బిజినెస్

అభివృద్ధికి జిఎస్‌టి ‘బ్రహ్మాస్త్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్వరగా ఆమోదించి రాజకీయ సంకల్పాన్ని చాటాలి
సకాలంలో అమలుచేస్తే 2 శాతం వరకు జిడిపి వృద్ధి
అసోచామ్ నూతన అధ్యక్షుడు సునీల్ కనోరియా

న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశ ఆర్థికాభివృద్ధికి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు ఎంతో కీలకమైనదని, సాధ్యమైనంత త్వరగా ఈ బిల్లును ఆమోదించాలని పారిశ్రామిక విభాగం అసోచామ్ పునరుద్ఘాటించింది. గురువారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసోచామ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా పెను సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో భారత్‌కు వస్తు, సేవల పన్ను బిల్లు ‘బ్రహ్మాస్త్రం’లా ఉపయోగపడుతుందని, కనుక పార్లమెంట్‌లో రాజకీయాలకు అతీతంగా ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసేందుకు ప్రతిపక్షాలన్నీ సహకరించాలని అసోచామ్ నూతన అధ్యక్షుడు సునీల్ కనోరియా విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన న్యూఢిల్లీలో విలేఖర్లతో మాట్లాడుతూ, జిఎస్‌టి బిల్లును ఆమోదించడం ద్వారా భారత్ తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లను రాజకీయ సంకల్పంతో అధిగమించగలదన్న బలమైన సందేశాన్ని పెట్టుబడిదారులకు పంపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడుల అనంతరం ఏర్పడిన భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ముఖ్యమైన సరుకుల ధరలు పతనమవడం, డిమాండ్ తగ్గడం తదితర కారణాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లిందన్నారు. అయితే ఈ నష్టాన్ని భర్తీ చేసుకుని స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)ని పెంపొందించుకునేందుకు వస్తు, సేవల పన్ను ‘బ్రహ్మాస్త్రం’లా ఉపయోగపడుతుందని, దేశంలో వివిధ పన్నులను పక్కకు నెట్టి పరోక్ష పన్నులకు ఊతమివ్వడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకుని వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు తద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకునేందుకు కూడా జిఎస్‌టి ఉపకరిస్తుందని సునీల్ కనోరియా స్పష్టం చేశారు. దేశ సంక్షేమం కోసం రాజకీయ పార్టీలన్నీ దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి ఐక్యంగా జిఎస్‌టి బిల్లును ఆమోదించాలని, ఈ బిల్లును సకాలంలో అమలులోకి తీసుకురాగలిగితే జిడిపి 1.5 శాతం నుంచి 2 శాతం వరకు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది వృద్ధిరేటు 7.3లోపే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్న దానికంటే (7.5 శాతం) కంటే తక్కువగా 7.2 నుంచి 7.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2016-17లో ఈ వృద్ధి 7.5 నుంచి 8 శాతం వరకు, 2018-19లో 9 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నామని, అయితే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.