కథ

వలస పక్షులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
*
చీకటి చిక్కబడింది. నగరం నిద్రలోకి జారుకుంటోంది. ఆ ఆస్పత్రి ఆవరణలో మాత్రం ఇంకా సందడిగానే ఉంది. హారన్ కొడుతూ వస్తున్న అంబులెన్స్. పురుళ్ల వార్డులో ప్రసవ వేదన పడుతున్న ఒక మాతృమూర్తి ఆక్రందన లీలగా-
ఈ నేపథ్యంలో రెసిడెంట్ డాక్టర్ రూములో తన లాప్‌టాప్ తెరిచి దీక్షగా చూస్తున్నాడు అనంత్. అతను చదివేది కొద్ది రోజుల్లో తను వెళ్లబోయే విదేశీ చదువు గురించి కాదు. అతను చూస్తున్నది లాప్‌టాప్ స్క్రీన్ మీదున్న రకరకాల పక్షులు.. అవి కొన్ని లేత నీలిరంగువి, కొన్ని ముదురు ఆకుపచ్చవి. మరి కొన్ని పక్షులు చిన్నిచిన్ని ముక్కులతో బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. అనంత్‌కు పక్షులంటే ఇష్టం. అది ఇప్పటిది కాదు.
అతను ఆరోక్లాసులో ఉన్నపుడు టీచరమ్మ ప్రశ్న వేసింది. ‘ఒకవేల జన్మ అంటూ వుంటే వచ్చే జన్మలో మీరంతా ఏమవుదామనుకుంటున్నారు?’ అని అందరినీ అడిగింది. కొంతమంది గుర్రం అవుతామన్నారు. కొంతమంది ఏనుగు.. మిగతా సహచరులు ముక్తకంఠంతో మృగరాజు సింహం అయిపోతామన్నారు. ఇక అనంత్ వంతు వచ్చేసరికి వెంటనే చెప్పేశాడు ‘తను పక్షి అయిపోతాను’ అని. ‘ఎందుకురా పక్షి అవ్వడం’ అంది టీచరమ్మ. వెంటనే అనంత్ తన రెండు చేతులు గాల్లో ఆడించాడు. ఒక్కసారి పైకి ఎగిరినట్టుగా గెంతి చూపించాడు. ఆ తర్వాత చెప్పాడు. ‘పక్షయితే ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగిరిపోవచ్చు. ప్రపంచం అంతా చుట్టి రావచ్చు..’ అనేశాడు ఉద్వేగంగా.
అలా పక్షులపై అతడి ఇష్టం బాల్యం నించీ పెరుగుతూ వచ్చింది.
టెన్త్ క్లాస్ ఫస్ట్‌క్లాసులో పాసయినపుడు, ‘నీకేం కావాలిరా’ అంది అతడి తల్లి. ‘నాకు రంగురంగుల లవ్‌బర్డ్స్ కావాలి’ అన్నాడు. అమ్మ కొని తెచ్చేసింది. ఇక ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి అతడి తల్లి అతడిని బైపిసి గ్రూప్ తీసుకోమంది. అనంత్‌కు ఇంజనీరింగ్ చేద్దామని ఉండేది. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చేసి హాయిగా ఏ విదేశమో వెళితే అక్కడ తనకు నచ్చిన పక్షులను చూస్తూ ఒక పక్షిలా తిరిగేద్దామని అతడి ప్రణాళిక. అయితే అమ్మ మాత్రం ‘నిన్ను డాక్టర్ని చేద్దామని నాన్న అనుకునేవారు.. పాపం ఆ కల నెరవేరకుండానే వెళ్లిపోయారు..’ అంది. అనంత్‌కు అర్థమయింది. అతను తొమ్మిదో తరగతిలో ఉండగానే అనంత్ తండ్రిగారి అకాల మరణం. నిద్రలోనే మాసివ్ హార్ట్ అటాక్‌లో శాశ్వత నిద్రకు గురయ్యారు. అప్పట్నించి తల్లే అతడిని, అతనికంటే పెద్దయిన ఇద్దరు అన్నయ్యలను ప్రయోజకుల్ని చేసింది. తల్లి అతడికి మరో భరోసా ఇచ్చింది. ‘నాన్నా నువ్ మెడిసిన్ చదివినా అమెరికా వెళ్లొచ్చు. అందుకు అవకాశాలు చాలా ఉంటాయి’ అంది. అలా కష్టపడి చదివాడు. మెడిసిన్ సీటొచ్చింది. స్వతహాగా కష్టపడి చదివే తత్వం ఉండటం, దానికి తోడు తండ్రిగారి అభీష్టం తీర్చాలని, మెడిసిన్ చదువు శ్రద్ధగా పూర్తి చేశాడు. అమెరికా వెళ్లేందుకు ఇంకా కొన్ని నెలల టైముంది. ఈలోగా ప్రాక్టీసవుతుందని తను చదివిన మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రిలో రెసిడెంటుగా చేరాడు.
