కళాంజలి

నాట్యవిద్వన్మణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి గోవిందరాజు శ్రీదేవి ప్రఖ్యాత నాట్యకోవిదురాలు. ఒకవైపు గృహిణిగా, తల్లిగా వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంకోవైపు కళలకు ఎంతో సేవ చేస్తున్న బంగారు తల్లి, కల్పవల్లి. ఈవిడ నాట్య విద్వన్మణి, గురువు, పరిశోధకురాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బి.ఏ. (బంగారు పతకం), ఎం.ఏ., ఎం.్ఫల్ చేసి ప్రస్తుతం డా.అలేఖ్య పుంజాలగారి మార్గదర్శకత్వంలో పిహెచ్.డి. చేస్తున్నారు. శ్రీమతి శ్రీదేవి గారి పిహెచ్.డి పరిశోధనాంశం ‘కూచిపూడి నాట్యము - రూపకల్పన’. ఆవిడ హృదయం సముద్రమంత లోతు, ఔన్నత్యం హిమాలయమంత ఎత్తు. శ్రీదేవిగారు నిండు కుండ తొణకదు అన్నట్లు ఉంటారు. ఆవిడ మూర్తి చిన్నది స్ఫూర్తి గొప్పది. శ్రీదేవిగారితో ముఖాముఖి-
ప్రశ్న: మీ బాల్యం గురించి చెప్తారా?
జ: నేను సెప్టెంబర్ 23 కొత్తగూడెంలో శ్రీ గోవిందరాజు రామమోహనరావు, ఇందిరా కుమారి దంపతులకు జన్మించాను. మా అమ్మనాన్న గార్లకు కళలంటే ఎంతో ప్రేమ. నన్ను ఎంతో ప్రోత్సహించే మా అన్నయ్య గోవిందరాజు భరద్వాజ. నాటక రంగం - థియేటర్ ఆర్ట్స్‌లో సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్.డి చేశారు. వారు ప్రస్తుతం ఢిల్లీలో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో, విజువల్ ఆర్ట్స్ శాఖలో డైరెక్టర్.
ప్ర: మీరు ఏం చదువుకున్నారు?
జ: కళలకు చదువు తోడయితే బంగారానికి తావి అబ్బినట్లు ఉంటుంది. నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బి.ఏ., ఎం.ఏ., ఎం.్ఫల్ చేసి, ఇప్పుడు పిహెచ్.డి. చేస్తున్నాను. నాకు బి.ఏ.లో స్వర్ణ పతకం వచ్చింది. నా పిహెచ్.డి పరిశోధనాంశం ‘కూచిపూడి - రూపకల్పన’. నా గైడ్, మార్గదర్శి డా.అలేఖ్య పుంజాలగారు. ఆవిడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి మహిళా రిజిస్ట్రార్, డీన్. ప్రొఫెసర్ అలేఖ్యగారి మార్గదర్శకత్వంలో నేను ఎం.్ఫల్ చేశాను. అప్పుడు నా పరిశోధనాంశం ‘కూచిపూడి - శిక్షణా పద్ధతులు’. నేను కూచిపూడితోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. భరతనాట్యలం నాకు సర్ట్ఫికెట్, డిప్లొమా కూడా ఉన్నాయి.
ప్ర: మీరు ఎవరి వద్ద నేర్చుకున్నారు?
జ: నేను డా.ఉమారామారావు, డా.్భగవతుల సేతురాం, శ్రీమతి నిర్మలా ప్రభాకర్‌గార్ల వద్ద నృత్యం నేర్చుకున్నాను. దశాబ్దాలుగా నృత్యానికే అంకితమయ్యాను. శ్రీ వేదాంతం ప్రహ్లాదశర్మ గారి వద్ద నృత్యం నేర్చుకోవడం నా అదృష్టం.
ప్ర: మహిత కళాసమితి గురించి చెప్తారా?
జ: 1991లో నేను మహిత కళాసమితి శిక్షణాలయం ప్రారంభించాను. వనస్థలిపురం, కూకట్‌పల్లి, బండ్లగూడ, నాగోల్, స్కందగిరి, ఉప్పల్‌లో నా సంస్థ శాఖలు ఉన్నాయి. కొన్ని వందల ఉత్తమ నర్తకీమణులను తయారుచేశాను. లలితకళలు, ప్రత్యేకించి కూచిపూడి నాట్య విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తూ, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాము.
ప్ర: మీ బృందం ఎన్నిచోట్ల ప్రదర్శనలు ఇచ్చింది?
