెరువొందారు. వారు రచించిన ‘వేద ప్రామాణ్యం’ అనే చిన్న పుస్తకాన్ని నాకు అనుగ్రహించారు - చదవమని. దానిలో సుమారు 15 మంత్రాల్ని ఉటంకిస్తూ, వానికి సరియైన అన్వయం చూపేవారు. అర్థం, అంతరార్థం వివరించేవారూ లేరనీ, వానిని నాస్తికులు వెక్కిరిస్తున్నారనీ వ్రాశారు. గమ్మత్తుగా వాటన్నింటికీ అంతరార్థాల్ని చెప్పాను నేను. నన్ను నేనే నమ్మలేని స్థితి అది. దాన్ని ‘ఋషిహృదయం’ పేరిట ముద్రించి, స్వామివారి ఆశీస్సుల నందుకొన్నాను. ‘ఇది నా పూర్వజన్మల పుణ్యఫలమనీ, దర్శనమనీ’ అన్నారు వారు. మహామహులంతా దాన్ని చూచి ఆశ్చర్యపోయారు. ఆత్మీయులు డా.ముదిగొండ శివప్రసాద్ గారూ, శ్రీ సుదర్శనా చార్యులూ (సామవేద పరిశోధకులు) మున్నగువారు నన్ను వేదాలపై పరిశోధన చేసి వ్రాయాలనీ, ప్రపంచం నాకు రుణపడి ఉంటుందనీ అంటూ నన్ను వేదాలపై పరిశోధనకై పురిగొల్పారు. నా తలపై బండను పెట్టారు. నిజం చెప్పాలంటే నాకప్పటికి వేదాల గురించి ఏమీ తెలియదు. అందుకే నాలుగు వేదాల్ని ముందేసుకొని దాదాపు 10 సం.ల నుండి మధిస్తున్నాను. తత్ఫలితంగా ‘చతుర్వేద సాగర మథనం’ పేరిట 1000 పుటల అంతరార్థ వ్యాఖ్య వ్రాశాను. నాలుగు దృక్కోణాల్లో అర్థం చెప్పే ప్రయత్నం చేస్తూ. దాన్ని ప్రింట్ చేయటానికి రూ.2 లక్షలు కావాలన్నారు. అందువల్ల దాంట్లోంచి 250 పుటల్ని ‘చతుర్వేద సాగర మథనం-1’ -విశే్వ దేవతలు అగ్ని’ అన్న పేరిట ఒక పుస్తకాన్ని వెలువరించాను డబ్బుల్లేక. దీంట్లో కేవలం భావగర్భితమైన మంత్రాల్ని మాత్రమే తీసుకొని, విశే్వ దేవతలైన అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, సోముడు, ద్యారాపృథ్వుల గురించి చెప్పాను.
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి