కథ

కల్యాణ ఘడియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడూ కాంపస్ సెలక్షన్ ద్వారా బెంగుళూరులో.. ఓ ప్రముఖ కంపెనీలో అప్పుడే అయిదేళ్లుగా పని చేస్తున్నాడు. మెస్ భోజనం రుచించక అవస్థ పడుతున్నాడు. అందుకోసం అయినా అర్జంటుగా పెళ్లి చేసెయ్యాలి.
ఆ అమ్మాయి పనిచేసే కంపెనీ బెంగుళూరులో ఉంటే, ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటుంది. లేకపోతే అక్కడికే వెళ్లి.. మరొకటి వెతుక్కుంటుంది. ఉద్యోగం ఓ పెద్ద విషయం కాదు ఇక్కడ. చిన్న కంపెనీలు ఆడపిల్లకి మెటర్నిటీ లీవు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాల మీద నమ్మకం పెట్టుకోవాల్సిన పనిలేద.
ఎప్పుడు ఎలా కలిసి రావాలో.. అప్పుడు అలాగే కలిసి వస్తుంది అనుకున్నా.. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా!
ఆరు నెలలు క్రిందట వాడు.. అడగనే అడిగాడు. ‘అమ్మా! నాకు పెళ్లెప్పుడు చేస్తారు?’ అని.
‘అదేంరా! అలా అడుగుతున్నావ్?’ నవ్వాను.
‘అంటే.. ఫారిన్ ఛాన్స్ తగిలే అవకాశం ఉంది. నేను బయటకి వెళితే.. మళ్లీ మూడేళ్ల వరకూ రాను కదా! అప్పటికి ఏజ్ బార్ అయిపోతుంది అని.. అడుగుతున్నాను.’
వాడి మాటలకు నవ్వు వచ్చింది. మగపిల్లాడు కాబట్టి, అడగగలిగాడు. అదే ఆడపిల్ల అయితే, అడుగుతుందా? అనుకుంటూ ‘అదే ప్రయత్నంలో ఉన్నాంరా! పిల్ల నచ్చాలి కదా!’
‘అవుననుకో. మా ఫ్రెండ్ హుస్సేన్ ఉన్నాడు కదా! వాళ్ల అన్నయ్య సివిల్స్‌లో సెలక్షన్ తెచ్చుకునేంత వరకూ పెళ్లి చేసుకోనని, కూర్చున్నాడు. అతనికి సివిల్స్ రాలేదు గానీ, ముప్పై నాలుగేళ్లు వచ్చేసినాయ్. ఇప్పుడు ఏజ్ బార్ అయ్యింది. పెళ్లవడం లేదు. వాళ్ల అన్నయ్యకు పెళ్లి అవ్వకపోతే.. వీడికి అవ్వదని, వీడు బెంగ పెట్టుకున్నాడు. నాకూ అలా అవ్వకూడదని.. అంటున్నాను’
‘నీకు అంత పరిస్థితి రాదులే. మాకున్న ఒక్కగానొక్క కొడుకువి. ఆ మాత్రం చూడలేమా! అన్నీ సక్రమంగానే జరుగుతాయి. అయినా నీకు ఇంకా ఇరవై ఆరేళ్లు రాలేదు. అంత కంగారు పడాల్సిన పనేం లేదు’ అంటూ నచ్చజెప్పి.. మళ్లీ మేరేజ్ బ్యూరో అతన్ని పట్టుకున్నాను.
అతను.. చాలా సమయమే తీసుకుని.. ఈ సంబంధం చూపించాడు.
అమ్మాయి తండ్రి పిల్లాడి ఫొటో చూసి ‘వాళ్ల పెద్దవాళ్లు.. వొప్పుకుంటే ఇప్పటికిప్పుడు ‘పది లక్షల చెక్కు’ రాసిచ్చేస్తాను’ అన్నాడట.
నా కొడుకు వాళ్లకి అంత నచ్చినందుకు సంతోషించినా, అమ్మాయిని చూడకుండా ముందుకు వెళ్లదలచుకోలేదు.
ముందుగా మేము చూసి వచ్చి అమ్మాయి బాగుందనుకుంటే.. అప్పుడు అబ్బాయిని తీసుకు వెళ్లాలన్నది నా ఆలోచన.
ఆ మాటే బ్యూరో అతనితో అంటే ‘మీరొకసారి చూడడం, అబ్బాయి మరొకసారి చూడడం అంత బాగుండదేమోనమ్మా! అన్నిసార్లు అమ్మాయిని తయారుచేసి కూర్చోబెట్టడానికి.. ఇప్పుడెవరూ ఇష్టపడటంలేదు. ఇన్నిసార్లు వచ్చి వెళ్లి.. చివరికి నచ్చలేదంటే, ఆడపిల్ల వాళ్లకి పరువు తక్కువ కదా’
‘అయినా.. అమ్మాయిని నేను స్వయంగా చూశాను. చాలా బాగుంటుంది. అబ్బాయికి ఇప్పుడు వీలు కాకపోతే, సంక్రాంతికి వస్తాడేమో కనుక్కోండి. అమ్మాయి అప్పుడూ వస్తుంది. హైదరాబాద్ దగ్గరే కదా! ఇద్దరికి అది అనువైన సమయం. ఇంకా చెప్పాలంటే.. ఇద్దరికీ తగిన జోడీ కూడా’ పక్కాగా చెప్పాడు.
‘మా అబ్బాయి ఎవరికైనా నచ్చుతాడండి. మాకే అమ్మాయి నచ్చాలి. నాకు నచ్చితే అబ్బాయికి నచ్చినట్లే’ చెప్పాను అంతే ధీటుగా.
ముందే పిల్లాడిని తీసుకువెళ్లడం ఇష్టంలేక. ఎందుకు? ఇష్టం లేదూ అంటే, ఇతమిత్థంగా.. ఇదీ కారణం అంటే చెప్పలేను గానీ.. నాకు నచ్చితే, అందరికీ నచ్చి తీరుతుంది. అది మాత్రం నిజం.
ముందే ఓసారి.. ఇరుపక్షాల పెద్దలూ కలిసి మాట్లాడుకుంటే సుహృద్భావ వాతావరణం ఏర్పడి, అన్నీ అనుకూలంగా వుంటే, అబ్బాయినీ, అమ్మాయిని చూపించవచ్చు. లేదంటే, అంతటితో ముగిసిపోతుంది.. పిల్లల మనసులు నొచ్చుకోకుండా అని నా అభిప్రాయం.
అలా కాకుండా, అటు ఆడపిల్ల వాళ్లూ.. ఇటు మగపిల్లాడి వాళ్లూ ఒకేసారి కలుసుకోవడం.. అవతలి వాళ్ల గురించి సరిగ్గా తెలిసీ తెలియకుండానే, హడావిడిగా మాట్లాడేసుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం.. నాకు బాగా అనిపించలేదు. అందునా బ్యూరో వాళ్లు తీసుకొచ్చే సంబంధాలు ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి.
‘అవును.. ఎన్నిసార్లు.. వాళ్లయినా పిల్లని చూపిస్తారు. అందరం కలిసి వెళ్లడమే బాగుంటుంది’ మేరేజ్ బ్యూరో అతన్ని సమర్థించారు మా ఆయన. నేను అవునంటే, ఆయన కాదనే రకం.
అయినా నేను చెప్పాల్సింది చెప్పినా.. వాళ్లిద్దరూ నా మాట పడనివ్వలేదు.
‘సరే! అబ్బాయి సంక్రాంతికి ఎలాగూ వస్తాడు. సంక్రాంతి పండుగ ఈ రోజుకి.. నెల రోజులు ఉంది. టైము పాడవడం అంటే ఇదే. వాళ్లు అన్నట్లే అబ్బాయితోనే వస్తాం. అమ్మాయిని కూడా ఆ టైముకి వచ్చేలా చెయ్యండి’ చెప్పాను అయిష్టంగానే.
* * *
రోజులు లెక్కపెట్టుకుంటూ ఎదురుచూసీ ఎదురుచూసీ...
ఊరిలో ఉన్న సంబంధాన్ని.. వాళ్లు పెట్టిన ముహూర్తానికే, కనుమ పండుగ.. మరుసటి రోజు వెళ్లి.. చూడడానికి నిర్ణయించుకున్నాం.
వాళ్లు చెప్పినట్లే, బస్టాండు దగ్గర, రెండవ మలుపులో కారు ఆపుచేసుకుని.. ఆ లాయరు గారికి ఫోన్ చేశాం. ‘వచ్చేశాం సుమా’ అన్నట్లు.
రెండు నిమిషాల తరువాత ఓ టీనేజ్ అబ్బాయి వచ్చి ‘్ఫలానా వాళ్ల అబ్బాయిగా’ తన్ను తాను పరిచయం చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ అబ్బాయి చాలా మామూలుగా, వెడల్పు ముక్కుతో.. ఆ ముఖంలో అందం ఏమైనా ఉంటే, అది ముక్కే చెడగొట్టింది అనిపించేలా ఉన్నాడు.
లాయరుగారు ఎదురొచ్చారు. ఆ తరువాత ఇంట్లో ఆడవాళ్లు ఎదురొచ్చి ఆహ్వానించారు.
వాళ్లది చాలా చిన్న ‘అద్దె ఇల్లు’. మూడు గదుల వరుస పోర్షను. పదేళ్ల కిందట వాళ్ల పల్లెటూరి నుంచి వచ్చి, ఆ ఇంటిలో దిగారట. అప్పటి నుంచీ అందులోనే ఉండిపోయారు. టౌనులో అద్దెలు ఎక్కువగానే ఉంటాయి. అందుకని ఇరుగు సామ్రాజ్యానికే అలవాటు పడ్డారు.
కటకటీలతో ఉన్న వీధి గదిలో కూర్చోబెట్టారు మమ్మల్ని.
పెళ్లిచూపులు కొత్త, మాతోపాటు బలగం ఉండాలి కదా! అని, మా ఆడపడుచు నీలవేణిని కూడా రమ్మన్నాం. పిలిచినందుకు కష్టపడి ‘రాజమండ్రి’ నుంచి వచ్చింది. అప్పుడే బస్టాండులో దిగిన ఆమెను పికప్ చేసుకుని మరీ వచ్చాం.
మధ్యగదిలో అమ్మాయి ముస్తాబు అవుతోంది. అదే ఆ ఇంటి బెడ్‌రూమ్. చివరిది వంటగది. వచ్చిన మా నలుగురికే కూర్చోవడానికి ఆ గది చాలలేదు. పెళ్లయితే పిల్లాడు వచ్చి ఎక్కడ ఉంటాడు? అనిపించేలా!
మా ఆయనా, లాయరుగారు ఇంకా వచ్చిన ఒకళ్లిద్దరు పెద్దలూ.. ఆరు బయటే కాంపౌండులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ప్రక్క పోర్షన్ తాళంలో ఉంది. ఆ ఇంటి ముందు స్థలాన్ని కూడా.. వీళ్లు ఉపయోగించుకున్నారు.
లాయరుగారు అప్పుడే పెట్టుపోతలు గురించి మాట్లాడుతున్నారు. ‘లాంఛనాలతోపాటు, అమ్మాయికి పది తులాల బంగారం పెడతాం’ అని.
కతికితే, అతకదన్న సామెత ఉన్నా.. వాళ్లు మా కోసమే చేసిన ‘నేతి’ మినప సున్నిఉండల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ.. ఎదురుగా కూర్చున్న లాయరుగారినే పరిశీలించాను. అతని ముక్కు సన్నగా కోసుగా ఉండి, అతని ముఖానికి అందం తెచ్చింది.
వాళ్లకున్న ఇద్దరి అబ్బాయిల్లోనూ ఆ అందం కనిపించలేదు.
కాస్సేపటికి...
అమ్మాయిని మా గదిలోకే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఫర్వాలేదు బాగానే ఉంది.
తలంటు పోసుకున్న పొడవాటి జడతో... రెండు రకాల స్టెప్ గొలుసులతో నడిచొచ్చిన లక్ష్మీదేవిలా కళకళలాడింది.
మా మదన్‌తో ఇట్టే కలిసిపోయి మాట్లాడేసింది. ఉద్యోగం చేస్తుంది కదా! జంకూ గొంకూ లేదు. వాళ్లిద్దరూ, వాళ్లవాళ్ల కంపెనీ విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఏవైతే ఏమిటి?.. పెళ్లిచూపుల్లో ఫ్రీగా మాట్లాడుకోవడమే ముఖ్యం.
వాళ్లిద్దరికీ కాస్త ప్రైవసీ కల్పించాలని, నేనూ, మా నీలవేణి మధ్య గదిలోకి వెళ్లి.. ఇంట్లో ఆడవాళ్లతో కబుర్లలో పడ్డాం. కాస్సేపటిలోనే దగ్గరితనం వచ్చేసి, మరిన్ని విషయాలు ముందుకెళ్లిపోయాం.
అప్పుడు అన్నది పెళ్లికూతురు తల్లి.. గది చాలకుండా నిలబడి ఉన్న జనాల్ని చూపిస్తూ ‘మాకు అందరూ అయిన వాళ్లేనండి.. మేనమామ కొడుకునే ఇచ్చి చేశారు నాకు’ అంటూ.
ఆమె చెప్పింది అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది నాకు.
అంతే...
లోలోన ఆశ్చర్యపోతూ, బయట గదిలో ఉన్న అమ్మాయిని తలుపు వారగా.. మళ్లీ ఓసారి చూశాను. ఎదురుగా చూసినప్పుడు బాగానే ఉన్నా, సైడు నుంచి చూస్తే ఈ అమ్మాయికీ.. ముక్కు పొట్టిగా ముఖానికి అంటుకుపోయినట్లు కనిపించింది.
ఫొటో చూసినప్పుడు.. కనిపించిన ‘ఏదో తేడా’ ఇదన్నమాట. నాలో అప్పటివరకూ ఉన్న ‘సందేహానికి’ సమాధానం దొరికినట్లయ్యింది.
వచ్చేస్తుంటే పెళ్లికూతురు మా ఇద్దరి కాళ్లకు దండం పెట్టింది. అప్పుడే వరుస అయిపోయినట్టు.
ఆ పిల్ల ‘వినయానికి’ మనసు కరిగి.. గుండె గొంతుకలోకి వచ్చినట్లయ్యింది. లేమ్మా’ అంటూ లేపి, ‘వెళ్లిన తరువాత ఫోన్ చేస్తాం. మా ఇంటికీ వద్దురుగాని’ చెప్పాను లాయరుగారికి.
ఆ మాట మనస్ఫూర్తిగానే చెప్పాను ఆ నిమిషంలో. ఎందుకంటే వాళ్ల మర్యాద అంతగా సంతోషపెట్టింది మమ్మల్ని.
* * *
ఆ ఇంటి నుంచి బయటపడగానే...
కళ్ల ముందు ఆ సీన్ తొలగిపోయింది.
నా అసలు ప్రపంచం నాకు కనబడింది. నాలో ఏదో అలజడి. అందరం కట్టకట్టుకుని వెళ్లడం ఎలా నచ్చలేదో! అలాగే అయ్యింది. నెల రోజులుగా ఎదురుచూసిన సంబంధం.. ఎదురొచ్చింది.
కారు దిగబోతూ ఉండగా వైజాగ్‌లో ఉన్న నాన్నగారి దగ్గర నుంచి ఫోన్. ‘పెళ్లిచూపులకు వెళతానన్నారు. వెళ్లారా? ఏమైంది’ అని.
‘వెళ్లాం. అమ్మాయి బాగానే ఉన్నా.. ఆ ఇంట్లో పెద్దవాళ్లది.. మేనరికం. పిల్లలందరివీ పొట్టిముక్కులు. ఈ పిల్లకీ అంతే. అంత సంతోషంగా లేదు నాకు’ చెప్పాను.
‘అయ్యో! సరే. మంచి సంబంధం అనుకుంటేనే ముందుకెళ్లండి. లేకపోతే ఇంకోటి చూసుకోవచ్చు’ సలహా ఇచ్చారు నాన్నగారు.
