వినమరుగైన

బసవరాజు అప్పారావు గేయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లవాడే గొల్లపిల్లవాడే అని మాలపిల్ల సినిమాలో వినగానే ఊరూ వాడా ఆ పాట పాడింది. నట్టనడి సంద్రాన నావలో వున్నాను అన్న (బాలయోగిలో అనుకుంటాను) పాట వింటూంటే కవితమంటే ఇలా ఉంటుందని తెలిసింది. సూర్యకుమారిగారు మామిడిచెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి అని (గ్రామఫోన్ రికార్డో, రేడియో రికార్డింగో) పాడుతుంటే అది తాజ్‌మహల్ని గూర్చే అయినా అప్పారావుగారి గీత సంపద గురించేనేమో అనిపిస్తుంది. బందా కనక లింగేశ్వరరావు 1948లో చెన్నపురి ఆంధ్ర మహాసభలో చంద్రగుప్త నాటకం వేస్తే జనం ఆయన చేత గుత్తివంకాయ కూరోయి బావా పాడించుకున్నారు. అప్పారావుగారి కేర్‌లెస్‌నెస్ ఎలాంటిదంటే ఇంత గొప్ప పాటకి ఆయన వెర్రిపిల్ల అన్న శీర్షిక పెట్టి వదిలేశారు. రావు బాలసరస్వతిగారు తలుపుతీయునందలోనె పాటను గ్రామఫోను రికార్డుగా పాడారు. శ్రీ బి.వి.నరసింహారావు గారు తన నాట్య కార్యక్రమాల్లో వాడిన పూవున కేటికి మరలును వసంతకాలము దేవా అనేదీ, దాసిగానుంటకైనా తగనా ప్రానేశ అనేదీ నృత్యం చేసేవారు. నేను బసవరాజు అప్పారావుగారిని ఎరగక పూర్వం కొల్లాయి గట్టితేనేమి (1932లో) అనే పాట విని ఓహో అనుకున్నాను.
గాంధీగారు ఎంత గొప్పవాడో బసవరాజు వారిచే తన మీద పాటలు రాయించుకొన్నాడు. అన్నమాచార్యుల చేత వెంకటేశ్వరుడు రాయించుకున్నట్టు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి అంశే తనలోనూ ఉంది కనుక- ఆ సూటి మాటా, వెటకారం సంగీతం, దేశభక్తీ, త్యాగనిరతీ సముఖాన ఉన్నాడు కనక, మహనీయుడు కనక బహుముఖ ప్రజ్ఞాశాలి కనక, ధీరోదాత్తుడయిన నాయకుడు కనక అప్పారావు గారు ఆయన జీవిత చరిత్ర వ్రాసి ఆరాధించి పాటలు వ్రాశారు.
భవభూతి ఉత్తర రామ చరిత్రలో శ్రీరాముని దుఃఖాన్ని వర్ణిస్తుంటే ‘ఆపిగ్రావా రోదితి, అపిదలతి వజ్రస్య హృదయం’ అన్నారు. అప్పారావుగారి మంగళప్రదమ్మును గూర్చి చలిపిడుగు అనే గీతం చదివినా, ఇరుకు నా గుండెలో ఇమిడి పోయెనే అనే పంకిత చదివినా, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు అనే వాక్యం విన్నా శోకం కరుణగా మారి కట్టలు తెంచుకుంటుంది. రాళ్లైనా కరిగి గన్నీరౌతాయి. వజ్రానికయినా గుండె పగులుతుంది.
అప్పారావు గారి పల్లెపాటలు ఎంకి పాటలను తలపిస్తాయి. కాంచలేను కాంచలేను గీతం కృష్ణశాస్ర్తీని తలపిస్తుంది. అమ్మా ఓ భూదేవీ అనే మాలోని బలమే, పాలగుమ్మి పద్మరాజుగారి చేత అమ్మా ఓ భూమీ నాకేమయిన కథలు చెప్పపు అనే రచనకు దారితీసిందేమో. ఆయనకు శాఫోపట్ల అభిమానం అని ఆయన అనువదించిన గీతాలను బట్టి తెలుస్తుంది. ఆమె ప్రభావం చేతనే ప్రణయతత్త్వంలో పడిపోయాడేమో అనిపిస్తుంది. ఆయన తన మనోభావానికనుగుణంగా వస్తువును దర్శిస్తాడు.
మండుకొనిపోతున్న వండోయి లోకాలు
మంటలార్పేయంగ రండోయి-
అనేదొక దీపావళి నాటి దర్శనమేమో (లేక ప్రథమ ప్రపంచ యుద్ధం గురించా?)
లోకానికుత్తుత్త దీపావళీ
నాకు మాత్రం దివ్య దీపావళి
తనలోని దీపావళి ముందు లోకం పాటించే దీపావళి ఎంత చవకబారుదో అనే భావం చీమలనిపించారె భూమిలో కవులు అనే దానికొక ప్రతిధ్వనిలా తోస్తుంది.
‘‘నీ పుట్టకి నా పాపలొచ్చేరు’’ అన్నప్పుడుగాని దేవా, స్వామీ అని చేసిన రచనలు గాని వేదాద్రి నరసింహుని తలచినప్పుడుగాని- అది భక్తిరసమా? కావ్య సంప్రదాయమా? రెండూనా అనాల్సి వస్తుంది.
సెలయేటి గానమనేది ఆయన ప్రకటించిన కవితా సంపుటా, తాను వ్రాసుకోన్న నోటుబుక్కుకి పెట్టుకొన్న పేరా? సెలయేటి గానం అనడంలోనే తన కవితా స్వభావాన్ని వ్యక్తం చేశారు. (అడ్డూ ఆపూ లెక్కచెయ్యనిదని సందేశమనేది ఖండికల సంపుటియా? సందేశ కావ్యమేమయినా ఉందా? కృష్ణశాస్ర్తీగారు ప్రస్తావించలేదు). డా. గుండ్లపల్లి (మిరియాల) రెజినా తన సిద్ధాంత గ్రంథం (నవ్యాంధ్ర కవుల ప్రణయినా ప్రతిపత్తి)లో అప్పారావుగారిని గూర్చి కూడా ప్రస్తావించారు.
పైడిపాల రచించిన తెలుగు సినిమా పాట అనే గ్రంథంలో సినిమాలలో వాడబడిన అప్పారావుగారి గీతాలను తెలియజేశారు. మాలపిల్లలో 4, రైతుబిడ్డలో 2, ఇల్లాలులో 3, అపవాదులో 6, పంతులమ్మలో 1, ఏది నిజంలో 1 (గుత్తొంకాయి), మాయపిల్లలో 1 (దాసిగానుంటకైన), కన్యాశుల్కంలో 1 (నీ పుట్ట దరికి)
కృష్ణశాస్ర్తీగారి మాటలు స్మరించుకోవాలి. ‘బసవరాజు పాటలో శక్తి వేరు. అదొక నిట్టూర్పు. అతని పాటకు నెత్తురు జీరంటుకున్నట్టుండేది. వేగమే వేదనే అతని కవిత్వానికి ప్రాణం. అతను కవిత్వానే్న బ్రతికాడంటారు కవిమిత్రులు.
అతని కావ్యాలలోకన్నా అతని జీవితంలోనే ఎక్కువ కవిత్వం దొరుకుతుందని మరికొందరంటారు. అతని రచనలన్నీ కలిపి అతని జీవితగాథ అయింది. పాడేటప్పుడు అతని గీతాలకున్న శక్తి మరి ఏ కవి గీతాలకూ లేదనిపిస్తుంది’’.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-సూరంపూడి భాస్కరరావు