మెయిన్ ఫీచర్

కలిసిరాని అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం కలిసొచ్చింది కానీ, అదృష్టమే దిగిరాలేదు. ఒకటీ, రెండూ కాదు.. అచ్చంగా ఆరువారాల టైం దొరికింది -చిన్న సినిమాకు. పెద్ద పండగ సీజన్‌లో చివరి పెద్ద చిత్రంగా సోగ్గాడే చిన్నినాయినా విడుదలైన తరువాత -మళ్లీ పెద్ద సినిమాల విడుదలకు చాలా గ్యాప్ వచ్చింది. వచ్చిన వ్యాక్యూమ్‌ని క్యాష్ చేసుకోవడానికి చిన్న చిత్రాలు లెక్కలేనన్ని థియేటర్ల వద్ద క్యూగట్టాయి. వారానికి ఐదు నుంచి పది చొప్పున విడుదలవుతూనే ఉన్నాయి. కానీ -ఒక్కటీ తన సత్తా చూపించుకోలేకపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో -పెద్దదైనా, చిన్నదైనా ఒక సినిమా బతికి బట్టకట్టడానికి వారం చాలు. కానీ, పెద్ద సినిమాల ఊసులేకుండా ఇంత వ్యాక్యూమ్ చిన్న సినిమాకు దక్కినా.. ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. తీసిన సినిమాను థియేటర్‌కు విడుదల చేశాం అనిపించుకోవడం తప్ప, వైవిధ్యాన్ని చూపించి విమర్శకుల మెప్పుపొందిన, ఆడియన్స్ చేత ఆహా అనిపించిన సినిమా ఒక్కటీ రాలేదంటే అతిశయోక్తి కాదు.
==================
నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్నినాయినా చిత్రం థియేటర్ల వద్ద దుమ్ముదులిపేసి వెళ్లిన తరువాత -పెద్ద చిత్రాల ఊసు లేదు. అంటే -జనవరి నాలుగోవారం నుంచే చిన్న సినిమాలకు థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, బాక్సాఫీసు వద్ద ఏర్పడిన పెద్ద వ్యాక్యుమ్‌ను ఒక్కటంటే ఒక్క సినిమా కూడా క్యాష్ చేయలేకపోయింది. వారాలకొద్దీ థియేటర్లు చిన్న సినిమాలకు దక్కినా, బాక్సాఫీసు వద్ద గలగలలు వినిపించలేదు. కోట్ల రూపాయల చిన్న చిత్రాలన్నీ డస్ట్‌బిన్ పాలయ్యాయి. చిన్న సినిమాకు ప్రోత్సాహం లేదు, థియేటర్లు ఇవ్వడం లేదంటూ గగ్గోలు పెట్టడం తప్ప, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే సత్తా చిన్న సినిమాకు లేకుండా పోతోంది. నిజంగా చిన్న సినిమాలకు థియేటర్లు దొరికితే -ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షిస్తాయన్న ప్రశ్నకు ప్రస్తుత సీజన్ సమాధానం చెప్పినట్టయ్యింది. ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో ఈ సీజన్ సినిమాలన్నీ అస్త్ర సన్యాసం చేసేశాయి. దాంతో థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి.
పండగ తరువాత దక్కిన పండగలాంటి వాతావరణాన్ని క్యాష్ చేసుకోవడానికి -ఆగిపోయిన సినిమాలు, థియేటర్లు దొరకని సినిమాలు, ఎప్పుడు విడుదల చేయాలో అర్ధంకాని సినిమాలు, లేచిన సినిమాలు, లేవని సినిమాలు.. అన్నీ పొలోమంటూ థియేటర్లపై దాడి చేశాయి. కలిసొచ్చిన కాలంలో పరుగులు పెట్టినా అదృష్టాన్ని అందుకోలేకపోయాయి. స్పీడున్నోడు, లచ్చిందేవికి ఓలెక్కుంది, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, కృష్ణగాడి వీరప్రేమగాథ, గరం, కృష్ణాష్టమి, మలుపు, క్షణం, టెర్రర్, పడేశావే, ఎలుకా మజాకా, శౌర్య, గుంటూర్ టాకీస్ గత ఆరు వారాలుగా విడుదలైన చిన్న సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాలు. ఇలాంటివన్నీ అంతో ఇంతో పరిశ్రమలో అంచనాలు రేకెత్తించినవే. అయితే ఈ సినిమాలేవీ కనీసం బాక్సాఫీస్ బోర్డర్ కూడా దాటలేదు. పెద్ద హీరోల సినిమాలేవీ పోటీలేని వేళ ‘దక్కిందే విడుదలకు ముహూర్తం’ అనుకుంటూ వచ్చేశాయే తప్ప, పట్టుమని వారంపాటు థియేటర్ వద్ద సత్తా చూపించిన సినిమా ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదు. కృష్ణగాడి వీరప్రేమగాథ, క్షణంలాంటి చిత్రాల అంచనాలు బాగున్నా, విడుదలైన వారమంతా ఆసక్తి రేపినా -తర్వాత కనుమరుగయ్యాయి. కళ్యాణ వైభోగమే లాంటి ఒకటి రెండు కుటుంబ కథా చిత్రాలను మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఆదరించినా, రూరల్ ఏరియాల ఆడియన్స్ వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. కృష్ణాష్టమి, మలుపులాంటి చిత్రాలు ఆసక్తి రేపినా వౌత్‌టాక్‌తో వెనకపడ్డాయి. టెర్రర్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు చిత్రాలకు ఏమాత్రం ఆదరణ దొరకలేదు. చిన్న సినిమాను నిలబెట్టేందుకు, వ్యాపార దక్షతతోనో.. నాగార్జున, దాసరిలాంటి సీనియర్లు పోటీపడి ప్రమోషన్స్‌కు సహరించినా -పడేశావే, ఎలుకా మజాకా చిత్రాలు ఎక్కడికెళ్లిపోయాయో అంతుచిక్కని పరిస్థితి. ఓ మల్లినంటూ రమ్యశ్రీ ఒకలబోసిన అందాలు, హాయ్‌హాయ్ అంటూ వంశీ ఒలకబోసిన వెనె్నలలు, హారర్ సినిమాలు, లవ్ జోనర్లు.. ఇలా ప్రేక్షకుడికి ఏదీ ఎక్కలేదు. ఓవరాల్‌గా ఆరు వారాల వ్యవధిని ఏ సినిమా సరిగా వాడుకోలేకపోయింది.
నిజానికి పెద్ద చిన్న సినిమా అన్న తేడా ప్రేక్షకుడికి లేదు. సినిమా బావుందా? లేదా? అన్నదే చూస్తున్నాడు. చిన్నదే అయినా కథ, కథనాల్లో దమ్ముండి థియేటర్ వద్ద నిలబడగలదన్న అంచనాలు పెరిగినపుడు చిన్న సినిమానే పెద్దగా ఆదరిస్తున్నాడు కూడా. చుట్టేసి జనం మీదకు వదిలేద్దామన్న ధ్యాస తప్ప, నిబద్ధతతో సినిమా నిర్మించి ఆడియన్స్ ఆశీస్సులు అందుకుందామన్న ఆలోచనతో రూపొందుతున్న చిన్న సినిమాల సంఖ్య తగ్గిపోతుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది?

-తిలక్