ఈ వారం కథ

జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకునిగా, రచయితగా వాకాటి పాండురంగరావు గారు తెలుగు పాఠకులకు సుపరిచితులే.. ఆయన రాసిన కథలు సంఖ్యాపరంగా తక్కువే అయినా.. వస్తువు, శిల్పం పరంగా గొప్ప పేరు తెచ్చుకున్నాయి. అందులోని ఓ కథే ‘‘జై!!’’. అలనాటి ఈ కథని పాఠకుల కోసం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పునర్ముద్రిస్తున్నాం.

పాతికేళ్ల కింద మన దేశం రిపబ్లిక్ అయిందని ఆ రోజు పండుగదినం. ఆ పండుగను ఘనంగా, వైభవంగా, కోలా హలంగా చేసుకుంటున్నారు- అట్లా చేసుకోగలవాళ్ళందరూ.
ఢిల్లీ మహానగరంలో రాష్టప్రతి నివాసం నుండి ఇండియా గేట్ దాకా వున్న సువిశాలమయిన మార్గం పేరు రాజపధం. ఆ పధానికి అది పెద్ద పండగ దినం.
విజయ్ చౌక్ అనే ఆ సుందరమైన కూడలీ, రాజసంతో రాజిల్లే ఆ రాజపథమూ- లుట్యెన్స్ దొర కేవలం ఈ రిపబ్లిక్ దినోత్సవ నిమిత్తమే ఊహించి, రూపకల్పన చేశాడా అన్నం తగా- ఆ చోటూ ఆ పండగా చెట్టా పట్టాలేసుకుని వుంటాయి.
అంత చలిలోనూ ఆ ఉదయం-
ఆ పధానికిటూ, అటూ కిక్కిరిసిన లక్షలాది జనం.
పిల్లలూ, వారి తల్లిదండ్రులూ, తలిదండ్రులు కాని దంపతులూ, దంపతులు కాని స్ర్తి పురుషులూ, గుమాస్తాలూ, వ్యాపారస్తులూ, ఆఫీసర్లూ అక్కడ. అతిథులూ, ప్రతినిధులూ, సభ్యులూ, రాయబారులూ, ఇంకా ఇంకా పెద్దలూ, వెలుగు దీపాలూ, నిన్నటి సూర్యుళ్లూ, రేపటి చంద్రుళ్లూ కూడా కాస్త ‘దూరం’గా అక్కడే..
ఉత్సాహంగా జనం..
కుతూహలంగా జనం..
ఉవ్విళ్లూరుతూ జనం..
పరవళ్లు తొక్కుతూ జనం..
జనం -జనం, అంతా జనం..
సరిగ్గా తొమ్మిది గంటలకు-
మొదలయింది పెరేడ్.
అందమైన దుస్తులు
అద్భుతమైన బ్యాండ్ వాయిద్యాలు
తప్పెటలు, తాళాలు
తాళాలకు తగ్గ అడుగులు.
అడుగులతో బాటు కదిలే దుస్తులు, మెదిలే పతకాలు.
దుస్తులకు, పతాకాలకు కొత్త మలామా పూస్తూ సూర్యుడి కిరణాలు. కిరణం విరియగా కురిసిన రంగుల్లో స్నానాలు చేస్తున్న పతాకాలు.
మొదలయింది పెరేడ్.
***
(అదే నగరంలో- కరోల్బాగ్ ప్రాంతంలో నాలుగో నెంబరు బ్లాక్‌కూ- సత్‌నగర్‌కూ మధ్య ఒక వీధి. దాని పేరు వాల్మీకి వీధి. ఆ వీధిలో రామాయణం చదవరు కాని రాముడి బొమ్మలు చేస్తారు; కృష్ణుడి బొమ్మలూ చేస్తారు. వినాయకుడు, శివుడు, దుర్గ, బొజ్జ సన్యాసి, ఫ్రాక్ వేసుకుని చేత్తో పూలగుత్తి పట్టుకున్న కలవారి అమ్మాయి కామాక్షి-వంటి అన్ని బొమ్మలూ చేస్తారు.