జ: నాద నీరాజనం - తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, శిల్పారామం, కాణిపాకం, తిర్చూరు, రాజ్‌పూర్, మైసూర్, కూచిపూడి, మైసూర్ దసరా ఉత్సవాలు, చిదంబరం ఆలయం వంటి ఎన్నో ఎనె్నన్నో ప్రముఖ ఉత్సవాలు, పుణ్య క్షేత్రాలలో వందలాది ప్రదర్శనలు నా శిష్య బృందంతో చేయించాను.
ప్ర: శిక్షణా శిబిరాలు నిర్వహించారా?
జ: వేదాంతం రాధేశ్యాంగారి నేతృత్వంలో భామాకలాపం, ఉషా పరిణయం, యక్షగానం శిక్షణా శిబిరాలు (వర్క్‌షాప్స్) నిర్వహించాను. మదర్స్ ఇంటిగ్రెల్ కాలేజీ - కాకినాడలో కూచిపూడి నాట్యం మీద, అలాగే డా.విజయ్‌పాల్‌గారితో నాట్యయోగా మీద, క్రీ.శే.పద్మభూషణ్ వెంపటి చినసత్యంగారి శిష్యురాలైన బాలాకొండలరావు గారి నేతృత్వంలో కూచిపూడి ప్రాథమిక అంశాలపై శిక్షణా శిబిరం నిర్వహించాం. ప్రముఖ మృదంగ విద్వాంసులు కర్రా శ్రీనివాసరావుగారిచే శిష్యులకు ప్రతి సంవత్సరం నట్టువాంగం, తాళాలలో శిక్షణ ఇప్పిస్తున్నాను.
ప్ర: మీరు రాసిన వ్యాసాల వివరాలు ...
జ: బుద్ధి వికాసాన్ని కలిగించే కూచిపూడి నాట్యం, కూచిపూడి నాట్య రూపకల్పన వంటి ఎన్నో వ్యాసాలు వివిధ దినపత్రికలలో, సావనీర్లలో ప్రచురించాను.
ప్ర: మీకు లభించిన గౌరవాలు...
జ: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బి.ఏ.కి గాను స్వర్ణ పతకం లభించింది. హెచ్‌ఆర్‌డి, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ వారి ఫెలోషిప్ పొందాను.
తెలంగాణా కళావైభవం ట్రస్ట్, మహబూబ్‌నగర్ 2015లో నాకు ఉగాది పురస్కారం ఇచ్చి ఘన సన్మానం చేశారు. 2016లో ద్వితీయ తెలంగాణ రాష్ట్ర ఆవిర్నావ సంబరాల సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ఉత్తమ నాట్య కళాకారిణిగా స్టేట్ అవార్డు ఇచ్చింది.
ప్ర: మీరు రాసిన నృత్య రూపకాలు...
జ:మా వారు అచ్యుతుని రాధాకృష్ణ. అనారోగ్య రీత్యా ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి. వారికి ఎంతో సాహిత్యాభిలాష. నాకు కొండంత అండదండ వారే. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. వారు 20 బ్యాలే నృత్యరూపకాలు రాశారు. వారి మనస్సు ఎప్పుడూ నాట్యం మీదే ఉంటుంది.
ఎన్నో బాలేలకు కొరియోగ్రఫీ చేశాను. రూపకల్పన చేశాను. వాటిలో కొన్ని. శ్రీ లలితా దర్శనం, శ్రీ త్రిపుర సుందరీ విజయం, మహాశక్తి, మహిషాసుర మర్దిని, దక్షయజ్ఞం, గిరిజా కళ్యాణం, నవరస నటేశ్వరి, అరుణాసుర భంజని శ్రీ భ్రమరీ, ఉమాపుత్రం నమామ్యహం, పద్మావతీ శ్రీనివాసం, కృష్ణలీలామృతము, రాధామాధవీయం, గోదా కళ్యాణం, చిదంబర నటం భజే, శ్రీ కళ్యాణం, శ్రీపతి వైభవం, శ్రీరామ విజయం, దేవీ అభయం, సిద్ధయోగీంద్ర చరిత్ర, దేవదాసీ, ఊర్వశీ, శ్రీసీతారామ కళ్యాణం, జాతి వెలుగులు (సాంఘిక), సమైక్య జీవన సౌందర్యం, భారతీయం, భావి భారతం.
ప్ర: కళాకారులకు మీరిచ్చే సందేశం ..?
జ: గురువుని నమ్ముకొని, అర్థం చేసుకుని కళను నేర్చుకోవాలి. పద్ధతిగా, విశే్లషణాత్మకంగా నేర్చుకోవాలి. గురువుల పేరు నిలబెట్టాలి.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి