కథ

అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివేక్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆఫీసులో ఎంతో మంచి పేరు ఉన్న వ్యక్తి వివేక్. అతని భార్య నీలిమ కూడా చాలా మంచి అమ్మాయి. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అటువంటిది ఆ కుటుంబంలో జరిగిన ఆ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
విషయం తెలియడంతో వివిధ టీవీ ఛానల్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. పలు మహిళా సంఘాల సభ్యులు, అభ్యుదయ వాదులు అక్కడికి వాలిపోయారు.
‘అతని తల నరికెయ్యాలి’
‘ఏ చేతులతో ఆ దురాగతం చేశాడో ఆ చేతులు లేకుండా చేసెయ్యాలి’
‘స్ర్తిలపై మగవారి దౌర్జన్యాలకి అంతం లేకుండా పోతోంది’
‘్ఛ! భర్తే ఈ పని చేయడమా!!’
‘అతనిపై నిర్భయ కేసు పెట్టాలి’
‘ఏ మగవాడు ఇలాంటి అఘాయిత్యం చేయకుండా అతనికి అతి తీవ్రమైన శిక్ష విధించాలి’
ఇలా అక్కడ అనేకమైన ఆవేశ కావేశ పూరితమైన వ్యాఖ్యానాలు వినిపించసాగాయి.
నీలిమ దుఃఖ భారంతో కుంగిపోయింది. కళ్లమ్మట నీళ్లు ఏక ధారగా కారుతున్నాయి. నీలిమ తలపై ముసుగు వేసుకుని తలవంచుకుని కూచుంది. చుట్టూ మహిళా సంఘాల సభ్యులు కూచున్నారు.
‘మగవాళ్ల దాష్ట్టీకాలకి అంతం లేదా!! భార్య మీద ఇంతటి దుశ్చర్యకు పాల్పడతాడా? ఇటువంటి వాళ్లను ఒక్కొక్కళ్లను వదలిపెడితే రేపు వంద మంది పుట్టుకొస్తారు. అసలు అతని భాగస్వామి మీద ఏమి హక్కు ఉందని ఇంతటి నీచానికి ఒడిగట్టాడు. తన భార్య కూడా స్వతంత్ర భావాలూ, వ్యక్తిత్వం గల మనిషి అని గ్రహించలేని జంతువు అతను. అటువంటి వాళ్లని ఉరి తియ్యాలి. అసలు అతనికి పడే శిక్ష అత్యంత భయంకరంగా ఉండి ఇతర మృగాళ్లకు ఒక హెచ్చరిక కావాలి. నిజానికి ఆడవాళ్లు భర్తలకి ఇచ్చే అలుసే ఇటువంటి అకృత్యాలకి దోహదం చేస్తోంది’ అంటూ ఆవేశంగా మాట్లాడసాగింది దాదాపు ఏబయి సంవత్సరాలు ఉన్న ఒక స్ర్తి. ఆవిడ ఆ ఊరి మహిళా సంఘానికి అధ్యక్షురాలు. టీవీ వాళ్లు తమ కెమెరాలన్నీ ఆవిడ మీద ఫోకస్ చేస్తున్నారు.
‘మేడం! మీరు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు’ అంటూ ఒక విలేకరి ప్రశ్నించాడు.
‘ముందుగా పోలీసు కేసు పెడతాం. వివిధ సంఘాల వాళ్లు త్వరలో రంగప్రవేశం చేస్తారు’ అంది ఆవిడ.
‘ఇంతకీ అతను.. అదే ఈ అన్యాయం చేసిన ఆమె భర్త ఎక్కడ ఉన్నాడని మీ ఉద్దేశం?’ మరొక విలేకరి సందేహం.
‘వాడు ఎక్కడ ఉన్నా సరే గాలించి పట్టుకుంటాం’ అంది మహిళా సంఘం అధ్యక్షురాలు ఆవేశంగా.
‘మేడం. అతను ఇంకా ఎక్యూస్ట్ మాత్రమే. ఆ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు కనీస గౌరవం అన్నా ఇవ్వాలేమో!’ అంది ఏదో ఛానల్ రిపోర్టర్‌గా పని చేస్తున్న ఒక యువతి.
‘ఏమ్మా నువ్వు వాడికి చుట్టానివా? లేక వాడి దగ్గర వకాల్తా తీసుకున్న లాయరువా? అకృత్యాలు చేసిన వాడికి గౌరవం ఏమిటి?’
‘మేడం. ఇప్పటికి అతను నేరం చేశాడు అని మోపబడింది అంతే. అదీకాక ఏం జరిగిందో ఎందుకు జరిగిందో మనకు ఎవ్వరికీ తెలియదు..’ అంటూ ఏదో చెప్పబోయింది ఆ యువతి.
‘గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని.. స్ర్తి ఉద్యమాలలో నా ఎక్స్‌పీరియెన్స్ అంత లేదు నీ వయసు. నువ్వు నాకు నీతులు చెబుతావా?’ కస్సుమంది మహిళా అధ్యక్షురాలు. ఏమీ అనలేక వౌనం వహించింది ఆ యువతి.
నిజానికి ఏ వ్యక్తి నేరం రుజువు అయ్యేవరకు దోషి కాదు. శిక్షార్హుడు కాదు. అవి రెండూ పరిశీలించవలసింది, నిర్ణయించవలసింది న్యాయస్థానం. వేరెవ్వరికీ ఆ అర్హత లేదు. కానీ అది పట్టించుకునేది ఎవరు?
ఇంతకీ జరిగింది ఏమిటంటే.. నీలిమ చాలా అందంగా ఉంటుంది. గుండ్రటి ముఖం, చేపల్లాంటి కళ్లు, కోటేరులా తీర్చిదిద్దినట్లున్న నాసిక, దొండ పండ్ల లాంటి పెదవులు, చక్కటి చుబుకం, శంఖం ఆకారంలో కంఠం, అన్నింటికన్నా తుమ్మెద రెక్కల్లాంటి ఒతె్తైన శిరోజాలు.. అందం అంతా కలయబోసి ఆ బ్రహ్మదేవుడు ఆమెను సృష్టించాడా అన్న సందేహం ఆమెను చూసిన వారికీ కలగక మానదు. వివేక్ కూడా అందమైన పది మంది మగవాళ్లను నిలబెడితే ఫస్ట్ వస్తాడు. పెళ్లయినప్పటి నుంచి కూడా నీలిమ, వివేక్ ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా బతికేవాళ్లు.
వివేక్ ఆ పని చేశాడంటే ఆడవాళ్లతో సహా అతను పరిచయం ఉన్న వాళ్లెవరూ నమ్మలేదు. కానీ మీడియా మాత్రం అతనిని టార్గెట్ చేసింది. ఇక రకరకాల సంఘాల వాళ్ల సంగతి చెప్పక్కర్లేదు.
విచిత్రం ఏమిటంటే అసలు ఏం జరిగిందని కానీ, ఎందుకు జరిగి ఉంటుంది అని కానీ పట్టించుకోకుండా, ఎవరికి వారు ఒక నిర్ణయానికి వచ్చేసి, తమకు తోచినట్టు మాట్లాడసాగారు.
తనకు మత్తుమందు కలిగిన కూల్ డ్రింక్ ఇచ్చి వివేక్ తుమ్మెద రెక్కల్లాంటి ఆమె శిరోజాలను తీసివేశాడనేది నీలిమ చేస్తున్న అభియోగం! అయితే నిజంగా వివేక్ ఆ పని చేసి ఉంటే, ఆ పని చేయడానికి తగిన కారణంగానీ తర్కం గానీ అంతుబట్టలేదు ఎవరికీ. ఒకరిద్దరు తమ అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నించినా వారి నోటికి మూత వేయబడింది. ఎందుకంటే అసలు విషయం తెలిసిపోతే ఆ విషయం సెనే్సషన్ కాకుండా సామాన్యం అయిపోతుంది!!