అలా, పక్షిలా తను విదేశాలకు ఎగిరిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. విదేశాల్లో తను త్వరలో చూడబోయే కొన్ని వింతరకాల పక్షుల్ని నెట్‌లో చూసి ఆనందిస్తున్నాడు. ‘సార్’ అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. డ్యూటీ నర్స్ కేథరిన్. కేరళ అమ్మాయి.
‘బాగా దెబ్బలు తగిలాయి. సీరియస్ కేస్’ అంది.
‘వస్తున్నా’ అంటూ లాప్‌టాప్ మూసి బైటకు నడిచాడు.
గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు దాటి, బయటకు వస్తే ఎనాటమీ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లే రోడ్డు - ఆ ప్రదేశం అంతా చీకటి. ఆ చీకట్లో తన ముందు నించి నిర్భయంగా వెళుతున్న ఆ అమ్మాయిని చూసి ముచ్చటేసింది అనంత్‌కు. కేథరిన్ చాలా ధైర్యస్థురాలు. కష్టపడి పని చేస్తుంది. సేవే దైవం అనుకుంటుంది. పక్కనే టీ బంకు దగ్గర నించున్న కొంతమంది జూనియర్లు ఆమెను చూసి వెకిలిగా తెలుగులో ఏవో జోకులు వేసుకుంటున్నారు. తనని చూసి కొంచెం తగ్గారు. ‘పాపం.. ఆమెకు తెలుగు రాదనా, లేక ఇక్కడ స్థానబలం లేదనా - మనసులో ఏదో గిల్టీ - ఆలోచిస్తూనే కేజువాలిటీ వైపు నడిచాడు.
కేజువాలిటీ రూమ్‌లో ఐరన్ మంచం మీద కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి. వయసు ముప్పై లోపే. ముఖం అంతా కమిలిపోయి ఉంది. కన్ను దగ్గర బాగా ఉబ్బిపోయి ఉంది. మోచేయి నిండా రక్తపు చారికలు. అతనే కేథరిన్ చెప్పిన క్షతగాత్రుడు అనుకున్నాడు.
‘ఏమయ్యింది?’ అన్నాడు. అతడి వంక పరిశీలనగా చూసి. అతని నోట్లోంచి మాటలు రావడం లేదు. బహుశా మాట్లాడలేక పోతున్నాడేమో!
పక్కనే ఒక ఆడమనిషి. పాతికేళ్లుంటాయేమో. సన్నగా ఎండిపోయిన మొక్కలా కనిపించింది. పక్కనే మూడేళ్ల కూతురు.
‘నలుగురు కలిపి కొట్టేశారు సామీ. మా ఆయన్ని ఒక్కణ్ణి చేసి గొడ్డును బాదినట్టు బాదేసారు సామీ.. కొట్టేసింది సాలక కేసెట్టేసారయ్యా! ఎంత దారినం!’ అంది ఆ అమ్మాయి ఏడుస్తూ. ఆమెతోపాటూ ఆమె మూడేళ్ల కూతురూ ఏడుస్తోంది.
మనసంతా వికలం అయిపోయింది.
‘ఎందుకు కొట్టారు?’ అన్నాడు. ఆ మాటలకు అతను గబగబా చెప్పాడు. మాటలు తడబడినా, కొన్ని మాటలు మింగేసినా అతడికి విషయం మాత్రం అర్థమయింది.
ఆ క్షతగాత్రుడిది అనంతపురం. ఎవరో తెలిసిన వాళ్లుంటే ఈ ఊరొచ్చాడు. అపార్ట్‌మెంట్‌లో పని దొరికింది. తను ఇక్కడి లోకల్ వాల్ల కంటే తక్కువ కూలి తీసుకుంటున్నాడు. తనకు ఆ విషయం తెలీదట. తమకు ఇతను పోటీగా వచ్చాడని ఉక్రోషంతో నలుగురొచ్చి కొట్టారట! కొట్టడంతో ఊరుకోలేదు, అంతా కలిసి అతని మీద పోలీసు కేసు పెట్టారు. జైల్లో వేసే ముందు అవయవాలన్నీ బాగుండాలి కనుక ముందు ఆస్పత్రికి తీసుకొచ్చి పడేశారు.
