బాల భూమి

వెండి కంచం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామాధికారి చలమయ్య గారింట్లో హఠాత్తుగా కిలో బరువు తూగే వెండి కంచం మాయమై పోయింది. ఈ విషయం అతనికి, అతని భార్య సీతమ్మకి మాత్రమే తెలుసు. తమ ఇంట్లో ఎంతోమంది నౌకర్లు పని చేస్తుండటం వల్ల ఆ వెండి కంచాన్ని ఎవరు దొంగిలించారనేది తెలుసుకోవడం కష్టమనుకున్నారు ఆ భార్యాభర్తలిద్దరూ. అలా అని బయటికి దొంగతనం జరిగిందంటే గ్రామాధికారి ఇంట్లో దొంగతనం జరగడమా అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఏది ఏమైనా ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా వెండి కంచాన్ని దొంగిలించిన దొంగను ఎలా అయినా పట్టుకోవాలనుకున్నారు ఆ భార్యాభర్తలు.
మరుసటి రోజు రాత్రి భోజనాలు అయ్యాక చలమయ్య గారు భార్యతో నౌకర్లకి వినిపించేలా ‘సీతా! అంగడిలో బంగారం ధర రోజురోజుకి తగ్గిపోతోంది. మన దగ్గరున్న డబ్బుతో బంగారం కొని దానితో బంగారం కంచం చేయించి దానికి వెండి పూత పూయిద్దాం. అందుకు వెండి కంచంలో తింటున్నామన్న తృప్తి కూడా మిగులుతుంది. మరో విషయం బంగారం రేటు పెరగగానే దాన్ని అమ్మేద్దాం. ఏమంటావ్?’ అన్నారు.
‘అయితే ఎప్పుడు చేయిస్తారు. ఆ బంగారానికి వెండితో పూత పూయించిన ఆ కంచాన్ని?’ సీతమ్మ భర్తను ప్రశ్నించింది.
అందుకు సమాధానంగా చలమయ్య భార్య సీతతో ‘సీతా! రేపే నేను అంగడికి పోయి ఆ పని చేయించుకు వస్తాను. రేపు రాత్రయ్యేసరికి బంగారానికి వెండి పూత పూసిన ఆ కంచం అలమరాలో ఉంటుంది’ ఇతరులకు వినీ వినిపించనట్టుగా అన్నాడు.
చాటుగా ఇదంతా ఒక నౌకరు చెవులు రిక్కించి మరీ వినడం భార్యాభర్తలిద్దరూ గమనించారు. కానీ ఆ నౌకరు ఎవరనేది గమనించినా అతన్ని చూసీ చూడనట్టుగా నటించారు. ఎందుకంటే అసలు వెండి కంచెం ఎలా అయినా తమకు చేరాలని.
మరునాడు అంగడికి పోయి దొంగిలించబడిన వెండి కంచం లాంటి కంచు కంచాన్ని కొని దానికి వెండిపూత పూయించి వంట గది అలమరాలో పెట్టారు. అది చూడ్డానికి అచ్చు గుద్దినట్టుగా దొంగిలించబడిన వెండి కంచంలానే కన్పించింది.
భార్యాభర్తలిద్దరూ అలమరాకి దగ్గర్లో ఎవరికీ కనిపించకుండా దాగున్నారు. అర్ధరాత్రయింది. ఇంతలో ఒక నౌకరు శబ్దం చేయకుండా అడుగులు వేసుకొంటూ అలమరా దగ్గరకు వచ్చి తను అంతకు ముందు దొంగిలించిన నిజమైన వెండి కంచాన్ని అక్కడ ఉంచి, కంచు కంచానికి వెండి పూత పూయబడిన కంచాన్ని బంగారం కంచంగా భావించి దానిని తీసుకువెళ్లడం గమనించారు.
అలా తీసుకువెళ్లిన నౌకరు ఎవరో కాదు తాము నమ్మకస్థుడు అనుకున్న నౌకరు మల్లన్న.
అసలు వెండి కంచం తమకు దక్కినందుకు భార్యాభర్తలిద్దరూ ఎంతో సంబరపడి దానిని తీసుకొని వెళ్లి రహస్య గదిలో దాచిపెట్టారు. మరెప్పుడూ దానిని బయటికి తీయలేదు.
తమ దగ్గర నమ్మకం పోగొట్టుకున్న మల్లన్నను ఏదో వంకతో పని నుండి తీయించేశారు ఆ భార్యాభర్తలిద్దరూ.

-బెలగాం కేశవరావు 99893 68430