జరిగినది తెలుసుకుని నీలిమ తల్లిదండ్రులు, అత్తమామలు హుటాహుటిన వచ్చారు. అయితే అటు వివేక్‌ని గానీ, అతని తల్లిదండ్రులని గానీ ఎవ్వరూ ఏమీ అనలేక పోయారు. ఎందుకంటే జరిగింది విచిత్రమైనది. అలాగే ఆ పని వివేక్ చేసి ఉంటాడని ఎవ్వరూ నమ్మలేక పోతున్నారు. ఒకవేళ వివేక్ ఆ పని చేసి ఉంటే నిజంగా అతను పిచ్చి పని చేశాడనే అనిపిస్తుంది. కానీ భార్య అందగత్తె కనుక అసూయపడో, ఆమెని అనుమానించో అటువంటి పని చేశాడు అనుకోడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్లిద్దరిది ఏ దాపరికం లేని అన్యోన్య దాంపత్యం. ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాగే అందంలో తెలివితేటలలో ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరు. ఇవన్నీ సామాన్య జనానికే కాక పోలీసులకు కూడా చాలెంజ్ అయ్యాయి.
కంప్లైంట్ చేయడం, వివేక్ ఇంట్లో లేకపోవడం లాంటివి కొన్ని అనుమానాలకి తావిచ్చి పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసు పెట్టడం జరిగింది. పోలీసులు వివేక్ వేటలో పడ్డారు.
‘పోలీసు కేసులు అవీ ఎందుకు?’ అన్న నీలిమ మాటలు ఆ రణగొణ ధ్వనిలో బయటకి వినిపించలేదు.
కానీ నీలిమ మాటలకి అర్థం ఏమిటా అని పక్కనే నుంచున్న నీలిమ తల్లి వినోద అనుకుంది. అదే విషయం పక్కనే ఉన్న భర్త చెవిలో వేసింది.
‘వివేక్‌ని అనవసరంగా అల్లరి పెడుతున్నారేమో!’ అని నీలిమ తల్లిదండ్రులు అనుకున్నారు.
ఏది ఏమైనా జరగవలసిన అనర్థం జరిగిపోయింది. గుట్టుగా ఉండవలసిన నీలిమ కుటుంబం సోషల్ మీడియాలోకీ, టీవీలోకీ పేపర్లలోకీ ఎక్కిపోయింది.
‘వివేక్ పరమ దుర్మార్గుడు’ అని కొందరు అంటే, ‘అటువంటి శాడిస్ట్ ప్రపంచంలో ఇంకొకడు ఉండడు’ అని కొందరు అభిప్రాయపడ్డారు.
టీవీలు అదిగో పులి అంటే, ఇదిగో తోక అని గంటకో కథనం ప్రచారం చేస్తున్నాయి. ఇటు వివేక్ తల్లిదండ్రులకు, అటు నీలిమ తల్లిదండ్రులకు కూడా తల కొట్టేసినట్లు అయ్యింది. నీలిమ పరిస్థితి విచిత్రంగా ఉంది. తను ఏమి మాట్లాడుతోందో, ఏమి చేస్తోందో ఆమెకే తెలియని పరిస్థితి.
అనూహ్యంగా వివేక్ ఇంటికి వచ్చాడు. కానీ వివేక్ తన భార్యతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అత్తమామలతో కానీ మాట్లాడేందుకు వీలు చిక్కలేదు. మీడియా వాళ్లు అతనిని చుట్టుముట్టేశారు. రకరకాల ప్రశ్నలతో అతనిని విసిగించి, ప్రాణాలు తోడేశారు.
అంతలో పోలీసులు వచ్చి అతనిని అరెస్ట్ చేశారు. పెద్దగా కష్టపడకుండానే వివేక్‌కి బెయిల్ దొరికింది. బాధితురాలిని భయపెట్టడానికి, రుజువులు తారుమారు చేయడానికి వివేక్‌కి అవకాశం ఉందని కొందరు గగ్గోలు పెట్టారు.
తన ఇంటి మీద దండయాత్ర చేసిన వాళ్లు అందరికి ‘ఇది మా కుటుంబ వ్యవహారం. మీరందరూ దయచేసి వెళ్లిపొండి. మీమీ పనులు చూసుకోండి’ అని చాలా మృదువుగా చెప్పాడు వివేక్.
‘ఆడవారి మీద అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం’ అన్నారు మహిళా సంఘ సభ్యులు.
అంతవరకు నిగ్రహించుకున్న నీలిమ తల్లి వినోదకి ఆ మాటలకి బాగా కోపం వచ్చింది.
‘హక్కులు, పోరాటాలు, వాదాలతో కాపురాలు నిలవవు. కుటుంబాలు మన్నవు. మా అమ్మాయి.. మేము చూసుకుంటాం దయ చెయ్యండి’ అంది వినోద కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ.
‘అదిగో అప్పుడే బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులని భయపెట్టే ప్రయత్నం జరిగింది. వెంటనే నిందితుడి బెయిల్ రద్దు చెయ్యాలి’ అన్నారెవరో ఆవేశంగా.
వివేక్ తండ్రి నాగరాజు ‘మీరు అందరూ ఉన్నపళాన వెళతారా! లేకపోతే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన ఐ.జి.కి ఫోన్ చేయమంటారా!’ అన్నాడు కోపంగా.
ఆ దెబ్బకి ఏమనుకున్నారో ఏమో క్రమంగా ఒక్కొక్కరూ జారుకున్నారు.
* * *
ఆ రోజు సాయంత్రం ఇంట్లో కేవలం వివేక్ కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు అతి సన్నిహితులు అయిన శ్రేయోభిలాషులు ఉన్నారు.
‘బాబూ! ఎందుకు చేసావు ఇలాంటి అప్రదిష్టమైన పని!?... చూడు మనం కుటుంబం, నీలిమ కుటుంబం ఎలా బజారుపాలయ్యాయో!’ అన్నాడు వివేక్ తండ్రి నాగరాజు ఆవేదనగా.
‘నాన్నా! నేను ఎప్పుడూ నీకు తలవంపులు వచ్చే పని చేయను అని మీకు తెలుసు కదా!’ అన్నాడు వివేక్.
‘తెలుసు అనుకో.. కానీ ఇప్పుడు మన పరువు పోయింది. ఎంతో గౌరవంగా బతుకుతున్న మనం రోడ్డున పడ్డాం... ఇంతకీ నువ్వు చేసిన పని ఏమిటో, ఎందుకు చేసావో నీకైనా తెలుసా! మాకు ఎవ్వరికి అర్థం కాలేదు’ అన్నాడు నాగరాజు.
‘అలా గట్టిగా అడగండి మామయ్యగారు’ అంది అంతవరకూ వౌనంగా ఉన్న నీలిమ గుడ్లనీరు గక్కుంటూ.
‘బాబూ వివేక్ ప్రపంచంలో ఎవ్వరికీ నువ్వు సమాధానం చెప్పకపోయినా పరవాలేదు కానీ, నిన్ను నమ్ముకు వచ్చిన, నీ జీవిత భాగస్వామికి మాత్రం నువ్వు చేసిన అనాగరిక, అసహ్యకరమైన పనికి కారణం చెప్పాలి. సంజాయిషీ ఇవ్వాలి. ఆ అవసరం ఉంది. ఆ పని నువ్వే చేసావని ఎవరికి తెలిసినా, ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు’ అన్నాడు నాగరాజు తీవ్రంగా.
‘నాన్నా నేను నా ఆత్మకి మాత్రమే సమాధానం చెప్పుకోవాలి. నేను ఆ పని ఎందుకు చేసానో నా అంతరాత్మకి తెలుసు.. అసలు ఆత్మ ప్రబోధం ప్రకారం చేసిన పనికి నేను ఎవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదు’ అన్నాడు వివేక్ మొండిగా.
‘వివేక్ అలా అర్థంపర్థం లేకుండా మాట్లాడితే ఊరుకోను. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది మన కుటుంబ సభ్యులకు అన్నా తెలియాలి’ అన్నాడు నాగరాజు కోపంగా.

అందం (7వ పేజీ తరువాయ)
‘చెప్పు వివేక్... రాత్రికి రాత్రే నన్ను నలుగురిలో తిరగలేకుండా, ఇంత అంధ వికారంగా ఎందుకు చేసావు?’ అంది నీలిమ బాధ, కోపం మిళితమైన స్వరంతో.
‘నీలిమ నిజం చెప్పు.. నేను ఆ పని ఎందుకు చేసానో నీకు తెలియదూ!’ అని భార్యని ప్రశ్నించాడు వివేక్.
‘నాకేం తెలుస్తుంది? అయినా నువ్వు ఇంతటి నీచమైన పనిని చేస్తావని కలలో కూడా అనుకోలేదు’ అంది నీలిమ ఉక్రోషంగా, కడుపులోంచి తన్నుకు వస్తున్న దుఃఖంని బలవంతంగా ఆపుకుంటూ.
‘నేను చేసిన పని నీచమైనదని ఎందుకు అనుకుంటున్నావు?...’ అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్.
‘ఊరుకోరా. ఇంకా చేసిన పనిని సమర్థించుకుంటున్నావు’ అన్నాడు నాగరాజు కొడుకు వైపు అసహ్యంగా చూస్తూ.
‘నాన్నా...’ అంటూ ఏదో చెప్పబోయిన వివేక్‌ని చేతితోనే వారించాడు నాగరాజు.
‘వివేక్ ఇంకేమీ చెప్పకు. నీకు అనుమానం, అసూయ జబ్బు అన్నా వచ్చి ఉండాలి. లేదా పిచ్చి అన్నా పట్టి ఉండాలి. నిన్ను వెంటనే ఒక సైకియాట్రిస్ట్‌కి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అన్నాడు నాగరాజు సాలోచనగా.
‘వివేక్.. ఎంతో అందమైన నా కోడలి ముఖం నీ పైశాచిక చర్యతో అంధ విహీనంగా తయారుచేసావురా. ఛీఛీ... నీ తల్లిని చెప్పుకోడానికే సిగ్గుగా ఉంది’ అంటూ తన కొడుకుకేసి కోపంగా చూడసాగింది వివేక్ తల్లి శారద.
‘అమ్మా నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు’ అన్నాడు వివేక్ తల్లితో బాధగా.
‘వివేక్ నీ తల్లిని కావడం నా చేతులు కట్టి పడేసింది... ఒక మామూలు ఆడదానిగా ఇక్కడకు వచ్చి ఉంటే నీ రెండు చెంపలు చెప్పులతో వాయించేదాన్ని’ అంది శారద కళ్లల్లో నిప్పులు కక్కుతూ.
వివేక్ పరిస్థితి విచిత్రంగా తయారయ్యింది. బయట వాళ్లు తనని తూర్పారబడుతూ ఉంటే, ఇంట్లో వాళ్లు అసలు విషయం తెలుసుకోకుండా నిందించడం అతనికి చాలా బాధ కలిగించింది.
వివేక్ తన అందమైన భార్య నీలిమ, తుమ్మెద రెక్కల్లాంటి జుట్టుని అకారణంగా తొలగించి, అతి జుగుప్సాకరమైన పని చేశాడు అని అందరి అభిప్రాయం. కనుక సహజంగా ఎవ్వరూ అతనిని సమర్థించరు. సమర్థించలేరు కూడా.
అంతవరకు ఎంతో ఓపికగా అందరి మాటలు విన్న వివేక్ అందరిని ఒకేసారి ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘దయచేసి అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చేసిన పని మీకందరికీ ఒక నీతిమాలిన, అర్థం లేని, పిచ్చి పనిగా అనిపించి ఉండవచ్చు. ఇప్పుడు నాకు, నీలిమకు మాత్రం తెలిసిన నిజం, మీకెవ్వరికీ తెలియని నిజం ఒకటి చెపుతాను వినండి. నీలిమకు బ్రెయిన్ కేన్సర్’ ఆ మాటలు అక్కడున్న అందరికి షాక్ ఇచ్చాయి.
ఉఆ మాట వినగానే వినోద ఒక్కసారిగా ‘నిజమా! తల్లీ నీలూ’ అంటూ కూతురిని కౌగలించుకుని బావురుమంది. శారద ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తూనే కళ్లమ్మట నీరు పెట్టుకుంది. నాగరాజు, నీలిమ తండ్రి విషణ్ణ వదనాలతో నుంచున్నారు. ఒక్కసారిగా అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది.
‘అవును.. నీలిమకు బ్రెయిన్ కేన్సర్ అని ఈ మధ్యే తెలిసింది. డాక్టర్లు ఆపరేషన్ తప్పదన్నారు. నీలిమ ఆపరేషన్ అంటే ఒప్పుకోలేదు. మందులతో, మాత్రలతో తన వ్యాధి తగ్గించమని డాక్టర్లని అడిగింది. వాళ్లు కుదరదు ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అని చెప్పారు. ఒకవేళ నీలిమ భయపడుతోందేమోనని, ఆపరేషన్ అంటే భయం అక్కర్లేదని వ్యాధిని ప్రారంభ దశలోనే కనుక్కున్నాం కనుక ఆపరేషన్ చేస్తే ఏమీ సమస్య ఉండదని డాక్టర్లు చెప్పారు. నీలిమ ఆయుష్షుకి గానీ, జీవన శైలికి గానీ ఆపరేషన్ వల్ల ఏమీ నష్టం ఉండదని చెప్పారు.’ ఊపిరి తీసుకోడానికి అన్నట్లు ఒక్క క్షణం ఆగాడు వివేక్. అతని మాటలను అక్కడ ఉన్న అందరూ ఊపిరి బిగబట్టి వింటున్నారు.
‘మాకు బాగా తెలిసిన డాక్టర్ నీలిమకు సందేహం ఏమిటి అని అడిగాడు. దానికి నీలిమ తన అందం కోల్పోవడం తనకు ఇష్టం లేదని, ఎంతో అందమైన శిరోజాలను తీసివేసే ఆపరేషన్‌కి తను ఒప్పుకోనని చెప్పింది. అలాగే తరువాత చాలా కాలానికి గానీ తన శిరోజాలు అందంగా తయారవ్వవని చెప్పింది. నేను, డాక్టర్ నచ్చచెప్పపోతే తనకు ప్రాణం పోయినా సరేగానీ తను అందం కోల్పోడానికి తయారుగా లేనని మూర్ఖంగా వాదించింది. డాక్టర్‌కి, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పేషెంట్ కోపరేట్ చెయ్యకపోతే ఏమీ చెయ్యలేమని డాక్టర్లు చెప్పారు. నేను తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాను. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. నాకు నా భార్య అందంకన్నా, అసలు నీలిమకి కూడా తన అందం కన్నా ప్రాణం ముఖ్యమైనది అనే నిర్ణయానికి వచ్చాను. నీలిమను మత్తులో ముంచి.. ఆపరేషన్‌కి అవరోధం లేకుండా చేశాను’ అన్నాడు వివేక్.
అతని కంఠం బొంగురుపోయింది. కళ్లమ్మట నీళ్లు జలజల రాలాయి.
‘బాబూ! వివేక్! నీ భార్య కోసం ఏ భర్తా చేయకూడని, చేయలేని ధైర్యం చేసి, గొప్ప సాహసం చేశావు. ఇటు ఇంట్లో వాళ్ల దృష్టిలో, అటు బయటవాళ్ల దృష్టిలో కూడా నేరస్థుడివి, దుర్మార్గుడవి అయ్యావు. చేయని తప్పుకు బాధ అనుభవించావు. నువ్వు నీ నిరుపమాన సాహసంతో నీ భార్యను రక్షించడమే కాదు. అందంకన్నా ఆరోగ్యం ముఖ్యం అనీ, అలంకరణల కన్నా హాయిగా జీవించడంలోనే ఆనందం ఉందనీ, అందం పేరుతో డబ్బునీ, కాలాన్నీ, ఆరోగ్యాన్నీ నాశనం చేసుకోవద్దని అందరికీ ఒక గుణపాఠం చెప్పావు. అందం వెల ఒక ప్రాణం కాకూడదు. ఎప్పటికీ కాకూడదు’ అంది వివేక్ అత్త వినోద.

=============================================================
కథలకు ఆహ్వానం

‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.

పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-ఎం.వి.ఎస్.ఎన్. ప్రసాద్.. 9849013002