అతడి జాలి కథతో మనసులో బాధ. నర్స్ సాయంతో డ్రెస్సింగ్ చేసి రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. గాయాల తీవ్రత తగ్గడం కోసం ఒక సెడిటివ్ ఇచ్చేసరికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికి అర్ధరాత్రి పనె్నండు దాటింది. మెల్లగా రూముకొచ్చాడు. రూములోని మంచం మీద పడుకుని నిద్రకు ఉపక్రమించినా అతడికి నిద్ర కరువయ్యింది. ఏవో ఆలోచనలు. పొట్టచేత పట్టుకుని పట్నం వచ్చిన ఆ కార్మికుడికి పొట్ట నిండలేదు సరికదా శరీరం రక్తసిక్తం అయింది. అతడి ఆలోచనతోపాటూ కేరళ అమ్మాయి కేథరిన్ గుర్తొచ్చింది. వెకిలిగా మాట్లాడినా తన కాలేజీ జూనియర్లు గుర్తుకొచ్చారు. ఎందుకో ఈ రెండు సంఘటనలు ఒకే నాణెం మీది బొమ్మా బొరుసుల్లా అనిపించాయి అతడికి. నిద్ర రాకపోవడంతో లాప్‌టాప్‌లోని రంగురంగుల పక్షుల వంక చూస్తూ అలాగే ఉండిపోయాడు.
* * *
‘కొత్తగా రెక్కలొచ్చెనా.. గూటిలోని గువ్విల్లకీ’ దిగ్గున నిద్రలోంచి బయటకు వచ్చాడు. అది తన సెల్‌ఫోన్ రింగ్‌టోన్. ‘వొరేయ్ ఇంకా నైట్ డ్యూటీయేనా. బీచ్ ఒడ్డుకు ఏవో కొత్తరకం పక్షులొచ్చాయట. రకరకాల వలస పక్షులు. సైబీరియా నుంచో, అంటార్కిటికా నుంచో వచ్చాయట. నీకు ఇష్టం కదా. చూద్దువుగాని..’ తన మిత్రుడి ఫోన్‌తో నిద్రమత్తు వదిలిపోయింది. వేగంగా పరుగులాంటి నడకతో డ్యూటీ డాక్టర్ రూములోంచి బయటపడ్డాడు. తన ద్విచక్ర వాహనాన్ని ఇంటివైపు పరుగు పెట్టించాడు. పావుగంటలో ఇల్లు చేరుకున్నాడు. వంట గదిలో అమ్మ. ‘నాన్నా వచ్చావా! స్నానం చెయ్యి. టిఫిన్ రెడీ. నీకిష్టమైన పెసరట్టు ఉప్మా టిఫిను తిని, పడుకుందువుగాని, రాత్రంతా నిద్ర లేనట్టుంది’ అంది ఎర్రగా ఉన్న అతడి కళ్లుచూసి. ‘పడుకోవడం లేదు, బీచ్ ఒడ్డున పక్షులు వచ్చాయట. కొత్తరకం పక్షులట - చూసొస్తాను. ఆ తర్వాత పాస్‌పోర్ట్ కోసం పరిగెత్తాలి. ఇవ్వాళ స్లాట్ బుక్కయింది’ అన్నాడు.
పాస్‌పోర్టు పేరు చెప్పగానే తన తల్లి కళ్లల్లో క్షణకాలం కనిపించిన దిగులు మేఘం! ఆమెకు తను అమెరికా వెళ్లడం ఇష్టం లేదు. అయినా తన అభీష్టాన్ని బలవంతంగా ఆమోదించింది. అమ్మని వదిలివెల్లాలంటే తనకూ బెంగే. అమ్మకిపుడు యాభై ఏడేళ్లు దాటాయి. ఈ వయసులో ఆమెకు తోడుండాలి. అన్నయ్యలు ఉన్నారు కదా, ఇద్దరూ ఈ ఊళ్లోనే ఉంటారు. వాళ్లు చూసుకుంటారు - సమాధానపడి ఇంటి వెనక పెరటి వైపు వెళ్లాడు. అక్కడ తన నేస్తాలు. చూడగానే భుజం మీద వాలాయి. అవి పావురాళ్లు. గుప్పెడు గింజలు తీసి చేతిలో పోసుకున్నాడు. అవి తినడం ముగించిన తర్వాత బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు.
పావుగంటలో అన్నీ ముగించి, తర్వాత ఇంకో పావుగంటలో టిఫిన్ బలవంతంగా నోట్లో కుక్కుకుని, అమ్మ ఇంకా పూజగదిలో ఉండగానే ‘వెళ్లొస్తానమ్మా’ అంటూ స్కూటర్ ఎక్కాడు.
బీచ్ ఒడ్డు. అప్పటికే చాలామంది చేరారు. రకరకాల పక్షులు. వందల్లో ఉన్నాయి. తేనె రంగు మక్కులు. రెక్కల మీద ఆకుపచ్చ రంగు మచ్చలు. చాలామంది వాటిని కెమెరాల్లోనూ, సెల్‌ఫోన్లలోనూ బంధిస్తున్నారు. అనంత్ తన సెల్‌ఫోన్ తీసి వాటిని తన సెల్‌ఫోన్ కెమెరాలో పదిలపరిచాడు.
ఇంతలో చాలామంది ఒక పెద్దాయన చుట్టూ చేరి ఏవో ప్రశ్నలడుగుతున్నారు. ఆయన పొడుగ్గా ఉన్నాడు. రేబాన్ కళ్లద్దాలు. అనంత్ ఆయనను గుర్తు పట్టాడు. ఆయన పేరు డాక్టర్ అలీ. పేరున్న ఆర్నితాలజిస్ట్. పక్షుల గురించి పరిశోధన చేశాడు. ఆయనను అంతకు ముందు చాలాసార్లు కలిశాడు. తన గురించీ ఆయనకు తెలుసు. అనంత్ మనసులో కొన్ని సందేహాలు- వెంటనే అడిగేశాడు.
‘సార్ ఈ పక్షులన్నీ మనకు కొత్త. ఇంతదూరం ఇన్ని సముద్రాలు దాటి, ఎందుకు వస్తున్నట్టు?’ అన్నాడు. ఆ ప్రశ్నకు ఆయన చిన్నగా నవ్వి ‘మీరూ.. కొన్ని సముద్రాలు దాటి, కొన్ని వేల మైళ్ల దూరం ప్రయాణం చేసి విదేశాలకు వెళదామనుకుంటున్నారు, ఎందుకు?’ అన్నాడు తిరిగి ప్రశ్నిస్తూ.
ఆ ప్రశ్నకు జవాబు కోసం అనంత్ అసలు ఆలోచించలేదు. వెంటనే చెప్పేశాడు.
‘సార్.. నాకు కొత్త ప్రదేశాలు చూడాలని.. మనం చూడని వింతలు తెలుసుకోవాలని.. ఇంకా అమెరికా అంటే భూతల స్వర్గం కదా.. అక్కడికి వెళ్లడానికి ఎవరైనా ఇష్టపడతారు’ అన్నాడు నవ్వుతూ.
వెంటనే ఆయన - ‘ఔను మీకు లాగానే ఈ పక్షులూ, వీటికీ కొత్త ప్రదేశాలు తిరగాలనీ, కొత్త లోకంలో విహరించాలనీ ఉంటుంది. అయితే చాలామటుకు పక్షులు వలస వచ్చేది, తామున్న వాతావరణంలో ఇమడలేక, తమకు నచ్చిన వాతావరణం, అంటే శరీరానికి సరిపడా తేమ, వేడి అనుకూలంగా ఉండే చోటికి వస్తాయి. అలాగే ఆహారం,

నీరు కోసం. కొన్ని ప్రాంతాల్లో చెరువులు, వాగులు ఎండిపోతాయి. ఆహారం కరువై పోతుంది. అలాంటి చోటు నుంచి అవి సమృద్ధిగా దొరికే చోటుకి వలస వస్తాయి’ అన్నాడాయన.
ఆయన అలా అంటుండగా చాలా సంఖ్యలో కాకులు కొత్తగా వచ్చిన ఈ వలస పక్షుల్ని చుట్టుముట్టాయి. అన్నీ గోలగా అరుస్తున్నాయి. కొన్ని కాకులయితే ఈ పక్షుల్ని ముక్కులతో పొడిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. క్షణంలో వాతావరణం మారిపోయింది.
ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూస్తున్న అనంత్ మనసులో బాధ సుళ్లుగా తిరిగింది. పాపం ముద్దు ముద్దుగా ఉన్న ఈ పక్షుల్ని ఈ కాకులు ఎలా వెంట తరుముతున్నాయో.. అసలు ఎందుకు ఈ కాకుల గోల? అనుకున్నాడు వెంటనే. ఆయన్ను అడిగేశాడు. ‘సార్.. ఇవి తోటి పక్షి జాతివే కదా. ఆ మాత్రం ప్రేమ, జాలి ఉండదా? ఎక్కడి నుంచో వచ్చిన అతిథులు కదా ఇవి. వీటిని ఆదరించకపోగా హింసిస్తున్నాయేం?’ అన్నాడు అనంత్.
ఆ మాటలకు ఆయన కళ్లు మూసుకున్నాడు. నిమిషం సేపు ఆలోచనలో పడ్డాడు.
ఆ తర్వాత నోరు విప్పాడు.
‘బాబూ! ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే నాకు కాస్త బాధగానే ఉంది. అయినా చెబుతాను’ అంటూ ఒక్క క్షణం ఆగాడు. ఆ తర్వాత చెప్పాడు.
‘మన పిల్లలు చాలామంది అమెరికా వెళుతున్నారు. ఆస్ట్రేలియా వెళుతున్నారు. ఇంకా కెనడా, రష్యా.. ఇలా అనేక విదేశాలు వెళుతున్నారు. అక్కడ అప్పుడప్పుడు ఏం జరుగుతోంది? మన పిల్లలు జాత్యహంకారుల చేతుల్లో చనిపోతున్నారు. మరి కొంతమందిని ఎందుకు చంపుతున్నారో తెలీదు. పూర్తిగా వీటికి ఆర్థిక అవసరాల కోసం బలి చేస్తున్నారని నిర్ధారించలేం. వీటిని చేసేది మనుషులే. బలయ్యేదీ మనుషులే’ ఆయన చెప్పడం ఆపాడు. తన సీసాలోని నీళ్లను ఒక గుక్కెడు తాగి మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు.
‘ఈ సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాసుల్లో బుద్ధిజీవి అయిన వాడు మనిషి ఒక్కడే. అసలు మనసే వికసించని ఈ అమాయక ప్రాణులు ఏం చేస్తాయి? ఈ వలస పక్షులు దోచుకుంటాయేమోనన్న భయం వీటికి ఉంది. మనిషికిలాగే...’ ఆయన చెప్పడం ముగించి అక్కడ నుంచి కదిలాడు.
ఆ మాటలకు అనంత్ ఆలోచనలో పడ్డాడు. మనసులో ఏదో తెలీని దిగులు. అన్యమనస్కంగానే అక్కడి నించి కదిలి, పాస్‌పోర్ట్ ఆఫీసుకు చేరుకున్నాడు. అక్కడ గంటకు పైగా క్యూలో నిలబడ్డాడు. అప్పటికి పని పూర్తయింది. ఇంటికి వచ్చేసరికి మూడయ్యింది. అప్పటికే కళ్లు బాగా మండుతున్నాయి. భోజనం చెయ్యకుండా కళ్లల్లో వొత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది అమ్మ. అంతవరకూ ఉన్నందుకు అమ్మమీద కోప్పడి గబగబా ఆమెతో భోజనం కానిచ్చి, మంచం మీద ఒరిగాడు.
* * *
రెండు నెలల తర్వాత-
అనంత్ అమెరికా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారి మెడికల్ స్కూల్ నించి వారి ఆమోదం తెలుపుతూ ఉత్తరం రావలసి ఉంది. దాని కోసమే ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు అనంత్ నాన్నగారి సంవత్సరీకం. అనంత్ అన్నయ్యలు అచ్యుత్, సంపత్, వదినలు, వారి పిల్లలు, ఇంకా బంధువులు అంతా వచ్చారు. కార్యక్రమం పూర్తయి అంతా భోజనాలు ముగించేసరికి మధ్యాహ్నం మూడు దాటింది. అన్నలిద్దరినీ పక్కకు పిలిచి అనంత్ తన మనసులో మాట చెప్పాడు.
‘నేను అమెరికా వెళుతున్నాను. మీకు తెలిసిన విషయమే. రెండేళ్లే. ఆ తర్వాత నేను వచ్చేస్తాను. అమ్మను వొంటరిగా ఉంచడం నాకిష్టంలేదు. ఈ రెండేళ్లూ మీరు చూసుకోండి’ అన్నాడు. అన్నయ్యలిద్దరూ వేరే గదిలోకి వెళ్లారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి భార్యలతోనూ చర్చించారు. ఆ తర్వాత ఇద్దరూ వచ్చారు అనంత్ దగ్గరకు-
‘వొరేయ్ ఇద్దరం తొమ్మిది నెలలు ఉంచుకుంటాము మా దగ్గర. అంటే చెరి నాలుగున్నర నెలలు’ అన్నారిద్దరూ.
‘మరి మిగతా మూడు నెలలూ’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘ఆ మూడు నెలలూ మా పిల్లలకు పరీక్షలు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్. మెడికల్ ఎంట్రన్స్. పిల్లల మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆ మూడు నెలలూ అమ్మ ఉంటుందిలే భయం ఏమిటి? మేం ఈ ఊళ్లోనే కదా ఉండేది’ అన్నారిద్దరూ కూడబలుక్కున్నట్టుగా.
‘అమ్మ ఒక్కర్తె ఉండాలా?’ అనంత్ గుండెల్లో రాయి పడింది. ఏదో ఉద్వేగం. కళ్లల్లోంచి నీళ్లు రావడంలేదు గాని మనసులో మూగ రోదన. అంతలోనే ఎవరో చెంప మీద కొట్టినట్టయింది.
‘తనూ అమెరికాకు ఎగిరిపోయే ప్రయత్నంలో లేడా? అమ్మను వదిలేసి. వాళ్లను విమర్శించే హక్కు ఎక్కడిది? అవును. వాళ్లు సరిగ్గానే చెప్పారు. తమను తొమ్మిది నెలలు కడుపులో మోసినందుకు తొమ్మిది నెలలు ఆమెను మోస్తామంటున్నారు అంతేఒ కదా! మనసులో దుఃఖం పైకి తన్నుకొచ్చింది అనంత్‌కు. అప్పటికే అన్నలిద్దరూ అక్కడ నించి కదిలారు.
* * *
వారం రోజుల తర్వాత డ్యూటీలో ఉండగా కొరియర్ ద్వారా ఉత్తరం వచ్చింది అనంత్‌కు - ముందు రాత్రి మెయిల్ వచ్చింది. తను చూసుకోలేదు. తనకు కాలిఫోర్నియా మెడికల్ స్కూల్‌లో పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్‌తోపాటూ, సీటూ వచ్చింది. అనంత్ ఆనందం వర్ణనాతీతం. అమ్మకు ఈ విషయం చెబుదామని వేగంగా ఇంటికొచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటావిడ, తాళం ఇచ్చింది. ‘మీ అమ్మగారు సూపర్ మార్కెట్‌కు వెళ్లారు’ అంది.
తాళం తీసి లోపలకు వెళ్లాడు. బీరువా తీసి తనకు కావలసిన కాగితాలు వెతుకుతుంటే అమ్మ చీరల పక్కన ఒక కవరు కనిపించింది. దాని మీద ‘శబరి వయోజన కేంద్రం’ అనే పేరు చూసి ఆశ్చర్యంగా కవరు తెరిచాడు. దాంట్లో ఒక ఉత్తరం.
‘శకుంతలమ్మగార్కి
మీరు పంపిన అడ్వాన్సు అందింది. మీరు మా వృద్ధుల ఆశ్రమానికి వస్తున్నందుకు స్వాగతం. వచ్చేముందు ఫోన్ చెయ్యగలరు.
భవదీయ
శంకరయ్య
కార్యదర్శి
ఆ ఉత్తరం చదివిన అనంత్‌కు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. మెదడు స్తంభించినట్లయింది. రెక్కలు తెగిన పక్షిలా ఆ గదిలో నేల మీద కూలబడ్డాడు.
తల్లిని తొమ్మిది నెలలు మాత్రం ఉంచుకుంటామన్న అన్నయ్యల మాటలు గుర్తొచ్చాయి.
- భర్త పోయినా కొడుకులను ప్రయోజకుల్ని చేసిన తల్లిని తొమ్మిది నెలలు మాత్రమే మోస్తామంటే ఆ తల్లి మనసు ఎంత క్షోభించిందో. అందుకే వృద్ధుల ఆశ్రమానికి వెళుతోందా? రెండురోజుల క్రితం ఎవరో కవి వాట్సప్‌లో పెట్టిన కవిత గుర్తుకొచ్చింది.
‘బడి ముందు నిన్ను వదిలివెళ్లిపోయేటపుడు తల్లిదండ్రుల్ని నువ్ చూసే చూపు.. వృద్ధాశ్రమంలో వదిలి వెళ్లేటపుడు వాళ్లు నిన్ను చూసే చూపు.. ఒకటే
బడిగంట కొట్టగానే నీ బాధ ఆగిపోతుంది. గుండె గంట కొట్టేవరకూ వారి బాధ ఆగిపోదు...’
అనంత్ మనసులో పరిపరి విధాల ఆలోచనలు. మనసు ఎక్కడికో వెళ్లిపోయింది.
రెండు నెలల క్రితం ఆస్పత్రిలో గాయాలతో వచ్చిన క్షతగాత్రుడు గుర్తుకొచ్చాడు. రోజూ మెడికల్ కాలేజీ విద్యార్థుల వెకిలి మాటలను భరించే కేరళ అమ్మాయి కేథరిన్ గుర్తుకొచ్చింది. ఇంకా నెల రోజుల క్రితం బీచ్ ఒడ్డున వలస వచ్చిన ఆ తేనెరంగు పక్షులు, వాటిని చుట్టుముట్టిన లోకల్ ‘కాకులు’ గుర్తుకొచ్చాయి.
-ఇప్పుడు తన తల్లి కొడుకులకు భారమై ఒక వలస పక్షిలా వెళతానంటోంది. మనసు గజిబిజిగా అయిపోయింది అనంత్‌కు. ఒకదానికొకటి పొంతన లేని ఆలోచనలు.
‘రేపు అమెరికా వెళితే తనూ ఈ వలస పక్షుల జాబితాలో చేరతాడు.. ఆ తర్వాత...?!
ఇంతలో డోర్‌బెల్ కొట్టిన చప్పుడు. అమ్మ వచ్చిందేమో! అనుకున్నాడు. క్షణంసేపు ఆలోచనలో పడ్డాడు. తనకొచ్చిన అమెరికా వారి ఆమోద పత్రం, వెంటనే తన జేబులోకి తోశాడు. అమ్మకు కనపడకుండా. తలుపు తీశాడు. ఎదురుగా అమ్మ. చేతిలో బరువైన సంచి. దాని నిండా పచారీ సరుకులు.
‘ఏంటమ్మా ఇన్ని కొనేశావ్?’ అన్నాడు చేతిలోని సంచి తీసుకుంటూ.
‘నువ్ అమెరికా వెళ్లిపోతావ్ కదా. అక్కడేం దొరకవట. అందుకే పిండివంటలు, పచ్చళ్లు చేద్దామని’ అంది.
అనంత్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. క్షణంసేపు తల్లిని చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత వెంటనే చెప్పాడు. ‘అమ్మా నా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది. అమెరికా వెళ్లటంలేదు’ అన్నాడు తలొంచుకుని.
‘అయ్యో! బాధపడకు. మళ్లీ ప్రయత్నించు’ అంది అతడి తల నిమురుతూ.
‘ఇంక మరే ప్రయత్నమూ లేదు, మనం ఇద్దరం వలస పక్షులం కావడం నాకు ఇష్టంలేదు. స్వంత ఊళ్లో ఉవ్వు, పరాయి దేశంలో నేను...’ అన్నాడు మెల్లగా.
‘అంటే?’ అతడి తల్లి అతని వంక ప్రశ్నార్థకంగా చూస్తూ అంది.
ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా ‘నేను అలా బైటకెళతా. కాసేపు నడుద్దామని’ అన్నాడు.
‘సరే.. వెళ్లిరా’ అంది తల్లి.
అనంత్ బయటకు నడిచాడు. సాయంత్రం ఐదు దాటింది. వాతావరణం చల్లగా ఉంది. తలెత్తి పైకి చూశాడు. ఆకాశం మబ్బులు లేకుండా స్వచ్ఛంగా కనిపించింది. ఏదో ఒక ఒంటరి పక్షి స్వేచ్ఛగా ఎగురుతోంది, అతని మనసులా.

డా. ఎమ్.సుగుణరావు.. 93931 29945