ఫోన్లోనే నా మాటలు విన్న ఆయన ‘ఏం? నీకు పిల్ల ఎందుకు నచ్చలేదు. బాగానే ఉంది కదా! దేనికో దానికి వంక పెడతావ్’ అన్నారు కోపంగా.
మనసంతా చికాకుగా ఉండి.. అప్పుడేం మాట్లాడలేక వౌనం వహించాను.
ఫోన్ క్లోజ్ చెయ్యడంతో నీలవేణి ‘వదినా! ఈ ఊరిలో ‘రాజ్ జువెలర్స్’ అనే షాపు ఉందట కదా! మా అపార్ట్‌మెంట్‌లో ఒకావిడ వాళ్ళాయనకి బ్రాస్లెట్ ఒకటి, అందులోనే కొనుక్కొచ్చింది. నేనూ అలాంటిదే కొనాలనుకుంటున్నాను. తోడు రావా! వెళదాం’ అడిగింది బ్రతిమాలుతున్నట్లు.
అప్పటికి సాయంత్రం నాలుగే అయ్యింది.
రాత్రి వంటకి ఇంకా చాలా సమయం ఉంది. తెల్లవారి వెళ్లిపోయే ఆడపడుచు కోరికని కాదనడం ఎందుకని.. మళ్లీ నాకూ రేపటి నుంచి ఆఫీసు. మరో పావుగంటలోనే నేనూ, నీలవేణీ దేవాలయం వీధిలో ఉన్న జువెలరీ షాప్‌కి బయలుదేరాం.
* * *
అరగంట టైములో ‘రాజ్ జువెలర్స్’లో ఉన్న అన్ని బ్రాస్లెట్లూ చూసేసింది.
ఏ మోడల్ చూపించినా ‘ఈ చేత ఇలా కాకుండా వెడల్పుగా ఉంటే, బాగుండును. ఈ డిజైన్ ఇంకాస్త, సన్నగా ఉంటే బాగుండును. బ్రాస్లెట్ చివరన ఒక చిన్న బిళ్లలా ఉండి, దాని మీద ఇరవై అయిదు అన్న అంకె, రాసి ఉంటే.. మా పెళ్లై ఇరవై అయిదేళ్లు అయినందుకు గుర్తుగా.. ఆయనకు ప్రెజెంట్ చేసి ఉండేదాన్ని’ అంటూ షాపు అంతా పరికించి చూసింది.
‘అలాంటి మోడల్స్ మగవారికి రావు మేడం’ చెప్పాడు షాపతను.
అక్కడికి దగ్గరలో ఉన్న మరో షాప్‌కి వెళ్లాం.
అక్కడా ఇదే పరిస్థితి. ఇంకా కొసమెరుపు ఏమిటంటే.. అసలు వస్తువు కొనేంత డబ్బు వేసుకు రాలేదని. నచ్చితే.. మళ్లీ వచ్చి కొనుక్కోవచ్చని.. ఆలోచన అట. తెలివితేటలు అంటే, ఆమెవే మరి. డబ్బు తేనప్పుడు నా టైము తగలెట్టడం ఎందుకు?
వెయ్యో, రెండు వేలో తక్కువ పడితే వేయగలనే గానీ, ఉద్యోగంలో ఉన్నందుకు.. యాభై వేల పెట్టుబడి పెట్టేయ్యలేను కదా! అసలే.. మనసు బాగుండక నేను అవస్థ పడుతుంటే.. ఈ ట్విస్టు.
మెల్లగా ఇంటికి బయలుదేరదీశాను.
* * *
ఇంటికి రాగానే పెళ్లి విషయమే చర్చ.
నా నిర్ణయం, మా ఆయనకు గానీ, ఆడపడుచు నీలవేణికి గానీ నచ్చలేదు. ‘అమ్మాయి బాగుంది. నాకు నచ్చింది. ఈ సంబంధమే ఖాయం చేద్దాం’ అన్నారాయన పట్టుదలగా.
పిల్లవాడు ఏమి తేల్చుకోకుండా ఉన్నాడు. ‘ఏరా’ అంటే...
‘ఏమో నాకు తెలీడంలేదు’ అన్నాడు.
‘అమ్మాయి బాగానే ఉంది. బ్యూటీ పార్లర్‌కి వెళ్లలేదు. మేకప్ లేదు. నేచురల్‌గా ఉంది. అదే మా ఊరిలో అయితేనా నిండా మేకప్‌తో వస్తారు’ చెప్పింది నీలవేణి.
అలా వాళ్ళిద్దరూ మద్దతు ప్రకటించినా, నేను చెప్పాల్సింది చెప్పాను.
‘అమ్మాయి ఫర్వాలేదు. ఆ తల్లిదండ్రులది మేనరికం అని తెలిసిన తరువాతే, నా నిర్ణయం మారిపోయింది. మేనరికాలు సైన్స్ రీత్యా అంత మంచివి కాదన్న విషయం తెలిసిందే. వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు తల్లిదండ్రులు నుంచి పిల్లలకి వస్తూ ఉంటాయి.’
‘అలా ఆవిడ.. మామూలు ముక్కు, అతని కోసు ముక్కూ కలిసి.. పిల్లలందరికీ తప్పడ ముక్కులు వచ్చాయి. అలాంటి పిల్లని మనింటికి తెచ్చుకుంటే.. పుట్టే మనవలు తప్పడ ముక్కులతోనే పుడతారు. కోడలు నలుపైతే.. కులమంతా నలుపే అవుతుందట. అందుకని, ఈ సంబంధం ఎంత మాత్రమూ వద్దు’ కచ్చితంగా చెప్పాను.
నా మాటలకి ఆయన తగ్గినా..
నీలవేణి మాత్రం తన ప్రయత్నంలోనే ఉంది. ‘ఇలా చిన్నచిన్న విషయాలకి పట్టించుకుంటే సంబంధాలు కుదరడం కష్టం’ తనకీ పెద్దరికం ఇచ్చాం మరి.
‘ఇది కాకపోతే, ఇంకోటి.. ప్రయత్నిస్తే దొరక్కపోతుందా? మనకి ఈ విషయం ముందుగా తెలిసింది కాబట్టి, జాగ్రత్త పడాలనుకుంటున్నాం. తెలియకపోతే, చేసేది ఏమీ లేదు’
ఆమెకు అర్థం అవడం కోసం ‘అయినా నువ్విప్పుడు బ్రాస్లెట్ కొనాలని వెళ్లావ్. రెండు షాపులు తిరిగినా ఒక్కటీ నచ్చలేదు. ఏదైతే, ఏమిటి? అంతా బంగారమే కదా! పూర్తిగా ఎల్లో మెటల్.. వట్టి బంగారం ఏ డిజైను అయితే ఏమిటి? కొనగలిగావా? ఏదీ నీకు నచ్చలేదు కదా! ఇదీ అంతే’ చెప్పాను వివరణగా.
దాంతో అన్నాచెల్లెళ్లు ఇద్దరికీ మరో మాట రాలేదు.
రెండు రోజుల తరువాత.. మధ్యవర్తి ద్వారా విషయం తెలుసుకున్న...
లాయరుగారి నుంచి ఫోను -‘అమ్మా! మమ్మల్ని.. మీ ఇంటికి కూడా రమ్మన్నారు కదమ్మా.. ఇంతలోనే అలా అనేసారేమిటి? అయినా ఓ సిట్టింగు వేసుకుందాం. ఆఫరింగు ఇంకా కావాలన్నా మాట్లాడుకుందాం’ అతని గొంతు చాలా బాధగా పలికింది.
అందుకు నా గుండె విలవిలలాడింది.
వెనుక మాటలేవీ రానివ్వకుండా ‘మీ అమ్మాయి బాగుండలేదని కాదు. మా అబ్బాయికి ఇంకాస్త బాగుండే.. అమ్మాయిని చూడాలనుకుంటున్నాం’ అంటూ మగపిల్లాడి తల్లినైనా, మనసు చిక్కబట్టుకుని చెప్పాల్సి వచ్చింది.
* * *
ఇది జరిగిన పదిహేను రోజులకు...
స్వంత ఊరిలో ఉన్న శివరాజు మామయ్య మాటలు.. నా ఆలోచనలకు ఊపిరి పోశాయి. ‘అమ్మా! మా అక్క అత్తవారిది.. అమలాపురం ప్రక్కన చిన్న పల్లెటూరు. అక్కడ ఓ సంబంధం ఉంది. నాకు చిన్నప్పటి నుంచీ తెలిసిన అమ్మాయే. ఇంజనీరింగ్ చదువుతూ ఉంది. చివిర సంవత్సరం. మన అబ్బాయికైతే బాగుంటుంది. మీరు వచ్చి చూసుకుంటే ముందుకు వెళ్లొచ్చు’ అని.
అంతా విన్న ఆయన ‘వద్దు. ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు’ అన్నారు.
‘ఉద్యోగం చేసే అమ్మాయి అయినా, మన పిల్లాడి దగ్గరకు వెళ్లాలంటే, దాన్ని వదులుకుని వెళ్లాల్సిందే. కాబట్టి, మా మామయ్య కోసం అయినా.. మనం వెళ్లి చూస్తున్నాం. ఈ ఆదివారం’ చెప్పాను.
* * *
రెండవసారి కావడంతో.. ఏ టెన్షనూ లేకుండానే ఇద్దరమే బయలుదేరి వెళ్లాం. షరా మామూలే ఆడ పెళ్లివారి ఇల్లు సందడి సందడిగా ఉంది. ఎవరెవరో హడావుడిగా ఇంట్లోకీ, బయటకీ తిరుగుతున్నారు.
అలా తిరుగుతున్న వాళ్లలో ఓ అబ్బాయిని చూపిస్తూ ‘అడుగో! ఆ వెళ్లే అబ్బాయే.. పెళ్లికూతురి తమ్ముడు’ చెప్పారు మా మామయ్య తరఫు బంధువులు.
ఆ అబ్బాయిని ఆసక్తిగా గమనించాను. ‘ఆ అబ్బాయి ముక్కు ఎలా వుందా?’ అని.
నిటారుగా, సూది వాటంగా సన్నగా పొడుగ్గా ఉంది. సంతోషం వేసింది.
ఇక అమ్మాయిని చూస్తే మనసే నిండిపోయింది.
చక్కటి ముఖ కవళికలు, అందమైన ముక్కు, పైగా మామయ్య తరఫు దగ్గరి వాళ్ల అమ్మాయి. అంటే, దగ్గరి వాళ్ల అమ్మాయే! ఇక వెనుకా ముందూ చూడలేదు. పల్లెటూరి సంబంధం అయినా.. బ్యూరో వాళ్లు చూపించే వాటికన్నా వెయ్యి రెట్లు నయం.
మా మదన్ ఫొటోలు ఇచ్చి వచ్చాం. ‘అమ్మాయికి ఇంకా ఫొటోలు తీయించలేదు. తీయించి పంపుతాం’ అన్నాడు పెళ్లికూతురి తండ్రి.
ఆ రాత్రి మా అబ్బాయికి ఫోన్ చేస్తూ అన్నా. ‘ఒరేయ్! నేను ఈ అమ్మాయికి ఫిక్స్ అయిపోయానురా’ అని. మగపిల్లాడి పెళ్ళి అయినా.. సంవత్సరంగా పడుతున్న టెన్షన్‌కి తెర దించేలా.
ఆ తరువాత కథ ఇంకా చెప్పాలంటారా!
పది రోజుల్లోనే మా అబ్బాయి మదన్మోహన్ బెంగుళూరు నుంచి రావడం.. పెళ్లి ఫిక్స్ చేసేసుకోవడం జరిగిపోయాయి. కక్కొచ్చినా.. కళ్యాణం వచ్చినా ఆగదంటారు. నిజమే కదా!

============================================================
కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్,
సికిందరాబాద్- 500 003.

పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-పి.ఎల్.ఎన్.మంగారత్నం 97014 26788