డైలీ సీరియల్

త్రిలింగ ధరిత్రి - 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపతి దేవుడికి యుక్త వయస్సు వస్తున్నది. భుజాల దాకా వ్రేలాడే జులపాలు. చిరుగడ్డం, నూనూగు మీసకట్టు. ఆజానుబాహువైన అంగపుష్టి, చిన్ననాడు కట్టిన మెడలో వ్రేలాడే బంగారు గొలుసుతో, శివలింగం తీర్చిదిద్దినట్లున్న అంగాంగ సౌష్టవం. నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజఠీవి. ప్రసన్నవదనం. నడుముకు అంగవస్త్రం మాత్రమే బిగించి ఉంటుంది. పైబట్ట వేసికోడు. ఎవరు ఎన్ని మారులు తెచ్చి యిచ్చినా అంతే.
ఎప్పుడూ ఏదో ఆలోచనా నిమగ్నుడై ఉంటాడు. విడిగా ఉన్నప్పుడు వౌనమే అతని వ్రతం. అతను ఎవరినీ ఏమీ అడగడు. అడగవలసిన అవసరం కూడా లేదు. అడగకుండానే అన్నీ అమరుతున్నాయి.
పదేళ్లయినా ఎన్నడూ రోజులు లెక్క పెట్టలేదు. ‘ఓం నమశ్శివాయః’ అతని జపం. ఆహార నిద్రలు పరమేశ్వరుడిచ్చిన ఆ శరీరానికి పోషక, విశ్రాంతులు.
కాని ఎప్పుడూ ఏదో సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఉంటుంది, అతని దృష్టి, ఆలోచన.
సై నికులందరూ అతని కనుసన్నలలోనే మెలగుతూ రాజ లాంఛనాల కొరతేగాని, రాజభోగాలకు కొరత లేదు. అదంతా అతనికి అలవాటైపోయింది. కాకపోతే బయట ప్రపంచం అతనికి తెలియదు. ఆ నాలుగు గోడలు దాటి బయటికి పోవటానికి అవకాశం లేదు. అయినా అవసరం కూడా లేదు. తనకు కావలసినవన్నీ అక్కడే సమకూరుతున్నాయి.
అప్పుడప్పుడూ ఇందులూరి సోమరాజు, పెదగణ్ణగరాజు విడివిడిగా, కలిసి వస్తూ పోతూ ఉంటారు. సోమరాజు, రుద్రదేవుని మంత్రి, పెదమల్లన కుమారుడు. వీరిరువురు మంచియోధులు. నీతి శాస్త్ర పారంగతులు. విద్యాభూషణులు. గణపతి దేవుడంటే అపార ప్రేమాభిమానాలు కలవారు.
వీరిరువురి వెంటగాని, విడిగాగాని హేమాద్రి రెడ్డి కూడా వచ్చి పోతూ ఉంటాడు. హేమాద్రిరెడ్డి మహాయోధుడు, చిరుత ప్రాయంలోనే మహదేవుడి కాలంలో సేనాని.
చెన్నాప్రగడ గణపయామాత్యుడు రాని రోజు ఉండదు. గణపతి దేవునిపై అతనికి పుత్రవాత్సల్యము. జయతుంగుడి వద్ద తనకు గల పలుకుబడిని ఉపయోగించి గణపతి దేవుని విముక్తికి అహరహం కృషి చేస్తున్నాడు.
అప్పుడప్పుడూ నలుగురు కలిసి వచ్చి మధ్యాహ్నం, సాయంత్రాలు భోజనసమయం దాకా ఏవేవో విషయాలు ఎడతెరిపి లేకుండా మాట్లాడుకున్న రోజులు కూడా లేకపోలేదు. సైనికులు వీరి నలుగురిని బాగా ఎరుగుదురు, వీరి రాక వారికి ఆనందమే.
సైనికుడు వచ్చి భోజన సమయం అయిందని చెప్పిందాకా వారికి ఏమీ తెలియదు. దానికి నవ్వుకునే వాళ్లు. గణపతి దేవుడి వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయేవారు.
2
శాతవాహనుల తరువాత త్రిలింగధరిత్రిని ఏకతాటిపై నిలిపినవారు కాకతీయులు.
కాకతీయ వంశానికి ఆద్యుడు ప్రోలరాజు. ఆరవ విక్రమాదిత్యుని సామంతుడు, పశ్చిమ చాళుక్యుడు విక్రమాదిత్యుడు. ‘‘సబ్బిసాయిరి’’ మండలాన్ని పాలిస్తూ ఉండేవాడు.
చాళుక్య చక్రవర్తి అనంతరం ప్రోలరాజు స్వతంత్రుడై కాకతీయ సామ్రాజ్యానికి పునాది వేశాడు. ‘కాకి’ అను శబ్దం జీవుడికి పర్యాయ పదం. కాకతులు, కాకతీయులు వాడుక పదాలు.
‘‘కాకతి’’ అను శక్తినే జైనులు ‘కూష్మాండిని’ ‘పద్మావతి’ అని బౌద్ధులు ‘‘తార’’ అని శైవులు ‘దుర్గ’ అని పిలుస్తారు.
బౌద్ధ జాతక కథలలో ‘కాకతి’ అనే జాతక కథ కూడా ఉంది. కాకతీయులు జైనులు, బౌద్ధులు, శైవులు,ప్రోలరాజుకు రుద్రదేవుడు, మహదేవరాజు కుమారుడు. రుద్రదేవుడు పెద్దవాడు, మొదటి ప్రతాపరుద్రుడనే బిరుదు వహించాడు. కడు సమర్థుడు. రాజనీతి విశారదుడు.
రుద్రదేవుడు మూడవ తైలపదేవుని ఓడించాడు. తైలపదేవుడికి రుద్రదేవుడంటే సింహస్వప్నమైంది. పర్యవసానంగా అతడు అతిసార వ్యాధితో అంతమైనాడు.
కాకతీయులు స్వతంత్రులై రాజ్య విస్తరణ చేస్తున్నారని ‘‘సబ్బిసాయిరి’ మండలంలోను, ‘పొలవాస’ ప్రాంతంలోను దొమ్మరాజు, మేడరాజు తామేమి తక్కువ తిన్నామని విజృంభించారు. పానుగల్లు ప్రాంత చోడోదయుడు, పాలమూరు ప్రాంత భీమచోడుడు కూడా వారి బాటనే నడిచి రుద్రదేవునితో ఎనలేని వైరాన్ని తెచ్చుకున్నారు.
రుద్రదేవుడు తన బలపరాక్రమాలతో, యుద్ధనీతి వైశారద్యంతో వీరిని తిరిగి తలెత్తకుండా అణిచివేశాడు. ఈ కారణంగా రుద్రదేవుడు తలెత్తిన స్థానిక పాలకుల పీచమణచి కృష్ణాగోదావరి నదుల నడుమ గల తెలుగునేలను తన కైవశం చేసికొని తన ఏలుబడిలోనికి తీసికొని వచ్చి తన ఆధిపత్యాన్ని చాటాడు.
తూర్పున, దక్షిణాన ఉన్న ప్రాంతాన పూర్వపుచోళచక్రవర్తుల సామంతులుగా ఉన్న ప్రబలులైన వెలనాటి చోళ సామంతులైన హైహయరాజ్యంలో సంభవించిన రెండు భారత యుద్ధాన్ని పోలిన అంతర్యుద్ధంలో రుద్రదేవుడు నలగాముడి పక్షం వహించాడు. ఈ యుద్ధంలో వెలనాటి చోళులు కూడా పాల్గొన్నారు. రుద్రదేవుడు వెలనాటి చోళులను ఓడించి తన ఆధిపత్యాన్ని కృష్ణకు దక్షిణాన కూడా విస్తరింపచేశాడు. అంతటితో ఆగక ఆ పోరాటంలో పాల్గొన్న పలనాటి హైహయులతోపాటు కొండపడమటి కోట వంశీయులను తన సామంతులుగా చేసికొన్నాడు. ఈ విధంగా ఎడతెరిపి లేని ఎన్నో పోరాటాలు చేసి కాకతీయ సామ్రాజ్య నిర్మాణంలో రుద్రదేవుడు ఘనకీర్తి నార్జించాడు.
రుద్రదేవుడు కేవలం యుద్ధ వీరుడే కాదు. కవి, పండిత పోషకుడు. స్వయంగా కవి. సంస్కృతంలో ‘రాజనీతిసార’ మనే రాజనీతి శాస్త్ర గ్రంథాన్ని కూడా వ్రాశాడు.
రుద్రదేవుడి కాలంలోనే కాకతీయ రాజధాని అనుమకొండలో వేయిస్తంభ మండపం అక్కడే రుద్రేశ్వరుడని త్రికూటాకృతి గల శివాలయాన్ని తన పేర నిర్మించాడు. అదేగాక పిల్లలమర్రిలోను మంతెన (మంత్రకూటం)లోను గొప్ప వాస్తు శిల్పకళ ఉట్టిపడే పెద్దపెద్ద దేవాలయాలు నిర్మించాడు. అపార సేనాసంపదతో, ధైర్య సాహసాలతో, ప్రజ్ఞాపాటవాలతో, కాకతీయ రాజ్యాన్ని విస్తరింపచేవాడు రుద్రదేవుడు.
తమ్ముడు మహదేవరాజు ధార్మికుడు. అన్న అంత సమర్థుడు కాదు కాని రాజ్యకాంక్ష లేకపోలేదు.
రుద్రదేవుడి అనంతరం మహదేవుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని అలసతవల్ల, అసమర్థతవల్ల అది కనిపెట్టిన శౌణదేశాధీశుడు యాదవరాజు అయిన జయతుంగుడు మహదేవరాజుపై దండెత్తి వచ్చి అతన్ని బందీ చేసి దేవగిరి తీసుకొని పోయిఅక్కడ నిర్దాక్షిణ్యంగా వధించాడు. అతని పుత్రుడైన గణపతి దేవుడిని గృహ నిర్బంధంలో ఉంచాడు.
* * *
జయతుంగుడెన్నడూ గణపతి దేవుని రుూ పదేండ్లలో చూచినవాడు కాదు. నిజానికి అతనిని అంతగా పట్టించుకోనూ లేదు. తన రాజ్యవిస్తరణ, తన రాజ్యం, తన పరిపాలన శత్రువులను ఎదుర్కోవటం, అంతఃకలహాలను అణచటంలో అతనికి సరిపోయింది.
గణపతి దేవుడున్న చోట కారాగారమని పేరైనా భటులు సైనికులు అందరూ రుద్రదేవ, మహాదేవుల కాలంనాటి వారే. రాజకుమారుడు అయిన గణపతిదేవుని వారు ఒక కంట కనిపెడుతున్నారు. బుద్ధి ఎరిగిన అతనికి అదో లోకంలా అనిపించింది.

-అయ్యదేవర పురుషోత్తమరావు