అయినా బొమ్మలకి అంత గిరాకీ ఏముంటుంది గనుక? ఆ బొమ్మలు చేసేవారి ఆకలిని తీర్చవు. మధ్యతరగతి అనబడే త్రిశంకు స్వర్గపు అట్టడుగు మెట్టు పట్టుకు వెళ్ళేడే అక్కడి జీవితాలు వడ్డించిన విస్తర్లు అసలు కావు; అందులో చాలామందివి జీవితపు జాగిలం చింపిన విస్తర్లు.
చదరపు గజానికి పదిమంది వసించే ప్రాంతం అది. ఆ పదిమందితో బాటు పందులూ, మేకలూ, కోళ్లూ, కుక్కలూ సహా జీవించే సోషలిస్టు సామ్రాజ్య భాగమది. మురికికి, మురికి కానిదానికీ సరిహద్దులు లేని కాలనీ అది. లేచినదాదిగా నిదురించే దాకా నోటిలోకి ‘రొట్టె’ ముక్క కోసం వెతుక్కునే వాళ్ల నిలయం అది.
అక్కడి అనేకానేక ఇళ్లల్లోని కిక్కిరిసిన పరిమితాపరిమత కుటుంబాల్లో-
ఒకదానికి చెందిన అమ్మాయి; ఆరేళ్ళది; పేరు మున్నూ. పెద్దకళ్లు, చింపిరిజుత్తు; వారానికొక్కరోజు మాత్రమే వాళ్లమ్మ ఆవనూనె రాస్తుంది. ఆ అడివికి, వాళ్ల నాన్న ఆ వీధి మొగదాల సైకిల్ రిపేర్లు చేస్తుంటాడు. మున్నూకో అక్కయ్య, తమ్ముడు వున్నారు. అందరూ తలో విధంగా ఇంటికి కావలసిన వాటికి సంపాదిస్తుండటమే వారి హాబీ!)
***
మొదలయింది రిపబ్లిక్ డే పెరేడ్.
లౌడ్ స్పీకర్ల ద్వారా ఖంగుమని శ్రావ్యంగా చెబుతూంది డీమెల్లో కంఠం.
‘‘అదిగో ఎర్రటి కుచ్చు టోపీలతో, మెరిసే కరవాలాలతో భువికి దిగివచ్చిన భాస్కరువలె, ఠీవిగా నిటారుగా హిస్సార్ రెజిమెంట్ అది వస్తుంది! గత సంవత్సరం శత్రుదేశం మనమీద దాడి చేసినపుడు లోన్‌వాలా విభాగంలో ఈదళం వారు అత్యంత సాహస పరాక్రమాలతో..’’
ఆ పదాతి దళం, వారి బ్యాండ్ డ్రమ్స్ కనుగుణంగా ‘మార్చ్’ చేస్తూ వచ్చింది.
చప్పట్లు ఆనందం కనుల పండుగ..
(మొదలయింది మున్నూ దైనందిన పెరేడ్.
మున్నూతో పాటు చిన్నూ.
చిన్నూతోపాటు టింకూ.
వాళ్లతోబాటు దుర్గా, రాధా, మీరా.
మార్చ్ ఫాస్ట్‌లు లేవక్కడ..
ఎప్పటికప్పుడు మార్చ్ ప్రజంట్‌లే...
నడక పరుగూ కలసిన మార్చ్ అది.
అందరి మొహాల్లోనూ ఆతురత.
అందరి కళ్లలోనూ కొశె్చన్ మార్క్‌లు.
గల గల నవ్వులు మాటలు.
కేకలు, కేరింతలు, వాగ్వాదాలు.
ఎందుకోసమో ఎదురుచూపులు-
జీవితపు బరువుకింద విరితావులు..)
‘‘అదిగో అదిగో.. సగర్వంగా నిగనిగ మెరిసే ‘వైజయంత’ టాంక్ అదిగో- వైరి హృదయాలలో విజయతాండవం అదే, అదే! దానికి కాస్త వెనుకగా విజయ గర్వంతో నెమ్మదిగా ముందుకు సాగుతున్నదేవిటో తెలుసా? తెలియకేం.. మీ అందరికీ తెలుసు. గత వర్షపు పోరాటంలో శత్రువుల్ని చిత్తుచేసిన సాటిలేని మేటి ‘నాట్’ విమానం అది’’.
గర్వం, ఆనందం, విజయోత్సాహం, కరతాళధ్వనుల వర్షం- ‘‘ఆ వెనకాల పారాట్రూపర్ల జంట.. వారిననుసరించి ఒయ్యారపు ఒంటెల మీద రాజసంతో సాగిపోతున్న ఆ జైసల్మార్ రిసాలా దళం..’’
లక్షలాది ప్రేక్షకుల కళ్ళల్లో రిపబ్లిక్ పండుగ వెల్లువలు..
(వెల్గులే తప్ప చీకట్లు తెలియని వయసు పిల్లలు మున్నూ, చిన్నూ, మీరా, రాధా..
ఆర్.కృష్ణనూ, మాన్యుయెల్ శాంటనాల టెన్నిసాటను తిలకిస్తున్న ప్రేక్షకులవలె ఆ చిన్నారి పొన్నారి తలలు అటూ ఇటూ కదులుతున్నాయి.
ఆ కళ్లు ఎటో ఎటో, ఎందుకోసమో చూస్తున్నాయి.
‘‘దుర్గా! నిన్న నేను పది పైసలు పెట్టి ఐస్‌క్రీమ్ కొనుక్కుతిన్నాను, తెలుసా... ఎంత బావుందో..’’
సిద్ధులయినవారికే సాధ్యమైన రీతిలో - పెదవులమీదకు ఐస్‌క్రీమ్ రుచిని తెప్పించుకుని నాలుకతో చప్పరిస్తున్న మిగతా పిల్లలు.
మరుక్షణం ఆతురతో ఎదురుచూపులు)
మళ్లీ లౌడ్ స్పీకర్లో అదే కంఠం.
మధుర గంభీరమైన స్వరం.
‘‘మనదేశం ఎంత గొప్పది! మన కళలు ఎంత గొప్పవి! మన నృత్య రీతులులో ఎంత వైవిధ్యం, ఎంత చైతన్యం, ఎంత సౌందర్యం!! వాటన్నిటి ప్రతీకగా ఆ గుజరాత్ దళంవారి ‘గర్భా’ నృత్యపు సొంపులు చూడండి..’’
రంగు రంగుల వలువలు! కమ్మ కమ్మని గీతాలు; లయతప్పని లాస్యపుటడుగులు.
‘‘వీరరసం తొణికే ఆ నాగా వీరుల నృత్యం తిలకించి పులకించండి!..’’
డబర డబర డబ్! డబ్; డబ్, డబ్!
ఎరుపు నలుపు చారల బట్టలు, రంగు ఈకల కిరీటాలు, గవ్వల హారాలు, భేరీలు, నగరాలు, తప్పెట్లు..
ముడులు పడిన జడలు ఎగురుతుండగా గతి తప్పని శివుల తాండవాలు..
(‘బెలూన్లు-ఈలలు- బొమ్మలోయ్’ అని అరుస్తూ శ్రావణమేఘంలా వెళ్తున్నాడు వాడు.
వాడికేసి చాతకప్పక్షుల్లా, చూస్తూ వాళ్లు-
వాళ్లకు ప్రణాళికా కాల దూరంలో వున్న బొమ్మలు.
ఆ చూస్తున్న కళ్లలో మెరవని మెరుపులు.
ఆ చిన్నారి గుండెల్లో విరియడానికి భయపడుతున్న కోర్కెలు..
ఈలోగా-
‘అదిగో ద్వారక!’
‘అదిగో అక్కడ’-
శ్రీకృష్ణుడు -శివుడు-యముడు-లక్ష్మి-లాటరీలో లక్ష రూపాయలు, అన్నీ కలసి-
అదిగో అక్కడ...
ఆశ్చర్యం- ఆనందం.. ఆతురత కలసిన పరుగులు మున్నూ మీరా చిన్నూ దుర్గా రాధా టింకూలు..
‘‘అదుగో మన జాతి రక్షణ నిమిత్తం ఉరకలు వేస్తున్న యువతరం! ఆ ఎన్.సి.సి. కేడెట్ల చూపులో ఆ దీక్ష, నడకలో ఆ ఉత్సాహం- గమనించండి-’’
(నడకలు కావవి పరుగులు
పదిమందికన్న ముందుగా
గమ్యం చేరుకుంది మున్నూ
ఏమా ఉత్సాహం-
గమనించుడు, గమనించుడు!)
‘‘వారే వారే మన సరిహద్దు రక్షణ దళాలు. ఆ వెనుకవస్తున్న అలంకరించబడిన శకటాలలో మొదటిది ప్రగతి పూలరథం. అందులో ఎంత విన్నాణం-ఎంత సోయగం..’’
లక్షలాది జనతా మనసులనిండా పూలజల్లులు.
(అదే, అదే-అసలు విషయం అదే.
నడిచేది, నడిపించెడిదీ అదే.
ఆగేదీ, ఆగించేదీ అదే.
పరుగెత్తేది, పరుగెత్తించేదీ అదే.
తెలుగు సినిమా వెనుక నవలవలె
దాని వెనకాతలే మున్నూ)
నడిచినా ఆగినా, పరుగుడిలినా రెండు చేతులతోనూ తట్టను వదలడం లేదు మున్నూ ‘ఆ’ చోటునుంచి కదలనివ్వడంలేదు.
‘‘చూచారా, చూచారా, ఆకాశంలో మన శాబర్ జెట్లు, నాట్‌లు, హంటర్లు, మిగ్‌లు ఎంచక్కటి ‘్ఫర్మేషన్’లో దూసుకు వస్తున్నాయో.. మన స్వేచ్ఛాకాశంలో అవి ఎంత గర్వంగా ఎగురుతున్నాయో మన దృఢ నిశ్చయానికి, మన ఉన్నత ఆశయానికి అవి ప్రతీకలు..’’
మెడలు సారించి ఆకాశం కేసి చూస్తూ పెద్దలూ, పిన్నలూ రెప్పలార్పకుండా చూస్తూ లక్షలాది కన్నులు.
(ఆ అదిగో...
అయిపోయింది.
ఎంత, ఇంకొక్క క్షణం.
మున్నూ కాక్షణం తెలుసు.
దానికోసమే ఈ పడిగాపులు
పడుతుంది, పడుతుంది
చేతిలో తట్ట నిండుతుంది.
అమ్మ చాలా సంతోషిస్తుంది.
‘మేరీ ప్యారీ మున్నూ!’ అని ముద్దు చేస్తుంది.
ఆ! ఆ! ఆ!)
‘‘ఇదిగో ఇటు-రాష్టప్రతి నివాసపు శిఖరాల మీదుగా బయలుదేరి మూడు రంగుల పొగను చిమ్ముతూ- ప్రళయకా ల ప్రభంజనాలవలె దూసుకొస్తున్న ఆ విమానాలను- ఆకాశంలో డేగలవలె విహరిస్తున్న ఆ ధీరులను చూడండి! మన గమ్యమంత ఎత్తుగా, మన అభ్యుదయమంత వేగంగా స్వేచ్ఛాకాశంలో ధైర్యసాహసాల రంగవల్లులు తీర్చిదిద్దుతున్న ఆ వీరుల్ని, వారి విమానాలను చూడండి.. అవిగో అవి ఎగిరాయి; ఎంతో ఎంతో ఎత్తుకు ఎగిరాయి. ఉల్కల్లా దిగుతున్నాయి. రివ్వున అందంగా దిగి- ‘సెల్యూటింగ్ బేస్’ వద్ద సెల్యూట్ చేసి-వేగంగా పైకెగిరి, వేవేగంగా- దూరంగా, దూర దూరంగా వెళ్లి ఆకాశంలోకి వెళ్లి మేఘంలో మేఘమై, నక్షత్రంలో నక్షత్రమై కలిసిపోతున్నాయి.. చూడండి మైడియర్ కంట్రిమెన్- ఎదలుప్పొంగేలా చూడండి!’’
(ఆ! అమ్మయ్య!!
ఆ తట్ట నిండింది.
భక్తుడికి వరం ప్రసాదించిన భగవంతుడిలా, చిద్విలాసంగా నడుచుకుంటూ, ముందుకు మున్ముందుకు, దూరంగా దూర దూరంగా వెళ్లిపోయింది మున్నూ ముందుండిన గేదె.
పేడ నిండిన తట్ట పట్టుకుని ఆనందంతో ఎగురుకుంతూ ఇంటికి పరుగు తీసింది మున్నూ!
జై(?)!!)

- వాకాటి పాండురంగరావ్