కళాంజలి

గురు ప్రశంసతో కళకు సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ చింతా ఆదినారాయణ శర్మగారు ప్రఖ్యాత కూచిపూడి గురువు, నర్తకుడు. వీరు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యానికే అంకితమయ్యారు. వీరి కళాసేవకు తార్కాణం గౌరవ డాక్టరేట్. త్యాగరాజ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్‌లో కూచిపూడి అధ్యాపకుడిగా పనిచేసి, రిటైరయ్యారు. దాదాపు 15వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్తమ అధ్యాపకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సత్కరింపబడ్డారు. వీరి శిష్యులు ప్రశిష్యులు వేల మంది కళాసేవ చేస్తున్నారు. వీరు నాట్యకళానిధి, నాట్య విశారద బిరుదులు పొందారు.
వారితో ముఖాముఖి-
* * *
నేను 1954 శ్రావణ పౌర్ణమి నాడు జన్మించాను. మా అమ్మానాన్నగార్లు చింతా రాధాకృష్ణమూర్తి - సీతా మహాలక్ష్మి. నేను కూచిపూడిలో పుట్టి పెరిగాను. తరువాత గుంటూరులో 1974-76లో ఎం.కాం చేశాను. నా మొట్టమొదటి గురువు మా నాన్నగారు. వారిది ఉమ్మడి కుటుంబం. బాబాయి చింతా కృష్ణమూర్తి గారి వద్ద తర్వాత నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. 1964లో కూచిపూడిలో సిద్దేంద్ర కళాక్షేత్రం జన్మించింది. అప్పటివరకు ఇళ్లల్లోనే కూచిపూడి నాట్యం నేర్చుకునే వాళ్లం. నేను సిద్దేంద్ర కళాక్షేత్రం ఫస్ట్ బ్యాచ్. 1964లో నాన్నగారు గుంటూరు వెళ్లాను. నేను కూచిపూడిలో ఉండిపోయాను. సంగీత నాటక అకాడెమీ స్కాలర్‌షిప్ వచ్చింది. ఆ రోజుల్లో 20 రూపాయలు ఇచ్చేవారు. నేను పివిజి కృష్ణశర్మ గారి వద్ద, వెంపటి చినసత్యం గారి వద్ద నృత్యం నేర్చుకున్నాను. 1964 నుండి వెంపటి చినసత్యం గారి వద్ద నేర్చుకున్నాను. ఎం.కాం అయిపోయిన తర్వాత మద్రాస్ వెళ్లి, 1983 ప్రాంతంలో చాలా ఏళ్లు నాట్యం నేర్చుకున్నాను. తెలుగు విశ్వవిద్యాలయంలో 1989-92 పని చేశాను. 1992లో గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో పని చేయడం మొదలుపెట్టాను.
సింగపూర్, మలేషియా, మారిషస్, శ్రీలంక, లండన్, యుఎస్.. ఇలా ఎన్నో దేశాలు పర్యటించి నృత్య ప్రదర్శనలిచ్చాను.
డా.సి.నారాయణ రెడ్డిగారు నా చేత ‘సుగ్రీవ విజయం’ చేయించారు. అప్పుడు వారు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు. నన్ను ఎంతో అభినందించారు.
కళారంగంలో, కళాకారుల్లో అసూయా ద్వేషాలు ఉంటాయి. ఎందుకు ఇలా చేస్తారో తెలియదు. నృత్యం ఒక తపస్సు. కళాకారులు మునుల్లా మదమాత్సర్యాలకు అతీతంగా ఉండాలి. మా చిన్నప్పుడు మా మేకప్ మేమే వేసుకునేవాళ్లం. మాకు ఎవరూ నేర్పించలేదు. ఇంకొకర్ని చూసి నేర్చుకునేవాళ్లం. సరైన విగ్గులు, ఆభరణాలు, దుస్తులు దొరికేవి కాదు. కొన్ని బాధలు చెప్పుకోలేం. కేవలం ప్రతిభ, వ్యుత్పత్తి, సృజనతో పైకి వచ్చాను.
మా గురువుగారు వెంపటి చినసత్యంగారు, ఉద్యోగంలో డా.సి.నారాయణరెడ్డిగారు, తరువాత రమణాచారి (ఐఎఎస్), కిషన్‌రావు (ఐఎఎస్) సహాయం చేశారు. వీరి రుణం తీర్చుకోలేనిది.
రోజూ పొద్దున్న రెండు గంటలు, రాత్రి 3 గంటలు అభ్యాసం చేసేవాడిని.
ఆలోచించి ఏ పనైనా చేయాలి. ఒక గురువు దగ్గర నుండి ఇంకొక గురువు దగ్గరికి ఊరికే మారకూడదు. నృత్యం శైలి, బాణీ మారిపోతుంది. ఒకే గురువుని నమ్ముకోవాలి. రాత్రికి రాత్రి శిష్యులు ప్రదర్శనకు తయారవరు. కనీసం ఐదారేళ్లు కష్టపడి ఇష్టపడి నేర్చుకోవాలి. శిష్యుల ప్రతిభ చూసి గురువు సంతోషపడి, అనుమతి ఇస్తే అప్పుడు ప్రదర్శనలు ఇవ్వవచ్చు. కళ ఒక జీవనశైలి, జీవన విధానం.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి